పిఎంఇండియా
జాతీయ ఉత్పాదక వస్తువుల విధానానికి (నేషనల్ కేపిటల్ గూడ్స్ పాలసీ) కేంద్ర మంత్రిమండలి ఈ రోజు ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. కేపిటల్ గూడ్స్ కోసం ఉద్దేశించిన మొట్టమొదటి విధానం ఇది. ఉత్పాదక వస్తువుల విలువ 2014-15 లో రూ. 2, 30,000 కోట్లుగా ఉండగా, 2025 కల్లా రూ. 7,50,000 కోట్లకు పెంచాలనేది ఈ విధానపు స్పష్టమైన లక్ష్యం. ఉత్పాదక వస్తువుల రంగంలో ప్రస్తుతం ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి పొందుతున్న వారు 8.4 మిలియన్ గా ఉన్నారు. ఈ సంఖ్యను 30 మిలియన్ కు పెంచాలనేది లక్ష్యం.
జాతీయ ఉత్పాదక వస్తువుల విధానం ఎగుమతులను ఇప్పుడున్న 27 శాతం స్థాయి నుండి ఉత్పత్తి లో 40 శాతం స్థాయికి పెంచాలని ఆశిస్తున్నది ఇది భారతదేశ అవసరాలలో దేశీయ ఉత్పత్తి వాటాను 60 శాతం నుండి 80 శాతానికి పెంచగలదు. తద్వారా భారతదేశం కేపిటల్ గూడ్స్‌కు సంబంధించి నికర ఎగుమతిదారు కాగలదు. ఈ రంగానికి చెందిన ఉప రంగాల్లో సాంకేతికతను మెరుగుపరచాలనేది కూడా ఈ విధానం ధ్యేయాలలో ఒకటిగా ఉంది. మరింత నైపుణ్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం, విధిగా అనుసరించవలసిన ప్రమాణాలను నెలకొల్పడం, ఎమ్ ఎస్ ఎమ్ ఇ ల సామర్థ్యాన్ని పెంచడం ఈ విధానం ఇతర ధ్యేయాలు అయి ఉన్నాయి.
కేపిటల్ గూడ్స్ కు భారతదేశాన్ని ప్రపంచ శ్రేణి ప్రమాణాల నిలయంగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ కొత్త విధానం దోహదం చేస్తుంది. ఈ విధానం మొత్తం తయారీ రంగంలోనే ఒక కీలకమైన పాత్రను పోషించి, ‘మేక్ ఇన్ ఇండియా ‘ కార్యక్రమానికి వెన్ను దన్నుగా నిలువగలదు.
విధానపరమైన జోక్యాల మార్గ సూచి ప్రకారం పథకాలకు కావలసిన ఆమోదాలను భారీ పరిశ్రమల విభాగం పొందడం ద్వారా నిర్దిష్ట కాలం లోపల ఈ విధానం లక్ష్యాలను అందుకొనేటట్లు కృషి చేస్తుంది.
పూర్వ రంగం :
2014 డిసెంబర్ నెలలో జరిగిన ‘మేక్ ఇన్ ఇండియా’ వర్క్‌షాపులో భారీ పరిశ్రమల విభాగం మొదటిసారిగా జాతీయ ఉత్పాదక వస్తువుల విధానాన్ని ప్రధాన మంత్రి కి నివేదించింది. ఆ తరువాత ఈ రంగానికి సంబంధించిన భాగస్వాములైన పరిశ్రమలు, విద్యారంగ సంస్థలతోను ఇంకా ఇతర మంత్రిత్వ శాఖలతోను విస్తృతంగా చర్చించి ఈ విధానాన్ని అంతిమంగా తీర్చిదిద్దడమైంది. ఈ విధానంలో సూచించిన ప్రధానమైన అంశాల ప్రకారం పనిచేస్తే ఈ ముఖ్యమైన రంగంలో అభివృద్ధి త్వరితగతిన జరుగుతుంది. ఉత్పాదక వస్తువుల రంగాన్ని సమూలంగా మార్చివేసేలా, ఈ రంగంలో అభివృద్ధిని భారీగా సాధించే వ్యూహాలను తయారు చేసుకోవడమే ఈ విధానం లక్ష్యం. నిధుల అందుబాటు, ముడి సరుకులు, పరిశోధన, సాంకేతికత, ఉత్పాదకత, నాణ్యత, పర్యావరణ హిత తయారీ విధానాలు, ఎగుమతులకు ప్రోత్సాహం, దేశీయంగా డిమాండును నెలకొల్పడం మొదలైన ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ విధానాన్ని రూపొందించడమైంది.