పిఎంఇండియా

నేడు శ్రీ లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ జయంతి. అలాగే ఇవాళ ఆయనకు అత్యంత సన్నిహితులలో ఒకరైన శ్రీమాన్ నానాజీ దేశ్‌ముఖ్ శత జయంతి కూడా. ఈ ఇద్దరు మహనీయులూ వారి జీవితాలను ప్రజలకు అంకితం చేస్తూ పవిత్ర ప్రతిజ్ఞ చేశారు. ఆ ప్రతినను నెరవేర్చే క్రమంలో తమను తాము జన్మభూమికి అంకితం చేసుకొని, జీవితంలో ప్రతి క్షణాన్ని సహ దేశవాసుల సంక్షేమమే పరమావధిగా గడిపారు. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో యువతకు లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ స్ఫూర్తిప్రదాత. నాటి పోరాటంలో భాగంగా ‘క్విట్ ఇండియా’ ఉద్యమం 1942లో పతాక స్థాయికి చేరింది. మహాత్మ గాంధీ, సర్దార్ పటేల్ లు సహా గొప్ప నాయకులందరినీ బ్రిటిష్ ప్రభుత్వం జైళ్ల లోకి నెట్టింది. అటువంటి సమయంలో జయప్రకాశ్ గారు, లోహియా గారుల వంటి యువకులు ముందుకువచ్చి ఉద్యమ పగ్గాలను చేపట్టి యువతరంలో స్ఫూర్తిని నింపారు. ఒక ప్రజా నాయకుడుగా నాటి స్వాతంత్ర్య సంగ్రామంలో శ్రీ జయప్రకాశ్ యువతీయువకులకు ఉత్తేజాన్ని ఇచ్చే శక్తిగా మారారు. అయితే, స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత అనేక మంది దిగ్గజాలు అధికారంలో వాటా కోసం అన్వేషణలో పడితే అధికార రాజకీయాలకు దూరంగా ఉండిపోయింది జయప్రకాశ్ నారాయణ్ గారు ఒక్కరే. దేశం స్వేచ్ఛా వాయువులను పీల్చుకొన్న తరువాత శ్రీ జయప్రకాశ్ గారు, ఆయన భార్య ప్రభాదేవి గారులు గ్రామీణాభివృద్ధి, ప్రజా సంక్షేమ మార్గాన్ని ఎంచుకొన్నారు.
నానాజీ దేశ్‌ముఖ్ గారు.. దేశం కోసమే తన జీవితాన్ని అంకితం చేసినా ఆ రోజుల్లో దేశ ప్రజలకు ఆయన పెద్దగా పరిచయం లేని వ్యక్తి. శ్రీ జయప్రకాశ్ అవినీతిపై యుద్ధాన్ని మొదలుపెట్టారు. ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలోనూ అవినీతి పెచ్చరిల్లడంపై కలత చెందిన ఆయన అత్యవసర పరిస్థితికి ముందు కూడా మరో సారి విద్యార్థి ఉద్యమంతో మమేకమయ్యారు. అవినీతిపై గుజరాత్ లో యువతరం ప్రారంభించిన ఉద్యమంతో స్ఫూర్తి పొందిన ఆయన, మళ్లీ ప్రజా జీవితంలో ప్రవేశించారు. ఆ విప్లవం ఢిల్లీలో ప్రభుత్వాన్ని కుదుపేసింది. దీంతో శ్రీ జయప్రకాశ్ ను నిలువరించడానికి అనేక కుట్రలకు రూపకల్పన జరిగింది. ఇది శ్రీ జయప్రకాశ్ పై పట్నాలో భౌతిక దాడి దాకా వెళ్లింది. నగరంలో ఓ ప్రజా కార్యక్రమం సందర్భంగా నిరసన ప్రదర్శన సాగుతుండగా, దుండగులు ఒక్కసారిగా ఆయనపై దాడి చేశారు. ఆ సమయంలో నానాజీ దేశ్‌ముఖ్ ఆయన పక్కనే ఉన్నారు. శ్రీ జయప్రకాశ్ పై పడిన చావుదెబ్బకు ఆయన అడ్డుపడ్డారు. దీంతో ఆయన ఎముకలు విరిగాయి. అయినప్పటికీ శ్రీ జయప్రకాశ్ ను రక్షించడంలో సఫలమయ్యారు. అదిగో.. ఆ క్షణం లోనే దేశం మొత్తం నానాజీ దేశ్‌ముఖ్ వైపు ఆకర్షితమైంది. నానాజీ తన జీవితంలో తుది శ్వాస వరకూ దేశం కోసమే తపించారు. దీన్‌దయాళ్ పరిశోధన సంస్థ తో సంయుక్తంగా సాగించిన కృషిలో భాగంగా జీవిత భాగస్వాములు ఒక్క మాటపై నిలచి దేశం కోసమే జీవించడం ఎలాగో అనేక మంది దంపతులకు నేర్పారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేశం కోసం తాము ఎంచుకొన్న లక్ష్యాన్ని సాధించడంలో తిరుగులేని శిక్షణనిచ్చారు. ఈ సూత్రం ఆధారంగానే ఎందరో దంపతులను ఆహ్వానించారు. ఆయన పిలుపుతో వందలాది జంటలు ముందుకువచ్చాయి. వారందరికీ తగిన శిక్షణను, స్ఫూర్తిని ఇస్తూ గ్రామీణాభివృద్ధికి పాటు పడడం కోసం పంపారు. జనతా పార్టీ పాలనలో మొరార్జీ భాయ్ ప్రధాన మంత్రిగా ఉన్నపుడు కేంద్ర మంత్రివర్గంలో చేరవలసిందిగా నానాజీ దేశ్‌ముఖ్‌ను ఆహ్వానించారు. కానీ, మంత్రిమండలిలో చేరడానికి ఆయన సవినయంగా తిరస్కరించి లోక్‌నాయక్ శ్రీ జయప్రకాశ్ అడుగుజాడలను అనుసరిస్తూ 60 ఏళ్ల వయస్సు లో రాజకీయ జీవితానికి స్వస్తి చెప్పారు. ఆ తరువాత మిగిలిన జీవితంలో దాదాపు మూడు దశాబ్దాల పాటు గ్రామీణుల జీవితాల్లో వెలుగు నింపడం కోసమే అంకితమయ్యారు. ఆయన కృషికి చిత్రకూట్, గోండా కేంద్రం వంటివి ప్రత్యక్ష ఉదాహరణలు.
