పిఎంఇండియా
వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధీనంలోని పారిశ్రామిక విధానం మరియు ప్రోత్సాహాల విభాగానికి, సింగపూర్ ప్రభుత్వంలోని చట్ట మంత్రిత్వ శాఖ, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆఫీస్ ఆఫ్ సింగపూర్ (ఐ పి ఒ ఎస్)కు మధ్య ఇండస్ట్రియల్ ప్రాపర్టీ కో ఆపరేషన్ రంగంలో అవగాహన పూర్వక ఒప్పంద పత్రానికి (ఎమ్ ఒ యు) మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ ఎమ్ ఒ యు పై సంతకాలు సింగపూర్ ప్రధాని 2016, అక్టోబరు 4-7 తేదీల మధ్య భారత దేశ సందర్శనకు విచ్చేసినపుడు జరుగనున్నాయి.
పేటెంట్లు, ట్రేడ్ మార్కులు మరియు ఇండస్ట్రియల్ డిజైన్ లకు సంబంధించిన ఇండస్ట్రియల్ ప్రాపర్టీ రైట్స్ (ఐపిఆర్) రంగంలో ద్వైపాక్షిక సహకార కార్యకలాపాలకు ఎమ్ ఒ యు ఊతం అదించగలుగుతుంది. ఇరు ప్రాంతాలలోను నవకల్పనకు, సృజనాత్మకతకు మరియు సాంకేతిక విజ్ఞాన సంబంధ పురోగతికి ఈ ఎమ్ ఒ యు ఒక ఉత్తేజాన్ని అందించనుంది. ఎమ్ ఒ యు లో భాగంగా ఈ కింద పేర్కొన్న కార్యక్రమాలను ప్రాధాన్య ప్రాతిపదికన అమలు చేస్తారు.
• రెండు దేశాలలోను విద్యా సంస్థలు, వ్యాపారాలు, ప్రజా బహుళ్యంలో మేధో సంపత్తి సంబంధమైన జాగృతిని పెంపొందించేందుకుగాను అత్యుత్తమ పద్ధతులను, విజ్ఞానాన్ని పరస్పరం మార్పిడి చేసుకుంటారు.
• మేధో సంపత్తి రంగంలో ప్రావీణ్యం సంపాదించిన నిపుణులను అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు పంపుతారు.
• మేధోసంపత్తి సంబంధిత విజ్ఞానాన్ని, అత్యుత్తమ పద్ధతులను, అనుభవాన్ని ఇరు పక్షాలకు చెందిన చిన్న, మధ్యతరహా సంస్థలు, పరిశోధన మరియు అభివృద్ధి సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశ్రమల రంగం.. వీటన్నింటికీ మధ్య ఆదాన ప్రదానం చేసుకొంటారు.
• ఆధునిక తరహా ప్రాజెక్టుల అమలులోను, ఆటోమేషన్ అభివృద్ధిలోను ఒక దేశానికి మరొక దేశం సహకరించుకొంటాయి.
• స్థానిక ఐపి మరియు వ్యాపార సమాజాలకు మేధో సంపత్తి సంబంధిత శిక్షణను ఇవ్వడంలో భాగస్వామ్యం నెలకొల్పుకొంటారు.
నవకల్పన మరియు మేధో సంపత్తి సంబంధిత కార్యక్షేత్రాలలో భారతదేశం తాను సంపాదించిన అనుభవ సారాన్ని మార్పిడి చేసుకొనేందుకు ఎమ్ ఒ యు వీలు కల్పిస్తుంది. దీని ద్వారా ఇరు పక్షాల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు మరియు వ్యాపార సంస్థలు గణనీయంగా లాభపడేందుకు అవకాశం ఉంటుంది. రెండు దేశాలు అత్యుత్తమ పద్ధతులను ఇచ్చి పుచ్చుకోవడం భారతదేశానికి చెందిన మేధో సంబంధమైన ఉత్పాదనల శ్రేణి లోని వైవిధ్యాన్ని గురించిన ఎరుకను, తత్సంబంధిత రక్షణను మెరుగుపరచగలదు. ప్రపంచ శ్రేణి నవకల్పనలో ప్రధాన పాత్రధారిగా ఎదిగే దిశగా భారతదేశం సాగిస్తున్న ప్రయాణంలో ఈ ఎమ్ ఒ యు ద్వారా ఒక ప్రముఖమైన ముందంజను వేసినట్లు అవుతుంది. అంతేకాకుండా, జాతీయ మేధోసంపత్తి హక్కుల విధానం, 2016 లక్ష్యాలను సాధించడంలో కూడా ఇది తోడ్పడుతుంది.
***