Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఘోఘా, ద‌హేజ్ ల మ‌ధ్య రో-రో ఫెరీ సర్వీసు ప్రారంభ కార్యక్రమంలో ప్రధాన‌ మంత్రి ప్ర‌సంగ సారాంశం

ఘోఘా, ద‌హేజ్ ల మ‌ధ్య రో-రో ఫెరీ సర్వీసు ప్రారంభ కార్యక్రమంలో ప్రధాన‌ మంత్రి ప్ర‌సంగ సారాంశం


ప్రియమైన నా సోదరులు మరియు సోదరీమణులారా,
మిత్రులారా!

బంగారు పంట పండిన పొలాన్ని చూసినప్పుడు రైతుకు ఎంత సంతోషం కలుగుతుందో; ఓ మట్టిముద్ద తన చేతిలో అందమైన కూజా గానో లేదా కుండ గానో లేదా మట్టి దీపంగానో రూపుదిద్దుకొన్నప్పుడు కుమ్మరి ఎంత పొంగిపోతాడో; ఒక సుందరమైన తివాచీని తన చేతుల మీదుగా అల్లినప్పుడు చేనేతకారుడికి కలిగే ఆనందం, అనుభవం ఎలాంటివో; అటువంటి సంతోషదాయకమైన అనుభూతులే ఇప్పుడు నాకు కలుగుతున్నాయి. నా సాటి దేశ వాసులైన 125 కోట్ల మంది ఆశలు, భావోద్వేగాల అనుభవంతో నేను ఇక్కడికి వచ్చానని ఓ ఘడియ కిందట ఈ ప్రాంతంలో అడుగు పెట్టినప్పుడు నాకు అనిపించింది.

ఘోఘా నుండి ద‌హేజ్‌కు సముద్రంలో నేను ప్రయాణిస్తున్నప్పుడు గడుస్తున్న ప్రతి క్షణం ఓ కొత్త చరిత్రను లిఖిస్తున్న భావన నాకు కలిగింది. ఇదొక కొత్త భవిష్యత్తుకు ద్వారాలను తెరిచింది. ఈ ద్వారం నుండి పయనించడం ద్వారా మనం ఒక ‘న్యూ ఇండియా’ కు బలమైన పునాదిని వేయడమే కాదు.. ఆ స్వప్నాన్ని సాకారం చేసుకోగలం కూడాను. ఈ దిశగా దేశ ప్రజాశక్తిని సద్వినియోగం చేసుకోవాలని సర్దార్ పటేల్ మొదలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ వరకు ప్రతి ఒక్కరు కలలుగన్నారు. ఇవాళ వారి కలల బాటలో మనం ఓ మైలురాయిని అధిగమించాం.

ఘోఘా, దహేజ్ ల మధ్య ఈ ఫెరీ సర్వీసు సేవలు సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ వాసులైన లక్షలాది ప్రజల జీవితాలను సులభతరం చేయడమేగాక పరస్పరం మరింత చేరువ చేస్తాయి కూడా.

ఈ ఫెరీ సర్వీసు ఈ ప్రాంతం మొత్తంలో సామాజిక-ఆర్థిక అభివృద్ధిపరంగా ఓ కొత్త శకాన్ని ఆవిష్కరించనుంది. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకొనే యువతకు కొత్త ఉపాధి అవకాశాలను అందుబాటులోకి వస్తాయి. తీరప్రాంత నౌకా రవాణా, పర్యాటకాలలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఇప్పుడు ఇక్కడ హాజరైన మనమంతా భవిష్యత్తులో రాబోయే మార్పులకు సాక్షులం అవుతామని గమనించాలి. రాబోయే రోజుల్లో ఈ ఫెరీ సర్వీసు ద్వారా హజీరా, పీపావావో, జాఫ్రాబాద్, దమన్-దీవ్ ల వంటి ముఖ్యమైన ప్రాంతాలను సంధానించగలం.

