Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుజరాత్ లోని అమ్ రేలీ లో జరిగిన సహకార సమ్మేళనం లో ప్రధాన మంత్రి ప్రసంగం (17 సెప్టెంబరు, 2017)


(ప్రధాన మంత్రి గుజరాతీ భాష లో చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ కింది విధంగా ఉంది..)

ఇక్కడ పెద్ద సంఖ్యలో హాజరైన నా సోదరులు మరియు సోదరీమణులారా,

కేమ్ ఛో, బఢా?
(మీరు ఎలా ఉన్నారు ? బాగున్నారు కదూ!)

ఈ మైదానం ఏమంత పెద్దదిగా లేదని నాకు అనిపిస్తోంది; బయట కూడా ఖాళీ ఏమీ లేదు. గతంలో ఏ ప్రధాన మంత్రి ఇక్కడ మిమ్మల్ని కలుసుకున్నారో మీకు జ్ఞాపకం ఉందా ? లేదు ! లేదా ? ఏ ప్రధాన మంత్రి అయినా ఇక్కడకు వచ్చారా ? అది సరే మరి. ఇది కేవలం నా ఒక్కరికే రాసి పెట్టి ఉంది.

ముందుగా, కొత్త తరం పాలు పంచుకుంటున్న అమ్ రేలీ సహకార సంఘాన్ని నేను అభినందించ దలచాను. రతూభాయ్, ఇంకా ఇతర ప్రముఖులు గతంలో ఈ సహకార జగత్తు లో చురుకుగా పాల్గొనే వారు. సహకార రంగం, ప్రభుత్వ రంగం.. ఈ రెండూ ఈ ప్రముఖుల నియంత్రణలో ఉండేవి. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా, ఈ కొత్త బృందం అమ్ రేలీ జిల్లాను అభివృద్ధిలో నూతన శిఖరాలకు తీసుకువెళ్తోంది. నేను గతంలో కూడా అమ్ రేలీ కి చెందిన ఎపిఎమ్ సి మార్కెట్ తో ఒక సారి సమావేశమయ్యాను. అయితే, మన పిపి ప్రస్తుతం సాధించిన అద్భుతాలు, అభివృద్ధి నమూనా నిజంగా ప్రశంసార్హం. పిపి గారికి మరియు ఆయన బృందానికి అనేక అభినందనలు.

దిలీప్ భాయ్ చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి; అతనికి పనే జీవితం. పని లేకుండా అతను జీవించలేరు. ఏదైనా కొత్తగా ఉండే పని ఎలా చేయాలా అని ఆయన ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. సౌరాష్ట్ర లోని పాడి పరిశ్రమ అభివృద్ధి చెందడానికి అవకాశం లేని విధంగా గుజరాత్ లోని గత ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడం నాకు గుర్తు ఉంది. వారు ఎప్పుడూ ఇక్కడకు రాలేదు. అటువంటి అధ్వాన స్థితిలో ఇది ఉండేది. మేము విధానపరమైన మార్పులు చేశాము. ముందుగా, ఈ పరిస్థితిలో మార్పు రావాలని దిలీప్ భాయ్ నిర్ణయించారు. ఆయన దీనిని సాధించగలరన్న విశ్వాసంతో ఈ రోజు నేను ఉన్నాను. ఈ రోజు యావత్తు అమ్ రేలీ లాభపడింది. అమ్ రేలీ ప్రజలందరూ- వారు పశుపోషకులు కానీ, రైతులు కానీ, పాల ఉత్పత్తిలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్న వారు కానీ – అందరికీ ఒక సరైన విపణి సదుపాయం లభించింది. ఇది ఒక్కటే కాదు, వారు ఉత్పత్తి చేసే పాలకు సమృద్ధిగా, సరసమైన ధరను కూడా వారు పొందారు. ఇంత పెద్ద విజయాన్ని సాధించిన అనంతరం కూడా,ఈ దిశగా కృషి కొనసాగుతూ ఉండడం పట్ల- ఈ రోజు నేను చాలా తృప్తిగా ఉన్నాను. అదేవిధంగా, ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎపిఎమ్ సి ఒక భూ పరీక్షా ప్రయోగశాలను రూపొందించింది. విపణికి చేరుకుంటున్న వస్తువుల నాణ్యతకు అనుగుణంగా వేరు చేయడానికి ఒక ప్రయోగశాలను కూడా వారు ఏర్పాటు చేశారు. ఏ విపణిలో తమకు మంచి ధర లభిస్తుందో, ఆ విపణిలో రైతులు వారి ఉత్పత్తులను విక్రయించడానికి అనువుగా భారత ప్రభుత్వం ‘ఈ ఎన్ ఎ ఎమ్’ (eNAM) పథకాన్ని ప్రారంభించింది. భారత ప్రభుత్వం అభివృద్ధి పరచిన డిజిటల్ ప్లాట్ ఫారానికి అవసరమైన “నాణ్యతకు అనుగుణంగా వస్తువులను వేరుచేసే ప్రయోగశాల” ను కూడా పి పి భాయ్ ఏర్పాటు చేశారు. గుజరాత్ లోని ఇతర పిఎమ్ సి లకు ఒక నూతన మార్గాన్ని అమ్ రేలీ చూపిందని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను. గుజరాత్ లోని ఎపిఎమ్ సి ప్రపంచంలో అమ్రేలీని ప్రథమస్థానంలో నిలిపినందుకు నేను ఆయనను అభినందిస్తున్నాను. తిరిగి ఈ రోజున ఆరు దశాబ్దాల అనంతరం, ఆధునిక సాంకేతిక ప్రపంచంలో అమ్ రేలీఒక నూతన పంథాను అనుసరించడంలో ప్రథమస్థానంలో ఉంది. ఈ సాహస కృత్యానికి తప్పక అభినందించాలి.

