Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జి-20 సమిట్ సందర్భం లో జరిగిన బిఆర్ఐసిఎస్ (‘బ్రిక్స్’) నేతల లాంఛనప్రాయం కాని సమావేశపు సంయుక్త ప్రకటన


1.          రిపబ్లిక్ ఆఫ్ బ్రెజిల్, రష్యన్ ఫెడరేశన్, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ప్రభుత్వాల అధినేతలం అయిన మేము, 2019వ సంవత్సరం జూన్ 28వ తేదీ న జపాన్ లోని ఒసాకా లో జి-20 సమిట్ సందర్భం లో సమావేశమయ్యాము.   జి-20 కి జపాన్ అధ్యక్షత వహించడాన్ని మేము అభినందిస్తూ, మాకు అందించిన ఆతిథ్యానికిగాను కృతజ్ఞత ను వ్యక్తం చేశాము. 
 
2.          వాణిజ్యం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక త, ఆవిష్కరణ, మౌలిక సదుపాయాలు, జల వాయు పరివర్తన, సార్వత్రిక ఆరోగ్య పరిరక్షణ, వయస్సు మీరుతున్న జనాభాలు మరియు మన్నికైన అభివృద్ధి మొదలైన అంశాల పైన జపాన్ ప్రాథమ్యాల ను మేము గమనించాము. 
 
3.              ప్రపంచ ఆర్థికాభివృద్ధి స్థిరపడుతున్నట్లు కనబడుతోంది.  సాధారణం గా ఇది ఈ సంవత్సరం నుండి 2020 కల్లా క్రమం గా పెరిగే అవకాశం ఉంది.   అయినప్పటికి, ఈ వృద్ధి బలోపేతం అనిశ్చితం గా ఉంది.  దీని కి వాణిజ్యం పెరగడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత లు, వస్తువుల ధరల అస్థిరత, అసమానత, తగినంత వృద్ధి లేకపోవడం, గడ్డు ఆర్ధిక పరిస్థితులు వంటివి కూడా అవరోధం గా ఉన్నాయి.  అంతర్జాతీయ అసమానత లు ఎక్కువ గా,  నిరంతరాయం గా ఉన్నాయి.  వీటి ని అధిగమించడానికి సమగ్ర పర్యవేక్షణ, సకాలం లో విధాన రూపకల్పన లు ఆవశ్యకం.   స్థిరమైన అంతర్జాతీయ వాణిజ్యాభివృద్ధి కోసం, అనుకూలమైన ప్రపంచ ఆర్ధిక వాతావరణం ప్రాముఖ్యంపై మరింత దృష్టి కేంద్రీకరించవలసిన అవసరాన్ని మేము గుర్తించాము.  
 
4.          ఈ నేపథ్యం లో, గత దశాబ్ద కాలం లో అంతర్జాతీయ అభివృద్ధి కి బ్రిక్స్ దేశాలు కీలకం గా పనిచేయడం, ప్రస్తుతం ప్రపంచ ఉత్పత్తి లో మూడో వంతు కు దగ్గర గా ఉండడం మాకు సంతృప్తిని ఇచ్చింది.    2030వ సంవత్సరం కల్లా బ్రిక్స్ దేశాలు ప్రపంచ ఆర్థికాభివృద్ధి లో సగం కంటే ఎక్కువ స్థాయి లో కొనసాగుతాయని అంచనాలు పేర్కొంటున్నాయి.   నిర్మాణాత్మక సంస్కరణల ను నిరంతరాయం గా అమలుచేయడం, మన వృద్ధి సామర్ధ్యాన్ని పెంపొందిస్తుంది.   బ్రిక్స్ సభ్యత్వ దేశాల మధ్య నెలకొన్న సమతుల వాణిజ్య విస్తరణ, అంతర్జాతీయ వాణిజ్య విస్తరణ లను మరింత బలోపేతం చేస్తుంది. 
 
