పిఎంఇండియా
నమస్కారం.
ఈ ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమాన్ని మీరంతా ఇంత అద్భుతంగా నిర్వహించారు. అందరికీ హృదయపూర్వక అభినందనలు. కార్యక్రమ నిర్వహణలో పాలుపంచుకున్న నా కేంద్ర మంత్రివర్గ సహచరులకూ, ముఖ్యమంత్రులకూ, రాష్ట్ర ప్రభుత్వాల్లోని మంత్రులకూ, నా పార్లమెంటు సహచరులకూ, లక్షలాది మంది మై భారత్ స్వచ్ఛంద కార్యకర్తలకూ ఆత్మీయ శుభాకాంక్షలు. నేడు దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులూ, క్రీడారంగ ప్రముఖులూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
మిత్రులారా, మీ అందరికీ తెలుసు..
మరో రెండు రోజుల్లో, అంటే ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం. మీ అందరికీ, దేశ యువతకూ, క్రీడారంగంతో అనుబంధమున్న ప్రతి ఒక్కరికీ ముందస్తుగా శుభాకాంక్షలు. భరతమాత ముద్దుబిడ్డ మేజర్ ధ్యాన్‌చంద్‌ను స్మరించుకోవాల్సిన రోజు ఇది. వందేళ్ల కిందట భారత ఆర్మీ హాకీ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఆ జట్టులో ధ్యాన్‌చంద్ ఒకరు. భారత్, న్యూజిలాండ్ నడుమ వందేళ్ల క్రీడా సంబంధాలకు ఆ పర్యటన పునాది వేసింది. కొన్ని రోజుల కిందటే నేను న్యూజిలాండ్‌లో పర్యటించాను. అక్కడా ఆయనను స్మరించుకున్నాను. మేజర్ ధ్యాన్‌చంద్ పునాదులు వేసిన ఈ సంబంధాలను మరింత దృఢతరం చేసుకునేందుకు భారత్ నేడు నిరంతరం కృషి చేస్తోంది.
మిత్రులారా,
ఆగస్టు 15న ఎర్రకోట వేదికగా మన క్రీడా సంకల్పాన్ని దేశం ముందుంచాను. నేను క్రీడల గురించి మాట్లాడుతున్నానంటే – అది పతకాలను గెలుచుకోవడానికి మాత్రమే పరిమితం కాదు.. వికసిత భారత్ నిర్మాణం దిశగా భారత క్రీడాశక్తినీ, యువశక్తినీ ఏకం చేసే ఉద్యమమిది. నేనెప్పుడూ చెబుతూంటాను.. ‘ఆడేవారే రాణిస్తారు (జో ఖేలేగా, వో ఖిలేగా)’. క్రీడల్లో రాణించడమంటే మైదానంలో పతకాలను గెలవడం మాత్రమే కాదు. క్రీడల్లో రాణించడమంటే.. వ్యక్తిత్వ వికాసం, కుటుంబ వికాసం కూడా. అంతేకాదు అది దేశ ప్రతిష్ఠనూ ఇనుమడింపజేస్తుంది.
మిత్రులారా,
క్రీడాకారులు గెలిస్తే.. ఆ విజయం వారొక్కరిదే కాదు. అది వారి కుటుంబ గౌరవాన్నీ, ప్రతిష్ఠనూ ద్విగుణీకృతం చేస్తుంది. వారు చదివిన బడీ, కళాశాలల ప్రతిష్ఠ పెరుగుతుంది. వారి జిల్లాకూ, రాష్ట్రానికీ మరింత విశేష గుర్తింపు లభిస్తుంది. ఆ నగరాన్నీ, రాష్ట్రాన్నీ ఈ ప్రపంచం వారి పేరుతో గుర్తిస్తుంది. అలాంటి విజయాలనేకం ఆ ప్రాంతం పేరును ప్రపంచ క్రీడా యవనికపై తళుక్కుమనేలా చేస్తే.. ప్రపంచం ఆ నగరాన్ని చూసే దృష్టికోణమూ మారుతుంది. దేశంలోని వందలాది జిల్లాలకు చెందిన క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచపటంలో వెలుగులు చిమ్మే సత్తా ప్రతి జిల్లాకూ ఉంది. మన బలాన్ని అర్థం చేసుకుని ఈ సంవాదాన్ని మనం ముందుకు సాగిద్దాం.
