Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఢిల్లీలో జరిగిన భారత్ పునరుత్పాదక ఇంధన సదస్సు, ఎక్స్‌పో ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

ఢిల్లీలో జరిగిన భారత్ పునరుత్పాదక ఇంధన సదస్సు, ఎక్స్‌పో ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం


క్యాబినెట్లో నా సహచర మంత్రులు శ్రీ ప్రల్హాద్ జోషి, శ్రీపాద నాయక్, పారిశ్రామిక ప్రతినిధులు, పెట్టుబడిదారులు, అంకురసంస్థల రంగానికి చెందిన మిత్రులు, ఉన్నతాధికారులు, విశిష్ట అతిథులు, దేశ విదేశాల నుంచి భారతదేశానికి వచ్చిన అందరికీ…

భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సదస్సుకు మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఈ ఏడాది నిర్వహిస్తున్న సదస్సు ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది ప్రత్యేక పరిస్థితుల మధ్య జరుగుతోంది. ఈ ఏడాది ఇంధన సంక్షోభాల చుట్టూనే చర్చలు జరగడాన్ని మనం చూశాం. మన జీవితాల్లో, మన అభివృద్ధి ప్రయాణంలో పునరుత్పాదక ఇంధనానికి ఉన్న పాధాన్యం మరింత తేటతెల్లమయింది. ఈ సదస్సు జరుగుతున్న సమయంలోనే అంతర్జాతీయ సౌర కూటమి తొమ్మిదో సమావేశాన్ని కూడా నిర్వహించడం ఆనందదాయకం. గ్రీన్ హైడ్రోజన్ నాలుగో సమావేశానికి హాజరవుతున్న ప్రతినిధులు సైతం ఇక్కడ ఉన్నారు. అలాగే ఈ ఏడాది ఈ కార్యక్రమం స్థాయి మరింత విస్తృతమైంది. మీ అందరికీ నా శుభాకాంక్షలు.

మిత్రులారా,

గడచిన కొన్నేళ్లుగా మునుపెన్నడూ లేని విధంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సంక్షోభాలను ఎదుర్కొంది. కొవిడ్ మహమ్మారి నుంచి పశ్చిమాసియా సంక్షోభం వరకు ఈ ప్రపంచం అనేక ప్రధాన సవాళ్లను చవిచూసింది. పశ్చిమాసియా సంక్షోభం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ సవాళ్లను ఇతరుల కంటే మెరుగ్గా మనం ఎదుర్కొన్నామని, సంక్షోభ పరిస్థితుల్లోనూ భారతదేశ వృద్ధి రేటు అధికంగానే ఉందని 140 కోట్ల మంది భారతీయులు గర్వపడుతున్నారు. గడచిన దశాబ్దంలో శుద్ధ ఇంధన రంగంలో భారత్ పెట్టుబడులు పెట్టకుండా, ఈ రంగంలో కొత్త వ్యవస్థలను ఏర్పాటు చేయకుండా ఉండి ఉంటే… ప్రపంచంలోని మిగిలిన దేశాల కంటే తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చి ఉండేది.

మిత్రులారా,

ఆర్థిక భద్రతతో ఇంధన భద్రత నేరుగా అనుసంధానమై ఉందనే సందేశాన్ని ప్రతి దేశానికీ ఈ అంతర్జాతీయ సంక్షోభం అందించింది. శుద్ధ ఇంధనంలోనే ఇంధన భద్రత భవిష్యత్తు దాగుందని మనందరికీ తెలుసు. శిలాజ ఇంధనాలపై మనం అధికంగా ఆధారపడటాన్ని కొనసాగిస్తే… ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తరచూ అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. శిలాజ ఇంధనాలు పరిమితంగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. మరోవైపు పునరుత్పాదక ఇంధనానికి అపరిమితమైన సామర్థ్యం ఉంది. ప్రతి ప్రాంతమూ, ప్రతి దేశమూ దాని నుంచి ప్రయోజనం పొందుతాయి.

