Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జ‌మ్ము- క‌శ్మీర్ పై అఖిల ప‌క్ష స‌మావేశం ముగింపులో ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్ర‌సంగం పూర్తి పాఠం

జ‌మ్ము- క‌శ్మీర్ పై అఖిల ప‌క్ష స‌మావేశం ముగింపులో ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్ర‌సంగం పూర్తి పాఠం


ఈ స‌మావేశంలో పాల్గొన్న స‌హ‌చ‌రులంద‌రూ ఒకే మాట‌ మీద ఉండి, ఒకే సెంటిమెంట్ ను వ్యక్తం చేయడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.

జ‌మ్ము- క‌శ్మీర్ ను గురించి మాట్లాడవలసివ‌స్తే, మ‌నం రాష్ర్టంలోని నాలుగు విభాగాల గురించి ప్ర‌స్తావించుకోవాలి. అవే జ‌మ్ము, క‌శ్మీర్ లోయ, ల‌డ‌ఖ్‌, పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్. జ‌మ్ము- క‌శ్మీర్ లోని కొన్ని ప్రాంతాలలో ప్ర‌స్తుతం నెల‌కొన్న‌ ప‌రిస్థితుల ప‌ట్ల ఆందోళ‌న వెలిబుచ్చిన నాయ‌కులంద‌రికీ నా ధ‌న్య‌వాదాలు. గ‌త ఆరు ద‌శాబ్దాలుగా మ‌న ప్ర‌జాస్వామ్యం పెంచిపోషించిన స‌మున్న‌త సంప్ర‌దాయాలే మ‌న ఐక్య‌త‌, స‌మ‌గ్ర‌త‌ ల బ‌లం. కొన్ని అంశాల‌పై మ‌న‌కు అభిప్రాయ‌భేదాలు ఉండ‌వ‌చ్చు; కానీ, దేశ స‌మ‌గ్ర‌త‌ సార్వ‌భౌమ‌త్వం విష‌యంలో మాత్రం అంద‌రమూ ఒక్క‌టిగానే నిలుస్తాము.

జ‌మ్ము-క‌శ్మీర్ లో ఇటీవ‌ల జ‌రిగిన సంఘ‌ట‌న‌లు ప్ర‌తి ఒక్క భార‌తీయుని వ‌లెనే న‌న్ను సైతం తీవ్రంగా క‌ల‌వ‌ర‌ప‌రిచాయి. పిల్ల‌లు విద్యాభ్యాసానికి వెళ్ళ‌లేక‌పోతున్నారు; యాపిల్ పెంప‌కందారులు వారి ఉత్ప‌త్తుల‌ను మండీల‌కు త‌ర‌లించ‌లేక‌పోతున్నారు; దుకాణ‌దారులు రోజువారీ ఆదాయాన్ని ఆర్జించుకోలేక‌పోతున్నారు; ప్ర‌భుత్వ కార్యాల‌యాలు సాధార‌ణ ప్రజలకు సేవలు అందజేయలేక‌పోతున్నాయి. ఈ ప‌రిస్థితికి పేద‌లు తీవ్రంగా అల్లాడిపోతున్నారు.

ప్ర‌జ‌ల కార‌ణంగానే మ‌నం రాజ‌కీయ కార్య‌క‌ర్త‌లుగా మ‌నుగ‌డ సాగించ‌గ‌లుగుతున్నాము. ప్ర‌జ‌లే మ‌న బ‌లం, వారే మ‌న శ‌క్తి. మ‌న ప్ర‌జాజీవ‌నంలో ప్ర‌జాశ‌క్తే బ‌లం. దాడుల్లో ఒక పౌరుడు లేదా ఒక జ‌వాను గాయ‌ప‌డినా, మ‌ర‌ణించినా మ‌నంద‌రం క్షోభను అనుభ‌విస్తున్నాము. ఆ కుటుంబాల‌న్నింటికీ నా హృద‌య‌పూర్వ‌క సానుభూతిని తెలియ‌చేస్తున్నాను. క్ష‌త‌గాత్రుల‌కు అత్యున్న‌త వైద్య‌సేవ‌లు అందించేందుకు మనము క‌ట్టుబ‌డి ఉన్నాము. వీలైనంత త్వ‌ర‌లో అక్క‌డ సాధార‌ణ ప‌రిస్థితులను, శాంతిని పున‌రుద్ధ‌రించాల‌ని ఆకాంక్షిస్తున్నాము. అప్పుడే ప్ర‌జ‌లు సాధార‌ణ జీవ‌నాన్ని కొన‌సాగించుకోగ‌లుగుతారు; కుటుంబాల కోసం సంపాదించుకోగ‌లుగుతారు; పిల్ల‌ల‌ను పాఠ‌శాల‌ల‌కు పంప‌గ‌లుగుతారు; రాత్రి వేళ‌ల్లో ప్రశాంతంగా నిద్రించ‌గ‌లుగుతారు.