ఈ ఫెరీ సర్వీసును సూరత్ ఆవల హజీరా, అటుపైన ముంబయి దాకా తీసుకుపోవాలని గుజరాత్ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు నాకు సమాచారం అందింది. కచ్ఛ్ జలసంధి లోనూ ఇటువంటి రవాణా సేవలను ప్రారంభించే అంశంపై సాగుతున్న చర్చల్లో ఇప్పటికే చాలా పురోగతి కనిపిస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్నాను. ఇలాంటి వినూత్న కార్యక్రమాలను చేపడితే కేంద్ర ప్రభుత్వం పూర్తి తోడ్పాటు అందిస్తుందని కూడా హామీ ఇస్తున్నాను.

ద‌హేజ్‌స‌హా దక్షిణ గుజరాత్ మొత్తాన్ని అభివృద్ధి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి ఈ ఫెరీ సేవలే ఒక సజీవ ఉదాహరణ. భ‌రూచ్‌కు అద‌నంగా దక్షిణ గుజరాత్ అంతటా పారిశ్రామికాభివృద్ధికి ఊపునిచ్చే దిశగా దహేజ్, హజీరా ల వంటి కేంద్రాల మీద మేం ప్రత్యేకంగా దృష్టి సారించాం. పెట్రోలియమ్, ర‌సాయ‌నాలు- పెట్రో ర‌సాయ‌నాల పెట్టుబ‌డి ప్రాంతాల ఏర్పాటుకు అద‌నంగా రైలుమార్గాల నిర్మాణం, ర‌హ‌దారుల‌ అనుసంధానం త‌దిత‌రాల‌పై ఈ విధంగా కృషి సాగుతుంద‌ని ఇంత‌కుముందు ఎవ‌రూ బ‌హుశా ఊహించి కూడా ఉండ‌రు.

దీంతో పాటు హజీరాలో మౌలిక వసతుల అభివృద్ధికీ ప్రాధాన్యమిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఢిల్లీ-ముంబయి పారిశ్రామిక కారిడార్ నుండి కూడా ఈ ప్రాంతాలకు లబ్ధి చేకూరుతుంది. గుజరాత్ రాష్ట్రంలో సముద్ర రవాణా సదుపాయాల అభివృద్ధి దేశానికే ఒక నమూనా అవుతుంది. అలాగే ఇవాళ శ్రీకారం చుట్టిన రో-రో ఫెరీ సర్వీసు ప్రాజెక్టు అన్ని రాష్ట్రాలకూ ఆదర్శ పథకం కాగలదన్న ఆశాభావం నాకుంది.

ఇటువంటి పథకాలను సాకారం చేయడంలో ఎదురయ్యే సమస్యలను అర్థం చేసుకుని, వాటి పరిష్కారం కోసం అనేక సంవత్సరాల పాటు ఎంతో కఠినంగా శ్రమించాం. దీనివల్ల భవిష్యత్తులో ఇలాంటి ప్రాజెక్టుల నిర్మాణంలో సమస్యలు కనిష్ఠ స్థాయికి తగ్గుతాయి. ఈ దిశగా గుజరాత్ మహత్తర కృషి చేసింది.

మిత్రులారా, భారతదేశం జలరవాణాలో ఇవాళ కాదు.. శతాబ్దాల కిందటే ప్రపంచ దేశాలన్నింటి కన్నా ఎంతో ముందుంది. ఇతర దేశాల సాంకేతిక పరిజ్ఞానంతో పోలిస్తే మన సాంకేతికత చాలా మెరుగైంది. అయితే, వలస పాలన బానిసత్వ కాలంలో చారిత్రక సానుకూలతల నుండి నేర్చుకోవడాన్ని మనం క్రమేణా మానేశామన్నది కూడా గమనించాల్సిన వాస్తవం.. ఒకవిధంగా దాన్నంతా మనం మరచిపోయాం. వినూత్న ఆవిష్కరణలు తగ్గిపోవడంతో పాటు మనకు గల సామర్థ్యాలు కూడా నెమ్మదిగా కనుమరుగై గత చరిత్రగా నిలచిపోయాయి. వందల సంవత్సరాలుగా మన నావికా సామర్థ్యాలు ప్రపంచం గుర్తింపు పొందినప్పటికీ స్వాతంత్ర్యం సిద్ధించిన అనంతరం జల రవాణా రంగం ఎందుకు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడింది ?

