Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

చ‌క్కెర డీ హోర్డింగ్ కు సంబంధించిన సెంట్రల్ ఆర్డ‌ర్ చెల్లుబాటు 2017 ఏప్రిల్ వ‌ర‌కు పొడిగింపు


చ‌క్కెర నిల్వ‌ల‌పై ప‌రిమితి విధిస్తూ జారీ చేసిన కేంద్ర ఉత్త‌ర్వు గ‌డువును 2016 అక్టోబ‌రు 29 నుంచి 2017 ఏప్రిల్ 28 వ‌ర‌కు మ‌రో ఆరు నెల‌ల పాటు పొడిగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు.

ఈ నిర్ణయం వల్ల కేంద్ర‌ప్ర‌భుత్వం నుండి ముంద‌స్తు సమ్మతితో రాష్ట్రాలు చ‌క్కెర నిల్వ‌ల‌పై ప‌రిమితిని విధించ‌గ‌లుగుతాయి. తాము అవ‌స‌రం అని భావించిన‌ప్పుడ‌ల్లా చ‌క్కెర నిల్వ‌ల‌పై ప‌రిమితులు/ లైసెన్సింగ్ నిబంధ‌న‌లు విధించే వెసులుబాటు క‌లుగుతుంది. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు అందుబాటు ధ‌ర‌ల్లో చ‌క్కెర ల‌భ్య‌త‌ను పెంచేందుకు, లాభాపేక్ష‌తో చ‌క్కెరను అక్ర‌మంగా నిల్వ చేసే ధోర‌ణుల‌ను నిరోధించేందుకు కూడా అవ‌కాశం లభిస్తుంది.

పూర్వ రంగం :

చ‌క్కెర స‌ర‌ఫ‌రా, పంపిణీ, ఉత్ప‌త్తి, నిల్వ‌, స్టాక్ ల నిర్వ‌హ‌ణ‌, కొనుగోలు, క‌ద‌లిక‌ల‌పై అవ‌స‌ర‌మైన నియంత్ర‌ణ‌లు అమ‌లుప‌రిచే అవ‌కాశం రాష్ట్రాలకు ఇవ్వాల‌న్న ల‌క్ష్యంతో ఈ ఏడాది ఏప్రిల్ 27వ తేదీన స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఆరు మాసాల కాల‌ప‌రిమితికి చ‌క్కెర‌ డీ హోర్డింగ్ ఉత్త‌ర్వును జారీ చేసింది. ఈ గ‌డువు ఈ నెల 28వ తేదీతో ముగియ‌నుంది. కేంద్ర మంత్రివర్గ నిర్ణ‌యానికి అనుగుణంగా 2016 ఏప్రిల్ 29వ తేదీతో జిఎస్ ఆర్ 1584 (ఇ) నోటిఫికేష‌న్ ను వినియోగ‌దారుల వ్య‌వ‌హారాల శాఖ జారీ చేసింది. కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాల స‌వ‌ర‌ణ ఉత్త‌ర్వు-2016 కు స‌వ‌ర‌ణ‌గా జారీ చేసిన ఈ నోటిఫికేష‌న్ కింద 2016 అక్టోబ‌రు 28వ తేదీ వ‌ర‌కు రాష్ర్ట ప్ర‌భుత్వాలు చ‌క్కెర నిల్వ‌ల‌పై ప‌రిమితులు విధించ‌వ‌చ్చు. త‌దుప‌రి ఈ ఉత్త‌ర్వును అంత‌కు ముందే జారీ అయిన ఉత్త‌ర్వుల‌తో విలీనం చేసి నిత్యావ‌స‌ర వ‌స్తువులు మ‌రియు క‌న్సాలిడేటెడ్ ఆర్డ‌ర్ జిఎస్ ఆర్ 929 (ఇ) ని 2016 సెప్టెంబ‌రు 29న జారీ చేశారు. అయితే మిల్లుల వ‌ద్ద త‌గినంత చ‌క్కెర నిల్వ‌లు ఉన్న‌ప్ప‌టికీ ఇటీవ‌ల కాలంలో చ‌క్కెర స‌గ‌టు రిటైల్ ధ‌ర పెరిగిన‌ట్లు ప్ర‌భుత్వం గమనించింది. ట్రేడ‌ర్లు/ డీల‌ర్లు ఉద్దేశ‌పూర్వ‌కంగానే చ‌క్కెరను అక్ర‌మంగా నిల్వ చేసి కృత్రిమంగా ధ‌ర పెరిగేందుకు కార‌ణ‌మైన‌ట్లు ప్ర‌భుత్వం గుర్తించింది. గ‌తంలో కూడా ఇలాంటి ప‌రిస్థితి ఎదురైన‌ప్పుడు నిల్వ‌ల‌ను నియంత్రించేందుకు ప్ర‌భుత్వానికి గ‌ల హ‌క్కుల‌ను వినియోగించుకుని ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్ర‌స్తుతం అమ‌లులో ఉన్న ఆర్డ‌ర్ గ‌డువు 2016 అక్టోబ‌రు 28వ తేదీతో ముగుస్తోంది. అందువ‌ల్ల 2016 సెప్టెంబ‌రు 29న జారీ చేసిన ఆర్డ‌ర్ జిఎస్ ఆర్ నంబర్ 929 (ఇ) గ‌డువును 2017 ఏప్రిల్ 28వ తేదీ వ‌ర‌కు పొడిగించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది.

తాజా నిర్ణ‌యానికి అనుగుణంగా కేంద్ర‌ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ జారీ చేసి రాష్ర్ట‌ప్ర‌భుత్వాలు/ కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు తెలియ‌చేస్తుంది. ఆ నోటిఫికేష‌న్ కు అనుగుణంగా రాష్ర్ట‌ప్ర‌భుత్వాలు/ కేంద్ర‌పాలిత ప్రాంతాలు త‌మ‌కు సంక్ర‌మించిన అధికారాల‌ను వినియోగించుకుని కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ముంద‌స్తు అనుమ‌తిని పొంద‌డం ద్వారా కంట్రోల్ ఉత్త‌ర్వులు జారీ చేయ‌వ‌చ్చు.