జై శ్రీరామ్!
జై శ్రీరామ్!
జై శ్రీరామ్!
పవిత్ర విజయదశమి సందర్భంగా భగవాన్ శ్రీ రాముని పాదాలకు, జానకీ మాతకు, భజరంగబలికి నమస్కరిస్తున్నాను. ఈ ఆధ్యాత్మిక వాతావరణంలో దేశ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
ఈ రోజు, భారతదేశంలోని ప్రతి మారుమూల ప్రాంతం శ్రీరాముని భక్తిలో లీనమైంది. ప్రతి ఊరూ, ప్రతి నగరమూ, యావత్తు దేశమూ రామలీలా స్ఫూర్తిలో మునిగిపోయాయి. దేశవ్యాప్తంగా చేపడుతున్న రామలీలా ప్రదర్శనలు, భగవాన్ శ్రీరాముని ఆదర్శాలను సజీవంగా ఉంచే సంప్రదాయాలు, నిరంకుశత్వం, భయం అంతం అయ్యాయన్న సందేశం, అసత్యంపై సత్యం సాధించిన విజయం… ఇది మనకు పండగగా మాత్రమే పరిమితం కాలేదు. ఇది మన భారతీయ జీవశక్తి. అందుకే ఈ రోజు దేశంలోని ప్రతి పౌరుడూ అధర్మంపై ధర్మం సాధించిన విజయాన్ని ఉత్సవంగా జరుపుకొంటున్నారు. రండి, మరోసారి నాతో కలసి చెప్పండి:
జై శ్రీరామ్!
జై శ్రీరామ్!
జై శ్రీరామ్!
మిత్రులారా,
ఈ దేశం, ఈ సంస్కృతి, వేల సంవత్సరాలుగా శ్రీరాముని ఆరాధిస్తూ వచ్చిన మన పూర్వీకులు. ఇది శ్రీరాముడు రాక్షస రాజు రావణుని సంహరించడం వల్ల వచ్చిన విశ్వాసం మాత్రమే కాదు. మానవ చరిత్రలో సాటిలేని ఆదర్శాలను అందించినందువల్లే ఆ విశ్వాసం నిలిచి ఉంది.
మిత్రులారా,
తన జీవితంలో అనేక కష్టాలను శ్రీరాముడు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ సత్యం, ధర్మమార్గాన్ని ఏనాడూ విడిచిపెట్టలేదు. ఆయన గుణం అలాంటిది. ‘‘ప్రసన్నతం యా న గత అభిషేకితః తథా, న మామ్లే వనవాస దుఃఖతో’’ – అంటే రాజ్యం దక్కినప్పుడు రాముడు ఉప్పొంగిపోలేదు. అరణ్యవాసం చేయాల్సి వచ్చినప్పుడు విచారంలో మునిగిపోలేదు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ ధర్మాన్ని నిలబెట్టారు. సత్యస్థాపన చేశారు. అరణ్యవాసానికి వెళ్లినప్పుడు నిషాద రాజును ఆలింగనం చేసుకున్నారు. శబరి మాతను గౌరవించారు. కరుణ, దయ, ప్రేమ, సామరస్యంలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పారు. అయోధ్యకు తిరిగి వచ్చి రాజుగా పట్టాభిషేకం అయిన తర్వాత రామరాజ్యాన్ని స్థాపించారు. అదే నేటికీ సుపరిపాలనకు ప్రామాణికంగా నిలిచింది. రామరాజ్యం అంటే ఎవరి పట్ల వివక్ష లేనిది. అందరికీ సమన్యాయాన్ని అందించేది. అందరికీ సమానవకాశాలు దక్కేలా చేసేది. అధికారం అంటే పాలించడం మాత్రమే కాదని ప్రజల సంక్షేమం కోసం సేవ చేసే వ్యవస్థ అని తెలియజెప్పేది. అందుకే ‘‘దైహిక్ దైవిక్ భౌతిక్ తప, రామరాజ్ నహిన్ కహూహి వ్యాప’’ అని గోస్వామి తులసీదాస్ అన్నారు. ఇది మర్యాదపురుషోత్తముడైన భగవాన్ శ్రీరాముని ఆదర్శం. కాబట్టి మనం ఎల్లప్పుడూ ప్రజలనే దైవంగా భావించాలి. పౌరుడే ప్రథమం అనే మంత్రంతో ముందుకు సాగాలి. అన్నింటి కంటే ముఖ్యంగా పేదలకు, అణగారిన వర్గాలకు సేవ చేసేందుకే మనం అధిక ప్రాధాన్యమివ్వాలి.