మిత్రులారా, ఇవాళ్టికీ దేశ రవాణా రంగంలో రహదారుల రంగం వాటా 55 శాతం కాగా రైల్వేల వాటా 35 శాతంగా ఉంటే అత్యంత చౌక మార్గమైన జల రవాణా 5 నుండి 6 శాతం కూడా లేదు. మూడో ప్రపంచ దేశాల్లో జలమార్గాలు, తీర రవాణాకు సంబంధించి 30 శాతం వాటా గల భారతదేశంలో ఇదీ మనముందు ఉన్నటువంటి వాస్తవం. ఇదే మనకు ప్రధానమైన సవాలు.. ఈ పరిస్థితిని మార్చడానికి మనమంతా గట్టి పట్టుదలతో ముందుకు కదలాలి.

నేడు మన ఆర్థిక వ్యవస్థలో రవాణా రంగం వాటా 18 శాతంగా ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అంటే.. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో ఒకచోటు నుండి మరొక చోటుకు వస్తు రవాణా అనేది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదన్న మాట. ఈ రవాణా వ్యయం అధికం కావడంవల్ల పేదలకు అవసరమైన వస్తువులు ప్రియమైపోతున్నాయి. జల రవాణాను ప్రోత్సహించడం ద్వారా రవాణా వ్యయాన్ని మనం సగానికి సగం తగ్గించవచ్చు. ఇందుకు అవసరమైన వనరులు, సదుపాయాలు, మార్గాలు, సామర్థ్యాలు.. సకలం మనకున్నాయి.

మిత్రులారా, దేశానికి 7,500 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరం ఉంది. దాంతో పాటు 14,500 కిలోమీటర్ల పొడవైన అంతర్గత జల మార్గాలు లేదా అందుకు అవసరమైన నదీ సమూహం మన సొంతం. అంటే భరతమాత మనలను 21,000 కిలోమీటర్ల పొడవైన జలమార్గాలతో ఆశీర్వదించింది. కానీ, ఏళ్ల తరబడి ఈ ప్రకృతి వరాన్ని సద్వినియోగం చేసుకోలేని జడత్వంలో ఉండిపోయి, దానిని ఎలా వినియోగించుకోవాలో అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాం.

మన దేశంలో తొలి ఓడరేవుల విధానానికి 1995లో రూపుదిద్దారని తెలిస్తే మీరంతా ఆశ్చర్యపోవడం ఖాయం. దేశానికి 1947లో స్వాతంత్ర్యం వస్తే ఓడరేవుల విధానం రూపొందింది 1995లో. దీన్నిబట్టి ఎంత జాప్యమైందో గ్రహించండి. అంతకుముందు కూడా ఓడరేవులను దీర్ఘ దృష్టితో అభివృద్ధి చేసింది లేదు. ఈ కారణంగా వందల కోట్ల రూపాయల, వేల కోట్ల రూపాయల మేర దేశం ఆర్థికంగా నష్టపోయిందన్నది సత్యం. ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే అంతా గాడిలో పడుతోంది.

మీకు ఒక ఉదాహరణ చెబుతాను; జలమార్గంలో మనం బొగ్గును కిలోమీటరు రవాణా చేస్తే టన్నుకు ఖర్చయ్యేది 20 పైసలే! కానీ, అదే బొగ్గును రైలుమార్గంలో కిలోమీటరు రవాణాపై టన్నుకు రూ.1.25 వెచ్చించాలి.. అంటే, 20 పైసలు కాస్తా రూపాయిన్నరకు చేరింది. అలాంటప్పుడు రోడ్డు మార్గంలో బొగ్గు రవాణా చేస్తే ఖర్చు ఏ మేరకు ఇబ్బడిముబ్బడి అవుతుందో మీరు ఆలోచించగలరా ? మరి బొగ్గును మనం చౌకైన మార్గంలో రవాణా చేసుకోవాలా.. వద్దా ? కానీ, 90 శాతం బొగ్గు రవాణా నేటికీ రైల్వేల ద్వారానే సాగుతోందంటే మీరు ఆశ్చర్యపడాల్సిందే. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ దు:స్థితిని మార్చాలని మేం గట్టిగా సంకల్పించాం. ఆ మేరకు ప్రభుత్వం క్రమబద్ధంగా సరికొత్త చర్యలు తీసుకుంటూ ముందడుగు వేస్తోంది.

