పిఎంఇండియా
జలవనరుల రంగంలో సహకారంపై భారత-మొరాకోల మధ్య కుదిరిన
అవగాహన ఒప్పందంపై సంతకాలకు ప్రధానమంత్రి నరేంద్ర అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. జలవనరుల అభివృద్ధి-నిర్వహణ రంగానికి సంబంధించిన చట్రం కింద తమతమ చట్టాలకు, నైపుణ్యానికి అనుగుణంగా సహకారం అందించుకునేందుకు ఈ అవగాహన ఒప్పందం ఉద్దేశించబడింది. ఈ ఒప్పందం కింద ద్వైపాక్షిక సహకారంలో కింది అంశాలు అంతర్భాగంగా ఉంటాయి.
1. జల వనరుల మౌలిక సదుపాయాల రూపకల్పన, నిర్మాణం, నిర్వహణ.. ప్రత్యేకించి పెద్ద ఆనకట్టలు, జల పంపిణీ ప్రాజెక్టులు;
2. జలవనరుల సమగ్ర నిర్వహణ… ఉపరితల, భూగర్భ జలవనరుల సంయుక్త వినియోగం, నీటి వినియోగ సామర్థ్యం పెంపు,
వాతావరణ మార్పులకు అనుగుణంగా అనుశీలన, అనుసరణ, జలనిధుల కృత్రిమ పునఃపూరణ, నిర్వాహక-సంస్థాగత-నియంత్రణాంశాలు;
3. వరదలు, కరువుల నిర్వహణ;
4. పునఃపూరణ ప్రవర్ధనంసహా జలవనరుల సుస్థిర అభివృద్ధి, నిర్వహణ
5. వాననీటి సంరక్షణ, మూల్యాంకనం, వాతావరణానుగుణ అనుసరణ, అనుశీలన
సహకారంలో కింది అంశాలు కూడా భాగంగా ఉంటాయి:
1. కార్యక్రమ నిపుణుల కార్యక్రమాలు, సందర్శనల ఆదానప్రదానం;
2. జలవనరుల రంగంలో పరిశోధనల ఫలితాలుసహా కార్యక్రమాలపై, ప్రచురణలు, నైపుణ్యంపై సమాచార ఆదానప్రదానం;
• భారత, మొరాకో దేశాలలో పైన పేర్కొన్న అంశాలకు సంబంధించిన ప్రాజెక్టుల అభివృద్ధి; రెండు దేశాల్లోని సామాజిక-ఆర్థిక కార్యకలాపాల్లోని సంస్థలు, నిపుణులతో భాగస్వామ్య యంత్రాంగం రూపకల్పన;
1. జల సంబంధిత కార్యక్రమాలు, ప్రాజెక్టులకు సంబంధించి పరస్పరం నిపుణుల భాగస్వామ్యం;
2. జల పరీవాహక ప్రాంతాలలో సమగ్ర జలవనరుల సూత్రావళి అమలుకు సంబంధించి నైపుణ్య భాగస్వామ్యం లక్ష్యంగా రెండు దేశాల్లోని జల పరీవాహక సంస్థల మధ్య సహకారానికి ప్రోత్సాహం.
అవగాహన ఒప్పందం అమలులో భాగంగా నిర్దేశిత కార్యకలాపాల పర్యవేక్షణ కోసం రెండు దేశాల నుంచి సమాన సంఖ్యలో సభ్యులతో సంయుక్త కార్యాచరణ బృందం ఏర్పాటుకు ఈ ఒప్పందం వీలు కల్పిస్తోంది. ఈ కార్యాచరణ బృందం భారత, మొరాకోలలో ఒకదాని తర్వాత మరొకటి వార్షిక సమావేశాలను నిర్వహిస్తుంది. దీంతోపాటు ఈ బృందంలోని సభ్యులు అవసరమైతే ఏ సమయంలోనైనా టెలిఫోన్ లేదా వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయంద్వారా సంప్రదించుకోవచ్చు.
శాస్త్ర, సాంకేతిక, సాంకేతిక పరిజ్ఞాన రంగాలు లక్ష్యంగాగల ఈ సహకారం ఫలితంగా రెండు దేశాల్లోని జలవనరులకు సంబంధించిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల మధ్య ద్వైపాక్షిక సంబంధాల కల్పన/అభివృద్ధికి వీలు కలుగుతుంది. ఆధునిక విధానాలు, సాంకేతిక పరిజ్ఞానాలపై నైపుణ్యం, అనుభవాల ఆదానప్రదానంలో భాగంగా రెండు దేశాలూ ఆయా నైపుణ్యాలను నేర్చుకోవడంతోపాటు మెరుగుపరచుకోవచ్చు.
నేపథ్యం:
జల వనరుల అభివృద్ధి, నిర్వహణలో ఇతర దేశాలతో ద్వైపాక్షిక సహకారానికి జలవనరుల, నదీ వికాస, గంగా పునరుజ్జవ మంత్రిత్వ శాఖ రూపకల్పన చేస్తోంది. ఇందుకోసం విధాన, సాంకేతిక నైపుణ్య భాగస్వామ్యం, శిక్షణ కోర్సులతోపాటు కార్యశాలు, శాస్త్ర-సాంకేతిక సదస్సులు, నిపుణుల ఆదానప్రదానం, అధ్యయన పర్యటనలు వంటివి నిర్వహిస్తుంది. ప్రస్తుతం అమలులో ఉన్న భారత-ఆఫ్రికా సహకార అవగాహన మేరకు జలవనరులపై మొరాకోతో ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించబడింది.