Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

క్యాన్సర్ పరిశోధనలో భారత, యుకె ఎంఓయుకు కేబినెట్ ఆమోదం


 

ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ అధ్య‌క్షతన స‌మావేశ‌మైన కేంద్ర కేబినెట్ 2018 న‌వంబ‌ర్ 14వ తేదీన భారత, యుకె దేశాలు సంత‌కాలు చేసిన క్యాన్స‌ర్ ప‌రిశోధ‌నకు సంబంధించిన అవగాహ‌నా ఒప్పందానికి ఆమోద‌ముద్ర వేసింది. 

వివ‌రాలు:

అంద‌రూ భ‌రించగల స్థాయి, నివార‌ణీయ, క్యాన్స‌ర్ కేర్ వ‌స‌తులు అందుబాటులోకి తేవ‌డంలో ఎదుర‌వుతున్న స‌వాళ్ల‌ను భారత, యుకె క్యాన్స‌ర్ ప‌రిశోధన కార్య‌క్ర‌మం ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తుంది. క్లినిక‌ల్ ప‌రిశోధన, జ‌నాభాప‌ర‌మైన  ప‌రిశోధన, కొత్త సాంకేతిక ప‌రిజ్ఞానాలు, భౌతిక శాస్ర్తాల విభాగాల్లోని భారత, యుకె దేశాల నిపుణులంద‌రినీ ఒకే వేదిక పైకి తీసుకువ‌చ్చి ప‌రిశోధన కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం దీని ప్ర‌ధాన ల‌క్ష్యం. ప‌రిశోధ‌న‌ల‌కు అవస‌రం అయిన కొత్త భాగ‌స్వామ్యాలు ఏర్పాటు చేయ‌డం, ప్ర‌భావ‌వంత‌మైన ప‌రిశోధన, క్యాన్స‌ర్ నివార‌ణ‌లో విజ‌య‌వంత‌మైన పురోగ‌తి సాధ‌న‌కు ఇది కృషి చేస్తుంది. 

ఫండింగ్ విధానం:

వ‌చ్చే ఐదేళ్ల కాలంలో ఈ ప‌రిశోధ‌న‌కు మొత్తం కోటి పౌండ్లు (సుమారు రూ.90 కోట్లు) ఖ‌ర్చ‌వుతుంద‌ని అంచ‌నా. ఇందులో క్ర‌క్స్ వాటా 50 ల‌క్షల పౌండ్లు (సుమారు రూ.45 కోట్లు) ఉంటుంది. డిబిటి మ‌రో 50 ల‌క్షల పౌండ్లు (సుమారు రూ.45 కోట్లు) స‌మ‌కూర్చుతుంది. ఈ ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభం నాటి మార‌క‌పు రేట్ల ఆధారంగా మ్యాచింగ్ ఫండ్లు మంజూరు చేస్తారు.

ప్ర‌భావం:

సాంకేతిక, బ‌యోమెడిక‌ల్, క్లినిక‌ల్, ఫార్మా విభాగాల్లో చేప‌ట్టిన ఇన్నోవేష‌న్ల కార‌ణంగా క్యాన్స‌ర్ పై ఎంత‌గా విజ‌యం సాధించామ‌ని భావించినా  ఇప్ప‌టికే ఆరోగ్య సంర‌క్షణ వ్య‌వ‌స్థ‌పై పెరిగిన భారాల కార‌ణంగా యావ‌త్ ప్ర‌పంచం నానాటికీ పెరిగిపోతున్న క్యాన్స‌ర్ వ్య‌యాల భారాన్ని త‌ట్టుకోగల స్థాయిలో లేదు. ఉత్తమ ప‌రిశోధ‌కులు, శాస్త్రవేత్త‌లు, ఆరోగ్య రక్షణ సంస్థ‌లు, బ‌హుముఖీన ప‌రిశోధన సంస్థ‌ల‌న్నింటినీ సంఘ‌టితం చేస్తూ అధిక విలువ, త‌క్కువ వ్య‌యాల‌తో కూడిన క్యాన్స‌ర్ సంర‌క్షణ వ‌స‌తులు క‌ల్పించ‌డానికి అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌ల‌ను భారత-యుకె క్యాన్స‌ర్ ప‌రిశోధన కార్య‌క్ర‌మం ఆవిష్క‌రిస్తుంది. ఈ కార్య‌క్ర‌మం కార‌ణంగా డాక్ట‌రేట్, పోస్ట్ డాక్ట‌రేట్ స్థాయిలోను,కెరీర్ ప్రారంభ స్థాయిలోను అవ‌కాశాలు బాగా పెరుగుతాయి. వారికి అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాల పైనే కాకుండా అత్యంత కీల‌క‌మైన నాయ‌క‌త్వ, ప్రాజ‌క్ట్ మేనేజ్ మెంట్ నైపుణ్యాల్లో కూడా శిక్షణ ఇస్తారు. దీనివ‌ల్ల వారికి విద్యా స్థాయిలోను, బ‌యోఫార్మా ప‌రిశ్రమ స్థాయిలోను ప‌రిశోధ‌నావ‌కాశాలు పెరుగుతాయి. 

పూర్వారంగం:

భారత బ‌యోటెక్నాల‌జీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాల‌జీ శాఖ, యుకె క్యాన్స‌ర్ ప‌రిశోధ‌నా విభాగం (క్‌‌క్) అమ‌లుజ‌రిపే 5 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితి గల భారత, యుకె క్యాన్స‌ర్ ప‌రిశోధన కార్య‌క్ర‌మం ఇది. క్యాన్స‌ర్ చికిత్స‌లు అంద‌రికీ అందుబాటు ధ‌ర‌ల్లోకి తీసుకురాగల విధానాల‌పై ఇది అధ్య‌య‌నం చేస్తుంది. ప్ర‌యోగాత్మక ప్రాతిప‌దికన చేప‌ట్టే ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చే ఐదేళ్ల కాలంలో క్ర‌క్, డిబిటి 50 ల‌క్షల పౌండ్ల వంతున (సుమారు రూ.45 కోట్లు) పెట్టుబ‌డి పెడ‌తాయి. ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ యుకె ప‌ర్యటన స‌మ‌యంలో 2018 ఏప్రిల్ 18వ తేదీన ఉభయ దేశాల ప్ర‌ధాన‌మంత్రుల ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న‌లోని అంశాల‌కు త‌దుప‌రి చర్య‌గానే ఈ కార్య‌క్ర‌మం చేప‌డుతునా్న‌రు. ఆ ఉమ్మ‌డి ప్రకటన ఇలా ఉంది. 

“నానాటికీ పురోగమన ప‌థంలో ఉన్న ప్ర‌జాస్వామ్యాలు రెండూ నిబంధనల ఆధారిత అంత‌ర్జాతీయ వ్య‌వ‌స్థ ప్ర‌మాణాల‌కు అనుగుణంగా ఆమోద‌నీయ‌మైన అంత‌ర్జాతీయ‌నిబంధ‌న‌లు, ప్ర‌పంచ శాంతి, సుస్థిరత ల‌క్ష్యాలుగా క‌లిసిక‌ట్టుగా కృషి చేయాల‌న్న ఉమ్మ‌డి ఆకాంక్ష ప్ర‌క‌టిస్తున్నాయి.  ఆర‌కంగా భారత, యుకె దేశాలు అస్థిర ప్ర‌పంచంలో మంచికి ఒక శ‌క్తిగా క‌లిసిక‌ట్టుగా నిలుస్తాయి. అంత‌ర్జాతీయ స‌వాళ్ల‌ను దీటుగా ఎదుర్కొనేందుకు మా అనుభ‌వాలు, ప‌రిజ్ఞానాలు అంద‌రితో పంచుకునేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఇందులో  భాగంగా త‌క్కువ వ్య‌యాల‌తో క్యాన్స‌ర్ చికిత్స వ‌స‌తులు అందుబాటులోకి తెచ్చేందుకు కోటి పౌండ్ల (సుమారు రూ.90 కోట్లు) పెట్టుబ‌డితో భారత బ‌యోటెక్నాల‌జీ శాఖ, యుకె క్యాన్స‌ర్ ప‌రిశోధ‌నా శాఖ ద్వైపాక్షిక ప‌రిశోధన కార్య‌క్ర‌మం చేప‌ట్టేందుకు క‌ట్టుబాటును ప్ర‌క‌టించాయి”.