మిత్రులారా, మనం ఒక కొత్త ఇంటిని కొనాలని అనుకుంటే దానికి ఇతర ప్రాంతాలతో సంధానం ఎలా ఉందన్నది పరిగణనలోకి తీసుకుంటాం. దానికి రోడ్డు మార్గం ఉందా లేదా, రైళ్లు వెళ్లే వీలుందా, బస్సులు తరచూ దొరుకుతాయా ఇత్యాది అంశాలన్నిటినీ క్షుణ్నంగా పరిశీలిస్తాం. అవేవీ లేవని స్పష్టమైతో మరో చోట ఇల్లు చూసుకుంటాం.

అదేవిధంగా కొత్త వ్యాపారం ప్రారంభించాలంటే కూడా ఆ ప్రాంతానికి ఎటువంటి సంధానం ఉందో చూసుకుంటాం. ఆ ప్రాంతానికి వస్తు రవాణాలో సమస్యలు ఏవైనా ఉంటాయా అని పరిశీలిస్తాం.

మరి మన సాధారణ పరిశీలన ఇలా ఉన్నపుడు ఒక పరిశ్రమను సముద్ర తీరానికి దూరంగా ఎందుకు ఏర్పాటు చేయాలి ? ముడిసరుకుల చేరవేత లేదా కర్మాగారాలలో వస్తు తయారీ అన్నది ఓడరేవు సంధానంతో ముడిపడి ఉన్నపుడు తీర ప్రాంతాలలో పరిశ్రమ ఏర్పాటు తెలివైన ఆలోచన అవుతుందా.. కాదా ? దీనివల్ల రవాణా వ్యయం తగ్గడమేగాక వ్యాపార సానుకూలత మెరుగుకూ వీలు ఉంటుంది.

దేశానికి అవసరమైంది ఏదైనా ఉత్పత్తి చేయడానికి దేశంలో ఎక్కడైనా సదరు పరిశ్రమను ఏర్పాటు చేయవచ్చు.. ఇప్పుడు జరగాల్సింది ఇదే. అలాగే ఇతర దేశాలకు ఏదైనా పంపాలన్నా, ఏదైనా ఎగుమతి చేయాలన్నా వాటిని తీర ప్రాంతాల నుండి చేపడితే అది మరింత సౌలభ్యంగా ఉండటమేగాక మరిన్ని లాభాలను కూడా తెచ్చిపెడుతుంది.

మిత్రులారా,

రవాణారంగ ప్రపంచంలో ‘మీరు రేపటి సమస్యను ఇవాళ పరిష్కరించబోతున్నారంటే అప్పటికే చాలా ఆలస్యం చేసినట్లే’అని భావించాలంటారు. మీరొక్కసారి ఊహించుకోండి.. ఒక ప్రాంతంలో నిత్యం వాహన రాకపోకలు స్తంభిస్తుంటాయి. దీన్నిబట్టి అక్కడ ఓ ఫ్లైఓవర్ ను నిర్మించాలని నిర్ణయిస్తే అది పూర్తయ్యే లోపు వాహనాల సంఖ్య మరింత వేగంగా పెరిగి, ఫ్లైఓవర్ మీద కూడా వాహన రాకపోకలు స్తంభిస్తాయి. ఇప్పడు మన దేశంలో పరిస్థితి ఇదే.. అందుకే ప్రభుత్వం ప్రస్తుత అవసరాలనేగాక భవిష్యత్ అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకొని రవాణా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగమే ‘పి ఫర్ పి’… అంటే ‘రేవులతో రెట్టింపు సౌభాగ్యం’ అన్నమాట. ఇదే మా తారక మంత్రం.. మన రేవులే మన సౌభాగ్య ద్వారాలు. ఈ దూరదృష్టికి ప్రతిబింబమే ‘సాగరమాల’ వంటి పథకం. ఆ మేరకు 2035ను మనస్సులో పెట్టుకొని 2025 అవసరాలు తీర్చడానికి మేం కృషి చేస్తున్నాం. ఈ పథకం కింద ప్రభుత్వం నేటి అవసరాలతో పోల్చి 2035 నాటి అవసరాల అంచనాతో 400కు పైగా ప్రాజెక్టులలో భారీగా పెట్టుబడులు పెట్టనుంది.

