Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జనవరి 17, 18 తేదీలలో అస్సాంలో పర్యటించనున్న ప్రధానమంత్రి


2026 జనవరి 17, 18 తేదీలలో అస్సాం రాష్ట్రంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. 
జనవరి 17న సాయంత్రం సుమారు 6 గంటలకు గౌహతిలోని సరుసజాయ్ స్టేడియంలో నిర్వహించే సంప్రదాయ బోడో సాంస్కృతిక కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. 
జనవరి 18న ఉదయం సుమారు 11 గంటలకు నాగావ్ జిల్లాలోని కలియాబోర్ వద్ద రూ. 6950 కోట్లకు పైగా విలువైన కాజీరంగా ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్ భూమి పూజ ప్రధాని చేయనున్నారు. దీనితో పాటు రెండు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆయన ప్రారంభిస్తారు. 
గౌహతిలో ప్రధాని
గౌహతిలోని సరుసజాయ్ స్టేడియంలో బోడో సామాజిక వర్గానికి ఉన్న గొప్ప వారసత్వాన్ని చాటిచెప్పే చారిత్రాత్మక సాంస్కృతిక కార్యక్రమం ‘బగురుంబా ధ్వౌ 2026’లో ప్రధానమంత్రి పాల్గొంటారు.
ఈ సందర్భంగా 10,000 మంది బోడో కళాకారులు ఒకే లయలో బగురుంబా నృత్యాన్ని ప్రదర్శించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 23 జిల్లాల్లోని 81 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కళాకారులు ఇందులో పాల్గొననున్నారు. 
ప్రకృతి నుంచి ప్రేరణ పొందిన బగురుంబా.. బోడో సామాజిక వర్గానికి చెందిన అత్యంత ప్రసిద్ధ జానపద నృత్యాలలో ఒకటి. వికసించే పువ్వుల మాదిరిగా ఉండే ఈ నృత్యం మానవ జీవితం, ప్రకృతికి మధ్య ఉన్న సామరస్యాన్ని తెలియజేస్తోంది. సంప్రదాయ యువ బోడో మహిళలు ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. పురుషులు సంగీతకారులుగా ఉంటారు. సీతాకోకచిలుకలు, పక్షులు, ఆకులు, పువ్వుల కదలికలను అనుకరించే మృదువైన కదలికలే ఈ నృత్యానికి ఉన్న ప్రత్యేకత. సాధారణంగా సమూహాలుగా వలయాకారంలో లేదా వరుసలలో నిర్వహించే ఈ ప్రదర్శనలు చూసేందుకు అత్యంత అందంగా ఉంటాయి. 
బోడో ప్రజల విషయంలో బగురుంబా నృత్యానికి లోతైన సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది. శాంతి, సంతానోత్పత్తి, ఆనందం, సామూహిక సామరస్యాన్ని సూచించే ఈ నృత్యం బోడో కొత్త సంవత్సరం ‘బైసాగు’, ‘డొమాసి’ వంటి పండుగలతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంది.
కలియాబోర్‌లో ప్రధాని
కలియాబోర్ నుమలీగఢ్ విభాగంలో (ఎన్‌హెచ్-715) భాగంగా రూ. 6950 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించనున్న కాజీరంగా ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్‌కు ప్రధానమంత్రి భూమి పూజ చేయనున్నారు. 
పర్యావరణ స్పృహతో రూపొందించిన ఈ 86 కి.మీ పొడవైన జాతీయ రహదారి ప్రాజెక్ట్‌లో కాజీరంగా జాతీయ పార్కు మీదుగా వెళ్లే 35 కి.మీల ఎలివేటెడ్ వైల్డ్‌లైఫ్ కారిడార్, 21 కి.మీల బైపాస్, ప్రస్తుతం ఉన్న ఎన్‌హెచ్-715 రహదారిని రెండు నుంచి నాలుగు వరుసలుగా విస్తరించే 30 కి.మీల పనులు ఉన్నాయి. పార్కుకు ఉన్న గొప్ప జీవవైవిధ్యాన్ని కాపాడుతూనే ప్రాంతీయ అనుసంధానతను మెరుగుపరచాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నారు. 
నాగావ్, కర్బీ ఆంగ్లాంగ్, గోలాఘాట్ జిల్లాల మీదుగా వెళ్లే ఈ ప్రాజెక్ట్.. ఎగువ అస్సాం ముఖ్యంగా డిబ్రూఘర్, తిన్సుకియా ప్రాంతాలకు రవాణా సౌకర్యాలను గణనీయంగా మెరుగుపరుస్తుంది. జంతువుల నిరంతర సంచారాన్ని నిర్ధారించే ఎలివేటెడ్ వైల్డ్‌లైఫ్ కారిడార్.. మానవ-వన్యప్రాణుల సంఘర్షణను తగ్గిస్తుంది. రహదారి భద్రతను మెరుగుపరుస్తూ ప్రయాణ సమయాన్ని తగ్గించే ఈ ప్రాజెక్ట్ ప్రమాదాల శాతాన్ని తగ్గిస్తుంది. వీటితో పాటు పెరుగుతున్న ప్రయాణికుల, సరుకు రవాణా అవసరాలకు ఇది మద్దతు ఇస్తుంది. పట్టణాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించటం, స్థానికుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా జఖలాబంద, బోకాఖత్ వద్ద బైపాస్‌లను నిర్మించనున్నారు. 
ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. గౌహతి (కామాఖ్య)-రోహ్‌తక్, డిబ్రూఘర్-లక్నో (గోమతి నగర్) మధ్య రెండు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభిస్తారు. ఈ కొత్త రైలు సేవలు ఈశాన్య, ఉత్తర భారత్‌ మధ్య రైలు అనుసంధానాన్ని బలోపేతం చేసి ప్రజలకు సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి.

 

***