జ‌మ్ము- క‌శ్మీర్ స‌మ‌స్య‌కు రాజ్యాంగం మౌలిక సూత్రాల ప‌రిధిలో శాశ్వ‌త‌, శాంతియుత ప‌రిష్కారాన్ని సాధించ‌డానికి మేము క‌ట్టుబ‌డి ఉన్నాము. మాది విశాల దృక్ప‌థం. మా త‌లుపులు ఎప్పుడూ తెరచే ఉంటాయి. జ‌మ్ము- క‌శ్మీర్ రాష్ర్టంలోని ప్ర‌తి ఒక్క ప్రాంతంలో ప్ర‌జ‌ల సంక్షేమానికి మేము క‌ట్టుబ‌డి ఉన్నాము. ప‌రిష్కార సాధ‌న విష‌యంలో శ్రీ అట‌ల్ బిహారీ వాజ్ పేయి వేసిన బాట‌లో మేము ప‌య‌నిస్తున్నాము.

జ‌మ్ము- క‌శ్మీర్ తర‌చు భార‌త‌దేశానికి కిరీటంగా మ‌న్న‌న పొందుతూ ఉంటుంది. హిందువులు, సిక్కులు, బౌద్ధులు, ముస్లిములు.. అన్నివ‌ర్గాల వారు స‌హ‌ జీవ‌నం సాగించే ఆ రాష్ర్టం స‌మాన‌త్వానికి ప్ర‌తీక‌గా (స‌ర్వ‌ ప‌థ సంభావ్‌) సాంప్ర‌దాయికంగా నిల‌బ‌డింది. మ‌న పూర్వీకుల విశ్వాసానికి ప్ర‌తీక‌గా నిలుస్తోంది. మ‌న ప్రాదేశిక స‌మ‌గ్ర‌త‌కే కాదు.. జాతీయ‌త‌కు కూడా నిర్వ‌చ‌నం జ‌మ్ము- క‌శ్మీర్. ఆ రాష్ర్టంపై ఒక ప‌థ‌కం ప్ర‌కారం సాగుతున్న దాడుల్లో భ‌ద్ర‌తా ద‌ళాలే ల‌క్ష్యం అయ్యాయి. ఈ కార‌ణంగా భ‌ద్ర‌తా సిబ్బందిలో ఎంద‌రో గాయాల‌ పాలైన విష‌యం మ‌నం కాద‌న‌లేము. అయిన‌ప్ప‌టికీ మ‌న భ‌ద్ర‌తా సిబ్బంది ఎంతో సంయ‌మ‌నాన్ని పాటిస్తున్నారు. పెద్ద సంఖ్య‌లో భ‌ద్ర‌తాద‌ళాల సిబ్బంది గాయ‌ప‌డిన‌ట్ల గ‌ణాంకాలు తెలుపుతున్నాయి.

క‌శ్మీర్ పై కొన్ని వ‌ర్గాలు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్న‌ప్ప‌టికీ యువ‌త‌ను రెచ్చ‌గొట్ట‌డం, గంద‌ర‌గోళం, అశాంతి క‌ల్పించ‌డం వంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్న వారి శాతం త‌క్కువ‌గానే ఉంది. ప్ర‌తి ఒక్క క‌శ్మీరీ శాంతినే కొరుకుంటున్నారు. ప్ర‌జాస్వామ్యంపై విశ్వాసాన్ని క‌లిగి ఉన్నారు. ప్ర‌తి ఎన్నిక‌ల స‌మ‌యంలో వేర్పాటువాద శ‌క్తులు బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నా క‌శ్మీర్ ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున ఎన్నిక‌ల్లో (భార‌త ప్ర‌జాస్వామ్యానికి పండుగ) పాల్గొని ప్ర‌జాస్వామిక ప్ర‌క్రియ‌పై విశ్వాసం ప్ర‌క‌టిస్తూనే ఉన్నారు. ఇటీవ‌ల ఎన్నిక‌ల‌కు ముందు క‌ల్లోలం చెల‌రేగిన‌ప్ప‌టికీ ముఖ్య‌మంత్రి మ‌హ‌బూబా జీ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌లు పెద్ద సంఖ్య‌లో వోటింగులో పాల్గొన్నారు. ప్ర‌జ‌ల ఆందోళ‌న అనేది వాస్త‌వానికి అమిత దూరంగా జ‌రుగుతున్న ప్ర‌చారం అనేందుకు ఇదే నిద‌ర్శ‌నం.