తదనుగుణంగా వివిధ పథకాల కోసం 8 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులు సిద్ధంగా ఉన్నాయి. కనుక ‘న్యూ ఇండియా’కు సాగరమాల పథకం కచ్చితంగా మూలస్తంభం అవుతుంది.

మిత్రులారా, సముద్రాల ద్వారా ఇతర దేశాలతో బలమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి మనకు మరిన్ని ఆధునిక ఓడరేవులు అవసరం. అవి మన ఆర్థిక వ్యవస్థకు ప్రాణవాయువును అందించే శ్వాసకోశాల వంటివి. కాబట్టి అవి నిరుపయోగంగా ఉన్నా, వాటి సామర్థ్యానికి తగినట్లు పనిచేయకపోయినా, మన వాణిజ్యం ఆశించిన స్థాయిలో సాగదు. ఊపిరితిత్తులు గాలిలో నుండి ప్రాణవాయువును గ్రహించి గుండె ద్వారా, రక్తనాళాల ద్వారా అన్ని శరీర భాగాలకూ సరఫరా చేస్తాయి. అదేవిధంగా రైల్వేలు, జాతీయ రహదారులు, ఆకాశ, జలమార్గాలు మన ఆర్థిక వ్యవస్థకు ఊపిరులను ఊదే పాత్రను పోషిస్తాయి. శరీరానికి రక్త సరఫరా, ప్రాణవాయు సరఫరాలు తగ్గితే అది బలహీనపడుతుంది. అలాగే తగిన అనుసంధానం లేకపోతే, దేశ ఆర్థికాభివృద్ధి కూడా మందగిస్తుంది. అందుకే మా ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, అనుసంధానం అనే ఈ రెండు రంగాలలో గరిష్ఠ వనరులను వినియోగిస్తోంది.

మిత్రులారా, ప్రభుత్వం గడచిన మూడు సంవత్సరాలుగా చేస్తున్న ఈ కృషి ఫలితంగానే ఓడరేవుల రంగంలో ఈ మహత్తర మార్పు చోటు చేసుకొంది. రేవులకు అదనపు సామర్థ్యం జోడించబడింది. ఇందులో అధిక శాతం రెండు మూడేళ్లుగా సమకూరిందే. కాబట్టే నష్టాలలో నడుస్తున్న రేవులు, ప్రభుత్వరంగ సంస్థల్లో పరిస్థితులు మెరుగుపడ్డాయి. అలాగే తీరప్రాంత సేవల విషయంలో నైపుణ్యాభివృద్ధిపైనా ప్రభుత్వం దృష్టిపెట్టింది.

ఒక అంచనా ప్రకారం, భవిష్యత్తులో దేశంలోని వివిధ ప్రాంతాల్లో సాగరమాల పథకం ఒక్కటే కోటి ఉద్యోగాలను సృష్టించగలుగుతుంది. ఈ లక్ష్యం దిశగా రవాణా రంగ చట్రం సమూల ఆధునికీకరణకు, ఏకీకరణకు మేం కృషి చేస్తున్నాం.

ఈ రోజుల్లో, అనేక ప్రాంతాల్లో కనిపించే వాహన రాకపోకల స్తంభన సమస్య మీరంతా ఎదుర్కొంటున్నదే. మన ఓడరేవులలో కూడా ఇటువంటి సమస్య ఉంది. దీనివల్ల వేచి చూడాల్సిన సమయంతో పాటు రవాణా వ్యయం కూడా పెరిగిపోతుంది. ఒకసారి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయామంటే అక్కడ ఎదురుచూడడంలో తప్ప మన సమయాన్ని ఉత్పాదక రీతిలో వెచ్చించలేం. సరుకులు దింపడం, ఎక్కించడం కోసం ఓడలు సముద్రంలో వేచి చూడవలసి వచ్చినా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. అంటే సదరు ఓడ ఒక్కటే కాదు.. మొత్తం ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోతుంది. కనుక ఇటువంటి అవరోధాలను తొలగించి, రేవులను ఆధునికీకరించడం అత్యంత అవసరం.

సాగరమాల పథకంలోని మరొక అంశం ‘నీలి’ ఆర్థిక వ్యవస్థ. ఇంతకుముందు ప్రజలు సముద్ర ఆర్థిక వ్యవస్థను గురించి మాత్రమే మాట్లాడేవారు కాగా, మేం నీలి ఆర్థిక వ్యవస్థను గురించి ప్రస్తావిస్తున్నాం. అంటే.. ఆర్థికం, పర్యావరణాల సమ్మేళనం అన్న మాట! ఇది ఆర్థిక కార్యకలాపాలతో పాటు సముద్ర జీవావరణ వ్యవస్థను కూడా పరిపోషిస్తుంది.

పారిశ్రామిక విప్లవం 18, 19 శతాబ్దాల్లో భూమి మీద సంభవించగా, 21వ శతాబ్దపు ఆర్థిక విప్లవం సముద్రాల ద్వారా ఆవిష్కృతమవుతుంది. అంటే.. నీలి ఆర్థిక వ్యవస్థ ద్వారా రూపుదాలుస్తుంది.

మిత్రులారా, మన ప్రస్తుత అవసరాల రీత్యా, సవాళ్ల రీత్యా మన దేశానికి గల నావికా ప్రావీణ్యాన్ని గరిష్ఠ స్థాయికి పెంచుకోవడం అత్యంత అవశ్యం. నీలి ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాల వినియోగం పెంపు ‘న్యూ ఇండియా’కు పునాది అవుతుంది.

ఆహార భద్రతకు భరోసా కోసం కూడా నీలి ఆర్థిక వ్యవస్థ పై ఆధారపడవచ్చు. ఉదాహరణకు మన మత్స్యకార సోదరులు సముద్ర పూసల తయారీలోనూ నిమగ్నమై, వాటికి కాస్త విలువను జోడిస్తే, చేపల వేట ద్వారా ఆర్జనకు తోడుగా అదనపు ఆదాయం పొందవచ్చు. అదేవిధంగా ఇంధనం, గనులు, పర్యాటక రంగాలలోనూ ‘న్యూ ఇండియా’ నిర్మాణానికి నీలి ఆర్థిక వ్యవస్థ తోడ్పడుతుంది.

మిత్రులారా, ఈ ప్రభుత్వం దేశంలో జవాబుదారీతనంతో కూడిన, పారదర్శకతతో కూడిన సరికొత్త పని సంస్కృతిని ఆవిష్కరించింది. ఈ పని సంస్కృతి కారణంగా ఇవాళ పథకాలు వేగం అందుకొన్నాయి. రహదారుల నిర్మాణం రెట్టింపు వేగంతో సాగుతోంది. రైలు మార్గాలు వేసే పనులు ద్విగుణీకృతం అయ్యాయి.