మిత్రులారా,

ఈ రంగంలో గడచిన పన్నెండేళ్లుగా హామీలు, నిబద్ధత, పనితీరుతో భారత్ సాగిస్తున్న ప్రయాణం కూడుకొని ఉంది. కాప్–26లో మేం చేసిన వాగ్దానమే దీనికి నిదర్శనం. 2021 శిఖరాగ్ర సమావేశంలో భారతదేశం 2030 నాటికి శిలాజేతర ఇంధన వనరుల ద్వారా 500 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని సంకల్పించింది. మేం సాధిస్తాం అని చెప్పాం. విద్యుదుత్పత్తి సామర్థ్యంలో సగభాగాన్ని శిలాజేతర ఇంధన వనరుల ద్వారా సాధించాలనే లక్ష్యాన్ని ప్యారిస్ ప్రతిజ్ఞలో భారత్ నిర్దేశించుకుంది. 2025లోనే భారత్ ఆ లక్ష్యాన్ని సాధించింది. మరో మాటలో చెప్పాలంటే.. నిర్దేశించుకున్న సమయాని కంటే అయిదేళ్లు ముందుగానే ఈ లక్ష్యాన్ని మేం సాధించాం. ప్రస్తుతం, మా విద్యుదుత్పత్తి సామర్థ్యంలో 50 శాతానికి పైగా శిలాజేతర ఇంధనాల నుంచి ఉత్పత్తి అవుతోంది. 500 గిగావాట్ల లక్ష్యాన్ని సాధించే దిశగా భారత్ స్థిరంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే దాదాపు 300 గిగావాట్ల సామర్థ్యాన్ని సాధించాం. ఇప్పుడు సౌర, పునరుత్పాదక ఇంధన రంగంలో భారతదేశం ప్రపంచంలోని మూడు అగ్ర దేశాల్లో ఒకటిగా ఉంది. వచ్చే పది, పదకొండేళ్లలో మరో 500 గిగావాట్ల నూతన శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని జోడించేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. ఈ లక్ష్యం కొంత సవాలుతో కూడుకున్నది. కానీ నా దేశ సామర్థ్యాలపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. అందుకే మేం దీన్ని సాధిస్తామని చెబుతున్నాను.

మిత్రులారా,

మానవాళి మొత్తానికి భారతదేశ ఆవిష్కరణల, అనుభవాల ప్రయోజనాన్ని అందించాలని మేం కోరుకుంటున్నాం. హరిత ఇంధన విషయంలోనూ ఇదే విధానం అనుసరిస్తున్నాం. ఈ రంగంలో భారత్ సాధించిన విజయాలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఉపయోగపడతాయి. ఈ అంశాన్ని ఉదాహరణల ద్వారా వివరిస్తాను.

మిత్రులారా,

పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని 2024 ఫిబ్రవరిలో ప్రారంభించాం. ఈ పథకం ద్వారా ఒక కోటి ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. గత ఇరవై నాలుగూ, ఇరవై అయిదూ నెలల్లోనే అరవై అయిదు లక్షలకు పైగా గృహాలు ఈ కార్యక్రమంలో చేరాయి. ఇప్పుడే మా మంత్రి శ్రీ ప్రల్హాద్ జోషి చెప్పినట్లుగా ప్రతి ఆరు రోజులకూ ఒక లక్ష కొత్త గృహాలు ఈ సౌర ఉద్యమంలో భాగమవుతున్నాయి. విద్యుత్తు బిల్లుల్లో సైతం ఈ ప్రభావం కనిపిస్తోంది. ఈ అరవై అయిదు లక్షల గృహాల విద్యుత్తు బిల్లు దాదాపు 76 శాతం మేర తగ్గినట్టు ఓ అధ్యయనం వెల్లడించింది. లక్షలాది కుటుంబాలకు విద్యుత్ బిల్లులు సున్నా అయ్యాయి. మిగులు విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్న అనేక కుటుంబాలు దానిని గ్రిడ్‌కు విక్రయించి ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. ఈ పథకం అనేక దేశాల్లో, ముఖ్యంగా గ్లోబల్ సౌత్‌లో ఇంధన భద్రతను బలోపేతం చేస్తుంది.

మిత్రులారా,

తన ప్రజల జీవితాల్లో సౌర విద్యుత్తును భాగంగా భారత్ మారుస్తోంది. గడచిన పన్నెండేళ్లలో సౌర విద్యుత్తుతో పరిశ్రమలను, వ్యవసాయ క్షేత్రాలను అనుసంధానించేందుకు కూడా మేం ప్రయత్నించాం. ప్రస్తుతం 44,000కు పైగా ప్రభుత్వ కార్యాలయాలు సౌర విద్యుత్తుకు అనుసంధానమై ఉన్నాయి. దీనివల్ల ఏడాదికి రూ.700 కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయి. కుసుమ్ పథకం ద్వారా భారతీయ రైతులకు విస్తృత ప్రయోజనాలు అందుతున్నాయి. దీని ద్వారా 30 లక్షలకు పైగా రైతులకు సౌర విద్యుత్తుతో నడిచే నీటిపారుదల సౌకర్యం లభించింది. సోలార్ పంపులను వినియోగిస్తున్న ప్రతి రైతుకూ ఏటా లక్ష రూపాయలు ఆదా అవుతోందని అంచనా. పీఎం సూర్య సరోవర్ యోజన గురించి కూడా మీకు చెబుతాను. చెరువులు, సరస్సులు, జలాశయాలపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసి విద్యుత్తును ఉత్పత్తి చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. దీనివల్ల జలాశయాలను మరింత మెరుగ్గా వినియోగించుకోవచ్చు. ఇలాంటి ప్రాజెక్టులు భూసేకరణకు అయ్యే ఖర్చులను కూడా తగ్గిస్తాయి.