నేడు నానాజీ దేశ్‌ముఖ్ శత జయంతి సందర్భంగా అలాంటి మహనీయులు కన్న కలలకు అనుగుణంగా గ్రామీణాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక మహాత్మ గాంధీ చూపిన బాటలో ఈ దిశగా మనం ఎలా ముందుకెళ్లగలం; మన గ్రామాలను ఎలా స్వయంసమృద్ధం చేయగలం; పేదరికం నుండి, వ్యాధుల నుండి గ్రామాలను విముక్తం చేయడం ఎలా; చివరకు ఈ రోజుల్లో కూడా కులతత్వం మన గ్రామాలను నాశనం చేస్తోంది. ఆయా గ్రామాల ప్రజల కలలను ఛిద్రం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో కులతత్వానికి అతీతంగా ఆలోచిస్తూ గ్రామాల్లో సౌభాగ్యం నింపడమెలా ? తమ గ్రామ సంక్షేమం కోసం ప్రజలందరూ సమష్టిగా ప్రతినబూనే విధంగా… గ్రామం ప్రతి ఒక్కరినీ తనవెంట తీసుకెళ్లేలా చేయడం ఎలా ? ఈ ప్రశ్నలన్నిటికీ పరిష్కారం దిశగానే ప్రజా భాగస్వామ్యం ఆధారంగా గ్రామీణ వికాసానికి ఉత్తేజమిచ్చేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది.
నేడు.. గ్రామీణ జీవితాల గురించి యోచించే వారు, గ్రామీణుల జీవితాల మెరుగుకు తమ వంతు కృషిచేసిన వారు, గ్రామీణ వ్యవసాయ జీవితం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోని వివిధ అంశాలను ఔపోసన పట్టిన వారు 300 మందికి పైగా నిన్నంతా ఇక్కడ సమావేశమయ్యారు. వారంతా వివిధ బృందాలుగా ఏర్పడి ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా గ్రామీణాభివృద్ధి సాధనకు సంబంధించి విభిన్న అంశాలపై విస్తృతంగా చర్చించారు. అనుభవజ్ఞులైన వీరందరూ నిన్న మొత్తం ఈ సమస్యలపై లోతుగా చర్చించుకున్నారు. ఈ మధనం నుండి రూపొందించిన సారాంశాన్ని కొద్దిసేపటి ముందు వీడియో ద్వారా ప్రదర్శించే ప్రయత్నం చేశారు. అయితే, వారి చర్చల అనంతరం ఎంపిక చేసుకొన్న అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని వారికి నేను హామీ ఇస్తున్నాను. వీటిని ముఖ్యమైనవిగా భావిస్తూ పరిశీలించగల అంశాలను, అమలు చేయగల అంశాలను ప్రభుత్వ పథకాలలో చేరుస్తుంది. మొత్తంమీద చాలా ఏళ్ల తరువాత గ్రామీణ భారత జీవితాలపై ఇంత భారీ వేదికపై ఇంతటి విస్తృత స్థాయిలో చర్చలు సాగడం ముదావహం.
దేశంలోని వివిధ ప్రాంతాల నుండి చాలా మంది ఇక్కడికి వచ్చారు. వేరువేరు ప్రాంతాల స్వభావం వేరువేరు ఉంటుంది. వారి సమస్యలు, వారి వనరులు భిన్నం. ఆయా గ్రామాలకు నచ్చినట్లు, వాటి ధోరణికి అనుగుణంగా, వాటి స్వభావం తదితరాలకు తగినట్లు గ్రామీణాభివృద్ధిని వాటి మూలాలకు జోడిస్తే సుస్థిర అభివృద్ధికి హామీ లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో వెలుపలి నుండి తమపై రుద్దే అంశాలను స్వీకరించడానికి గ్రామీణ జీవితాలు సాహసించవు. ఆ విధంగా వెలుపలి శక్తి తరహాలో గ్రామీణ జీవితాలపై రుద్దేవన్నీ వైరుధ్యాలుగా రూపుదాలుస్తాయి. అందుకే ఒక గ్రామం బలమేమిటో, దానికే ప్రత్యేకమైన సామర్థ్యమేమిటో, గ్రామస్థులు దేనికి చిర పరిచితులో, వారికి అనువైంది ఏదో ముందుగా పరిగణనలోకి తీసుకుని సదరు గ్రామం అభివృద్ధికి ఒక నమూనా రూపకల్పనకు మేం కృషి చేస్తున్నాం. దీనికి చిన్న సవరణ అవసరం. ఇందుకోసం ఆర్థికపరమైన అంశాల, సాంకేతికపరమైన అంశాల దృష్టిలో ఒక సహాయక వ్యవస్థ కావాలి. దీనిని బలోపేతం చేసుకుంటూ మనం ముందుకు సాగితే గ్రామం కూడా దాన్ని సులభంగా స్వీకరిస్తుంది. తనంతట తానే స్వీయాభివృద్ధి దిశగా పయనించే బాధ్యతను పూర్తిగా చేపట్టి సుస్థిర ప్రగతికి భరోసానిస్తుంది.