5.           సవాళ్ళ ను అధిగమించడాని కి, అవకాశాల నుండి పూర్తి గా ప్రయోజనం పొందడానికి, పరస్పరం సహకరించుకోవడానికి వీలు గా, బహిరంగ విపణులు, పటిష్టమైన ఆర్థిక పరిస్థితి, ఆర్ధిక సుస్థిరత, చక్క గా రూపొందించి, సమన్వయ పరచిన స్థూల ఆర్థిక విధానాల ప్రాముఖ్యాన్ని మేము గుర్తించాము.  అదే విధం గా నిర్మాణాత్మక సంస్కరణలు, మానవ మూలధనం లో తగినంత పెట్టుబడి, పేదరిక స్థాయిల లో తగ్గుదల, అసమానత్వం వంటివి వాటి ని కూడా గుర్తించడం జరిగింది. పెట్టుబడులు, అన్వేషణ ల ప్రోత్సాహాని కి సమర్ధవంతమైన పోటీ,  సార్వత్రికమైన, సరైన, న్యాయమైన, వివక్ష లేని వ్యాపార వాతావరణం, ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం లో సహకారం (పిపిపి), మౌలిక సదుపాయాల కు ఆర్థిక సహకారం, అభివృద్ధి మొదలైనవి కూడా వీటిలో ఉన్నాయి.   ఈ విషయాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి లో తీసుకునే చర్య లు వంటివి కూడా సుస్థిరమైన, సమగ్ర ఆర్థికాభివృద్ధి కి దోహదపడతాయి.   ప్రపంచ స్థాయి లో విలువ ల అభివృద్ధి ప్రణాళిక లో మరింత గా భాగస్వాములు కావాలని అభివృద్ధి చెందుతున్న దేశాల కు మేము పిలుపునిస్తున్నాము.  వాణిజ్యం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ మధ్య సామరస్య ప్రాముఖ్యాన్ని మేము గుర్తించాము.   అభివృద్ధి లో సమాచారం పాత్ర ను కూడా మేము ధ్రువీకరిస్తున్నాము.  

6.          పారదర్శకమైన, వివక్ష రహితమైన, సార్వత్రికమైన,  స్వేచ్ఛాయుతమైన అంతర్జాతీయ వాణిజ్యాని కి మేము కట్టుబడి ఉన్నాము.   స్వదేశీవస్తు రక్షణ విధానం, ఏక పక్ష విధానం వంటివి డబ్ల్యుటిఒ విధి విధానాల కు వ్యతిరేకం.   బహుముఖ, అంతర్జాతీయ చట్టాని కి మేము కట్టుబడి ఉన్నాము.  డబ్ల్యుటిఒ కేంద్రంగా రూపొందించబడిన బహుముఖ వాణిజ్య విధానాని కి ఆధారమైన నియమాల కు మా పూర్తి సహకారం ఉంటుందని పునరుద్ఘాటిస్తున్నాము.  అంతర్జాతీయ వాణిజ్యం లో ప్రస్తుత, భవిష్యత్తు సవాళ్ళ ను సమర్ధం గా ఎదుర్కోవడానికి వీలు గా సంస్థ కు అవసరమైన సంస్కరణల పై  డబ్ల్యుటిఒ  సభ్యులందరి తో నిర్మాణాత్మకం గా కలసి పనిచేస్తాము.  తద్వారా దాని ఔచిత్యాన్ని, ప్రాభవాన్న పెంపొందిస్తాము.   సంస్కరణ లు మిగతా అంశాల కు తోడుగా, కేంద్రీయత్వాన్ని, ప్రధాన విలువలను, డబ్ల్యుటిఒ ప్రాథమిక సూత్రాల ను పరిరక్షించాలి.  అభివృద్ధి చెందుతున్న దేశాలు, ఎల్ డిసి స్ తో సహా సభ్యులందరి ప్రయోజనాల ను పరిగణన లోకి తీసుకోవాలి.    డబ్ల్యుటిఒ  సంప్రదింపుల అజెండా  వివరాలు సమతుల్యం గా ఉండాలి.  వాటి ని సార్వత్రికం గా, పారదర్శకం గా, సమ్మిళిత విధానం లో చర్చించాలి. 

7.    బహుముఖీన వాణిజ్య విధానం లో డబ్ల్యుటిఒ వివాద పరిష్కార యంత్రాంగం ఒక తప్పనిసరి వ్యవస్థ.  అదే విధం గా సంస్థ సజావు గా, సమర్ధం గా పనిచేయడానికి విచారణ యంత్రాంగం కూడా తప్పనిసరి.   డబ్ల్యుటిఒ లో వివాదాల కు రెండు అంచెల  తీర్పు వ్యవస్థ పనితీరు ను సంరక్షించడానికి మేము కట్టుబడి ఉన్నాము.  విచారణ యంత్రాంగం లో సభ్యుల నియామక ప్రక్రియ లో ప్రతిష్టంభన ను పరిష్కరించవలసిన ఆవశ్యకత ను గుర్తుచేస్తూ,  విచారణ యంత్రాంగం ఎంపిక ప్రక్రియ ను వెంటనే ప్రారంభించాలని మేము కోరుతున్నాము.  

8.           అంతర్జాతీయ ఆర్ధిక భద్రత వ్యవస్థ కేంద్రం గా, పటిష్టమైన, కోటా ఆధారితమైన, సమృద్ధి గా వనరులు కలిగిన అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) కోసం కట్టుబడి ఉన్నామని మేము మరొక్క మారు నిర్ధారిస్తున్నాము.   2010 లో ఆమోదించిన సూత్రాల ఆధారం గా పరిపాలన సంస్కరణల కు, ఐఎంఎఫ్ కోటా అమలు దిశ గా, కార్యనిర్వాహక మండలి తో కలసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నామని మేము పునరుద్ఘాటిస్తున్నాము.   2019 వ సంవత్సర వార్షిక సమావేశాల కంటే ముందు కోటా గురించిన 15వ సాధారణ సమీక్ష ను ముగించడానికి మేము కట్టుబడి ఉన్నాము.  

9.     మౌలిక సదుపాయాల కు ఆర్ధిక సహాయం, సుస్థిర అభివృద్ధి, పటిష్టమైన, సమతులమైన, ఉన్నత నాణ్యత ప్రమాణాల తో కూడిన ప్రాజెక్టుల ను నిర్మించడానికి,  మెరుగైన, నిరంతర కృషి జరుపుతున్న నూతన అభివృద్ధి బ్యాంకు (ఎన్ డి బి) పాత్ర ను మేము ప్రశంసిస్తున్నాము.    సభ్యత్వ దేశాల లో క్లిష్టమైన మౌలిక సదుపాయాల పెట్టుబడుల లో బ్యాక్ లాగ్ లను అధిగమించడానికి చేపట్టవతసిన చర్యల ఆవశ్యకత ను మేము నొక్కి పలికాము.   ప్రాంతీయ కార్యాలయాల ఏర్పాటు ద్వారా ఎన్ డిబి ని పటిష్ఠపరచడం జరుగుతుంది.   తన సభ్యత్వ దేశాల కరెన్సీ లో వనరుల సమీకరణ కు, చైనా తో మొదలుపెట్టి దక్షిణాఫ్రికా, రష్యా లలో చేపడుతున్న కార్యక్రమాల కు ఎన్ డిబి కట్టుబడి ఉండడాన్ని మేము స్వాగతిస్తున్నాము.  ఎన్ డిబి  ప్రాజెక్టు తయారీ నిధి ని త్వరగా అమలు చేయాలని మేము ఎదురుచూస్తున్నాము.  ఎన్ డిబి సభ్యత్వ దేశాల కు సాంకేతిక సహాయాన్ని అందించడం తో పాటు, ప్రోజెక్టు లు తయారు చేయడానికి ఇది ఒక సమర్ధవంతమైన  సాధనం గా మారుతుందని భావిస్తున్నాము.  
     
10.           సభ్యత్వ దేశాల లో స్వల్ప కాల మిగులు చెల్లింపుల ఒత్తిళ్ల ను తగ్గించడానికి ఉపయోగపడే ఒక  యంత్రాంగం గా,  బ్రిక్స్ కంటింజంట్ రిజర్వు ఏర్పాటు (సిఆర్ఎ) ప్రాముఖ్యాన్ని మేము గుర్తించాము.   2018 వ సంవత్సరం లో నిర్వహించిన ప్రయోగ పరీక్ష విజయవంతం కావడం తో, వనరుల కోసం వచ్చే విజ్ఞప్తుల కు సిద్ధం గా ఉండే విధం గా, అవసరమైతే మరిన్ని ప్రయోగ పరీక్షల ను నిర్వహించడానికి మేము కట్టుబడి ఉన్నాము.   స్థూల ఆర్ధిక సమాచారం (ఎస్ఇఎంఐ) విధానం లో  సిఆర్ఎ సిస్టమ్ ఆఫ్ ఎక్స్ చేంజ్ పనితీరు ను మేము స్వాగతించాము.   బ్రిక్స్ స్థానిక కరెన్సీ బాండ్ ఫండ్ స్థాపన దిశ గా కొనసాగుతున్న కృషి ని మేము స్వాగతిస్తున్నాము.  ఫండ్ త్వరలో పనిచేయడం ప్రారంభం కావడం కోసం ఎదురుచూస్తున్నాము.   సిఆర్ఎ  మరియు ఐఎమ్ఎఫ్ ల మధ్య సహకారానికి కూడా మేము మద్దతునిస్తాము.  

11.           బ్రిక్స్ దేశాల పై సహా తీవ్రవాద దాడుల కు ఎవరు, ఎవరిపై, ఎక్కడ, ఏ రకం గా ఒడిగట్టినా వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.   ఐక్య రాజ్య సమితి ఆధ్వర్యం లో ఒక గట్టి అంతర్జాతీయ చట్ట పరమైన ఆధారం తో తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి సమగ్ర విధానంత పాటు సమష్టి కృషి జరగాలని మేము కోరుకుంటున్నాము.   తమ భూభాగం పై నుండి ఎటువంటి తీవ్రవాదం కార్యకలాపాలు జరగకుండా, తీవ్రవాద బృందాలకు ఎటువంటి ఆర్ధిక సహాయం అందకుండా చూడవలసిన బాధ్యత అన్ని దేశాల పైనా ఉందన్న విషయాన్ని మేము పునరుద్ఘాటిస్తున్నాము.   తీవ్రవాద కార్యకలాపాల కోసం ఇంటర్ నెట్ ను దుర్వినియోగ పరచకుండా పోరాడడానికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటిస్తున్నాము.   ఐ సి టి ల వినియోగంలో భద్రతపరమైన, రక్షణపరమైన అంశాలను నిర్ధారించే విషయం లో ప్రభుత్వాలు  కీలక పాత్ర ను పోషించవలసిన అవసరం ఉందని మేము గుర్తించాము.   తీవ్రవాద చర్యల ను ప్రోత్సహించడానికి, నియమించుకోవడానికి, నిర్వహించడానికి డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లను వినియోగించకుండా సాంకేతిక కంపెనీలు అందుబాటు లో ఉన్న చట్టాల పరిధి లో ప్రభుత్వాల కు సహకరించాలని మేము పిలుపునిచ్చాము. 

12.      అవినీతి కి వ్యతిరేకం గా పోరాటం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము.  ప్రభుత్వ, ప్రయివేటు రంగాల లో సమగ్రత ను పెంపొందిచడానికి కృషి చేస్తున్నాము.  అందువల్ల, మేము, అంతర్జాతీయం గా అవినీతి నిర్మూలన కు, అదే విధం గా అవినీతి ని మరింత సమర్ధం గా ఎదుర్కొనేందుకు.. మరీ ముఖ్యం గా ఆస్తుల స్వాధీనం వంటి కేసుల లో అవసరమైన మేరకు చట్టాల ను పటిష్టపరచేందుకు  గట్టి గా కృషి చేస్తున్నాము.   అవినీతి కి పాల్పడ్డ వ్యక్తుల పై అభియోగం, విచారణ సమయం లో పరస్పరం సహకరాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించుకున్నాము.   ప్రభుత్వ, ప్రయివేటు రంగాల లో అవినీతి ని నివారించడం, ఎదుర్కోవడంలో అవినీతి సంబంధిత సమాచారాన్ని అందించే వారి  పాత్ర ను మేము గుర్తించాము.  అటువంటి సమాచారాన్ని అందించే వారి ని కాపాడడానికి తీసుకొనే చర్యలను మెరుగుపరచవలసిన అవసరం ఉంది. 

