Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్టార్టప్ ఇండియా దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

స్టార్టప్ ఇండియా దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం


నా మంత్రివర్గ సహచరులు శ్రీ పీయూష్ గోయల్, దేశం నలుమూలల నుంచి విచ్చేసిన అంకుర సంస్థలకు చెందిన మిత్రులు, ఇతర విశిష్ట అతిథులు, సోదరసోదరీలారా!

 

ఈ రోజు మనమందరం ఒక ప్రత్యేక సందర్భంలో ఇక్కడ సమావేశమయ్యాం. ఈ జాతీయ స్టార్టప్ దినోత్సవం సందర్భంగా అంకుర సంస్థల వ్యవస్థాపకులు, ఆవిష్కర్తల సమక్షంలో కొత్తగా రూపుదిద్దుకుంటున్న దేశ భవిష్యత్తును నా కళ్ల ముందే చూస్తున్నాననే భావన కలుగుతోంది.

 

ఇప్పుడే నాకు అంకుర సంస్థల వ్యవస్థకు చెందిన కొంతమంది వ్యక్తులను కలిసే అవకాశం లభించింది. వారి విజయాలను, ప్రయోగాలను చూడటం, వారి మాటలను విన్నాను. వ్యవసాయం, ఫిన్‌టెక్, మొబిలిటీ, ఆరోగ్యం, స్థిరత్వం వంటి రంగాలలో పనిచేస్తున్న స్టార్టప్‌ల ఆలోచనలు నాకు మాత్రమే కాదు, అందరికీ ఎంతో స్ఫూర్తినిస్తున్నాయి. అయితే, అన్నింటికంటే ఎక్కువగా నన్ను ఆకట్టుకున్నది మీ ఆత్మవిశ్వాసం, మీ లక్ష్యాలే.

 

పదేళ్ల క్రితం విజ్ఞాన్ భవన్‌లో ఈ కార్యక్రమం కేవలం 500 నుంచి 700 మంది యువకులతో ప్రారంభమైంది. ఈరోజు రితేష్ ఇక్కడ కూర్చుని ఉన్నారు. అతని ప్రయాణం అప్పుడే మొదలైంది. అప్పట్లో అంకుర సంస్థల ప్రపంచంలోకి అడుగుపెడుతున్న వారి అనుభవాలను నేను వింటూ ఉండేవాడిని. ఒక యువతి నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆమె తన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి అంకుర సంస్థ నెలకొల్పే వైపు అడుగులు వేసింది. కోల్‌కతాలో ఉన్న తన తల్లి దగ్గరకు వెళ్లి ‘‘నేను నా ఉద్యోగాన్ని వదిలేశాను’’ అని చెప్పింది. దానికి ఆమె తల్లి ‘ఎందుకు’ అని అడిగింది. ఆమె ‘‘ఇప్పుడు నేను ఒక స్టార్టప్ ప్రారంభించాలనుకుంటున్నాను’’ అని చెప్పగా దానికి ఆ తల్లి ‘‘ఇది నాశనం అయిపోయే పని, ఎందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నావు?’’ అని ప్రశ్నించింది. అప్పుడు ఆ యువతి విజ్ఞాన్ భవన్‌లో ఈ విషయాన్ని వివరించింది.

 

అదే అప్పట్లో మన దేశంలో అంకుర సంస్థలపై పట్ల ఉన్న ఆలోచనా దృక్పథం. కానీ ఈ రోజు చూడండి. విజ్ఞాన్ భవన్ నుంచి భారత్ మండపం వరకు మన ప్రయాణం ఎంత దూరం వచ్చిందో! ఇక్కడ ఇప్పుడు కూర్చోవడానికి కూడా చోటు సరిపోవడం లేదు. కేవలం వారం వ్యవధిలోనే దేశ యువతను రెండుసార్లు కలుసుకునే అవకాశం లభించడం నా అదృష్టం. జనవరి 12న జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా దేశం నలుమూలల నుంచి వచ్చిన దాదాపు 3,000 మంది యువతతో నేను రెండున్నర గంటల పాటు కూర్చొని వారి మాటలను శ్రద్ధగా విన్నాను. ఈ రోజు కూడా మీ అందరి మాటలను వినే అవకాశం, నా దేశ యువత శక్తిని ప్రత్యక్షంగా చూసే భాగ్యం నాకు లభించింది.