ప్రాజెక్టులు నిర్దిష్ట వ్యవధిలో పూర్తయ్యేలా పర్యవేక్షించడం కోసం డ్రోన్ లను, ఉపగ్రహాలను వినియోగించే ఏర్పాట్లు చేస్తున్నాం. మీరు ఇవాళ పాస్‌పోర్టులను సులభంగా పొందుతున్నారంటే అందుకో కారణం ఉండి ఉండాలి. గ్యాస్ సిలిండర్ సులభంగా లభిస్తోందన్నా అందుకో కారణం ఉండి ఉండాలి.. ఆదాయపు పన్ను వాపసు కోసం మీరు ప్రస్తుతం నెలల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేదంటే అందుకో కారణం ఉండి ఉండాలి.. మీ జీవితాల్లో ఈ మార్పులన్నీ వచ్చాయంటే- ప్రభుత్వ పని సంస్కృతిలో మేం తెచ్చిన మార్పులే అందుకు ప్రధాన కారణం. ఇది ఎటువంటి పని సంస్కృతి అంటే, పేదల హక్కులకు భరోసా ఇచ్చే సంస్కృతి. సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ద్వారా మధ్యతరగతి హక్కులకు భరోసా ఇచ్చిన పని సంస్కృతి.

మిత్రులారా,

గుజ‌రాత్‌లో మీరు నాకు ఏమేం నేర్పారో ఆ అనుభవమంతా ఢిల్లీలో నాకు ఎంతో ఉపయోగపడింది. నా వద్దకు వచ్చే ఫైళ్లన్నీ సంపూర్ణ రూపంతో చేరుతున్నందువల్ల దశాబ్దాలుగా మూల పడి ఉన్న ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యేలా చూడగలుగుతున్నాను. ఇందుకోసం మేం ‘ప్రగతి’ అనే వ్యవస్థను రూపొందించాం. దీనిలో భాగంగా 9 లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులను ఇప్పటివరకు పరిశీలించాం. ఇవన్నీ దాదాపు నాలుగు దశాబ్దాలుగా మూలుగుతున్నవి కాగా, ప్రగతిలో పరిశీలన తరువాత వీటి పనులు జోరందుకొన్నాయి. దేశంలో నిజాయతీతో కూడిన ఆర్థిక వ్యవస్థను, నిజాయతీతో కూడిన సామాజిక ఆర్థిక వ్యవస్థను నెలకొల్పడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పెద్ద నోట్ల రద్దుతో దొంగచాటుగా దాచిపెట్టిన నల్లధనమంతా బ్యాంకులకు చేరింది. అంతేకాకుండా అనూహ్య ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టేందుకు కూడా అది వీలు కల్పించింది.

అదేవిధంగా, వస్తువులు మరియు సేవల పన్ను (జిఎస్ టి) వ్యవస్థ కింద దేశం కొత్త తరహా వ్యాపార సంస్కృతిని అలవరచుకొంటోంది. ఇంతకుముందు జనం ట్రక్కులలో వెళ్లి, చెక్‌పోస్టుల వద్ద గంటల తరబడి చిక్కుకుపోవలసిన పరిస్థితిని మనం చూశాం. జిఎస్ టి అమలుతో ఆ చెక్‌పోస్టులన్నీ ఒక్క దెబ్బకు రద్దయ్యాయి. దీంతో లోగడ ఐదు రోజులకుగానీ గమ్యం చేరని ట్రక్కులు ఇవాళ మూడు రోజుల్లోనే చేరుతున్నాయి. జిఎస్ టి తో వస్తు రవాణా వ్యయం కూడా దిగివచ్చింది.. చెక్‌పోస్టుల వద్ద వేలాది కోట్ల రూపాయల మేర సాగుతున్న అవినీతి, తదితర కార్యకలాపాలకు అడ్డుకట్ట పడింది. దయచేసి ఇప్పుడు చెప్పండి.. ఇంతవరకూ దేశాన్ని దోచుకొన్న కాంట్రాక్టర్ ఎవరైనా మోదీపై కోపంతో ఉంటారా, లేదా ? మోదీ చర్యలతో వాళ్లు ఆగ్రహంతో ఊగిపోతారా, లేదా ? మరి దేశ పౌరుల సంక్షేమానికి భరోసా అవసరం లేదా ? దేశ పౌరులకు లబ్ధి చేకూరాలా, చేకూరవద్దా ?