మీ చర్చలు క్షేత్రస్థాయి వాస్తవాల పైనా, అందుకు కారణమైన అంశాల ఆధారంగా సాగాయి. గ్రామీణాభివృద్ధి సాధన కృషి ఎంత వేగంగా సాగాలో అంత వేగంగా సాగడంపై నేను విశ్వాసంతో ఉన్నాను. అయితే, అభివృద్ధి సాధించాలన్న ఆకాంక్ష ఒక్కటే ఇందుకు సరిపోదన్న వాస్తవాన్ని మనం గుర్తుంచుకోవాలి. నిర్దిష్ట వ్యవధి ప్రకారం మన కృషి కొనసాగితే, మన కార్యక్రమాల లక్షిత లబ్ధిదారుల కోసం వాటిని సంపూర్ణంగా అమలు చేస్తే, ఏ ఉద్దేశాలతోనైతే మనం పథకాన్ని ప్రారంభించామో అవి నీరుగారడం లేదా పక్కదోవ పట్టడం వంటివేవీ ఉండరాదు. అంతేకాకుండా ఒక కాలావధిని నిర్దేశించుకొని అమలు చేయడానికి మనం ప్రయత్నించాలి. అయితే, అది మొత్తం ఫలితం ప్రాతిపదికగా కాకుండా పర్యవసాన ఆధారితమై సాగాలి. మనం భారీగా నిధులిచ్చామంటే చాలదు; ఇటువంటి బడ్జెట్‌కు మనం నిర్దేశించుకున్న లక్ష్యం ఇదేనని, దీనిని మనం సాధించామనేదే ముఖ్యం. మనం సకాలంలో సమగ్రంగా కృషి చేస్తే 2022లో మనం 75వ స్వాతంత్ర్య దినోత్సవం చేసుకొనేటప్పటికి ప్రగతి పరుగు చాలా వేగం అందుకొంటుందన్న విశ్వాసం నాకుంది. దీనిని సుసాధ్యం చేస్తే గ్రామీణుల జీవితాల్లో గడచిన 70 ఏళ్లుగా అభివృద్ధి వేగం అంతంతమాత్రంగా ఉన్న నేపథ్యంలో తన కలలు సాకారం కావడం కోసం ఇంకా ఎదురుచూస్తున్న గ్రామీణ వ్యక్తి జీవితంలో మార్పులు తేవడం కూడా సాధ్యమవుతుంది. ఇవాళ పట్టణ పౌరులకు లభించే సదుపాయాలతో పల్లెల్లో తాము కూడా జీవించాలని గ్రామీణ పౌరులు ఆకాంక్షిస్తున్నారు. కాబట్టి నగరాల్లో లభ్యమయ్యే సౌకర్యాలన్నీ గ్రామాల్లోనూ అందుబాటులోకి రావాలి. నగరాలు విద్యుత్ వెలుగులతో ప్రకాశిస్తుంటే ఆ వెలుగులు పల్లెలకూ కావాలి. పట్టణ వాసులు ఎప్పుడు కావాలంటే అప్పుడు టీవీ చూడగలుగుతుంటే అదే సదుపాయాన్ని గ్రామీణ ప్రజలూ కోరుకుంటారు. నగరంలోని విద్యార్థి తన పాఠశాల లోని ప్రయోగశాలలో ఒక ప్రయోగం చేయగలిగితే.. అదే అవకాశం తమకూ ఉండాలని గ్రామీణ విద్యార్థులు ఆశిస్తారు. నగరంలోని విద్యార్థులు కంప్యూటర్ ద్వారా సాంకేతిక విద్య అభ్యసిస్తుంటే.. గ్రామీణ విద్యార్థులకూ అది అందుబాటులోకి రావాలి.
సాంకేతిక పరిజ్ఞాన రంగంలో పురోగమించడం కోసం వారికీ అదే అవకాశం దక్కాలి.
ఈ రోజుల్లో ఉపాధ్యాయులు గ్రామాల్లో నివసించటానికి ఇష్టపడడం లేదు. పల్లెల్లో పనిచేసే వైద్యులు రాత్రికల్లా పట్టణాల్లోని తమ ఇళ్లకు వెళ్లిపోవాలని కోరుకొంటున్నారు. అయితే, నగరాల్లో లభించే కొళాయి నీరు, ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ అందుబాటు, ఇంటర్ నెట్ సంధానత, 24 గంటల విద్యుత్తు, గ్యాస్ కనెక్షన్ ల వంటి సదుపాయాలన్నీ లభిస్తే- వీటన్నిటినీ కల్పించడంలో మనం సఫలమైతే- గ్రామీణుల జీవితాల్లో నాణ్యమైన మార్పులు చోటు చేసుకొంటాయి. ఆ పరిస్థితులు ఏర్పడినప్పుడు జనం గ్రామాల్లో ఉండే విధంగా ప్రోత్సహిస్తాయి. ఒక ఉపాధ్యాయుడు, ఒక వైద్యుడు, ఒక ప్రజా ప్రతినిధి గ్రామంలో నివసిస్తున్నట్లయితే గ్రామీణ జీవితంలో మార్పును తీసుకురావడానికి అదొక ప్రధాన ప్రేరణ అవుతుంది. అందువల్లనే మహాత్మ గాంధీ కలల బాటలో.. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ గారి ప్రబోధాన్ని అనుసరిస్తూ.. నానాజీ గారు, జయప్రకాశ్ నారాయణ్ గారుల జీవితాలను నడిపిన ఆశయాల అడుగుజాడల్లో సాగుతూ గ్రామీణ జీవితంలో మార్పులు తెచ్చే ఈ కీలక దిశగా ముందడుగు వేయడానికి మేం కృషి చేస్తున్నాం. ఈ ఆశయ స్రవంతిని సదా మదిలో ఉంచుకొని గ్రామీణ జీవితాల్లో మార్పు తెచ్చేదిశగా కృషి చేయడమే మా పరమావధి.
‘‘దేశంలో వనరుల కొరత వల్ల సమాజంలోని చివరి వ్యక్తికి ఏమీ ఇవ్వలేకపోయాం’’; నేడు కేంద్రంలో మా ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ వాదనతో నేను ఏకీభవించలేకపోతున్నాను. దేశంలోని చివరి వ్యక్తికీ హక్కులు దఖలు పరచాలన్న సంకల్పం ఉంటే మన దేశంలో వనరులకు కొరతేమీ ఉండదు. ఏదైనా కొరత ఉందంటే అది సుపరిపాలన లేకపోవడమే. సుపరిపాలన గల రాష్ట్రాల్లో వస్తున్న మార్పులను, ప్రభుత్వ యంత్రాంగం తమ బాధ్యతలను నిర్ణీత కాలావధిలో పూర్తి చేయడానికి కట్టుబడి ఉండడాన్ని మీరు గమనించవచ్చు. ఉదాహరణకు మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎమ్ఎన్ ఆర్ ఇజిఎ)లో ఒక విశిష్టత ఉంది. గ్రామీణ ప్రాంతాల పేదలకు ఉపాధి కల్పన కోసం ఈ పథకం రూపొందింది. కానీ, మన అనుభవం ప్రకారం పేదరికం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఈ పథకం కింద పనులు తక్కువగా జరిగాయి. అయితే, పేదరికం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో సదరు రాష్ట్రం చురుగ్గా వ్యవహరిస్తుంటే, అక్కడ సుపరిపాలన ఉన్నట్లయితే ప్రభుత్వాలు మరిన్ని పథకాలను రూపొందించి, మరింత అధిక సంఖ్యలో ప్రజలను వాటితో జోడించి.. అత్యధికంగా పనులు చేయిస్తున్నాయి. కాబట్టే గ్రామీణాభివృద్ధి కోసం సుపరిపాలనకు ప్రాధాన్యం ఇవ్వడానికి మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది.
నేడు వేలికొసల్లో సమాచారం లభ్యమయ్యే ఉపకరణాన్ని (డిజిటల్ డాష్‌బోర్డ్) ‘దిశ’ పేరిట మీకందరికీ అందుబాటులోకి తెచ్చాం. సుపరిపాలన దిశగా ఇదొక ముఖ్యమైన అడుగు. దీని సాయంతో ప్రతి అంశంపైనా కేంద్రీకృత పర్యవేక్షణ, నిర్దిష్ట వ్యవధిలో సమీక్ష చేపట్టవచ్చు. ఈ సందర్భంగా ఏవైనా లోటుపాట్లు వెల్లడైతే వెంటనే వాటిని సరిదిద్దే చర్యలు తీసుకోవాలి. ఒకవేళ విధానపరమైన సమస్య ఏదైనా ఉంటే ఆ విధానాన్ని సవరించాలి లేదా వ్యక్తివల్ల సమస్య ఎదురైతే సదరు వ్యక్తిని సరిదిద్దాలి. అయితే, ‘దిశ’వల్ల తొలి ప్రయోజనం.. ఈ పర్యవేక్షణ వ్యవస్థ దేశంలోని ప్రతి గ్రామంతో సంధానమవుతుంది. రెండోది.. ప్రభుత్వ దార్శనికతను, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ఓ క్రమంలో ఆవిష్కరించగలిగితే.. వాటికి మనం ప్రాధాన్యం ఇస్తున్నట్లయితే.. వాటి అమలులో మన పార్లమెంటు సభ్యులను, జిల్లా యంత్రాంగాలను ఒక ఉమ్మడి చట్రంలోకి తెస్తే, మనం ఆశించిన ఫలితాలను కచ్చితంగా సాధించగలం. కాబట్టే దిశ డాష్‌బోర్డు ద్వారా ప్రజా ప్రతినిధులను చురుగ్గా అనుసంధానించే కీలక కృషిని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. పార్లమెంటు సభ్యులు జిల్లా యంత్రాంగాలతో కూర్చొని ఈ పథకాలను సమీక్షించవచ్చు. అవసరాలకు అనుగుణంగా ప్రాథమ్యాలను నిర్ణయించే వీలు ఉంటుంది. అప్పుడు పైనుండి రుద్దటమంటూ ఉండదు. అందుకే కార్యకలాపాలను వేగవంతం చేయడంలో ఇది ఘన విజయాన్ని సాధించింది.