కొన్ని ప్రాంతాలలో శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ అవ‌స‌రాల దృష్ట్యా కొన్ని ప‌రిమితులను విధించవలసివ‌చ్చింది. శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ కోసం సాధార‌ణంగా తీసుకునే ప‌రిపాల‌నాప‌ర‌మైన చ‌ర్య ఇది. అలా చేయ‌క‌పోతే శాంతి కాముకులైన ప్ర‌జ‌ల జీవితాలు ప్ర‌తికూలంగా ప్ర‌భావితం అవుతాయి. కాని వాస్త‌వికంగా చూస్తే ఈ ప‌రిమితులు లేదా ఆంక్ష‌ల వ‌ల్ల స‌గ‌టు మనిషికి ఎటువంటి ఇబ్బంది లేదు. వేర్పాటువాద శ‌క్తులు త‌ర‌చుగా ప్ర‌క‌టిస్తున్న స‌మ్మెల వ‌ల్లనే ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది క‌లుగుతోంది.

ఇదే స‌మ‌యంలో అమ‌ర్ నాథ్ యాత్ర ఎంతో స‌జావుగా సాగిపోయింది. ల‌డ‌ఖ్ ప్రాంతంలో సౌర‌ శ‌క్తిని ఉప‌యోగించ‌డానికి రాష్ర్ట‌ ప్ర‌భుత్వం ఎన్నో చ‌ర్య‌లు తీసుకుంది. ఎన్ ఇ ఇ టి, సి ఇ టి, ఇంకా యు పి ఎస్ సి సివిల్ స‌ర్వీసు ప‌రీక్ష‌లు కూడా నిర్దిష్ట కాలంలో జ‌రిగిపోయాయి. పౌరుల‌కు అన్ని నిత్యావ‌స‌ర వ‌స్తువులు స‌ర‌ఫ‌రా అవుతున్నాయి. ఇప్పుడు మ‌నం అత్యంత ప్ర‌ధాన‌మైన టూరిజం సీజ‌న్ లోకి ప్ర‌వేశిస్తున్నాం. యాపిల్ పంట కూడా కోత‌కు వచ్చింది. సాధార‌ణ క‌శ్మీరీల జీవ‌నోపాధికి ఇవి చాలా కీల‌కం. కొన్ని వేర్పాటువాద శ‌క్తులు దీనిని అవ‌కాశంగా మ‌లుచుకుని క‌శ్మీర్ లో శాంతికి భంగం క‌లిగించేందుకు, శాంతి కాముకులైన ప్ర‌జ‌ల జీవితాల్లో క‌ల్లోలం రేపేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

పొరుగుదేశం సీమాంత‌ర ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హించ‌డ‌మే ఈ క‌ల్లోలాల‌కు ప్ర‌ధాన కార‌ణం. ఈ ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల వ‌ల్ల క‌శ్మీర్ లో సాధార‌ణ జనజీవనం ప్ర‌భావితం అవుతోంది. 1989-90లో క‌శ్మీర్ లో ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాలు ప్రారంభ‌మైన నాటి నుండి భ‌ద్ర‌తాద‌ళాల చ‌ర్య‌లో…

– 34 వేల‌కు పైగా ఎకె 47 రైఫిళ్ళు;

– 5000కి పేగా గ్రెనేడ్ లాంచ‌ర్లు;

– 90 ఎల్ ఎంజిలు;

– 12 వేల‌కు పైగా రివాల్వ‌ర్లు;

– 3 టాంకు విధ్వంస‌క తుపాకులు, 4 విమాన విధ్వంస‌క తుపాకులు;