మిత్రులారా,

 

అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే భారత యువత దృష్టి వాస్తవ సమస్యల పరిష్కారంపై కేంద్రీకృతమై ఉంది. కొత్త కలలు కనే ధైర్యం చేసిన మన యువ ఆవిష్కర్తలు ప్రతి ఒక్కరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.

 

మిత్రులారా,

 

నేడు మనం ‘స్టార్టప్ ఇండియా’ పదేళ్ల మైలురాయిని జరుపుకుంటున్నాం. ఈ పదేళ్ల ప్రయాణం కేవలం ఒక ప్రభుత్వ పథకం సాధించిన విజయం మాత్రమే కాదు. ఇది మీలాంటి వేలాది, లక్షలాది మంది కలల ప్రయాణం. అనేక ఊహలు వాస్తవ రూపం దాల్చిన కథ ఇది. పదేళ్ల క్రితం పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. వ్యక్తిగత ప్రయత్నాలకు, ఆవిష్కరణలకు దాదాపు అవకాశమే లేదు. అటువంటి పరిస్థితులను మేం సవాలుగా స్వీకరించాం. ‘స్టార్టప్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రారంభించాం. మన యువతకు ఒక విశాలమైన ఆకాశాన్ని ఇచ్చాం. ఈరోజు ఆ ఫలితాలు మన కళ్లముందే ఉన్నాయి.కేవలం పదేళ్లలోనే స్టార్టప్ ఇండియా కార్యక్రమం ఒక ఉద్యమంగా మారింది. భారత్‌ ఈరోజు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద అంకుర సంస్థ వ్యవస్థగా నిలిచింది. పదేళ్ల క్రితం దేశంలో 500 కంటే తక్కువ అంకుర సంస్థలు ఉండేవి. ఈరోజు ఆ సంఖ్య 2,00,000 దాటింది. 2014లో దేశంలో కేవలం నాలుగు యూనికార్న్‌లు మాత్రమే ఉండేవి. ఈరోజు దేశంలో దాదాపు 125 క్రియాశీల యూనికార్న్‌లు ఉన్నాయి. ఈ విజయగాథను ప్రపంచం ఆశ్చర్యంతో చూస్తోంది. రాబోయే కాలంలో భారతీయ అంకుర సంస్థల ప్రయాణం గురించి చర్చ జరిగినప్పుడు ఈ హాల్‌లో కూర్చున్న చాలా మంది యువకులు స్వయంగా అద్భుతమైన కేస్ స్టడీలుగా(అనుభవ అధ్యయనాలు) మారుతారు.

 

మిత్రులారా,

 

స్టార్టప్ ఇండియా వేగం నిరంతరం పుంజుకోవడం నాకు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. నేటి అంకుర సంస్థలు యూనికార్న్‌లుగా మారుతున్నాయి, యూనికార్న్‌లు ఐపీఓలను ప్రారంభిస్తున్నాయి.దీనివల్ల మునుపటి కంటే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. గతేడాది అంటే 2025లో సుమారు 44,000 కొత్త అంకుర సంస్థలు నమోదయ్యాయి. స్టార్టప్ ఇండియా ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క ఏడాదిలో నమోదైన అతిపెద్ద పెరుగుదల ఇదే. మన స్టార్టప్ వ్యవస్థ ఆవిష్కరణలను, ఆర్ధిక వృద్ధిని ఏ విధంగా ముందుకు నడిపిస్తుందో చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం.