నేను, ఈ రోజు, రెండు విషయాలు మీ దృష్టికి తీసుకురాదలచాను.

ఇక్కడ జరుగుతున్న మొదటి విషయం మధుర విప్లవం ప్రారంభోత్సవం. ఇక రెండోది, నీలి విప్లవానికి దారి తీస్తున్న గుజరాత్ లోని 1600 కిలోమీటర్ల మేర ఉన్న సముద్రతీరం. చేపల వేటలో నిమగ్నమైన మన సోదరులు మరియు సోదరీమణులు, వారు మన సముద్ర ఆస్తి; వారు ఈ కొత్త విప్లవాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి. ఒక వైపు గ్రామీణ గుజరాత్ కు చెందిన ప్రజలు, మరో వైపు సముద్రతీర ప్రాంతానికి చెందిన ప్రజలు.. వీరు ఇరువురు ఈ పథకాల ద్వారా వారి జీవితాలను ఒక కొత్త మార్గంలో ప్రారంభించనున్నారు. హరిత విప్లవం, శ్వేత విప్లవం తరహాలో భారత ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. మనం కూడా తప్పకుండా మధుర విప్లవం దిశగా ముందుకు వెళ్ళాలి. ఒక ఏడాది లేదా ఏడాదిన్నర క్రితం దిలీప్ భాయ్ తోనూ, మిగిలిన వాళ్లందరితోనూ నేను మాట్లాడాను. మనం వెళ్లి, రైతుల నుండి పాలను ఎలా సేకరిస్తున్నామో, అలాగే, తేనే ను కూడా మనం సేకరించగలం. ఎవరైనా 50 తేనెటీగలను పెంచితే, అప్పుడు వారు సంవత్సరానికి కనీసం 2 లక్షల రూపాయల విలువైన తేనెను విక్రయించవచ్చు. తేనెటీగల పెంపకం ద్వారా ఈ అదనపు ఆదాయం పొందవచ్చు. తేనెటీగలకు అవసరమైన మొక్కలను పెంచడం ద్వారా లభించే వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా కూడా అదనపు ఆదాయం లభిస్తుంది. ఈ రోజు దానికి కూడా శంకుస్థాపన చేసే అవకాశం నాకు లభించింది.