మిత్రులారా,
ఈ సారి ఎర్రకోట నుంచి నా ప్రసంగంలో క్రీడల్లో మనం ఎదుర్కొంటున్న ఒక పెద్ద సవాలు గురించి మాట్లాడాను. ఇప్పుడు దేశమంతా దానిపై చర్చిస్తోంది. ఒలింపిక్ క్రీడల్లో మనమెదుర్కొంటున్న సవాలు ఇది. ఒలింపిక్స్ విభాగాలన్నింటిలో.. సగం క్రీడల్లో మాత్రమే భారత జట్లు పాల్గొంటున్నాయన్నది చేదు నిజం. అంటే, పతకాల పట్టిక జాబితాలో ఉన్న ఎన్నో క్రీడల్లో మనం కనీసం పోటీలో కూడా ఉండడం లేదు. దశాబ్దాలుగా ఇదే జరుగుతోంది. 2012 ఒలింపిక్స్‌లో భారత్ కేవలం 13 క్రీడల్లో మాత్రమే పాల్గొన్నది. 20కి పైగా క్రీడల్లో పాల్గొనలేదు. ఆ 20కి పైగా క్రీడల్లో చాలా పేర్లను కూడా దేశ ప్రజలు విని ఉండరేమో. ఆ క్రీడల్లో వేరే దేశాలు పతకాలు సాధిస్తుంటే.. మనం కనీసం పాల్గొనడమూ లేదు. పతకాల పట్టికలో మరింత మెరుగైన స్థానాన్ని పొందాలంటే.. ఈ క్రీడల్లో కూడా మనం ప్రావీణ్యం సాధించి తీరాలి. ఉదాహరణకు సర్ఫింగ్, స్పోర్ట్స్ క్లైంబింగులనే తీసుకోండి.. విస్తారమైన తీర ప్రాంతం మనకుంది. విశాలమైన కొండ ప్రాంతాలూ మనకున్నయి. ఈ క్రీడల పట్ల సహజంగానే ఆసక్తిని పెంచే ప్రాంతాలవి. జల క్రీడలూ, శీతాకాల క్రీడలూ రెండింటికీ కావాల్సిన మానవ వనరులూ, భౌగోళిక వనరులూ మనకున్నాయి. అయినప్పటికీ, అంతర్జాతీయ స్థాయిలో ఆ క్రీడల్లో మన ప్రాతినిధ్యమే లేదు. అందుకే వివిధ జిల్లాల్లో ఒక నిర్దిష్ట క్రీడకు సంబంధించిన వ్యవస్థను అభివృద్ధి చేయగల అవకాశాలను మనం పరిశీలించాలి. ఖేలో ఇండియా సంవాదానిది ఇందులో అత్యంత కీలకమైన పాత్ర.
మిత్రులారా,
2036 ఒలింపిక్స్‌కు సన్నద్ధత గురించి మనం మాట్లాడుకుంటువన్నామంటే.. ఆ సమయానికి వివిధ క్రీడల్లో అర్హత సాధించి పోటీ పడగల క్రీడాకారులను ఇప్పటి నుంచే సిద్ధం చేయడంపై మనం దృష్టి సారించాలి. అందుకే 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సున్న క్రీడాకారులను గుర్తించడం కోసం.. ఒక విస్తృతస్థాయి ప్రతిభావంతుల అన్వేషణ కార్యక్రమాన్ని ఎర్రకోట వేదికగా నేను ప్రకటించాను. ఇందులోనూ, ఏ బాలుడికి ఏ క్రీడలో ఆసక్తి ఉందన్నది మాత్రమే కాదు.. ఆ పిల్లలు ఏ క్రీడకు సరిపోతారో కూడా గుర్తించాలి. దానికి అనుగుణంగా వారికి శిక్షణ ఇవ్వాలి. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారమైనా అందిస్తాం. ప్రభుత్వం మీతో భుజం భుజం కలిపి నడుస్తుందని హామీ ఇస్తున్నాను.
