పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘నమామి గంగే కార్యక్రమం’లో పురోగతిపై గురువారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు.
ఈ అంశంపై సమర్పణ సమయంలో, వేరు వేరు ప్రభుత్వ విభాగాలకు చెందిన సీనియర్ అధికారులు ఇంతవరకు చేపట్టిన పనులను గురించి, ఇంకా ఈ కార్యక్రమంలోని పురోగతి క్రమాన్ని గురించి ప్రధాన మంత్రి కి తెలియజేశారు.
నది పక్కన వెలసిన పట్టణాలలో మురుగు నీటి శుద్ధి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతున్నామని అధికారులు తెలిపారు. మరీ ముఖ్యంగా గంగా ప్రధాన స్రవంతి వెంబడి ఉన్న పెద్ద నగరాలైనటువంటి హరిద్వార్, కాన్పూర్, అలహాబాద్, వారాణసీ, పట్నా, భాగల్ పుర్, హౌడా మరియు కోల్ కాతా లపై శ్రద్ధ తీసుకొంటున్నట్లు చెప్పారు.
భారీ కాలుష్యకారక పరిశ్రమల విషయంలో ముమ్మర తనిఖీలను మరియు పర్యవేక్షణను చేపట్టడం జరిగింది. ఇది గంగా నది యొక్క ఉపనదులలో కొన్ని ఉప నదుల జల శుభ్రత పెద్ద ఎత్తున మెరుగపడడానికి దోహదపడినట్లు అధికారులు పేర్కొన్నారు. అంతే కాక ఈ పనిలో భాగంగా ‘డిసాల్వ్ డ్ ఆక్సిజన్’ మరియు ‘‘బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్’’ వంటి పరామితుల అధ్యయనం సాగినట్లు వారు తెలిపారు.
గంగా నది తీర ప్రాంతాలను ఆనుకొని ఉన్న పల్లెలలో గ్రామీణ పారిశుధ్యంలో చెప్పుకోదగిన పురోగతి చోటుచేసుకొన్న సంగతిని కూడా ప్రధాన మత్రి దృష్టికి తీసుకువచ్చారు. గంగా నది శుద్ధి పనులపై ప్రజలలో జాగృతిని పెంపొందించవలసిన అవసరం ఉందని, అలాగే ఈ పనులలో వారి భాగస్వామ్యాన్ని పెంచాల్సిన ఆవశ్యకత ఉందని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు.
ప్రధాన మంత్రి కార్యాలయం, నీతి ఆయోగ్, జల వనరుల మంత్రిత్వ శాఖ, తాగు నీరు మరియు పారిశుధ్యం మంత్రిత్వ శాఖ, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగ లతో పాటు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి లకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.