ఇక రెండో విషయానికి వస్తే, మీరు భారతదేశంలో ఏ మూలకు వెళ్లినా ప్రతి శుభప్రదమైన కార్యక్రమానికీ ముందు మిఠాయిలు ఇస్తారు. అయితే, ఒక్క గుజరాత్ రాష్ట్రంలో మాత్రమే శుభ కార్యక్రమాలలో ఐస్ క్రీమ్ ఇస్తారు. ఈ రోజు అమ్ రేలీ కూడా ఒక పాల ఐస్ క్రీమ్ కర్మాగారాన్ని ప్రారంభిస్తోంది. ఈ రెండు కొత్త పథకాలకు నా శుభాకాంక్షలు. ఈ పథకాలకు భారత ప్రభుత్వం 400 లక్షల రూపాయల మేర ఆర్ధిక సహాయాన్ని అందిస్తోంది. దీంతో ఈ పధకాలు సాఫీగా ముందుకు సాగే అవకాశం ఉంది.

రైతు సామాజిక వర్గానికి చెందిన నా సోదరులకు నా విజ్ఞప్తి- ఎటువంటి అదనపు శ్రమ లేకుండా పొలాల్లో తేనెటీగల పెంపకాన్ని సహజంగా చేపట్టవచ్చు. దానికి మనం కొంచెం ఏర్పాట్లు చేసి, ఆ ఉత్పత్తులను మంచిగా విక్రయిస్తే, అది మనకు మంచి ఆదాయాన్ని ఇస్తుంది. అంతే కాదు, ఒకవేళ దానిని విక్రయించలేకపోతే, మన ఇంట్లో ఉన్న పిల్లలకు తేనే లభిస్తుంది. అది ఆరోగ్యానికి చాలా మంచిది. అందువల్ల మధుర విప్లవం కోసం, గుజరాత్ లో ఎక్కడెక్కడ పాల ఉత్పత్తుల విక్రయానికి అవకాశం ఉందో అక్కడ ఈ తేనె విప్లవాన్ని కూడా జత చేయాలి. భారతదేశంలో ఒక కొత్త విప్లవం దిశగా ముందుకు సాగాలి.

భారతదేశ సముద్రతీరం విస్తారమైనది. అయితే గుజరాత్ సముద్ర తీరం నీలి ఉద్యమానికి భారీ సహకారాన్ని అందించింది. మనం జల మార్గాల వైపు, ఘోఘా నుండి దహేజ్ వరకు ఫెరి సర్వీసు వైపు దృష్టి సారిస్తున్నాము. నౌకాశ్రయాల అభివృద్ధిపై మనం పనిచేస్తున్నాం; నౌకాశ్రయాలు కేంద్రంగా అభివృద్ధిపై కృషి చేస్తున్నాం. ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నానికి సముద్ర మార్గం ద్వారా పంపవలసివస్తే, లేదా మన మోర్బీ నుండి తూర్పున ఉన్న కోల్ కాతా వరకు సముద్ర మార్గం ద్వారా మనం అతి తక్కువ ఖర్చుతో టైల్స్ ను రవాణా చేయగలం. కాబట్టి, అదేవిధంగా గుజరాత్ సముద్రతీర ప్రాంతం వెంబడి నివసిస్తున్న ప్రజల జీవనోపాధిలో భారీ మార్పులను తీసుకువచ్చే నీలి విప్లవాన్ని మరింత ముందుకు తీసుకుపోయే దిశగా ప్రభుత్వం పనిచేస్తోంది. గుజరాత్ కోస్తా తీరానికి చెందిన యువకులు నౌకాదళంలో చేరి, మన మాతృ భూమి అయిన భారతదేశానికి సేవ చేసే విధంగా వారికి శిక్షణ ఇచ్చి, వారికి మార్గనిర్దేశం చేసి, వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇటువంటి పథకాలకు ప్రచారం కల్పిస్తోంది. జీవ్ రాజ్ మెహతా తరువాత ఇక్కడ ఒక కొత్త కళాశాల కూడా రాలేదని, కొద్ది సేపటి క్రితం మన రూపాలా గారు నాకు చెప్పారు. జీవ్ రాజ్ భాయ్ మెహతా తరువాత మేము అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే, విద్యారంగంలో ఈ విప్లవం చోటు చేసుకుంది. బ్రాడ్ గేజ్ రైల్వే, జాతీయ రహదారి ల వంటివి ఇక్కడికి వస్తాయన్న ఆశలను అమ్ రేలీ ప్రజలు ఎప్పుడో వదలివేసుకొన్నారు. ఢిల్లీ లో సేవ చేయడానికి మీరు నాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు, ఈ రోజు మీ యొక్క రెండు కోరికలు సాకారమయ్యే దిశగా పరుగులు తీస్తున్నాయి.

సోదరులు మరియు సోదరీమణులారా, అతి త్వరలో మనం స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం 75 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం. స్వాతంత్య్ర పోరాటంలో మిగతా అన్ని జిల్లాల కంటే అమ్ రేలీ జిల్లా ముందు వరుసలో ఉంది. 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలను మనం ఎలా జరుపుకొంటాం, మన స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులకు మనం ఎలాంటి భారతదేశాన్ని బహుమతిగా ఇవ్వగలం ? వాళ్లు కలలుగన్న భారతదేశాన్ని మనం వారికి ఎలా అందించగలం ? వచ్చే ఐదేళ్లలో, అంటే 2022 సంవత్సరానికల్లా ఇది సాధిస్తామని- మన అమ్ రేలీ జిల్లా, అమ్ రేలీ పురపాలక సంఘాలు, అమ్ రేలీ తెహసిల్ పంచాయతీలు, అమ్ రేలీ జిల్లా పంచాయతీలు, గ్రామ పంచాయితీలు, సహకార సంఘాలు, విద్యా సంస్థలు, సామాజిక సంస్థలు సమష్టిగా తీర్మానించుకోవాలి. ఏది ఏమైనా, దేశం కోసం మనం ఈ మాత్రం చేయాలి. అదే విధంగా, మనం రోజువారీగా ప్రణాళికలు తయారు చేసుకుని, ఈ ఐదేళ్లలో ఈ తీర్మానాన్ని సాధించడానికి కృషి చేయాలి. మన జీవనయానాన్ని తీర్మానం నుండి సాఫల్య దిశగా కొనసాగించాలి. 2022 సంవత్సరానికల్లా మన దేశ రైతుల ఆదాయం రెట్టింపు కావాలన్నదే మన స్వప్నం.

సోదరులు మరియు సోదరీమణులారా, మనం ఒక క్రమబద్ధమైన మార్గంలో ముందుకు పోతే, ఒక ఖచ్చితత్వంతో ముందుకు పోతే, అప్పుడు భారతీయ రైతుకు కూడా అదే విధమైన శక్తి ఉంటుంది. ప్రభుత్వం, సమాజం, రైతులు కలిసి పనిచేయడం ద్వారా దీనిని సాధించవచ్చు. అయితే దాని కోసం మన సంప్రదాయ విధానాల నుండి బయటపడి ఆధునికత వైపు పయనించాలి. కొత్త విషయాలను అంగీకరించాలి. ఈ రోజు మనం నర్మదా ప్రాజెక్టు ను పూర్తి చేసుకొన్నాం; గుజరాత్ చరిత్రలో ఇది ఒక అద్భుతమైన రోజు. ఇది ఒక చాలా అద్భుతమైన రోజు. అయితే, నర్మద జలాలను బిందు సేద్యం ద్వారా వినియోగించుకునే అలవాటుగా మార్చుకున్నట్లయితే, అదే విధంగా మన రైతాంగానికి బిందు సేద్యాన్ని పరిచయం చేసినట్లయితే, అప్పుడే అది మనకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. తద్వారా, రానున్న వంద సంవత్సరాల దాకా మన ముందు తరాలకు ప్రయోజనాన్ని చేకూర్చగలుగుతాం. మరి ఈ విధంగానే నర్మద జలాలను వినియోగించుకుంటామని మనం హామీ ఇద్దాం. ఈ విషయంలో గుజరాత్ ఒక పెద్ద అడుగు వేసింది. దేశంలోని మొత్తం బిందు సేద్యంలో 25 శాతం గుజరాత్ లో అమలులో ఉంది. ఈ విషయంలో గుజరాత్ రైతులను అభినందించాలి. అయితే, ఇంతటితో ఇది ఆగకూడదు. ఇంకా ఎంతో చేయడానికి అవకాశం ఉంది. ఆ దిశగా మనం ప్రయత్నించాలి. వ్యవసాయ రంగంలో మరో రెండు విషయాలు ఉన్నాయి: చాలా మంది రైతులు సౌర శక్తి తో నడిచే పంపులను వాడుతున్నారు. దీని వల్ల ఒక్క రూపాయి కూడా విద్యుత్తు బిల్లు రాదు. తమ స్వంత పొలంలో సౌర ఫలకాలను వినియోగించడం ద్వారా రైతు ఒక పంపును నడిపించుకోవచ్చు. ఆ పంపు ద్వారా సాగు నీటిని పొందవచ్చు. రైతు విద్యుత్తు బిల్లులపై ఆదా చేసినట్లయితే, అప్పుడు తన వ్యయంలో వేలాది రూపాయల ఖర్చును తగ్గించుకోవచ్చు. ఈ రోజుల్లో చాలా మంది రైతులు పెద్ద ఎత్తున సౌర శక్తి తో నడిచే పంపుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు చెప్పండి. బిందు సేద్యం, సోలార్ పంపులు, సౌర శక్తి ద్వారా విద్యుత్తు ఉత్పత్తి వంటివి అమలు చేస్తే, అవి ఖర్చు ను తగ్గిస్తాయా, లేదా ? ఆదాయం పెరుగుతుందా, లేదా ? మరి భూమి కూడా సద్వినియోగమవుతుంది. కాబట్టి రైతులు ఈ దిశగా కూడా ముందుకు రావాలన్నది నా విజ్ఞప్తి. తద్వారా సహకార ఉద్యమంలో ఉన్న మిత్రులు ఈ దిశగా ముందుకు వచ్చే అవకాశం ఉంది.