13.          అవినీతి, అక్రమ ధన ప్రవాహం,  విదేశీ అధికార పరిధి లో ఉన్న అక్రమ ఆస్తి ల వంటివి ఒక అంతర్జాతీయ సవాలు అని  మేము గుర్తించాము.  ఇది ఆర్థికాభివృద్ధి పై, స్థిరమైన అభివృద్ధి పై వ్యతిరేక ప్రభావం చూపే అవకాశం ఉంది.  ఈ విషయం లో ఒక పటిష్టమైన అంతర్జాతీయ నిబద్ధత కు వీలు గా మా విధానాన్ని సమన్వయ పరచి, ప్రోత్సహించాలని ప్రయత్నిస్తున్నాము.   అవినీతి వ్యతిరేక చట్టం అమలు, పరారయిన వారిని, ఆర్ధిక నేరగాళ్ల ను, అవినీతి కి పాల్పడిన నేరగాళ్ల ను పట్టుకోవడం, చోరీ కి గురైన ఆస్తుల ను స్వాధీనం చేసుకోవడం వంటి వాటి లో దేశీయ న్యాయ వ్యవస్థల పరిధి లో సహకారాన్ని పటిష్టం చేసుకోవలసిన అవసరాన్ని కూడా మేము గుర్తించాము.   ఆర్ధిక చర్యల టాస్క్ ఫోర్స్ (ఎఫ్ ఎ టి ఎఫ్), ప్రపంచ కస్టమ్స్ సంస్థ వంటి పలు ఇతర సంబంధిత బహుళపక్ష యంత్రాంగాల పరిధి లో సహకారం తో పాటు అక్రమ ఆర్ధిక లావాదేవీల ను ఎదుర్కోవడం లో అంతర్జాతీయ సహకారాని కి మద్దతివ్వాలన్న మా నిబద్దత ను మేము పునరుద్ఘాటిస్తున్నాము.   

14.          ఇంధన భద్రత, సుస్థిరమైన, సరసమైన ధర లో, అందుబాటు లో ఇంధన లభ్యత కు భరోసా కల్పించుకుంటూనే, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిశన్స్ తగ్గింపు తో కూడిన వృద్ధి తో పాటు స్వచ్చమైన,  మరింత సరళమైన, సమర్ధమైన విధానాల వైపు మార్పు చెందే విధానం లో సహకారం పాత్ర చాలా కీలకమని మేము గుర్తించాము.   సౌర శక్తి, స్థిరమైన జైవిక శక్తి, రవాణాలో సహజ వాయువు వంటి స్వల్ప ఉద్గారాల భవిష్యత్తు ను సాధించడానికి విభిన్న శక్తి వనరులు, సాంకేతిక ఆధునికత ల ప్రాముఖ్యాన్ని మేము గుర్తించాము. ఈ విషయం లో, స్థిరమైన శక్తి, అధునాతన ఇంధన సాంకేతికత లను ఇచ్చి పుచ్చుకోవడం పై సంయుక్త అధ్యయనాన్ని ప్రోత్సహించడం ధ్యేయం గా, పునరుత్పాదక శక్తి వనరుల పై అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం, బ్రిక్స్ ఇంధన పరిశోధన సహకార వేదిక ను పటిష్ఠపరడంలో బ్రిక్స్ దేశాల కృషి ని మేము గుర్తించాము. 

15.          వివిధ దేశాల పరిస్థితుల నేపథ్యం లో,  సాధారణ సూత్రాలు, విభిన్న బాధ్యత లు, సంబంధిత సామర్ధ్యాల తో సహా, యుఎన్ఎఫ్ సిసిసి సూత్రాల కింద స్వీకరించిన ప్యారిస్ ఒప్పందాన్ని పూర్తి గా అమలుచేయడానికి మేము కట్టుబడి ఉన్నాము.   ఉపశమనం, అనుసరణ ల సామర్ధ్యాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు పెంపొందించుకోవడానికి వీలుగా, ఆయా దేశాల కు అవసరమైన ఆర్ధిక, సాంకేతిక, సామర్ధ్య పరం గా నిర్మాణ మద్దతు ను అందజేయవలసిందిగా అభివృద్ధి చెందిన దేశాల ను మేము కోరుతున్నాము.  ఈ సంవత్సరం సెప్టెంబర్ లో జరిగే ఐక్య రాజ్య సమితి వాతావరణ చర్య ల సదస్సు సానుకూల ఫలితాలను ఇస్తుందని మేము ఎదురుచూస్తున్నాము. 
 