మిత్రులారా,

జల, సౌర, పవన, అణు విద్యుత్తుకు మాత్రమే మా శుద్ధ ఇంధన రంగం పరిమితం కాలేదు. గ్రీన్ హైడ్రోజన్ రంగంలో కీలకమైన పురోగతిని సాధించే దిశగా భారత్ యుద్ధప్రాతిపదికన ముందుకు సాగుతోంది. జాతీయ హరిత హైడ్రోజన్ కార్యక్రమం ద్వారా ఈ దశాబ్దం ముగిసేనాటికి 50 లక్షల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. రవాణా రంగాన్ని సైతం గ్రీన్ హైడ్రోజన్‌తో అనుసంధానిస్తున్నాం. కొద్ది నెలల క్రితమే భారతదేశం తన మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ రైలును కూడా ప్రారంభించింది. 

మిత్రులారా,

విద్యుదుత్పత్తిని సాధించడం ఒక్కటే సరిపోదని నిపుణులైన మీ అందరికీ తెలుసు. దానిని సమర్థంగా పంపిణీ చేయడానికి, అవసరమైన చోటుకి సరఫరా చేయడానికి కూడా సమప్రాధాన్యం ఉంది. భారత్‌లో కొన్ని నిర్దేశిత ప్రాంతాల్లో సౌర, పవన విద్యుత్తు అధికంగా ఉత్పత్తి అవుతోంది. దీని నుంచి విద్యుదుత్పత్తి సాపేక్షంగా తక్కువగా ఉన్న ప్రాంతాలకు లబ్ధి చేకూరేలా మనం చూడాలి. ఫలితంగా ఇళ్లు, వ్యవసాయ క్షేత్రాలు, పరిశ్రమలు కూడా శుద్ధ విద్యుత్ శక్తిపై నడుస్తాయి. అందుకే గ్రీన్ ఎనర్జీ కారిడార్లను అభివృద్ధి చేస్తున్నాం. ఈ కారిడార్ల పరిధిలో ట్రాన్స్‌మిషన్ లైన్లు, సబ్‌స్టేషన్లతో కూడిన ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. దీని ద్వారా డిమాండు ఉన్న  ప్రాంతాలకు సౌర, పవన విద్యుత్‌ను ఉత్పత్తి కేంద్రాల నుంచి తరలించడం సులభతరం అవుతుంది. ఈ ప్రయత్నానికి ఒకే దేశం, ఒకే పవర్ గ్రిడ్ కార్యక్రమం విస్తృత సహకారం అందిస్తోంది. గడచిన కొన్నేళ్లలో అయిదు ప్రాంతీయ గ్రిడ్లను ఒకే జాతీయ వ్యవస్థగా ఏకీకృతం చేశాం. ఇప్పుడు, దేశమంతా ఒకే పౌనఃపున్యంతో పనిచేసే పవర్ గ్రిడ్‌తో అనుసంధానమై ఉంది. ఈ గ్రీన్ ఎనర్జీ కారిడార్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా తదుపరి దశలోకి మేం అడుగుపెట్టాం. దీనికోసం ఇటీవలే రూ. రెండు లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించుకుంది.

మిత్రులారా,

పెరుగుతున్న తయారీ సామర్థ్యమే గ్రీన్ ఎనర్జీ రంగంలో మన విజయానికి ప్రధాన కారణం. కొన్నేళ్ల కిందటి వరకు మనం సౌరశక్తికి సంబంధించిన చిన్న భాగానికి కూడా పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడ్డాం. దశాబ్దం కిందట మన సోలార్ మాడ్యూల్ తయారీ సామర్థ్యం కేవలం 2 గిగావాట్ల వరకు మాత్రమే ఉండేది. నేడు అది 200 గిగావాట్లను దాటింది. సోలార్ సెల్ తయారీ సామర్థ్యం కూడా దాదాపు 40 గిగావాట్లకు చేరుకుంది. ప్రస్తుతం ఇతర భాగాల తయారీని కూడా విస్తరిస్తున్నాం. మరో మాటలో చెప్పాలంటే గ్రీన్ ఎనర్జీ రంగంలో భారతదేశ ఆకాంక్షలు ఆత్మనిర్భర్ భారత్ మిషన్ విజయానికి, మేక్ ఇన్ ఇండియా ప్రచార విజయానికి నిదర్శనం.