దేశంలో ఇప్పుడు పూర్తి నిజాయతీతో వ్యాపారం చేసుకొనే, నిజాయతీగా లాభాలు ఆర్జించుకొనే సంస్కృతి ఏర్పడింది. నా అనుభవాన్ని బట్టి ఇక ఏ వ్యాపారీ మోసాలకు పాల్పడాలని భావించడు. అయితే, కొన్ని నియమ నిబంధనలు, కొందరు అధికారులు, రాజకీయ నాయకులు వారిమీద ఒత్తిడిని తీసుకువచ్చే ప్రమాదం పొంచి ఉంంది. పేదలను ప్రేరేపించవచ్చు.. కానీ, మేం మాత్రం నిజాయతీభరిత వాతావరణాన్ని సృష్టించేందుకు కృషి చేస్తున్నాం.

జిఎస్ టి పరిధి లోకి వస్తున్న వ్యాపారుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. కొత్త పన్ను వ్యవస్థ అమలులోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి దాకా 27 లక్షల మంది పరోక్ష పన్నుల పరిధిలోకి రావడం దీనికి నిదర్శనం.

మిత్రులారా, ప్రధాన స్రవంతి లోకి వస్తున్న వ్యాపారులు కొందరు తమ గత రికార్డుల తనిఖీని గురించి ఆందోళన చెందుతున్నారని నాకు తెలుసు. దేశాభివృద్ధి కోసం నిజాయతీగా వ్యవస్థ లోకి వస్తున్న వారిని ‘‘పాత చరిత్ర ఆధారంగా వేధించడానికి ఏ అధికారినీ అనుమతించం’’. ఇది నా హామీ.

సోదరులు మరియు సోదరీమణులారా,

ఎన్నో సంస్కరణలను ప్రవేశపెట్టినప్పటికీ, కఠిన నిర్ణయాలు తీసుకొన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ సరైన దిశగా, సరైన మార్గంలోనే పయనిస్తోంది. ఇటీవల విడుదలైన గణాంకాల ప్రకారం బొగ్గు, విద్యుత్తు, సహజవాయువు ఉత్పత్తి; ఇతర వస్తువుల ఉత్పత్తి తదితరాలన్నీ గణనీయంగా పెరిగాయి. విదేశీ పెట్టుబడులు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. భారత విదేశీమారక నిల్వలు 30వేల కోట్ల డాలర్ల నుండి 40వేల కోట్ల డాలర్ల స్థాయికి పెరిగాయి. మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక పునాదులు చాలా బలమైనవన్న వాస్తవాన్ని అనేక మంది నిపుణులు అంగీకరించారు. సంస్కరణల రంగంలో ఎన్నో ముఖ్యమైన చర్యలు తీసుకోగా, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. అలాగే దేశ ద్రవ్య సుస్థిరతను నిర్వహిస్తాం. పెట్టుబడులకు ఉత్తేజాన్ని ఇచ్చేందుకు, ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకొంటాం.

మిత్రులారా, ఇదో పరిణామ వ్యవస్థల శకం. దృఢ సంకల్పంతో విజయాలు సాధించే యుగం. ఇప్పుడిక మనం ‘న్యూ ఇండియా’ నిర్మాణానికి గట్టి ప్రతినబూనడంతో పాటు దానిని సాకారం చేసుకోవాలి. ఘోఘా-దహేజ్ ఫెరీ సర్వీసుకు ఇక్కడ శ్రీకారం చుట్టడం ద్వారా ఇవాళ ‘న్యూ ఇండియా’ నిర్మాణం దిశగా కొత్త సదుపాయాన్ని సృష్టించినట్లయింది. ఈ సందర్భంగా మీకందరికీ మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ సౌకర్యాన్ని వీలున్నంత ఎక్కువ స్థాయిలో వినియోగించుకోండని ఆహ్వానిస్తున్నాను.

భారత్ మాతా కీ జయ్,

భారత్ మాతా కీ జయ్,

భారత్ మాతా కీ జయ్,

మీకందరికీ అనేకానేక ధన్యవాదాలు.