 

మిత్రులారా,

 

స్టార్టప్ ఇండియా దేశంలో ఒక కొత్త సంస్కృతికి జన్మనివ్వడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. గతంలో కొత్త వ్యాపారాలు, కొత్త సంస్థలు ఎక్కువగా పెద్ద పారిశ్రామిక కుటుంబాల పిల్లలే ప్రారంభించేవారు.. ఎందుకంటే వారికి మాత్రమే నిధులు, మద్దతు సులభంగా అందుబాటులో ఉండేవి. మధ్యతరగతి, పేద కుటుంబాల పిల్లలు ఎక్కువగా ఉద్యోగాల గురించి మాత్రమే కలలు కనేవారు. కానీ స్టార్టప్ ఇండియా కార్యక్రమం ఈ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చింది. ఇప్పుడు టైర్-2, టైర్-3 నగరాల నుంచే కాకుండా గ్రామాల నుంచి కూడా యువత తమ సొంత అంకుర సంస్థలను ప్రారంభిస్తున్నారు. ఈ యువకులే అట్టడుగు స్థాయిలో ఉన్న అత్యంత కీలక సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. సమాజం కోసం దేశం కోసం ఏదైనా చేయాలనే ఈ తపన నాకు అత్యంత ముఖ్యంగా అనిపిస్తుంది.

మిత్రులారా,

 

ఈ మార్పులో మన దేశ అమ్మాయిల పాత్ర ఎంతో విశేషమైనది. నేడు గుర్తింపు పొందిన అంకుర సంస్థల్లో 45 శాతానికి పైగా కనీసం ఒక మహిళా డైరెక్టర్ లేదా భాగస్వామి ఉన్నారు. మహిళల నేతృత్వంలోని అంకుర సంస్థలకు నిధులు సమక్చూర్చే విషయంలో భారత్‌ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద వ్యవస్థగా ఎదిగింది. అంకుర సంస్థల్లో కనిపిస్తున్న ఈ సమగ్ర వృద్ధి దేశ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తోంది.

 

మిత్రులారా,

 

ఈ రోజు దేశం తన భవిష్యత్తును స్టార్టప్ విప్లవంలో చూస్తోంది. అంకుర సంస్థలు ఎందుకు అంత ముఖ్యమని నేను మిమ్మల్ని అడిగితే.. మీలో ప్రతి ఒక్కరూ వేర్వేరు సమాధానాలు ఇవ్వవచ్చు. కొందరు భారత్ ప్రపంచంలోనే అత్యంత యువ దేశం కాబట్టి అంకుర సంస్థలు విస్తృత అవకాశాలు ఉన్నాయని చెబుతారు. మరికొందరు భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ కాబట్టి కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయని అంటారు. కొందరు భారత్ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను నిర్మిస్తోందని, ఉద్భవిస్తున్నాయని, అందుకే స్టార్టప్ వ్యవస్థ పురోగమిస్తోందని అనవచ్చు. ఇవన్నీ నిజాలే, సరైన కారణాలే. కానీ నా హృదయాన్ని తాకేది అంకుర సంస్తల ఆత్మవిశ్వాసం. ఈ రోజు నా దేశ యువత తమ జీవితాలను సౌకర్యవంతమైన పరిధిలోనే గడపడానికి సిద్ధంగా లేదు. చిరకాలంగా నడిచిన మార్గాల్లోనే నడవడాన్ని వారు అంగీకరించరు. వారు తమకోసం కొత్త బాటలు నిర్మించాలనుకుంటున్నారు. ఎందుకంటే వారు కొత్త గమ్యాలను, కొత్త మైలురాళ్లను చేరుకోవాలని ఆరాటపడుతున్నారు.