ప్రజాస్వామ్య విజయమంటే కేవలం ఎందరు ప్రజలు వోటు వేయడానికి వెళ్తున్నారు.. ఎందరు బ్యాలెట్ పెట్టెల్లో వోట్లు వేశారన్నది కాదు. దురదృష్టవశాత్తూ ఐదేళ్లకు ఒకసారి పోలింగ్ కేంద్రాలకు వెళ్లడం, బ్యాలట్ పేపర్‌ను పెట్టెలో వేయడం లేదా బటన్ ను నొక్కడం అన్న వాటికే అనేక సంవత్సరాలుగా మన ప్రజాస్వామ్యం పరిమితమైంది. అటుపైన ఏ ప్రభుత్వం ఎన్నికైనా, ఏ స్థానిక సంస్థ లేదా పంచాయతీ పాలకవర్గం ఎన్నికైనా ఐదేళ్ల పాటు అదే మన తలరాతను రాస్తుంది. ప్రజాస్వామ్యం ఇందుకు మాత్రమే పరిమితమని పరిగణించరాదన్నది నా భావన. ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమైన కర్తవ్యం మనం కోరుకొన్న ప్రభుత్వాన్ని ఎన్నుకోవడమే. అయితే, ఆ దేశ ప్రజల భాగస్వామ్యంతో పరిపాలన సాగినప్పుడే ప్రజాస్వామ్యం విజయవంతమవుతుంది. అలాగే గ్రామాభివృద్ధి వైపు పయనం ప్రజా భాగస్వామ్యంతోనే సాగాలి. పట్టణాభివృద్ధి దిశగా ప్రయాణంలో ప్రజలూ భాగస్వాములు కావాలి. ఇలా జరగాలంటే ప్రభుత్వం- ప్రజల మధ్య సంభాషణ చాలా ముఖ్యం. జీవనం గురించిన చర్చ చాలా అవశ్యం.
సరైన మార్గదర్శకాలు పైనుండి కిందకు ప్రవహిస్తే, సవ్యమైన సమాచారం కింది నుండి పైకి సరఫరా కావాలి. ఈ ద్విముఖ మార్గం పరిపూర్ణమైందిగా ఉంటే ప్రణాళికలు, విధానాలు, బడ్జెట్ కేటాయింపులు.. అన్నిటినీ నిర్దిష్ట లక్ష్యంవైపు గురిపెట్టవచ్చు. ఈ నేపథ్యంలో నేడు ఒక మొబైల్ యాప్ ద్వారా ఓ గ్రామీణుడు తన మొబైల్ సాయంతో కచ్చితమైన సమాచారం పంపగలడు. అలాగే పైనుండి కింది స్థాయికి చివరకు వరుసలో ఆఖరున గల వ్యక్తికి కూడా కచ్చితమైన మార్గదర్శకాలను నిర్దేశించవచ్చు. దీనివల్ల స్థానిక సంస్థ అయినా, అదీ ఒక ప్రభుత్వ సంస్థే కాబట్టి దానిపైనా ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే.. ‘‘అయ్యా, మీరు ఈ పథకం గురించి ఇలా చెప్పారు. కానీ, నా మొబైల్ ఫోన్ మాత్రం ఈ పథకం ఇందుకు భిన్నమంటోంది. మరి ఇక్కడ ఈ పథకాన్ని ఎందుకు అమలు చేయడంలేదో నాకు చెప్పండి’’ అని గ్రామస్థుడు నిలదీస్తాడు గనుక! ఈ మొబైల్ యాప్ వినియోగ సాంకేతికత ద్వారా ప్రజలతో పరస్పర చర్చను మెరుగుపరచుకొంటూ, ప్రజానీకం అవసరాలను అర్థం చేసుకొంటూ వారిలో అవగాహన పెంచి, పని గురించి నిర్దేశించగలిగేలా చేయడమన్నది అత్యంత సంక్లిష్ట కర్తవ్యం. అయినప్పటికీ దీన్ని నెరవేర్చడానికి మేం శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాం.
దేశవ్యాప్తంగా ఇవాళ కూడా అనేక ప్రారంభోత్సవాలు జరుగుతుంటాయి. అదేవిధంగా వ్యవసాయ శాఖకు అత్యంత ప్రధానమైన ఫినోమిక్స్ కేంద్రానికీ ప్రారంభోత్సవం జరిగింది. దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం, పశు పోషణ రంగాలు కీలకమైనవి. అయితే, వాటితో పాటు మన గ్రామీణ హస్తకళాకారులు కూడా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో భారీగా సహకరించవలసివుంది. అందుకే వ్యవసాయమైనా, పశు పోషణ అయినా, చేనేత లేదా హస్తకళలతో ముడిపడిన వారైనా.. వాటన్నింటినీ జతచేసి, మన ఆర్థిక వ్యవస్థ మూల స్తంభాలను పటిష్ఠం చేసేందుకు కృషి చేస్తున్నాం. మన దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవం చేసుకోబోయే 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని కంకణం కట్టుకుని ఆ దిశగా శ్రమిస్తున్నాం. ఇందుకోసం మనం ఇటు రైతుకు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడంతో పాటు అటు రైతు నుండి ఉత్పాదకతను పెంచడానికి ప్రయత్నించాలి. ఈ రెండు విషయాల్లో మనం ముందడుగు వేయాలంటే ఆధునికతవైపు అడుగు కదపాలి.. సాంకేతిక పరిజ్ఞాన సాయం తీసుకోవాలి. ఇక పశుపోషణ మాటకువస్తే… పశు గణం సంఖ్య తక్కువగా ఉన్నా పాల దిగుబడి అధికంగా ఉండాలి. తలసరి పాల ఉత్పత్తిలో మనం ఎంతగా ముందుకెళ్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అది మరింత సహాయకారి అవుతుంది.
