పిఎంఇండియా
నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ (సవరణ) ఆర్డినెన్స్, 2015 ప్రతిపాదనకు ప్రధాని శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది.
నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం, 1881( ది ఎన్ ఐ యాక్ట్)కు చేయాల్సిన సవరణల ప్రతిపాదనలు ఏం చెబుతున్నాయో చూద్దాం. ఎన్ ఐ యాక్ట్ లోని సెక్షన్ 138 కిందకు వచ్చే నేరాలకు సంబంధించిన కేసుల న్యాయపరిధి విషయంలో స్పష్టతకోసం ఉద్దేశించినవే ఈ ప్రతిపాదనలు.
చెల్లని చెక్కులకు సంబంధించి విచారణలో ఉన్న కేసుల న్యాయపరిధిపై స్పష్టత వచ్చిందంటే అది తప్పకుండా ఆర్థిక సాధనంగా ఉన్న చెక్కు విశ్వసనీయతను పెంచుతుంది. దేశంలోని వ్యాపార వాణిజ్య రంగాలకు ఇది మంచి పరిణామమవుతుంది. బ్యాంకులతో సహా రుణాలనిచ్చే సంస్థలు ఎలాంటి బెరుకు లేకుండా పని చేయగలుగుతాయి. చెల్లని చెక్కులనిచ్చి రుణాలను ఎగవేయడం జరుగుతుందనే భయం లేకుండా అవి తమ కార్యకలాపాలు నిర్వహించుకోగలుగుతాయి.
ఎన్ ఐ యాక్ట్ సెక్షన్ 138 కిందకు వచ్చే చెల్లని చెక్కు కేసుల న్యాయపరిధి ఏ ప్రాంతానికి చెందినదనే విషయాన్ని నిర్ణయించే చట్టపరమైన వ్యవస్థను తొందరగా నెలకొల్పుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందుకోసం ఉద్దేశించిన చట్టాన్ని నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ (సవరణ) ఆర్డినెన్స్, 2015 ద్వారా సవరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఆర్డినెన్స్ లక్ష్యం ఇలా ఉంది. చెల్లని చెక్కుల కేసులో ఫిర్యాదుదారుని ఆందోళనల్ని పరిగణలోకి తీసుకుంటూ సరైన విచారణ జరిగేలా చూడడానికి గాను న్యాయపరిధి ప్రాంతంపై స్పష్టత తేవాలనేది లక్ష్యం. ఆర్డినెన్స్ అనేది బిల్లులాంటిదే. ఎందుకంటే ఎన్ ఐ యాక్ట్, సెక్షన్ 138 కిందకు వచ్చే కేసుల న్యాయ పరిధిని నిర్ణయించే ప్రధానమైన నియమం యథాతథంగా ఉంటుంది. అయితే ఆర్డినెన్స్లో మరో రెండు అంశాలు పొందుపరచడం జరిగింది. అవి చెక్కు చెల్లింపులకు సంబంధించినవి. 1. అకౌంట్ ద్వారా చెల్లించాలని కోరుతూ చెక్కును బ్యాంకుకు సబ్మిట్చేయడం 2. ఏ బ్యాంకు చెక్కును ఇచ్చారో ఆ చెక్కును ఆ బ్యాంకుకు సంబంధించిన ఏదైనా బ్రాంచికి వెళ్లి కౌంటర్లో ఇవ్వడం ద్వారా నగదును కోరడం అనే ఈ రెండు అంశాలు ఆర్డినెన్స్లో చేర్చడం జరిగింది.
నేపథ్యం
ఎన్ ఐ చట్టంలోని సెక్షన్ 138 ఏం చెబుతుందంటే….అప్పు తీర్చాలనుకున్నవారు అందుకుగాను ఇచ్చే చెక్కు, వారి అకౌంటులో తగినంత డబ్బు లేకపోవడంతో చెల్లని చెక్కు అవుతుంది. ఇలాంటప్పుడు అప్పు ఇచ్చినవారు కేసులు పెడతారు. ఈ నేరాలకు సంబంధించినదే ఈ సెక్షన్. దీనివల్ల చెక్కు అనే ఆర్థిక సాధనానికి వున్న విశ్వసనీయత తగ్గిపోతుంది. ఈ విశ్వసనీయతను పెరిగేలా చేయడానికి ఉద్దేశించినదే ఎన్ ఐ చట్టం. దీనివల్ల సాధారణ వ్యాపార లావాదేవీలు, బాధ్యతల నిర్వహణకు ఎలాంటి ఢోకా ఉండదు. సెక్షన్ 138 కిందకు వచ్చే కేసుల న్యాయపరిధి విషయంలో ఈ మధ్యనే సుప్రీంకోర్టు వివరణ (ఇంటర్ప్రిటేషన్) ఇచ్చింది. దీనివలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు పలు ఆర్థిక సంస్థలు చెబుతున్నాయి. చెక్కు ఇచ్చిన వారి (డ్రాయర్) బ్యాంకు ఏ ప్రాంతంలో ఉందో ఆ ప్రాంతమే ఈ కేసుల న్యాయపరిధిగా సుప్రీంకోర్టు వివరణ ఇచ్చింది. తద్వారా అప్పులు ఇచ్చిన వారికి ఇబ్బందులు వస్తున్నాయి. వీటిని తొలగించడానికిగాను ప్రతిపాదన చేయడం జరిగింది. సెక్షన్ 138 కిందకు వచ్చే నేరాల పరిధిని స్పష్టంగా నిర్వచించాలనేదే ఈ ప్రతిపాదన. అందకనుగుణంగా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ (సవరణ) బిల్లు, 2015 (ది బిల్)ను 2015 మే 6వ తేదీన లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది.అది మే 13, 2015న లోక్సభలో పాసయింది. అయితే అదే రోజున అంటే మే 13, 2015న రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడడంతో ఈ బిల్లు రాజ్యసభలో చర్చకు రాలేదు, పాసు కాలేదు. దాంతో ఈ బిల్లు చట్టం కాలేదు.
చెక్కును తీసుకున్నవారు దాన్ని ప్రజెంట్ చేసిన బ్యాంకు ఏ కోర్టు పరిధిలో ఉంటే అదే ఈ కేసులకు సంబంధించిన న్యాయపరిధిగా తాజాగా లోక్సభలో ప్రవేశపెట్టబడి పాసయిన ఈ బిల్లు పేర్కొంటోంది. అంతే కాదు ఫిర్యాదు తర్వాత దానివలన ఉత్పన్నమయ్యే ఇతర ఫిర్యాదులు కూడా ఇదే కోర్టు పరిధిలోకి వస్తాయి.
చెక్కులు ఇచ్చినవారిపై ఒకటికంటే ఎక్కువ కేసులు వివిధ కోర్టుల్లో విచారణకు వచ్చి ఉంటే ఆ విషయం ఆ వివిధ కోర్టుల దృష్టికి వస్తే వెంటనే ఆ కోర్టులు ఆ కేసులను కొత్తగా న్యాయపరిధిలోకి వచ్చిన కోర్టుకు బదిలీ చేస్తుంది.