– 350కి పైగా క్షిప‌ణి ప్ర‌యోగ వ్య‌వ‌స్థ‌లు;

– ఆర్ డి ఎక్స్ స‌హా 63,000 కిలోగ్రాముల పేలుడు ప‌దార్థాలు;

– ల‌క్ష‌కు పైగా గ్రెనేడ్లు

స్వాధీనం చేసుకున్నారు. ఇదే కాలంలో 5,000 మందికి పైగా విదేశీ ఉగ్ర‌వాదులు దాడులలో హ‌త‌మ‌య్యారు. 5 బెటాలియ‌న్ల బ‌లంతో స‌మాన‌మైన సంఖ్య ఇది.

అంత భారీ ప‌రిమాణంలో ఆయుధాలను స్వాధీనం చేసుకుని, విధ్వంసాన్ని సృష్టించి మార‌ణ‌కాండ జ‌రిపేందుకు ఎంతో మంది విదేశీ ఉగ్ర‌వాదులు ప్ర‌వేశించిన‌ట్లు ధ్రువీక‌రించిన‌ప్పుడు పాకిస్తాన్ ఎన్ని అబ‌ద్ధాలు చెప్పినా ఆ త‌ప్పుడు ప్ర‌చారాన్ని ప్ర‌పంచ‌ దేశాలు విశ్వ‌సించ‌వు.

ఫైట‌ర్ విమానాలు ఉప‌యోగించి త‌మ సొంత పౌరుల‌ను తామే చంపుకుంటున్నామ‌న్న సంగ‌తి పాకిస్తాన్ మ‌రచిపోతోంది. బ‌లూచిస్థాన్‌, పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్ ప్ర‌జ‌ల‌పైన సాగించిన దురాగ‌తాల‌పై పాకిస్తాన్ ప్ర‌పంచానికి స‌మాధానం చెప్పాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మ‌యింది.

పౌరుల ప్రాథ‌మిక హ‌క్కుల‌కు మేము పూర్తిగా క‌ట్టుబ‌డి ఉన్నాము. మ‌న ఉగ్ర‌వాద వ్య‌తిరేక చ‌ట్టాలు కూడా ఇత‌ర దేశాల‌తో పోల్చితే ఎంతో మాన‌వీయంగా ఉన్నాయి. ఇలాంటి సంఘ‌ట‌ల‌ను ఎదుర్కొనే స‌మ‌యంలో మ‌న ప్ర‌భుత్వం, భ‌ద్ర‌తా ద‌ళాలు కూడా ఎంతో సంయ‌మ‌నాన్ని పాటిస్తున్నాయి.

సంపూర్ణ శ‌క్తి సామ‌ర్థ్యాల‌తో భార‌తదేశం ఉగ్ర‌వాదంపైన పోరాటాన్ని సాగిస్తుంది. ఇది మ‌నంద‌రి జాతీయ బాధ్య‌త‌. భార‌త‌దేశం చ‌ట్టాల‌కు క‌ట్టుబ‌డ‌డాన్ని మ‌న వ్య‌తిరేకులు ఒక బ‌ల‌హీన‌త‌గా భావిస్తే, అది చాలా పొర‌పాటు. ఉగ్ర‌వాదాన్ని స‌మూలంగా నిర్మూలించ‌డ‌మే భార‌తదేశం క‌ట్టుబాటు. ల‌క్ష్యం, గ‌మ్యం రెండూ మాకు ముఖ్య‌మే. రెండింటినీ సాధించ‌గ‌ల సామ‌ర్థ్యం మాకుంది.

క‌శ్మీరీ పండిట్లు శ‌తాబ్దాల త‌ర‌బ‌డి వారి పూర్వీకులు నివ‌సించిన ప్ర‌దేశాల నుండి దూరం కావ‌ల‌సి రావ‌డం వాస్త‌వం. ఒక ప్ర‌త్యేక తెగ ప‌ట్ల ఇటువంటి దురాగ‌తం పాకిస్తాన్ శిక్ష‌ణ పొందిన‌, సాయుధ ఉగ్ర‌వాదులు, వారి సానుభూతిప‌రుల దుశ్చ‌ర్య‌. “క‌శ్మీరియ‌త్” ను విశ్వ‌సించే వారు ఇటువంటి ప‌నుల‌కు ఒడిగ‌ట్ట‌రు.