మిత్రులారా,
దేశంలో 21వ శతాబ్దపు అవసరాలకు తగిన ఆధునిక క్రీడా వ్యవస్థను నిర్మించేందుకు మా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. ఈ రోజు క్రీడా విశ్వవిద్యాలయాల నుంచి ఆధునిక శిక్షణ కేంద్రాల దాకా… ప్రతిభావంతులను గుర్తించడం నుంచి ప్రపంచ స్థాయి వేదికలకు వారిని చేర్చే దాకా.. అన్ని స్థాయుల్లోనూ అండగా నిలిచే వ్యవస్థకు ప్రభుత్వం రూపుదిద్దుతోంది. క్రీడా విజ్ఞానం, శిక్షణ, తర్ఫీదు, అనుభవాలను పంచుకునే దిశగా.. ఇతర దేశాలతోనూ సహకారాన్ని విస్తరించుకుంటున్నాం.
మిత్రులారా,
క్రీడల పట్ల ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందో చెప్పడానికి ఈ కార్యక్రమమే నిదర్శనం. ‘ఖేలో ఇండియా సంవాద్’ కేవలం క్రీడలపై చర్చా కార్యక్రమమే కాదు.. ఇదొక సంవాద వేదిక. ఇక్కడి ప్రతి ఆలోచనా దేశ క్రీడా విధానానికి ఒక కొత్త దిశను నిర్దేశించగలదు. దీనితోపాటు ఇక్కడ జరుగుతున్న యువ సంవాదం.. మీ ఆలోచనలనూ, ఆశయాలనూ దేశ స్వప్నాలతో అనుసంధానించే గొప్ప వేదికగా నిలుస్తుంది. క్రీడా వ్యవస్థ, ప్రతిభకు పదును పెట్టడం, పాలన, వికసిత భారత్ గురించి యువత ఏమనుకుంటున్నదీ, వారి సూచనలేమిటన్నదీ ఈ కార్యక్రమంలో తెలుసుకుని.. విధాన రూపకల్పన ప్రక్రియలో వాటిని పరిగణనలోకి తీసుకుంటాం. ఈ వేదికను అత్యంత అర్థవంతంగా వినియోగించుకోవాలనీ, కొత్త భావాలను వెల్లడించాలనీ మీ అందరినీ కోరుతున్నాను. యువశక్తి అందించే ఈ కొత్త ఆలోచనలే.. వికసిత భారత్ సాధన కోసం అమితమైన బలాన్నిస్తాయి.
మిత్రులారా,
ఆరోగ్యకరమైన సమాజం, మంచి కుటుంబ వ్యవస్థ, మెరుగైన పని సంస్కృతి కోసం క్రీడా స్ఫూర్తి అత్యావశ్యకమని మనమెప్పుడూ వింటుంటాం. అయితే, క్రీడా మైదానానికి వెళ్లకుండా ఈ క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవడం చాలా కష్టం. విజేతలుగా నిలవడమే కాకుండా.. అత్యుత్తమ పోటీదారులుగా ఎదిగేందుకూ క్రీడలు మనకు తోడ్పడతాయి. ఎదగడం, పడిపోవడం, పడిపోయినా సరే మళ్లీ లేవడం… ఇలాంటి స్ఫూర్తిని క్రీడలు మనలో కలిగిస్తాయి.
మిత్రులారా,
క్రీడలు జీవితాన్ని ఎంతలా మార్చగలవో చెప్పడానికి మన పారా అథ్లెట్లే నిదర్శనం. మైదానంలో పారా అథ్లెట్లను చూసినప్పుడు జీవితం పట్ల మన దృక్పథం మారుతుంది. వారు ఏదైనా సాధిస్తే.. వారి కుటుంబమంతా నవోత్తేజాన్ని పొందుతుంది. తల్లిదండ్రులు, అన్నాతమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లు – ఇలా తొలి రోజుల్లో తమ బిడ్డ పడుతున్న కష్టాన్ని చూసిన వారందరిలోనూ.. ఆ దివ్యాంగ క్రీడాకారుల విజయం కొత్త స్వప్నాలను చిగురింపజేస్తుంది. వారిలో కొండంత ధైర్యాన్ని నింపుతుంది.