ప్రపంచవ్యాప్తంగా రసాయన మైనానికి బదులు తేనెటీగల మైనానికి గిరాకీ పెరుగుతోంది. నేడు అంతర్జాతీయంగా అధికశాతం జనం రసాయన మైనం స్థానంలో తేనెటీగల మైనానికి ప్రాధాన్యమిస్తున్నారు. అందువల్ల గ్రామాల్లో తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులు శాస్త్రీయ పద్ధతిలో దీన్ని పశుపోషణకు జోడిస్తే అదనపు ఆదాయానికి అవకాశాలు కూడా పెరుగుతాయి. రసాయనిక మైనాన్ని వదిలించుకోవాలని ప్రపంచం భావిస్తున్న నేపథ్యంలో తేనెటీగల మైనానికి నేడు విపరీతమైన గిరాకీ ఉంది. అందుకు తగినట్లు ఈ మైనానికి గల అతి పెద్ద విపణిని చేజిక్కించుకోగల సామర్థ్యం భారతదేశానికి ఉంది. కాబట్టి ఆ దిశగా మనం వేగంగా కదలాలి.
చేపల పెంపకం.. కోళ్ల పరిశ్రమ.. పశుపోషణ లేదా వ్యవసాయం ఏదైనా కావచ్చు.. వాటికి కలప పెంపకాన్నిజోడించాలి. పశుపోషణ లేదా వ్యవసాయంతో పాటు పొలం గట్ల మీద కలప సాగును సైతం ప్రారంభిస్తే మన దేశం కలపను దిగుమతి చేసుకొనే అవసరం తప్పుతుంది. దాంతో పాటు మన రైతులే కలప విక్రయంతో ఆదాయార్జన ద్వారా కుటుంబాలలో ఆర్థిక సంక్షోభం లేకుండా చూసుకోవచ్చు. ఓ ఐదేళ్లు లేదా పదేళ్లు కష్టపడితే చాలు… ఆ తరువాత ఫలితాలు వాటంతటవే రావడం మొదలవుతుంది. అటువంటి సమగ్ర, సమీకృత విధానంతో గ్రామీణాభివృద్ధిని విస్తరించేందుకు మేం కృషి చేస్తున్నాం.
నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలనే తలంపుతో మనం ఏదైనా పని ప్రారంభిస్తాం. మన గ్రామీణ జీవితాల్లో ఇంతకు ముందు మురికి, దుమ్ము ఓ భాగంగా ఉండేవి. గ్రామీణులు తమ తలరాత అంతేననిభావించి, వాటిని భరించడం అలవాటు చేసుకున్నారు. అయితే, క్రమంగా వారిలో అవగాహన పెరగడంతో వారిలో మార్పు ప్రారంభం కావడం చూసి నేను ఎంతో సంతోషిస్తున్నాను. గ్రామీణ ప్రాంతాల్లోని తల్లులు, ఆడపడుచుల ఆత్మగౌరవం లక్ష్యంగా బహిరంగ విసర్జన రహిత గ్రామాల ప్రచార కార్యక్రమం ప్రారంభించాం. దాంతో పాటు నిర్దేశిత వ్యవధిలో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసేలా మరో కార్యక్రమాన్నీ చేపట్టాం. తత్ఫలితంగా ఇవాళ పరిస్థితిలో క్రమంగా మార్పు వచ్చింది. నిన్నటి దాకా మనం మరుగుదొడ్లుగా పిలుస్తున్న వాటిని నేడు ‘ఆత్మగౌరవ నిలయం’గా పిలుస్తున్నారు. ఆ మేరకు వాటి గోడలపై పేరు కూడా రాస్తున్నారు. నిజంగా తల్లులకు, ఇంటి ఆడపడుచుల కోసం మరుగుదొడ్లు కట్టించడం ద్వారా వారి గౌరవాన్ని కాపాడడం కన్నా గొప్ప బహుమతి మరేముంటుంది ? వారు ఒకవైపు పొద్దస్తమానం పనిచేస్తూ మరోవైపు కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం ఎప్పుడు చీకటి పడుతుందా అని ఎదురుచూసే దు:స్థితి.. లేదంటే సూర్యోదయం లోగానే ఆ అవస్థల నుండి విముక్తం కావాల్సిన దురవస్థ. ఈ రెండు సమయాల్లో కాకుండా పగటివేళ కాలకృత్యాలు తీర్చుకోవలసిన అగత్యం ఏర్పడితే వారికది నరకమే కదూ! ఈ కష్టం ఎలాంటిదో మనకు అనుభవంలోకి రాకపోతే బహిరంగ విసర్జన రహిత ఉద్యమం ఎన్నటికీ విజయవంతం కాదు. మరుగుదొడ్డి నిర్మాణం సంగతి ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా మన ఇంటి తల్లులు, ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని, వారి సమస్యలను జ్ఞప్తికి తెచ్చుకోండి. అప్పుడు మీరు కూడా ఇతర పనులన్నీ పక్కనబెట్టి నేను మొట్టమొదట కేంద్ర ప్రభుత్వ పథకం కింద మరుగుదొడ్డి నిర్మించి, ఉపయోగించడం ప్రారంభించాలి అనే నిర్ణయానికి వస్తారు.