 మిత్రులారా,

 

మరి కొత్త గమ్యస్థానాలను ఎలా చేరుకోవాలి? దాని కోసం, మనం కఠోర శ్రమను ప్రదర్శించాలి. అందుకే ఇలా అంటారు… ఉద్యమేన్ హి సిద్ధ్యంతి, కార్యాణి న మనోరథైః అంటే పనులన్నీ కృషి వల్లనే సిద్ధిస్తాయి, కేవలం కోరికలతో కాదు. మరి కృషికి మొదట కావాల్సింది ధైర్యం. మీరు ఈ రోజు ఉన్న స్థాయికి చేరుకోవడం కోసం మీరు అపారమైన ధైర్యం చూపించి ఉండాలి… మీరు చాలా రిస్క్ తీసుకుని ఉండాలి. గతంలో మన దేశంలో రిస్క్ తీసుకోవడాన్ని నిరుత్సాహపరిచేవారు… కానీ ఈ రోజు రిస్క్ తీసుకోవడం అత్యంత కీలకంగా మారింది. నెలవారీ జీతం గురించి మాత్రమే కాకుండా అంతకు మించి ఆలోచించేవారు ఇప్పుడు ఆమోదం పొందటమే కాకుండా గౌరవమూ పొందుతున్నారు. ఒకప్పుడు అసాధారణమైనవిగా భావించిన ఆలోచనలు ఇప్పుడు నాగరికమైనవిగా మారుతున్నాయి.

 

మిత్రులారా,

 

నేను ఎల్లప్పుడూ రిస్క్ తీసుకోవడానికి ప్రత్యేక ప్రాధాన్యమిచ్చాను. అది చాలా కాలంగా నా అలవాటుగా ఉంది. ఎవరూ చేపట్టడానికి సిద్ధంగా లేని పనులను, ఎన్నికల్లో ఓడిపోతామనో… అధికారం కోల్పోతామనో దశాబ్దాలుగా ప్రభుత్వాలు భయంతో తప్పించుకున్న పనులను, ప్రజలు ‘అతి పెద్ద రాజకీయ రిస్క్’ అని భావించే పనులనూ చేపట్టడం నా బాధ్యతగా నేను ఎల్లప్పుడూ భావించాను. మీలాగే నేనూ దేశానికి అవసరమైన పనిని ఎవరో ఒకరు చేయాలని… ఎవరో ఒకరు ఆ రిస్క్ తీసుకోవాలని నమ్ముతాను. నష్టం జరిగితే అది నాకే… కానీ లాభం జరిగితే మాత్రం నా దేశంలోని లక్షలాది కుటుంబాలు ప్రయోజనం పొందుతాయి.

 

మిత్రులారా,

 

గత పదేళ్లలో దేశం ఆవిష్కరణలను ప్రోత్సహించే ఒక వ్యవస్థను నిర్మించింది. పిల్లల్లో ఆవిష్కరణల స్ఫూర్తిని పెంపొందించడానికి మేం పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశాం. మన యువత దేశ సమస్యలకు పరిష్కారాలను అందించడానికి వీలుగా మేం హ్యాకథాన్‌లను ప్రారంభించాం. వనరుల కొరత కారణంగా ఆలోచనలు మరుగున పడిపోకుండా ఉండేందుకు మేం ఇంక్యుబేషన్ కేంద్రాలను సృష్టించాం.

 

మిత్రులారా,

 

ఒకప్పుడు సంక్లిష్టమైన నిబంధనలు, సుదీర్ఘ ఆమోద ప్రక్రియలు, ఇన్‌స్పెక్టర్ రాజ్ భయం అనేవి ఆవిష్కరణలకు అతిపెద్ద అడ్డంకులుగా ఉండేవి. అందుకే మేం విశ్వాసం, పారదర్శకతతో కూడిన వాతావరణాన్ని సృష్టించాం. జన విశ్వాస్ చట్టం కింద 180కి పైగా నిబంధనలను నేరరహితం చేశాం. మీరు మీ సమయాన్ని వ్యాజ్యాలలో వృధా చేయకుండా, ఆవిష్కరణలపై దృష్టి పెట్టేందుకు వీలుగా మేం మీ సమయాన్ని ఆదా చేశాం. ముఖ్యంగా అంకురసంస్థల కోసం మేం అనేక చట్టాల్లో స్వీయ-ధృవీకరణను ప్రవేశపెట్టాం. మేం విలీనాలు, నిష్క్రమణల ప్రక్రియలనూ సులభతరం చేశాం.