జ‌మ్ము-క‌శ్మీర్ బ‌హుముఖీన అభివృద్ధికి రాష్ర్ట‌ ప్ర‌భుత్వంతో సంప్ర‌దించి 80,000 కోట్ల రూపాయ‌ల (800 బిలియ‌న్‌ రూపాయల) అభివృద్ధి ప్యాకేజిని అమ‌లుప‌ర‌చాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. రోడ్లు, విద్యుత్ ప్రాజెక్టులు చేప‌ట్ట‌డం ఒక్క‌టే కాదు.. రాష్ర్టంలోని ప్ర‌తి ఒక్క ప్రాంతం, స‌మాజంలోని ప్ర‌తి ఒక్క వ‌ర్గం అభివృద్ధి ఈ ప్యాకేజి ల‌క్ష్యం. పిల్ల‌ల‌కు విద్యావ‌స‌తుల ఏర్పాటు, యువ‌త‌కు ఉపాధి, ఆధునిక వైద్య చికిత్స‌లు, పర్యటన అభివృద్ధికి అవ‌స‌ర‌మైన వ‌స‌తుల నిర్మాణాన్ని పెంచ‌డానికి, పండ్ల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ప్ర‌త్యేక ఏర్పాట్లు ఈ ప్యాకేజిలో భాగంగా ఉంటాయి.

త‌క్ష‌ణ ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించేందుకు 10,000 స్పెష‌ల్ పోలీసు అధికారులు (ఎస్ పి ఓ ల), దాదాపు 1,200 అర్థసైనిక బలగాల, 5 ఐ ఆర్ బెటాలియ‌న్ లలో 4,000 మంది కాండిడేట్ ల నియామ‌కాన్ని చేప‌ట్ట‌బోతున్నాము. నిరుద్యోగుల‌కు త‌గు ఉపాధి ల‌భించ‌డానికి వీలుగా ఒక ల‌క్ష ఇరవైఅయిదు వేల మందికి ఉడాన్‌, హిమాయ‌త్ పథకాల కింద శిక్ష‌ణ ఇవ్వ‌డం జ‌రుగుతుంది.

శ్రీ‌మ‌తి మ‌హ‌బూబా ముఫ్తీ నాయ‌క‌త్వంలోని పి డి పి-బి జె పి ప్ర‌భుత్వం రాష్ర్ట స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి గ‌ట్టిగా కృషి చేస్తోంది. ఎన్నో ప్ర‌తికూల ప‌రిస్థితులలో కూడా ప్ర‌భుత్వం ఎంతో జాగ్ర‌త్త‌గా ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చింది. దేశం యావ‌త్తు ఆమె వెంట నిలబడుతుంది.

ప్ర‌జ‌ల న్యాయ‌బ‌ద్ధ‌మైన ఫిర్యాదులు ఏవైనా ప‌రిష్క‌రించ‌డానికి, శాంతి పున‌రుద్ధ‌ర‌ణ‌కు కేంద్ర‌, రాష్ర్ట ప్ర‌భుత్వాలు క‌ట్టుబ‌డి ఉన్నాయి. దౌర్జ‌న్య‌కాండ‌, ఉగ్ర‌వాదం, భార‌తదేశ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌న్నింటి పైన క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తాం. అదే స‌మ‌యంలో న్యాయ‌బ‌ద్ధ‌మైన కోర్కెతో ఎవ‌రు వ‌చ్చినా, ఆ కోర్కెను ప‌రిశీలించి ప‌రిష్క‌రించ‌డం జ‌రుగుతుంది.

ఉగ్ర‌వాదులు, విచ్ఛిన్న‌క‌ర శ‌క్తుల‌కు వ్య‌తిరేకంగా ఐక్యంగా పోరాడాల‌ని అన్ని రాజ‌కీయ పక్షాలకు, భార‌తీయులంద‌రికీ నేను మ‌రోసారి విజ్ఞ‌ప్తి చేస్తున్నాను. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉగ్ర‌వాదం కోర‌లు చాస్తున్న‌, పొరుగుదేశం మ‌న‌పై ఉగ్ర‌వాదుల‌ను రెచ్చ‌గొడుతున్న ప్ర‌స్తుత ప‌రిస్థితిలో మ‌నంద‌రం దానిపై ఉమ్మ‌డి పోరును సాగించాలి. అన్ని రాజ‌కీయ పక్షాలు విభేదాలను వీడి, రాష్ర్టంలో శాంతి పున‌రుద్ధ‌ర‌ణ‌కు, సుసంప‌న్న‌త‌కు స‌హ‌క‌రించాలి. మీ అంద‌రి స‌హ‌కారం, రాష్ర్ట‌ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌తో జ‌మ్ము- క‌శ్మీర్ లో సాధార‌ణ ప‌రిస్థితులు స‌త్వ‌రం పున‌రుద్ధ‌రించ‌గ‌ల‌మ‌న్న విశ్వాసం నాకుంది.