రైతులందరూ ఉమ్మడిగా వారి పంట పొలాల సమీపంలో సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకొని, విద్యుత్తును ఉత్పత్తి చేసినట్లయితే, ఫలితంగా రైతులు రెండు ప్రధాన ఖర్చుల నుండి బయటపడతారు. అవి విద్యుత్తు, సాగునీరు. రైతుల జీవితాల్లో అది తీసుకువచ్చే మార్పును ఒకసారి ఊహించండి. నేను మరొక విషయంలో మీకు విజ్ఞప్తి చేయదలచాను; మనం మన పొలంలో 2 నుంచి 3 మీటర్ల స్థలాన్ని పొలం చుట్టూ తీగ కంచె వేయడం కోసం వృథా చేస్తున్నాం. దానికి బదులుగా మనం కలప కోసం చెట్ల పెంపకం చేపట్టగలమా ? ఎవరైతే తమ పొలాల గట్ల మీద కలప కోసం చెట్ల పెంపకం చేపడతారో వారు ఆ కలపను విక్రయించుకోడానికి హక్కును పొందే విధంగా, ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వానికి చెందిన అటవీ శాఖ ఏ విధంగానూ వారిని ఇబ్బంది పెట్టదు. తద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది. మా ప్రభుత్వం అటువంటి చట్టం తీసుకు వచ్చే దిశగా కృషి చేస్తోంది. మన భూములు నిరుపయోగంగా మిగిలిపోతున్నాయి. ఇంకా, చెక్కలుగా కోసిన కలపను విదేశాల నుండి దిగుమతి చేసుకోవలసి వస్తోంది. మన దేశ రైతులు కోరుకుంటే, వారు కలప కోసం చెట్ల పెంపకం చేపట్టవచ్చు. అపుడు కలప దుంగల దిగుమతిని నిరోధించవచ్చు. దీని వల్ల రైతుల ఆదాయం పెరిగే అవకాశం లేదూ ?