మిత్రులారా,

తక్కువ వ్యవధిలోనే ఎంతో సాధించేందుకు భారత్ కృషి చేస్తోంది. మనం ఇక్కడితో ఆగిపోలేం. ప్రతి ప్రభుత్వ భవనాన్ని, ప్రతి పాఠశాలను, కళాశాలను, ఆస్పత్రులను, మొత్తం వీధి దీపాల వ్యవస్థను సౌరశక్తికి అనుసంధానించాలి. శరవేగంగా ఈ పనులు జరగాలి. మెరుగ్గా పని చేసేవారికి తగిన పురస్కారాలు లభించేలా, వారి విజయగాథల ద్వారా ఇతరులు నేర్చుకునేలా రాష్ట్రాలు, స్థానిక సంస్థల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించాలని కోరుకుంటున్నా.

మిత్రులారా,

వ్యవసాయ రంగంలో సౌర విద్యుత్ వినియోగం పట్ల ఒక సూచన చేస్తున్నా. మనం లక్షలాది సోలార్ పంపులను పంపిణీ చేశాం… కానీ సోలార్ పంపులను దాటి మనం ముందుకు వెళ్లాలి. అన్నదాత కాస్తా ఊర్జదాతగా మారాలి. అంటే ఆహారాన్ని అందించే వ్యక్తి… విద్యుత్ ను అందించే వ్యక్తిగా మారాలన్నదే నా ఆకాంక్ష. ఉపయోగంలో లేని భూమిలో రైతులు సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవాలి. పొలాల సరిహద్దులను కూడా వృథా చేయకూడదు. అక్కడ కూడా సోలార్ ప్యానెళ్లను అమర్చాలి. ఈ విధానం వీలైనన్ని ఎక్కువ గ్రామాలకు చేరుకునేలా మనం చూడాలి.

మిత్రులారా,

సోలార్ విప్లవానికి సంబంధించిన ఈ నూతన దశ కేవలం వినియోగానికి మాత్రమే కాక… ఆవిష్కరణలపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల మన అంకుర సంస్థలు, ఐఐటీలు, ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి, సౌర విద్యుత్ ద్వారా గృహావసరాలను వీలైనంత ఎక్కువగా తీర్చే నమూనాలను రూపొందించాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. రోజులో ఇరవై నాలుగు గంటలు, ప్రతి కాలంలోనూ సౌర విద్యుత్ అందుబాటులో ఉండేలా మనకు పరిష్కారాలు కావాలి. ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసుకున్న సోలార్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్ తోనే వంట చేసుకునే పరిస్థితికి మనం చేరుకోవాలి. మనం క్లీన్ కుకింగ్ ఉద్యమాన్ని ప్రారంభించాలి. దిగుమతి చేసుకున్న గ్యాస్‌పై ఆధారపడటాన్ని వీలైనంతగా తగ్గించాలి. మధ్యతరగతి కుటుంబాలు ఎలక్ట్రిక్ వాహనాలను ఎంచుకునేలా, సొంత సోలార్ వ్యవస్థల ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్‌తో స్కూటర్లు, బైక్‌లు, కార్లను ఇంట్లోనే ఛార్జ్ చేసుకునే వెసులుబాటును కూడా మనం కల్పించాలి. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలు ఏటా వేల రూపాయలను ఆదా చేసుకోవచ్చు.

మిత్రులారా,

డెయిరీ రంగంలోనూ సౌరశక్తిని ప్రోత్సహించే ఉత్పత్తులు మనకు అవసరం. పశువుల దాణా తయారీ నుంచి పంట కోత, కోత అనంతర కార్యకలాపాల వరకు ప్రతి పనికి సోలార్‌తో నడిచే పరికరాల అభివృద్ధి జరగాలి.

మిత్రులారా,

తదుపరి తరం ఆవిష్కరణలు లేకుండా ఇవేవీ సాధ్యం కావు. దీనికోసం దేశానికి అవసరమైన హార్డ్‌వేర్ కావాలి. మనకు స్వదేశీ స్టోరేజ్ పరిష్కారాలు అవసరం.  కొత్త బ్యాటరీ స్టోరేజ్ సామర్థ్యాన్ని మనం పెంపొందించుకోవాలి. మీ అందరికీ, దేశ యువతకు ఇదొక అద్భుతమైన అవకాశం. పరిశోధనా రంగానికి చెందిన ప్రతి ఒక్కరూ, పెట్టుబడిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నా. భారతదేశంలో మీరు అభివృద్ధి చేసే పరిష్కారాలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలకు ఉపయోగపడతాయి.

