Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జైపూర్ మెట్రో ప్రాజెక్టు రెండో దశకు మంత్రివర్గ ఆమోదం


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రి వర్గం.. జైపూర్ మెట్రో రెండో దశను ఆమోదించింది. ప్రహ్లాదపుర నుంచి టోడి మోడ్ వరకు 41 కి.మీ.ల పొడవుతో 36 స్టేషన్లతో కూడిన ఉత్తర-దక్షిణ కారిడార్ నిర్మాణాన్ని రూ.13,037.66 కోట్ల అంచనా వ్యయంతో చేపడతారు. కేంద్ర ప్రభుత్వం, రాజస్థాన్ ప్రభుత్వాలు 50:50 భాగస్వామ్యంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును రాజస్థాన్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్ఎంఆర్‌‌సీఎల్) నిర్మిస్తుంది.

 

సీతాపుర ఇండస్ట్రియల్ ఏరియా, వీకేఐఏ, జైపూర్ విమానాశ్రయం, టోంక్ రోడ్డు, ఎస్ఎంఎస్ ఆసుపత్రి, స్టేడియం, అంబారీ, విద్యాధర్ నగర్ లాంటి ప్రధానకేంద్రాలకు అవాంతరాలు లేని రవాణాను రెండో దశ మెట్రో అందిస్తుంది. విమానాశ్రయ ప్రాంతంలో భూగర్భ స్టేషన్లు నిర్మిస్తారు. అలాగే ప్రణాళికాబద్ధమైన ఇంటర్‌ఛేంజ్‌లు, ఫీడర్ వ్యవస్థల ద్వారా ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న మొదటి దశకు అనుసంధానించడం ద్వారా నగరం మొత్తం మీద ఏకీకృతమైన, నిరంతరాయమైన మెట్రో వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది.

 

తక్కువ దూరమే ఉన్నప్పటికీ అత్యంత కీలకమైన 11.64 కి.మీ.ల జైపూర్ మొదటి దశ మెట్రోలో రోజుకు సగటున ప్రయాణిస్తున్నవారి సంఖ్య సుమారుగా 60,000. మెట్రో రెండో దశ ప్రారంభమైతే ప్రయాణికుల సంఖ్య అనేక రెట్లు పెరుగుతుందనీ, జైపూర్ ప్రజా రవాణా వ్యవస్థ వాటా పెరిగి ప్రైవేటు వాహనాలపై ఆధారపడటం తగ్గుతుందనీ అంచనా వేస్తున్నారు.

 

అంతర మంత్రిత్వ శాఖల సంప్రదింపులు, నెట్వర్క్ ప్లానింగ్ గ్రూపు సమీక్ష, పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు మూల్యాంకనం సహా బహుళ దశల్లో జైపూర్ మెట్రో రెండో దశను సమగ్ర మదింపు చేశారు. నిర్దేశిత పరిమితి (>14%) కంటే ఈ ప్రాజెక్టు ఎకనామిక్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ (ఈఐఆర్ఆర్) ఎక్కువగా ఉంది. ఇది బలమైన సామాజిక-ఆర్థిక సామర్థ్యాన్ని సూచిస్తుంది. మెట్రో రైలు విధానం-2017కు అనుగుణంగా భారత ప్రభుత్వం, రాజస్థాన్ ప్రభుత్వం నుంచి ఈక్విటీ సహాయంతో పాటు అనుబంధ రుణం, బహుళ విధ ఫైనాన్సింగ్ ద్వారా నిధుల సమీకరణ జరుగుతుంది.

 

రాజస్థాన్ టీవోడీ విధానం – 2025, ప్రతిపాదిత యూఎంటీయే సంస్కరణలు, జాతీయ సుస్థిర పట్టణ రవాణా లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు ఉంది. 2031 సెప్టెంబరు నాటికి జైపూర్ మెట్రో రెండో దశను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇది పూర్తయితే ట్రాఫిక్ రద్దీ, వాహన ఉద్ఘారాలు తగ్గుతాయనీ, ప్రజలు, కార్మికులు, పర్యాటకులకు ప్రయాణ సౌలభ్యం మెరుగుపడుతుందనీ అంచనా వేస్తున్నారు. అలాగే ఆధునికమైన, భవిష్యత్తు అవసరాలకు తగినట్టుగా జైపూర్‌ను సిద్ధం చేస్తుందనీ, వికసిత భారత్, వికసిత రాజస్థాన్ దిశగా ముందుకు నడిపిస్తుందనీ భావిస్తున్నారు.

 

మొదటి దశ పరిధిలో ఇప్పటికే జైపూర్ మెట్రో వ్యవస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మానసరోవర్ నుంచి బడీ చౌపర్ వరకు 11.64 కి.మీ.ల మేర ఈ తూర్పు-పశ్చిమ కారిడార్ విస్తరించింది. మొత్తం 11 స్టేషన్లతో ముఖ్యమైన నివాస, వాణిజ్య ప్రాంతాలను జైపూర్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అయిన హెరిటేజ్ వాల్డ్ సిటీతో కలుపుతుంది. జైపూర్ మెట్రో రెండో దశలో ప్రతిపాదించిన ఉత్తర-దక్షిణ కారిడార్, ప్రస్తుత కొనసాగుతున్న కారిడార్‌కు అనుబంధంగా ఉండి, నగరం అంతటాా మెట్రో సదుపాయాన్ని అందిస్తుంది. ఫలితంగా ట్రాఫిక్ రద్దీ తగ్గి.. నగర రవాణా వ్యవస్థ మెరుగుపడుతుంది.

 

****