వీటన్నింటికీ అదనంగా పశువుల పెంపకం కూడా ఉంది. మన దేశంలో ఒక్కొక్క పశువు ద్వారా లభించే సరాసరి పాల పరిమాణాన్ని, అంతర్జాతీయ సరాసరి పాల పరిమాణంతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. ఏ విధంగా ఈ పశు సంపదను వృద్ధి చేయాలి ? వాటిని ఆరోగ్యంగా ఉంచడానికి ఎటువంటి ఏర్పాట్లు చేయాలి ? ఎటువంటి పశుగ్రాసాన్ని వాటికి అందించాలి ? పాత సంప్రదాయం ప్రకారం వాటికి ఏవి దొరికితే అవి తింటాయి. అందువల్ల వాటి సామర్ధ్యం కంటే చాలా తక్కువగా వాటి సరాసరి పాల దిగుబడి లభిస్తోంది. ఈ రోజు, పాల ఉత్పత్తిని పెంచాలంటే, ఒక రైతు ఏమి చేయాలని అనుకుంటున్నాడు ? తన పాడి పశువుల సంఖ్యను రెండు నుండి నాలుగు, నాలుగు నుండి ఎనిమిదికి పెంచుతున్నాడు. ఫలితంగా అతని వ్యయం కూడా పెరుగుతోంది. దానికి బదులుగా, కేవలం రెండు పాడి పశువుల నుండి ఎక్కువ పరిమాణంలో పాలు పొందడానికి ఏమి చెయ్యాలనే విషయమై దృష్టి పెడితే, అప్పుడు రైతు ఆదాయం పెరుగుతుంది; రైతు పైన భారం కూడా తగ్గుతుంది. ఈ పశువుల పెంపకం పని ని ప్రధానంగా మన సోదరీమణులే చేపడుతున్నారు. అందువల్ల వారికి తగిన శిక్షణను ఇవ్వాలి. ఇప్పుడు మేము ఆ దిశగా పని చేస్తున్నాం.

ఈ నేపథ్యంలో, మొట్టమొదటిసారిగా దేశంలో రైతులకు రక్షణ కల్పించడం జరిగింది. ప్రధాన మంత్రి పంట బీమా పధకం- కృషి బీమా యోజన ల వంటివాటిని ప్రారంభించడం జరిగింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట పండకపోతే, బీమా మొత్తం పొందే ఒక పథకాన్ని మొదటిసారి మీకోసం ప్రారంభించడం జరిగింది. సాగు చేసిన పంట పొలంలోనే ఉండి, 15 రోజుల లోపల వర్షం వచ్చి పంట నష్టం జరిగితే కూడా ఆ పంటకు నష్టపరిహారాన్ని చెల్లించడం జరుగుతుంది. ఈ విధమైన బీమా పథకాన్ని భారత ప్రభుత్వం మొదటిసారిగా ప్రవేశపెట్టింది. కాగా ఈ రోజున రైతులు కూడా ఈ పధకం ద్వారా లబ్ధిని పొందుతున్నారు.

రైతులు ఇప్పుడు పంటల బీమా వైపు మొగ్గు చూపుతున్నారు. తప్పుడు పనులు చేసే అలవాటు ఉన్న వారు సమయం తీసుకుంటున్నారు; కానీ నాకు తెలుసు.. వారు తప్పుడు పనులు చేసినా, వారు కూడా ప్రయోజనం పొందుతున్నారు. వారు మంచిగా జీవిస్తున్నారు. అప్పుడు తప్పుడు పనులు చేసే వారు మరో వైపు వెళ్తున్నారు. నీతిమంతులు అనేక ప్రయోజనాలను పొందుతున్నారు; ప్రధాన మంత్రి పంటల బీమా పథకం ఇలాగ ఉంది.

