Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అంతర్జాతీయ సరిహద్దు చుట్టుపక్కల నివసించే వారికి ఊరట


కేంద్ర ప్రభుత్వ ప్రజాహిత చర్యలలో భాగంగా ప్రత్యేకంగా అభివృద్ధి బాటలో చివరన ఉన్న వారికి కూడా ప్రయోజనం చేకూరే విధంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు , 2019 ఆమోదానికి మార్గం సుగమం చేసింది. పార్లమెంట్ వచ్చే సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టికి అనుగుణంగా “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్” కు కట్టుబడిన ప్రజానుకూల ప్రభుత్వ వైఖరిని మంత్రివర్గ నిర్ణయం ప్రతిబింభిస్తోంది.

ప్రయోజనాలు:

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అంతర్జాతీయ సరిహద్దు చుట్టుపక్కల నివసించే వారికి ఊరట లభిస్తుంది. దీనివల్ల వారికి దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయి.

జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో నివసించే వారిప్పుడు ఉద్యోగ నియామకాలకు ప్రత్యక్ష ఎంపికలో, ప్రమోషన్లలో, వృత్తివిద్యా కోర్సుల ప్రవేశాలలో రిజర్వేషన్ పొందవచ్చు.

ప్రభావం:

ఈ బిల్లు జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ చట్టం, 2004కు సవరణలు చేయడం ద్వారా “ జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) ఆర్డినెన్సు, 2019” ను భర్తీ చేస్తుంది. ఇంతకు ముందు జమ్మూ కాశ్మీర్లో వాస్తవాధీన రేఖకు సమీపంలో నివసించే వారికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ లభించేది. ఇప్పుడు వారితో సమానంగా ఈ సౌకర్యం అంతర్జాతీయ సరిహద్దు దగ్గరలో నివసించే ప్రజలకు కూడా వర్తిస్తుంది.

పూర్వరంగం:

జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ చట్టం, 2004 మరియు 2005 నియమావళి రూపొందించినప్పుడు అంతర్జాతీయ సరిహద్దులో నివసించే వారిని దానిలో చేర్చలేదు. అప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రత్యక్ష ఎంపిక, ప్రభుత్వ సర్వీసులలో పదోన్నతులు, వివిధ కేటగరీలకు చెందిన వృత్తివిద్యా కోర్సులలో ప్రవేశాలలో వాస్తవాధీన రేఖకు సమీపంలో నివసించే వారికి రిజర్వేషన్ లభించే విధంగా చట్టాన్ని రూపొందించారు. అందువల్ల అంతర్జాతీయ సరహద్దులో నివసించేవారికి చాలా కాలంగా ఆ ప్రయోజనాలు లభించేవి కాదు.

సరిహద్దు ఆవల నుంచి జరిగే దాడి తీవ్రతను ఎదుర్కొంటూ తీవ్ర ఉద్రిక్తలకు లోనవుతున్నందువల్ల అంతర్జాతీయ సరిహద్దులో నివసించే వారు సామాజిక, ఆర్ధిక, విద్య రంగాలలో వెనుకబడిపోయారు. సరిహద్దు ఆవల నుంచి తరచుగా జరిగే కాల్పుల వల్ల సరిహద్దులో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవలసి వచ్చేది. దానివల్ల వారి చదువు దెబ్బతినేది. విద్యాసంస్థలు చాలా రోజులు మూతబడి ఉండేవి.

అందువల్ల వాస్తవాధీన రేఖకు సమీపంలో నివసించే వారితో సమానంగా అంతర్జాతీయ సరిహద్దులో నివసించే వారికి కూడా రిజర్వేషన్ ప్రయోజనాలు కల్పించడం న్యాయమని భావించడం జరిగింది.

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులో ఉన్నప్పుడు రాష్ట్ర అసెంబ్లీ అధికారాలు పార్లమెంటుకు దఖలు పడతాయి. అందువల్ల జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) ఆర్డినెన్సు, 2019 స్థానంలో బిల్లును పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించడం జరిగింది.