మిత్రులారా,
అలాంటి ఆటగాళ్ల నుంచి నేనెప్పుడూ స్ఫూర్తిని పొందుతూనే ఉన్నాను. ఉదాహరణకు.. ఈ పేరు మీరంతా వినే ఉంటారు. విలువిద్యలో అద్భుత క్రీడాకారిణి.. ఆ అమ్మాయి పేరు తెలుసా మీకు? – శీతల్. పారాలింపిక్స్‌లో ఆమె పతకం గెలిచిన వేళ.. జమ్మూ కాశ్మీర్ అంతా, యావద్దేశమూ గర్వంతో ఉప్పొంగింది. అలాగే, మరో బిడ్డ అవనీ లేఖరా.. పారాలంపిక్స్‌లో రెండు సార్లు పతకం గెలుచుకున్నారామె. తనను కలిసినప్పుడల్లా నాకెంతో గర్వంగా ఉంటుంది. సుమిత్ అంతిల్, నితేశ్ కుమార్, ఈ మధ్యే ఝండూ కుమార్ పేరు కూడా మీరు వినుంటారు… ఆ పారా అథ్లెట్లు, అలాంటి సహచరులు మనకెంతో స్ఫూర్తిదాయకం.
మిత్రులారా,
మెరుగైన జీవితానికి క్రీడలు భరోసానిస్తాయి. క్రీడలు మనల్ని మెరుగైన జీవితాన్ని గడిపేలా దృఢంగా ఉంచుతాయి. మన జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయి. ఫౌజా సింగ్ గురించి మనందరికీ తెలుసు. వందేళ్లకు పైబడిన వయసులో పోయిన ఏడాది ఫౌజా సింగ్ కన్నుమూశారు. క్రీడలు, దారుఢ్యం పట్ల అనురక్తి జీవితాంతం కొనసాగుతుందనేందుకు ఫౌజా సింగ్ అత్యుత్తమ ఉదాహరణ. క్రీడలకూ, జీవన ప్రమాణాలకూ మధ్య అనుబంధాన్ని తెలియజేసే గొప్ప స్ఫూర్తిదాయక ఉదాహరణ ఆయన జీవితం.
మిత్రులారా,
క్రీడల వల్ల కలిగే మరో గొప్ప ప్రయోజనం ఏమిటంటే.. మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండే సంకల్ప బలాన్ని పెంపొందించుకునే శక్తి నిజమైన క్రీడాకారుల సొంతం. ఆ వ్యసనం యువతకు పెనుసవాలుగా పరిణమించిన నేటి తరుణంలో.. ఇందులో కూడా క్రీడలు అత్యంత అర్థవంతమైన పాత్రను పోషిస్తాయి.
మిత్రులారా,
దేశంలో నేడు క్రీడలు ఒక గౌరవప్రదమైన వృత్తిగా ఎదగడం సంతోషాన్నిచ్చే విషయం. సమాజం క్రీడలను చూసే దృక్పథంలో విశేషమైన మార్పు వచ్చింది. నేడు దేశంలో ప్రజలు ట్రయాథ్లాన్లలోనూ, 5కే, 10కే రన్నింగ్ రేసుల్లోనూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మిత్రులంతా కలిసి వచ్చి హైరాక్స్ వంటి సవాళ్లను పూర్తి చేస్తున్నారు. మొదటిసారి శీర్షాసనం వేసినందుకు ఒకరు సంబురపడుతుంటే.. మరొకరు స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి పికిల్‌బాల్, బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. ఇవి చిన్న విషయాలే. కానీ విస్తృత దృక్పథంతో వీటిని చూస్తే ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది. క్రీడలిప్పుడు మన జీవితాల్లో భాగమవుతున్నాయి. చదువు, కెరీర్ కోసం టైం టేబుళ్లను రూపొందించుకుంటే.. ఆ రోజువారీ జీవితంలో క్రీడలకు కూడా చోటు దక్కుతోంది. ఇది మార్పు. ఇది గణనీయమైన పరివర్తన. ఈ మార్పు వల్లే దేశ క్రీడా భవితపై విశ్వాసం పెరుగుతోంది.
మిత్రులారా,
సామాన్య ప్రజలు క్రీడలతో మమేకమైనప్పుడే దేశంలో క్రీడా సంస్కృతి ఏర్పడుతుంది. పాఠశాలల్లో ఆటల పిరియడ్లను కేవలం సహపాఠ్య కార్యకలాపాలుగా కాకుండా, జీవితంలో భాగంగా చూసినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఇలా జరిగినప్పుడే ప్రతిభావంతులైన క్రీడాకారుల సంఖ్య పెరుగుతుంది. క్రీడలను వృత్తిగా ఎంచుకోవాలనుకునే పిల్లలకు వారి కుటుంబాల నుంచి మద్దతు కూడా లభిస్తుంది. అందుకే నేనంటాను – స్క్రీన్ల కన్నా క్రీడా కేంద్రాలే ముఖ్యమైనవి. ప్లే స్టేషన్ల కన్నా ఆటస్థలాలే మిన్న. యువకులైన మీరంతా ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తేనే ఇదంతా సాధ్యపడుతుంది.