మనం మన దేశంలో వ్యవసాయాన్ని, తోటల పెంపకాన్ని చేపడుతున్నప్పటికీ కోట్లాది రూపాయల విలువ చేసే పండ్లు, కూరగాయలు వృథా అవుతున్నాయి. ప్రధాన మంత్రి కిసాన్ సంపద పథకాన్ని మేం తీసుకువచ్చాం. ఉత్పత్తి చేసిన వస్తువులకు ఈ పథకంలో భాగంగా అదనపు విలువను కల్పించడం జరుగుతుంది. మీరు పచ్చి మామిడికాయలు విక్రయిస్తే, మీకు తక్కువ డబ్బు వస్తుంది. అదే మామిడి పండ్లను విక్రయిస్తే, అప్పుడు మీకు ఎక్కువ డబ్బు వస్తుంది. దీనినే విలువను పెంచడం లేదా విలువను జోడించడం అంటారు. పచ్చి మామిడి కాయలతో ఊరగాయ పచ్చడి చేసి విక్రయిస్తే మీకు ఎక్కువ డబ్బు వస్తుంది. అయితే అదే ఊరగాయ పచ్చడిని అందమైన అట్ట పెట్టెలో పెట్టి విస్తృతంగా ప్రచారం చేస్తే, అప్పుడు మీ ఉత్పత్తికి ఇంకా మంచి ధర వస్తుంది. దీన్నే విలువను జోడించడం అంటారు. పచ్చి మిరపకాయలు తక్కువ ధరకు అమ్ముడు పోతాయి. అదే ఎండు మిరపకాయలు అధిక ధరలకు అమ్ముడు పోతాయి. అయితే అదే ఎండు మిరపకాయలను పొడి చేసి కారంగా విక్రయిస్తే, ఇంకా ఎక్కువ ధరకు అమ్ముడు పోతుంది. ఈ రకంగా వ్యవసాయ ఉత్పత్తులకు విలువను జోడించడం వల్ల రైతులు అధిక ప్రయోజనాలను పొందుతారు. మీరు పాలను విక్రయిస్తే, తక్కువ డబ్బు వస్తుంది; అదే కోవా (ఘనీభవించిన పాలు) ను తయారుచేసి విక్రయిస్తే, మీకు ఎక్కువ డబ్బు వస్తుంది. కోవా నుండి పేడాలు తయారుచేసి విక్రయిస్తే, ఇంకా ఎక్కువగా డబ్బు వస్తుంది. వ్యవసాయ ఉత్పత్తులకు విలువను జోడించే దిశగా రైతులను తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం ప్రధాన మంత్రి కృషి సంపద పథకాన్ని ప్రారంభించింది. భారీ స్థాయిలో ఫుడ్ పార్క్ నెలకొల్పేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ప్రపంచ వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉన్న సంస్థలను నవంబరు నెలలో ఆహ్వానించనున్నాం. అప్పుడు వారు వారి ఉత్పత్తుల విలువను ఏవిధంగా పెంపొందుచుకోవాలో రైతులకు వివరిస్తారు. ఫూడ్ ప్రాసెసింగ్ రంగంలో రైతులు ముందుకు వచ్చే విధంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలను ప్రధాన మంత్రి కృషి సంపద పథకం ద్వారా కేటాయించింది.

సోదరులు మరియు సోదరీమణులారా, గుజరాత్ లోని గ్రామాలు సుసంపన్నం కావాలి; గుజరాత్ లోని రైతులు సంపన్నులు కావాలి. ఈ పథకం ద్వారా మన దేశంలోని రైతులందరూ ప్రయోజనం పొందాలి. అదేవిధంగా మన దేశంలోని రైతులందరూ సంపన్నులు కావాలి. దేశంలోని గ్రామీణ జీవితాల్లో ఆర్ధిక విప్లవం తీసుకురావాలని భారత ప్రభుత్వం ఇప్పుడు అనేక ప్రాజెక్టులతో ముందుకు వస్తున్న సమయంలో, అమ్ రేలీ జిల్లా క్షీర విప్లవం, మధుర విప్లవం, నీలి విప్లవం, ఎపిఎమ్ సి, డెయిరీ ఇంజినీయరింగ్ లలో సహకార రంగం కింద అనేక ప్రాజెక్టులను చేపట్టింది. మీరు ఎప్పుడు ఏ ముందంజను వేసినా భారత ప్రభుత్వం ఎప్పటికీ మీ తోనే ఉంటుంది. ఇది భారత ప్రభుత్వ పథకం. దీని ద్వారా ఏ జిల్లా అయినా, ఏ జిల్లాకు చెందిన ఏ సహకార పథకమైనా ప్రయోజనం పొందవచ్చు. ఈ అవకాశాన్ని అమ్ రేలీ పూర్తిగా వినియోగించుకోవాలి; గుజరాత్ లోని అన్ని జిల్లాలు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి.

మీ అందరికి నా నుండి అనేక అభినందనలు .