దేశంలో నేడు 2.5 లక్షలకు పైగా గ్రామాలు బహిరంగ విసర్జన రహితం కావడానికి ముందుకు రావడమే కాదు.. ఆ లక్ష్యాన్ని సాధించాయి. ఆ గ్రామాలను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వారు తమ తల్లులు, ఆడపడుచుల ఆత్మగౌరవం కోసం ఓ పెద్ద ముందడుగు వేశారు. ఇలా తమ ఇంటి మహిళలను గౌరవించే గ్రామాలే నా దృష్టిలో గౌరవప్రదమైన గ్రామాలు. ఈ ముఖ్యమైన కార్యం సాధించిన గ్రామస్థులకు, గ్రామాలకు నేను శిరస్సును వంచి అభివాదం చేస్తున్నాను. ఇవాళ పరిశుభ్రత గ్రామాల సహజ స్వభావంగా మారింది. వారు బాధ్యతలను స్వీకరించడం కూడా ప్రారంభించారు.
స్వతంత్రం వచ్చిన 70 ఏళ్ల తరువాత కూడా దేశంలో అనేక గ్రామాలు చీకట్లో మగ్గుతున్నాయి. 18 వేల గ్రామాలు ఇంకా 18వ శతాబ్దపు పరిస్థితుల్లో అల్లాడుతున్నాయి. విద్యుత్ స్తంభం… బల్బు మాట అటుంచి ఈ గ్రామాలకు విద్యుత్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. అందుకే ఎర్రకోట నుంచి ఎంతో చొరవతో నేను ప్రకటించాను.. 18 వేల గ్రామాలను వెయ్యి రోజులలో విద్యుత్ వెలుగులతో నింపుతానని హామీ ఇచ్చాను. ఈ కృషిలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కలిసివచ్చి దీనిని మరింత వేగవంతం చేశాయి. తదనుగుణంగా ఇప్పటికే లక్ష్యం వైపు వేగంగా దూసుకెళ్తే 15వేల గ్రామాలను విద్యుదీకరించామని చెప్పడానికి నాకెంతో సంతోషంగా ఉంది. గ్రామాలకు విద్యుత్ సదుపాయం కల్పించడంతో సరిపోదు.. మేం అక్కడే ఉండిపోదలచుకోలేదు. అది పల్లెలో ఇల్లయినా, పట్టణం లోని గృహమైనా లేదా ఏ చిన్న పూరిల్లయినా ప్రతి కుటుంబానికీ విద్యుత్ కనెక్షన్, ఇంటింటికీ బల్బు ఉండాలని కలలుగంటున్నాం. అంతేకాదు.. 24 గంటలూ సరఫరా ఇవ్వాలన్నదీ మా ఆలోచన. ఈ బృహత్కార్యాన్ని తలకెత్తుకున్నాం. అ యితే, పేదలు విద్యుత్ కనెక్షన్ కోసం డబ్బు చెల్లించే అవసరం లేకుండా ఉచిత కనెక్షన్ ను ఇవ్వాలని నిర్ణయించాం. విద్యుత్ సౌకర్యం ఏర్పడిందంటే ఇక జీవనశైలి మారడం తథ్యం. అది వారి పిల్లల చదువులకు మరింత సదుపాయం కల్పిస్తుంది. ఇళ్లలో వారి నిస్సారమైన జీవనశైలిలో మార్పు వస్తుంది. ఆ మేరకు నిరంతర విద్యుత్ సరఫరాపై మా దృఢ నిర్ణయం అమలు దిశగా ముందంజ వేస్తున్నాం. అలాగే, గ్రామీణ ప్రజా జీవనం మార్పు దిశగా వారు ఉత్పత్తి చేసే వస్తువులకు నగరాల్లో అలంకరణ ప్రాధాన్యం పెరగాలి. పల్లెల్లోని సామాన్యులు తయారు చేసిన వస్తువులు నగరాల్లోని పెద్ద భవంతులలో కొలువుదీరితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు చేయూత లభిస్తుంది. దీపావళి పండుగకు మీరు మట్టి ప్రమిదలు కొనుగోలు చేస్తే వాటిని తయారు చేసిన కుమ్మరుల ఇంట దీపావళి వెలుగులు నిండుతాయి. ఇక ప్రమిదలు కొనుగోలు చేయడం మనకు పెద్ద కష్టమైన పనేమీ కాదు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని నగరాలలో నివసించే మనమంతా మన అవసరాలను తీర్చుకోవడం ప్రారంభిస్తే మనకూ ఓ కొత్తదనం అనుభవంలోకి వస్తుంది. దాంతో పాటు సంతృప్తి కూడా కలుగుతుంది. అందువల్ల గ్రామాలకు నగరాలే విపణి ప్రదేశాలు కావాలి. గ్రామాల నుండి వచ్చే ఆహారధాన్యాలు, కూరగాయలు వంటి వాటికి మాత్రమే పట్టణాలు విపణులు కావు. గ్రామాల్లో ఉత్పత్తి అయ్యే ప్రతి వస్తువుకూ పట్టణం మార్కెట్‌గా మారితే నా దేశంలో ఏ గ్రామమూ పేదరికంలో ఉండదు. పల్లెలోని ఏ కుటుంబమూ పేదరికంలో ఉండిపోదు. తద్వారా దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ గారు కలలుగన్న అంత్యోదయ లక్ష్యం సాకారమవుతుంది. నానాజీ దేశ్‌ముఖ్ గారి శత జయంతి సందర్భంగా ప్రభుత్వం ఒక తపాలా బిళ్లను విడుదల చేసింది. ఈ తపాలా బిళ్ల ప్రజలకు చేరితే, ఆయన గురించి మరింతగా తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తి కనబరుస్తారు. జాతి కోసం జీవించడమే పరమావధిగా, గ్రామీణ జీవనోద్ధరణ ధ్యేయంగా, ఇతరుల కోసం తనంతట తానే ప్రయోగాలు చేపట్టగల మహనీయుడాయన! నానాజీ గారు గ్రామాలలో తన పని ప్రారంభించాక సర్పంచులుగా బాధ్యతలు స్వీకరించిన వారంతా ఆ పనిలో సదా ఆయనకు సహకరిస్తుండే వారు. నానాజీ గారు చేపట్టిన పనిని ప్రశంసిస్తూ ఆయన చేతుల్లో రూపుదిద్దుకొన్న పథకాలను గురించి తెలుసుకొనే వారు. ఇవాళ ఆయన శత జయంతి సందర్భంగా దేశం నలుమూలల నుండి జనం తరలివచ్చారు. సంబంధిత ప్రభుత్వ శాఖలన్నీ ఏకమై గ్రామీణ జీవితాల్లో మార్పుతు తెచ్చేందుకు దృఢ సంకల్పంతో ముందుకువెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించుకొనే 2022 కల్లా తమ గ్రామం కోసం, దేశానికి తమ వంతు మేలు చేసే దిశగా ప్రతి గ్రామం, ప్రతి గ్రామస్థుడూ- విడివిడిగా, కలివిడిగా ఏదో ఒక లక్ష్యం నిర్దేశించుకుని దాన్ని సాధిస్తామని పవిత్ర ప్రతిజ్ఞ చేయాలి.