మిత్రులారా,

ప్రపంచంలోని అత్యంత యువ దేశాల్లో భారత్ ఒకటి. స్వచ్ఛ ఇంధన రంగంలో జరిగే ప్రతి ప్రయత్నం భారీ సంఖ్యలో నూతన ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది. ఈనాటికి వేలాది మంది ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారు. గ్రీన్ జాబ్స్‌కు అపారమైన అవకాశాలున్నాయి. ప్యానెల్స్, ఇతర హార్డ్‌వేర్ తయారీ నుంచి ఇన్‌స్టాలేషన్, సర్వీసింగ్, రవాణా వరకు వివిధ రంగాల్లో ఈ అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఒక్కసారి ఊహించండి… భవిష్యత్తులో సౌర విద్యుత్ సామర్థ్యం మరింత పెరిగినప్పుడు, ఇంకెన్ని ఉద్యోగాల కల్పన జరుగుతుంది. వంటగదిలో స్టవ్ నుంచి రవాణా వ్యవస్థల వరకు ప్రతిదీ సౌర విద్యుత్, గ్రీన్ ఎనర్జీ ఆధారంగా పనిచేసినప్పుడు సరికొత్త పరిశ్రమ ఆవిర్భవిస్తుంది.

మిత్రులారా,

మీ అందరి కోసం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారుల కోసం భారతదేశం అపారమైన అవకాశాలను కల్పిస్తుంది. భారత్ అందిస్తున్న డిమాండ్, స్థాయి, పరిధి వంటివి మరెక్కడా దొరకవు. భారతదేశ రాజకీయ, విధానపరమైన స్థిరత్వాన్ని కూడా మరెక్కడా చూడలేం. దీని ఫలితాలను మనం చూస్తున్నాం. గత దశాబ్దంలో పునరుత్పాదక శక్తి రంగంలో రూ. 15 లక్షల కోట్లకుపైగా అంటే 164 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా వచ్చాయి. 2024 నాటి రీ-ఇన్వెస్ట్ శిఖరాగ్ర సమ్మేళనం నుంచి నేటి వరకు కేవలం రెండేళ్ల వ్యవధిలోనే దాదాపు రూ. 6 లక్షల కోట్లు… అంటే 63 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు ఈ రంగంలోకి వచ్చాయి. ఈ దశాబ్దం నాటికి ఈ రంగంలో రూ. 20 లక్షల కోట్లకుపైగా, అనగా 220 బిలియన్ డాలర్ల పెట్టుబడి అవకాశాలు ఏర్పడతాయని అంచనా. భారత గ్రీన్ ఎనర్జీ రంగంలో మీ అందరికీ అవకాశాల ద్వారం తెరచుకుంటోంది.

మిత్రులారా,

ప్రపంచానికి ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే సందేశాన్ని భారత్ అందించింది. క్లీన్ ఎనర్జీ ప్రయాణంలోనూ ఇదే తత్వం ప్రతిబింబిస్తోంది. అంతర్జాతీయ సౌర కూటమి వెనకున్న ఆలోచన ఇదే. పునరుత్పాదక శక్తికి అవసరమైన నిధులు, సాంకేతికత, నైపుణ్యం అవసరమైన ప్రతి దేశానికి చేరేలా చూడాలన్నదే మా ప్రయత్నం. అందుకే ఆఫ్రికా దేశాల కోసం 200 మిలియన్ డాలర్ల ఆఫ్రికా సోలార్ ఫెసిలిటీ ప్రతిపాదనను ముందుకు తెచ్చాం.

మిత్రులారా,

మన వాతావరణ లక్ష్యాలకు రాబోయే దశాబ్దం అత్యంత కీలకం. ఈ సదస్సుకు విచ్చేసిన ప్రతి ఒక్కరూ భవిష్యత్తును సురక్షితంగా మలచటంలో ప్రధాన పాత్ర పోషిస్తారని నేను బలంగా విశ్వసిస్తున్నా. ప్రతి దేశాన్ని ఈ మిషన్‌తో అనుసంధానించాలి. ప్రతి ప్రాంతం ఈ మార్పులో భాగస్వామి కావాలి. అప్పుడే మనం పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, సురక్షితమైన భవిష్యత్తును నిర్మించగలం. మరోసారి మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.

ధన్యవాదాలు.

గమనిక: ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదం.

 

***