మిత్రులారా,

 

స్టార్టప్ ఇండియా కేవలం ఒక పథకం కాదు.. ఇది “రెయిన్‌బో విజన్”. ఇది వివిధ రంగాలను కొత్త అవకాశాలతో అనుసంధానించే సాధనం. రక్షణ రంగంలో తయారీని చూడండి… గతంలో ఎప్పుడైనా అంకురసంస్థలు మార్కెట్‌లో బాగా అనుభవమున్న సంస్థలతో పోటీపడటం ఊహించారా? ఐడెక్స్ ద్వారా, వ్యూహాత్మక రంగాల్లో అంకురసంస్థల కోసం మేం కొత్త సేకరణ మార్గాలను తెరిచాం. గతంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పూర్తిగా నిషేధించిన అంతరిక్ష రంగంలోనూ ఇప్పుడు అవకాశం కల్పిస్తున్నాం. దాదాపు 200 అంకురసంస్థలు ఈ రోజున అంతరిక్ష రంగంలో పనిచేస్తున్నాయి. అవి ప్రపంచ స్థాయిలో గుర్తింపునూ పొందుతున్నాయి. అదేవిధంగా డ్రోన్ రంగాన్ని చూడండి… ప్రారంభించేందుకు ప్రణాళిక లేకపోవడం వల్ల భారత్ సంవత్సరాలుగా ఈ రంగంలో వెనుకబడి ఉంది. మేం పాత నియమాలను తొలగించి, ఆవిష్కర్తలపై నమ్మకం ఉంచాం.

 

మిత్రులారా,

 

ప్రభుత్వ కొనుగోళ్లలో మేం ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్ జీఈఎమ్ ద్వారా మార్కెట్‌ను మరింత చేరువ చేశాం. దాదాపు 35,000 అంకురసంస్థలు, చిన్న వ్యాపారాలు జీఈఎమ్‌లో నమోదు చేసుకున్నాయి. వీరు సుమారు రూ. 50,000 కోట్ల విలువైన దాదాపు 500,000 ఆర్డర్‌లను పొందారు. ఒక విధంగా అంకురసంస్థలు తమ విజయాల ద్వారా ప్రతి రంగానికీ కొత్త వృద్ధి మార్గాలను తెరుస్తున్నాయి.

 

మిత్రులారా,

 

మూలధనం లేకుండా అత్యుత్తమ ఆలోచనలూ మార్కెట్‌కు చేరలేవని మనందరికీ తెలుసు. అందుకే, ఆవిష్కర్తలకు ఆర్థిక సహాయం అందుబాటులో ఉండేలా చూడటంపై మేం ప్రధానంగా దృష్టి సారించాం. అంకురసంస్థల కోసం ఫండ్ ఆఫ్ ఫండ్స్ ద్వారా రూ. 25,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్, ఇన్-స్పేస్ సీడ్ ఫండ్, నిధి సీడ్ సపోర్ట్ ప్రోగ్రామ్ వంటి పథకాలు అంకురసంస్థలకు సీడ్ ఫండింగ్‌ను అందిస్తున్నాయి. రుణ లభ్యతను మెరుగుపరచడం కోసం మేం క్రెడిట్ గ్యారెంటీ పథకాన్నీ ప్రారంభించాం. తద్వారా పూచీకత్తు లేకపోవడం అనేది సృజనాత్మకతకు అడ్డంకిగా మారకుండా ఉంటుంది.

 

మిత్రులారా,

 

నేటి పరిశోధన రేపటి మేధో సంపత్తిగా మారుతుంది. దీనిని ప్రోత్సహించడానికి, మేం రూ.1 లక్ష కోట్ల కేటాయింపుతో పరిశోధనాభివృద్ధి, ఆవిష్కరణల పథకాన్నీ ప్రారంభించాం. అభివృద్ధి చెందుతున్న రంగాల్లో దీర్ఘకాలిక పెట్టుబడులకు మద్దతునివ్వడానికి మేం డీప్ టెక్ ఫండ్ ఆఫ్ ఫండ్స్‌నూ సృష్టించాం.

