Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నిత్యావ‌స‌ర వ‌స్తువుల చ‌ట్టం, 1995 కింద నియంత్ర‌ణ విధింపు ఉత్త‌ర్వుల చెల్లుబాటు ఏడాది పొడిగింపు


ప‌ప్పు ధాన్యాలు, వంట నూనెలు, నూనె గింజ‌ల‌కు సంబంధించి గ‌తేడాది సెప్టెంబ‌రు 30వ తేదీన జారీ చేసిన కేంద్ర ఉత్త‌ర్వుల‌(ఆర్డ‌ర్ నెంబ‌రు. ఎస్‌.వో.2559(ఈ)) చెల్లుబాటును ఏడాది పొడ‌గించేందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ నేప‌థ్యంలో గ‌తంలో జారీ చేసిన‌ ఉత్త‌ర్వులు అక్టోబ‌రు 1, 2015 నుంచి సెప్టెంబ‌రు 30, 2016 వ‌ర‌కు చెల్లుబాటు అవుతాయి.

కేబినెట్ తీసుకున్న తాజా నిర్ణ‌యంతో రాష్ట్రాలు పైన పేర్కొన్న‌ నిత్యావ‌స‌రాల వాణిజ్యాన్ని నియంత్రించే, 1995 నిత్యావ‌స‌ర వ‌స్తువుల చ‌ట్టం కింద ప‌టిష్ఠ చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంటుంది. న‌ల్ల బ‌జారుకు స‌ర‌కును త‌ర‌గించ‌డం, కృత్రిమ కొర‌త‌ను సృష్టించి అధిక లాభాలు ఆర్జించ‌డాన్ని క‌ట్ట‌డి చేసేలా స్టాక్ ప‌రిమితి / లైసెన్సింగ్ లాంటి ప‌రిమితులను రాష్ట్రాలు విధించొచ్చు. కేబినెట్ తీసుకున్న నిర్ణ‌యం దేశీయ మార్కెట్ల‌లో త‌గినంత మేర నిత్యావ‌స‌రాలు అందుబాటులో ఉండేందుకు, ధ‌ర‌ల‌ను నియంత్రించేందుకు దోహ‌ద‌ప‌డుతుంది.

ప‌ప్పు ధాన్యాలు, ఉల్లి గ‌డ్డ‌లలాంటి నిత్యావ‌స‌ర వ‌స్తువులు మార్కెట్‌లో సాధార‌ణ ధ‌ర‌ల‌కే ల‌భించేలా ప్ర‌భుత్వం ప‌లు విధానాలు, చ‌ర్య‌ల‌ను తీసుకుంది. కంది ప‌ప్పు, మినప ప‌ప్పు న‌కు సంబంధించిన వాణిజ్యాన్ని నిలిపివేసింది. ప‌ప్పు ధాన్యాల ఎగుమ‌తిని నిషేధించింది. దిగుమ‌తుల‌పై సుంకాన్ని పూర్తిగా తొల‌గించింది. ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ ప‌థ‌కం కింద స‌హ‌కారం అందించేందుకు వీలుగా ప‌ప్పు ధాన్యాల‌ను ఇందులో చేర్చింది. దేశీయ మార్కెట్ల‌లో కంది ప‌ప్పు, మినప ప‌ప్పు ల‌ను అందుబాటులోకి ఉంచేందుకు వీలుగా 5 వేల ట‌న్నుల చొప్పున దిగుమ‌తుల‌కు ఆదేశాలు ఇచ్చింది. ఈ దిగుమ‌తులు త్వ‌ర‌లోనే దేశంలోకి రానున్నాయి. దీంతో ధ‌ర‌ల ప‌రిస్థితి ఆశావహంగా మారుతుంది.