మిత్రులారా,
శ్రీరాముని జీవితం నుంచి మనం ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకున్నాం. ఎంత పెద్ద సంక్షోభమైనా, ఎంత కఠినమైన సవాలు అయినా… ఇతరుల కోసం మనం ఎదురుచూస్తూ కూర్చోకూడదు. మన సొంత బలాన్ని గుర్తించాలి. మన సొంత వనరులపై నమ్మకముంచాలి. మన సంకల్పాన్ని మనమే శక్తిగా మార్చుకోవాలి. మన శ్రమ ద్వారా పరిష్కారాలను మనమే కనుగొనాలి. మార్గమధ్యంలో ఎదురయ్యే అడ్డంకులు మన ప్రయాణాన్ని ఆపలేవని శ్రీరాముడు మనకు బోధించారు. సముద్రం ఆయన ముందు ఉంది. లంక చాలా దూరంలో ఉంది. కానీ సంకల్పం అచంచలమైనది. ప్రజల్లో ఉన్న సామూహిక శక్తిని ఆయన మేల్కొలిపారు. ప్రజాభాగస్వామ్యాన్నే తనకు మద్దతుగా చేసుకున్నారు. అందుబాటులో ఉన్న వనరులను ఏకం చేశారు. అసాధ్యంగా పరిగణించిన లక్ష్యాన్ని సాధించి చూపారు. విజయానికి మూలమంత్రం ఇదే. మన బలంపై నమ్మకం ఉంచాలి. మన సామర్థ్యంపై విశ్వాసం ఉంచాలి. మన సొంత వనరులను సక్రమంగా వినియోగించుకోవాలి. మన లక్ష్యం పట్ల చెక్కుచెదరని అంకితభావం ఉండాలి. ఇప్పుడు మనం ఇదే మంత్రంతో ముందుకు సాగాలి. మన ముందు అభివృద్ధి చెందిన భారత్ అనే లక్ష్యం ఉంది. మన ముందు ఆత్మనిర్భర భారత్ అనే లక్ష్యం ఉంది. ప్రజల శక్తితో, ప్రజల సంక్షేమం కోసం మన పౌరుల ప్రతి ఆకాంక్షను మనం నెరవేర్చాలి. దీనికోసం కూడా మనం శ్రీరాముని నుంచి స్ఫూర్తిని పొందాలి.
మిత్రులారా,
ఆత్మగౌరవం ఉన్నప్పుడే ఒక దేశం పురోగతి సాధిస్తుంది. ఈ ఆత్మగౌరవంలో వారసత్వ సంపద కీలకమైన పాత్ర పోషిస్తుంది. అందుకే, తన సంస్కృతిని, గుర్తింపును కాపాడుకోవాలనే దృఢ నిశ్చయంతో నేడు దేశం ఉంది. అనేక శతాబ్దాల పాటు, మన సంపదను దోపిడీ చేసి విదేశాలకు తరలించారు. కానీ ఇప్పుడు వాటిని మేం తిరిగి తీసుకు వస్తున్నాం. గడచిన పన్నెండేళ్లో ఆరు వందల యాభైకి పైగా పురాతన విగ్రహాలను తిరిగి భారతదేశానికి తీసుకువచ్చాం. అలాగే, తన సాంస్కృతిక కేంద్రాలకు సరికొత్త ప్రపంచ గుర్తింపును భారత్ అందిస్తోంది. ఇటీవలి కాలంలో మన దేశంలోని అనేక ప్రదేశాలు యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. గతేడాదే యునెస్కో అమూర్త సాంస్కృతిక వారసత్వ సంపద జాబితాలో దీపావళికి చోటు లభించింది. ఇది లక్షలాది మంది భారతీయుల సమష్టి సంకల్పశక్తి ఫలితం. ఈ అంకితభావంతోనే మన కృషిని కొనసాగించాలి.
మిత్రులారా,
విజయాన్ని సూచించే పర్వదినమే విజయదశమి. ఇది విజయోత్సవం. మనం సత్యం, మానవత్వం వైపు నిలిచినప్పుడు… శత్రువు ఎంతటి శక్తిమంతుడైనప్పటికీ విజయం మనల్నే వరిస్తుందనే ధైర్యాన్ని ఈ పండగ మనకు ఇస్తుంది. ఈ విజయదశమి స్ఫూర్తి ఎల్లప్పుడూ భారతదేశానికి మార్గదర్శకత్వం అందిస్తూనే ఉంటుంది. ‘‘సమనో మంత్రః సమితిః సమని, సమనం మనః సహ చిత్తమేశం’’ అని మన రుషులు మనకు బోధించారు. దేశ ప్రయోజనాల కోసం మన ఆలోచనలు, మన సంఘాలు, దేశంలోని అన్ని సంస్థలు, అన్ని రాజకీయ పార్టీలు కలసి నిలబడాలి అని దీనర్థం. ఈ స్ఫూర్తితోనే మనం ముందుకు సాగాలి. మన దేశ శత్రువులను ఎదుర్కొనేందుకు మనం ఏకం కావాలి. మన దేశ గౌరవ, ప్రతిష్ఠలపై దాడి చేసే, సమాజాన్ని విభజించే, మన సంస్కృతి పట్ల ద్వేషాన్ని పెంచుకొనే శక్తులే మన దేశానికి శత్రువులు. పవిత్ర విజయదశమి సందర్భంగా మన సంకల్పాన్ని మరోసారి పునరుద్ధరించుకోవాలి. భరతమాత శత్రువులను మనం గుర్తించాలి. వారిని మనం ఓడించాలి. దేశమే ప్రథమం అని ప్రతిన పూని అందరూ ఒక్కటవ్వాలి. అయోధ్య ఆలయ ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవంలో మనం తీసుకున్న ‘‘రాముడి నుంచి దేశానికి’’, ‘‘దైవత్వం నుంచి జాతీయ కర్తవ్యం’’ అనే సంకల్పాలు కచ్చితంగా నెరవేరతాయనే విశ్వాసం నాకుంది. మరోసారి దేశ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు.
జై శ్రీరామ్!
జై శ్రీరామ్!
జై శ్రీరామ్!
భారత్ మాతాకీ జై!
భారత్ మాతాకీ జై!
ధన్యవాదాలు.
సూచన: ఇది ప్రధాని హిందీలో చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం.
****
Vijaya Dashami celebrates the victory of good over evil. It reminds us of the enduring strength of truth and righteousness. https://t.co/jJSlQdNhu2
— Narendra Modi (@narendramodi) October 20, 2026
दिल्ली में श्रद्धा और भव्यता से ओतप्रोत विजयादशमी कार्यक्रम ने अभिभूत कर दिया। https://t.co/qVpa1NjZf1
— Narendra Modi (@narendramodi) October 20, 2026