 

మిత్రులారా,

 

ఇప్పుడు మనం భవిష్యత్తు కోసం సిద్ధం కావాలి. మనం కొత్త ఆలోచనలపై పనిచేయాలి. రేపు దేశ ఆర్థిక భద్రత, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిలో కీలక పాత్ర పోషించబోయే అనేక రంగాలు ఈ రోజు పుట్టుకొస్తున్నాయి. దీనికి కృత్రిమ మేధ మన ముందున్న ఒక స్పష్టమైన ఉదాహరణ. కృత్రిమ మేధ విప్లవంలో ఏ దేశం అయితే అత్యంత ముందుకు వెళ్తుందో… ఆ దేశానికి గొప్ప ప్రయోజనం లభిస్తుంది. మన దేశం కోసం ఈ పనిని మన అంకురసంస్థలు ముందుకు తీసుకువెళ్లాలి. మీ అందరికీ తెలుసు… ఫిబ్రవరిలో గ్లోబల్ ఏఐ కాన్ఫరెన్స్…. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్… మన దేశంలోనే నిర్వహిస్తున్నాం. ఇది మీ అందరికీ ఒక గొప్ప అవకాశం. ఈ రంగంలో గల అధిక కంప్యూటింగ్ ఖర్చుల వంటి సవాళ్ల గురించి నాకు తెలుసు. ఇండియా ఏఐ మిషన్ ద్వారా మేం పరిష్కారాలను అందిస్తున్నాం. మేం 38,000 కంటే ఎక్కువ జీపీయూలను అందుబాటులోకి తెచ్చాం. పెద్ద సాంకేతికతను చిన్న అంకురసంస్థలకూ సులభంగా అందుబాటులోకి తీసుకురావడమే మా ప్రయత్నం. భారతీయ ప్రతిభతో… భారతీయ సర్వర్‌లపై స్వదేశీ కృత్రిమ మేధ అభివృద్ధి చెందేలా మేం కృషి చేస్తున్నాం. సెమీకండక్టర్లు, డేటా సెంటర్లు, గ్రీన్ హైడ్రోజన్, అనేక ఇతర రంగాల్లోనూ ఇలాంటి ప్రయత్నాలే జరుగుతున్నాయి.

 

మిత్రులారా,

 

మనం ముందుకు సాగుతున్నప్పుడు… మన ఆశయం కేవలం భాగస్వామ్యానికే పరిమితం కాకూడదు. మనం ప్రపంచ నాయకత్వం లక్ష్యంగా ముందుకుసాగాలి. కొత్త ఆలోచనలపై పని చేయాలి. సమస్యలను పరిష్కరించుకోవాలి. గత దశాబ్దాల్లో డిజిటల్ అంకురసంస్థలు, సేవల రంగంలో మనం అద్భుతమైన విజయాన్ని సాధించాం. ఇప్పుడు మన అంకురసంస్థలు తయారీపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. మనం కొత్త ఉత్పత్తులను సృష్టించాలి. ప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యత గల ఉత్పత్తులను ఉత్పత్తి చేయాలి. ప్రత్యేకమైన ఆలోచనలపై పని చేయడం ద్వారా మనం సాంకేతికతలో ముందంజ వేయాలి. భవిష్యత్తు దీనిదే. ప్రభుత్వం ప్రతి ప్రయత్నంలోనూ మీకు అండగా నిలుస్తుందని నేను మీకు హామీ ఇస్తున్నాను. మీ సామర్థ్యంపై నాకు ఎంతో నమ్మకం ఉంది. భారత భవిష్యత్తు మీ ధైర్యం, విశ్వాసం, ఆవిష్కరణల ద్వారానే రూపుదిద్దుకుంటోంది. గత పదేళ్లు దేశం సామర్థ్యాలను నిరూపించాయి. రాబోయే పదేళ్లలో… భారత్ కొత్త అంకురసంస్థల పోకడలు, సాంకేతికతల్లో ప్రపంచానికి మార్గదర్శనం చేయడమే మన మా లక్ష్యం.

మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీకు చాలా ధన్యవాదాలు.

***