ఈ పవిత్ర శపథంతో మనం ముందుకు కదిలితే గ్రామోద్ధరణ స్వప్న సాధన లక్ష్యంగా మనం ప్రారంభించిన ప్రయాణం విజయవంతం అవుతుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను నేను కొద్దిసేపటి కిందట చూశాను. అక్కడి చాలా వస్తువుల గురించి ఇక్కడికి వచ్చిన వారికి చాలా చెప్పవచ్చు. విజయవంతమైన ప్రయోగాల గురించి ఈ ప్రదర్శనలో ఉదాహరణలు ఉన్నాయి; వాటిని అర్థం చేసుకోవడానికి నేను ఆసక్తి చూపాను. చాలా చోట్ల ఆగి గమనించాను; చూస్తూ.. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. ప్రతి రాష్ట్రంలో ఏ రకమైన ప్రయోగాలు చేశారో, ఎలాంటి కొత్త చర్యలు తీసుకున్నారో చూసి ఆనందించాను. గ్రామాల్లోకి సాంకేతిక పరిజ్ఞానం ఎలా చేరిందో చూశాను.. వీటన్నిటినీ చూడటం నాకెంతో ఆనందం కలిగించింది. మీరెంత తీరిక లేకుండా ఉన్నప్పటికీ, మీరెంత త్వరగా వెళ్లాల్సి ఉన్నప్పటికీ ఈ ప్రదర్శనలో ప్రతి ఒక్కటీ దయచేసి క్షుణ్నంగా వీక్షించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే సంబంధిత వ్యక్తుల ఫోన్ నంబర్ వంటి వివరాలను స్వీకరించాలని కోరుతున్నాను. ప్రదర్శనలోని అంశాల్లో మీ గ్రామానికి తగినవి ఏవి ? వీటిని మీ గ్రామాలకు ఎలా అనువర్తింపజేస్తారు ? మనం ఏదైనా స్వయంగా చూస్తే అందులోని సామర్థ్యం ఏమిటో మనకు పూర్తిగా అర్థమవుతుంది. అందుకే, ఈ ప్రదర్శనలో కొన్ని గంటలు గడపండని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్కదానినీ నిశితంగా పరిశీలించండి.. వాటిలో ఉత్తమమని భావించిన వాటిని మీ గ్రామాలకు వర్తింపజేయండి. ఈ సందర్భంగా నేను మరొక్క మారు నానాజీ గారికి వందనం చేస్తున్నాను. బాబూ జయప్రకాశ్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అన్ని గ్రామాల నుండీ ఇక్కడికి తరలివచ్చిన చక్కటి సమాచారం కలిగివున్నటువంటి నా సోదర సోదరీమణులకు అభినందనలతో పాటు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
***
Today, we pay tributes to the great Loknayak JP and Nanaji Deshmukh, who worked closely with JP. Both these individuals distinguished themselves and devoted their lives towards the betterment of our nation: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 11, 2017
Loknayak JP was deeply popular among youngsters. The likes of Loknayak JP and Dr. Lohia were active during the 'Quit India' movement, inspired by the clarion call of Mahatma Gandhi. JP was never interested in power politics: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 11, 2017
Loknayak JP fought corruption in the nation. His leadership rattled those in power that time and during a march he was even attacked. At that time, standing shoulder to shoulder with him was Nanaji Deshmukh: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 11, 2017
When Janata Government was formed in 1977, Nanaji Deshmukh was requested to join the Government as a Minister but he did not do so. He followed JP and preferred to devote himself towards rural development and making our villages self-reliant, free from poverty: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 11, 2017
Just having the best ideas for development are not enough. Initiatives have to be completed on time and the fruits of development must reach the intended beneficiaries. Efforts have to be comprehensive and 'outcome driven' not 'output driven' : PM @narendramodi
— PMO India (@PMOIndia) October 11, 2017
Facilties that are associated with cities must also be made available to our villages: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 11, 2017
Strength of a democracy cannot be restricted to how many people vote. Yes, that is important but the real essence of a democracy is Jan Bhagidari and integrating people in the development journey of cities, villages. Regular Samvad with governments is required: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 11, 2017
Lack of sanitation facilities is adversely impacting the development journey of villages. That is why we have been working to overcome this and build toilets in rural areas: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 11, 2017