కశ్మీర్ పై మా ప్ర‌ధాన చ‌ర్య‌లు, విధానం మీ అంద‌రి ముందు ఆవిష్క‌రించ‌బోతున్నాను..

1) శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ ప్ర‌తి ఒక్క ప్ర‌భుత్వం బాధ్య‌త‌. ఉగ్ర‌వాదంతో రాజీ ప్ర‌స‌క్తే లేదు.

2) నేటి స‌మాజంలో ప్ర‌జాస్వామిక సంప్ర‌దాయాల‌కు అనుగుణంగా పౌరుల కార్య‌క‌లాపాల‌న్నింటిలోనూ పౌర‌స‌మాజం క‌లసి ప‌ని చేయ‌డాన్ని మేం ప్రోత్స‌హిస్తాము.

3) ప్ర‌జాస్వామిక సంప్ర‌దాయాల‌కు అనుగుణంగా రాజ‌కీయ ప్ర‌క్రియ‌ ముందుకు న‌డిపిస్తాము.

4) క‌శ్మీరీ యువ‌కుల‌ను ఆర్థిక కార్య‌క‌లాపాల‌తో అనుసంధానం చేసే ప్ర‌క్రియలో వేగం పెంచుతాము.

5) ఇత‌ర రాష్ట్రాలలో నివ‌సిస్తున్న జ‌మ్ము- క‌శ్మీర్ ప్ర‌జ‌లు హిందువులు, ముస్లిములు, సిక్కులు, బౌద్ధులు.. ఏ మ‌తానికి చెందిన వారైనా స‌రే, ఆయా ప్ర‌భుత్వాలు వారిని సంప్ర‌దించి జ‌మ్ము- క‌శ్మీర్ లో నివ‌సిస్తున్న వారి బంధువుల‌తో మాట్లాడే ఏర్పాటు చేయ‌డం, ఇత‌ర రాష్ట్రాలలో నివ‌సిస్తున్న తాము ఎంత పురోగ‌తిని సాధించిందీ, తాము నివ‌సిస్తున్న రాష్ట్రాలు ఎంత పురోగ‌తిని సాధించిందీ వివ‌రించేలా చూడాలి.

6) ప్ర‌పంచంలోని ఇత‌ర దేశాలలో నివ‌సిస్తున్న పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్ ప్రాంత‌ ప్ర‌జ‌ల‌ను విదేశాంగ మంత్రిత్వ శాఖ సంప్ర‌దించి పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్ లో వారు ఎదుర్కొన్న దుస్థితిని గురించి తెలుసుకుని ప్ర‌పంచ స‌మాజం ముందు ఆవిష్క‌రించాలి.

ఈ స‌మావేశంలో పాల్గొని అమూల్య‌మైన అభిప్రాయాలను, స‌ల‌హాలను అంద‌జేసినందుకు మీ అంద‌రికీ మ‌రోసారి ధ‌న్య‌వాదాలు. ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ఇచ్చినందుకు మీ అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. భార‌త ప్రాదేశిక స‌మ‌గ్ర‌త విష‌యంలో ఎటువంటి రాజీకి తావు లేకుండా మ‌నంద‌రమూ ఈ జాతీయ స్ఫూర్తిని కొన‌సాగించ‌డానికి క‌ట్టుబాటును ప్ర‌క‌టించాలి. రాజ్యాంగ ప‌రిధిలో అన్ని వ‌ర్గాల ఫిర్యాదులను ప‌రిష్క‌రించ‌డానికి మేము సిద్ధంగా ఉన్నాము.

మీకు ఇవే నా ధ‌న్య‌వాదాలు.