మిత్రులారా,
దేశ యువశక్తి సామర్థ్యంపైనా, వారి విజయాలపైనా నాకు బలమైన నమ్మకముంది. యువతకూ నేను చెప్పదలచుకున్నది ఒకటే – క్రీడా మైదానంలోనైనా, సమాజంలోనైనా.. మీరు భాగస్వాములు కావడమే భారత్‌కు బలం. మీకు ఆటలంటే ఇష్టమైతే వాటితో మమేకమయ్యేందుకు ఇప్పుడెన్నో మార్గాలున్నాయి. ఇప్పుడు కొత్త క్రీడా పరికరాలు వచ్చాయి. కొత్త సాంకేతికత వచ్చింది. శిక్షణ, కోచింగ్ పద్ధతులు మారాయి. క్రీడల నిర్వహణ, పోటీ, వివిధ రంగాలకు సంబంధించిన అవసరాల్లో మార్పులొచ్చాయి. పరికరాల రూపకల్పన, క్రీడా సాంకేతికత, స్పోర్ట్స్ మెడిసిన్, పోషకాహారం, సైకాలజీ, అనలటిక్స్… ఇలా అన్ని రంగాల్లోనూ యువతకు కొత్త అవకాశాలు లభిస్తున్నాయి. ఈ అవకాశాలను మీరు జారవిడుచుకోవద్దు. అందుకే.. ఈ సంవాదంలో మీ ఆలోచనలను స్వేచ్ఛగా వెల్లడించండి. ఈ యువశక్తి భాగస్వామ్యమే వికసిత భారత్‌కు గొప్ప బలం. యువ మిత్రులందరికీ మరోసారి శుభాకాంక్షలు.
ధన్యవాదాలు.
వందేమాతరం.
గమనిక: ప్రధానమంత్రి ప్రసంగానికి స్వేచ్ఛానువాదమిది. మౌలిక ప్రసంగం హిందీలో ఉంది.
***
Khelo India has become a wonderful platform for nurturing sporting talent across the country. It is providing young athletes with opportunities and support to pursue their dreams.@kheloindia
— Narendra Modi (@narendramodi) August 27, 2026
https://t.co/hj8qEJRj09
मैंने इस 15 अगस्त को लाल किले से भारत का स्पोर्ट्स विजन देश के सामने रखा है।
— PMO India (@PMOIndia) August 27, 2026
जब मैं स्पोर्ट्स की बात करता हूं... तो ये केवल मेडल जीतने तक सीमित नहीं है।
ये विकसित भारत के निर्माण में... भारत की खेलशक्ति और युवाशक्ति को एक साथ जोड़ने का अभियान है: PM @narendramodi
दुनिया के दूसरे देश उन खेलों में मेडल जीतते हैं और हम उनमें हिस्सा ही नहीं लेते।
— PMO India (@PMOIndia) August 27, 2026
हमें मेडल टैली बढ़ाने के लिए इन खेलों में भी महारत हासिल करनी ही होगी: PM @narendramodi
ओलंपिक्स में जितने अलग-अलग स्पोर्ट्स होते हैं... भारत की टीमें उसमें से आधे स्पोर्ट्स में हिस्सा ही नहीं लेती।
— PMO India (@PMOIndia) August 27, 2026
यानि मेडल टैली के एक बहुत बड़े हिस्से के लिए तो हम कंपीट ही नहीं करते।
और दशकों से ऐसा ही चला आ रहा है: PM @narendramodi
खेल हमें केवल champion बनना नहीं सिखाता... बल्कि खेल हमें एक बेहतर competitor बनना भी सिखाता है।
— PMO India (@PMOIndia) August 27, 2026
उठना, गिरना... गिरकर फिर से उठना... Sports, ये ज़ज्बा हमारे भीतर लाता है: PM @narendramodi
Screens से ज्यादा... Sports centres की अहमियत है।
— PMO India (@PMOIndia) August 27, 2026
Play station से ज्यादा... Playgrounds की अहमियत है: PM @narendramodi