పిఎంఇండియా
చక్కెరకు సంబంధించిన కేంద్ర ఆదేశాల చెల్లుబాటు కాలాన్ని ఆరు నెలల పాటు పొడిగించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 27.10.2016న వెలువడ్డ కేంద్ర ఉత్తరువు ప్రకారం ప్రస్తుతమున్న చెల్లుబాటు అవధిని 29.04.2017నుండి 28.10.2017 వరకు, అంటే మరో ఆరు నెలల పాటు పెంచుతూ కేంద్ర మంత్రివర్గం తాజాగా ఆమోదం తెలిపింది.
ఈ ఆమోదం తెలపడం వెనుక ప్రధాన లక్ష్యం ఇలా వుంది: కేంద్ర ప్రభుత్వ ముందస్తు ఆమోదంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రణపూర్వక ఆదేశాలు ఇవ్వడం ద్వారా చక్కెర నిల్వల పరిమితిని, లైసెన్సు అవసరాలను ఎప్పుడు అవసరమైతే అప్పుడు నిర్ణయించడానికి వీలవుతుంది. ప్రజలకు చక్కెర లాంటి వస్తువులు అందుబాటు ధరలలో లభించడానికి వీలుగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అంతే కాదు, ఇలాంటి చర్యల వల్ల ఈ తరహా సరుకులను అక్రమంగా దాచిపెట్టడం, తద్వారా లాభపడడం లాంటి వ్యవహారాలకు తావు వుండదు.
తాజాగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తెలియజేయడం జరుగుతుంది. తద్వారా వారు వారి వైపు నుండి తగిన చర్యలను తీసుకోవడానికి వీలవుతుంది.
పూర్వ రంగం
27.10.2016న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం చక్కెరకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు నెలల పాటు ఆయా రాష్ట్రాలే చక్కెర సరఫరా, నిలవ, కొనుగోలు, రవాణా లాంటి విషయాలను నియంత్రించడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం 27.10.2016 తేదీతో ఎస్. ఒ. 3341(ఇ) ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది. తద్వారా పాలనా శాఖ, ఆయా రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలు తమ నిలవల పరిమితి మొదలైన అంశాలను నిర్ణయించడానికి వీలు కలుగుతుంది. ఆ రోజున ఇచ్చిన ఆదేశం 28.04.2017 వరకు అమలులో వుంటుంది. ఇందుకోసం జి.ఎస్.ఆర్. 929 (ఇ) పేరు మీద 29.09.2016న విడుదలైన ప్రత్యేక ఆహార పదార్థాల ఆదేశం, 2016లోని లైసెన్సు అవసరాల తొలగింపు, నిలవ పరిమితులు, రవాణా నిబంధనలను సవరించడం జరిగింది.
ఆహార & ప్రజా పంపిణీ విభాగం క్రమం తప్పకుండా చక్కెర ధరలను పర్యవేక్షిస్తుంటుంది. ఈ విభాగం ఈ పనిని కర్మాగారంలోనే కాదు, దేశీయ విపణిలోను చేస్తుంది. గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో చిల్లర విక్రయ ధరలు అకస్మాత్తుగా పెరిగిపోయాయి. వాస్తవ కొరత వల్ల చక్కెర ధరలు పెరిగినట్టు అనిపించ లేదు. ఈ సమయంలో చక్కెర సరఫరాను నియంత్రించడం, ఊహాజనితంగా పుట్టుకొచ్చే ధరల సమస్యను పరిష్కరించడం, తగిన నిలవల మోతాదును నిర్ణయించడం చాలా ముఖ్యమని భావించడమైంది. దీనికి తోడు, ప్రస్తుత సీజనులో వినియోగించడానికి అసరమైనంత నిలవలు వున్నాయి. అయితే గత సంవత్సరం ఉత్పత్తి తగ్గింది కాబట్టి చక్కెరను అక్రమంగా నిలవ ఉంచడం, తద్వారా లబ్ధి పొందాలని చూడడం జరగవచ్చని అంచనా వేయడమైంది. కాబట్టి చక్కెర నిలవల పరిమితి వ్యవధిని పొడిగించాల్సిన అవసరం ఏర్పడింది.
చక్కెర రంగాన్ని ప్రోత్సహించడానికి గాను కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే రుణ సహాయాన్ని అందించింది. రూ.4305 కోట్ల రుణాలను నేరుగా చెరకు రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేయడం జరిగింది. ఆయా చక్కెర కర్మాగారాల తరఫున దాదాపు 32 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. చెరుకు ఉత్పత్తిలో గణనీయమైన ప్రగతిని సాధించిన రైతులకు క్వింటాలుకు రూ.4.50 వంతున ఉత్పత్తి రాయితీని అందించడం జరుగుతోంది. ఈ మొత్తాన్ని కూడా ఆయా చక్కెర కర్మాగారాల కింద ఉన్న రైతుల ఖాతాలలోకి నేరుగా జమ చేయడం జరుగుతుంది.
దేశీయంగా చక్కెర ధరలను నియంత్రణలో ఉంచడానికి వీలుగా 5 లక్షల మెట్రిక్ టన్నుల నియంత్రిత పరిమాణంలోని ముడి చక్కెరను ఆయా మిల్లర్లు/ రిఫైనర్లు దిగుమతి చేసుకోవడానికి వీలుగా కేంద్రం అనుమతి నిచ్చింది. దీనికి ఎలాంటి పన్నులు ఉండవు. ఈ నియంత్రిత పరిమాణంలోని చక్కెర కారణంగా చక్కెర పరిశ్రమలో ఆర్ధిక లావాదేవీలు పెరుగుతాయి. తద్వారా ఆయా కర్మాగారాలు వాటి పరిధిలోని రైతులకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించడానికి వీలవుతుంది.