16.          సుస్థిర అభివృద్ధి కోసం 2030 అజెండా ను గుర్తు చేసుకుంటూ, సుస్థిర అభివృద్ధి కి మేము గట్టి గా కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటిస్తున్నాము.   అడిస్ అబాబా కార్యాచరణ అజెండా కు అనుగుణం గా, అధికారిక అభివృద్ధి సహాయ ఒప్పందం, అభివృద్ధి వనరుల సహాయ ఒప్పందాల ను పూర్తి గా గౌరవించవలసిన ప్రాముఖ్యాన్ని మేము నొక్కి పలుకుతున్నాము.   2030 అజెండా ఆధారం గా రూపొందించిన జి-20 కార్యాచరణ ప్రణాళిక కు, ఆఫ్రికా తో చేసుకున్న ఒడంబడిక తో సహా ఆఫ్రికా లోనూ, ఇతర తక్కువ గా అభివృద్ధి చెందిన దేశాల లోనూ పారిశ్రామికీకరణ కు మద్దతు పై జి-20 తీసుకొంటున్న చర్యల కు మా మద్దతు ను కొనసాగిస్తాము. 
 
17.          2019 అధ్యక్ష స్థానానికి ‘‘ఒక వినూత్న భవిష్యత్తు కోసం ఆర్థికాభివృద్ధి’’ అనే ఇతివృత్తాన్ని గుర్తించినందుకు బ్రెజిల్ ను మేము అభినందిస్తున్నాము.   అభివృద్ధికి ఆవిష్కరణ ఒక కీలకమైన చోదక శక్తిగా గుర్తించి, గ్రామీణ, మారుమూల ప్రాంతాల జనాభా తో సహా ప్రజలందరి కి డిజిటలైజేషన్, అధునాతన సాంకేతికత ల ప్రయోజనాలు సంపూర్ణం గా అందాలన్న మా నిబద్ధత ను మరోసారి తెలియజేస్తున్నాము.  పేదరిక నిర్మూలన కోసం ఇంటర్ నెట్ తో అనుసంధానం చేసిన మంచి చర్యల తో పాటు పారిశ్రామిక రంగం చేపట్టిన డిజిటల్ ట్రాన్స్ ఫార్మేశన్ ను ఇచ్చి పుచ్చుకోవడానికి కలసికట్టు గా చేస్తున్న కృషి ని మేము ప్రోత్సహిస్తున్నాము.   నూతన పారిశ్రామిక విప్లవం (పార్ట్ ఎన్ఐఆర్)పై బ్రిక్స్ భాగస్వామ్యం, ఐ బ్రిక్స్ నెట్ వర్క్, బ్రిక్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫ్యూచర్ నెట్ వర్క్స్, యువ శాస్త్రవేత్త ల వేదిక లతో సహా  బ్రిక్స్ కొనసాగిస్తున్న విజ్ఞానశాస్త్రపరమైనటువంటి, సాంకేతిక విజ్ఞానపరమైనటువంటి, ఆవిష్కరణ, ఇంకా నవ పారిశ్రామికత్వ సంబంధి సహకార ప్రాముఖ్యాన్ని గురించి మేము నొక్కి వక్కాణిస్తున్నాము. 
 
18.     2019వ సంవత్సరం లో బ్రిక్స్ కు అధ్యక్షత వహిస్తున్న బ్రెజిల్ కు మా మద్దతు ను ప్రకటిస్తున్నాము.  నవంబర్ లో బ్రసిలియా లో జరిగే 11వ బ్రిక్స్ సమిట్ సఫలం కావాలని ఆకాంక్షిస్తున్నాము. 
 

                                                    **