Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నేపాల్ ప్ర‌ధానితో క‌ల‌సి సంయుక్త మీడియా సమావేశంలో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ చేసిన ప్ర‌క‌ట‌న పూర్తి పాఠం

నేపాల్ ప్ర‌ధానితో క‌ల‌సి సంయుక్త మీడియా సమావేశంలో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ చేసిన ప్ర‌క‌ట‌న పూర్తి పాఠం

నేపాల్ ప్ర‌ధానితో క‌ల‌సి సంయుక్త మీడియా సమావేశంలో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ చేసిన ప్ర‌క‌ట‌న పూర్తి పాఠం


శ్రేష్ఠుడైన ప్ర‌ధాని

శ్రీ పుష్ప‌ క‌మల్ ద‌హల్ ‘ప్ర‌చండ‌’,

 

మాన్య నేపాల్ ప్ర‌తినిధి వర్గ సభ్యులు,

 

మీడియా లోని మిత్రులారా,

 

మ‌న రెండు దేశాల స్నేహ చ‌రిత్ర‌లో ఈ రోజు ముఖ్యమైన రోజు.

 

ప‌ద‌వీబాధ్యతలను స్వీకరించిన తరువాత తొలి విదేశీ యాత్ర‌కు ఇక్క‌డికి వ‌చ్చిన శ్రేష్ఠుడు శ్రీ  ‘ప్ర‌చండ‌’కు, ఆయ‌న వెంట భార‌తదేశానికి వ‌చ్చిన ప్ర‌తినిధి వర్గంలోని స‌భ్యుల‌కు స్వాగ‌తం పలకడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.

 

మిత్రులారా,

 

మ‌న ఇరు స‌మాజాల చారిత్ర‌క‌, సాంస్కృతిక సంబంధాల మూలాలు బ‌ల‌మైన‌వి.

 

పంచుకుంటున్న న‌దీన‌దాలు, తెర‌చి ఉన్న స‌రిహ‌ద్దులు, నిరంత‌ర ప్ర‌జాసంబంధాలు మ‌న రెండు దేశాల‌ను క‌లిపి ఉంచాయి.  రెండు ప్ర‌భుత్వాల మ‌ధ్య సంబంధాలే కాకుండా మ‌న స‌మాజాల మ‌ధ్య బంధాలు కూడా మ‌న భాగ‌స్వామ్యంలోని లోతుకు నిద‌ర్శ‌నం. ఒక‌రి విజ‌యాల‌ను చూసి మ‌రొక‌రం ఎలా సంబ‌ర‌ప‌డ‌తామో సంక్షోభ‌ స‌మ‌యాల్లో ఒక‌రి బ‌రువును మ‌రొక‌రు అలాగే పంచుకుంటాం కూడా.

 

ఒక‌ ర‌కంగా చెప్పాలంటే, మ‌న స్నేహ‌ బంధం విల‌క్ష‌ణ‌మైంది. కాల‌ ప‌రీక్ష‌లో నెగ్గింది.

 

మా సన్నిహిత పొరుగు దేశం, మరియు మిత్ర దేశంగా నేపాల్ శాంతి, సుస్థిర‌త‌, ఆర్థికాభివృద్ధి సాధ‌న మాకు కూడా ప్ర‌ధాన‌మే. అవి మా లక్ష్యాలు కూడా.

 

నేపాల్ అభివృద్ధి ప్ర‌యాణంలో, ఆర్థికాభివృద్ధిలో మాకూ భాగ‌స్వామ్య‌ం ఉంద‌ని గ‌ర్వంగా చెప్ప‌గ‌ల‌ను.

 

నేపాల్‌లో ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లను బ‌లోపేతం చేయ‌డంలో మీరు వ్య‌క్తిగ‌తంగా పోషించిన పాత్ర ప్ర‌శంస‌నీయ‌మైంది.

 

నేపాల్‌లో శాంతికి మీరు ప్రేర‌క శ‌క్తి. మీ యుక్తిదాయ‌క నేతృత్వంలో

నేపాల్ అక్క‌డి విభిన్న స‌మాజంలోని అన్ని వ‌ర్గాల ఆకాంక్ష‌ల‌నూ క‌లుపుకొని రాజ్యాంగాన్ని అమ‌లు చేస్తూ ముందుకు సాగుతుంద‌ని విశ్వ‌విస్తున్నాను.

 

ఈ ప్ర‌య‌త్నంలో మీకు శుభం క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాను.

 

మిత్రులారా,

 

ఇవాళ మేం జ‌రిపిన విస్తృత‌మైన‌, ఫ‌ల‌ప్ర‌ద‌మైన చ‌ర్చ‌ల్లో ప్ర‌ధాని ‘ప్ర‌చండ‌’, నేను రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లోని అన్ని కోణాల‌నూ స్పృశించాం. నేపాల్‌తో అభివృద్ధి భాగ‌స్వామ్యాన్ని మ‌రింత బ‌లోపేతం చేసుకోవ‌డానికి భార‌తదేశం సిద్ధంగా ఉంటుంద‌ని ప్ర‌ధాని ‘ప్ర‌చండ‌’కు తెలియ‌జేశాను. అది కూడా నేపాల్ ప్ర‌జ‌ల‌, ప్ర‌భుత్వ ప్రాధాన్యాల ప్ర‌కారం చేయ‌డానికి సిద్ధంగా ఉన్నాము. ఈ దిశ‌గా నేపాల్‌లో భూకంపం అనంత‌రం చేప‌ట్టిన‌ పున‌రుద్ధ‌ర‌ణ చ‌ర్య‌లకుగాను 750 మిలియ‌న్ అమెరికా డాల‌ర్ల రుణం ఇవ్వ‌డానికి సంబంధించిన ఒప్పందంపై ఈ రోజు సంత‌కాలు చేశాము.

 

దీనివ‌ల్ల నిరుడు నేపాల్‌ను అత‌లాకుత‌లం చేసిన భూకంప బాధితుల‌కు ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంద‌ని ఆశిస్తున్నాను.

 

అంతేకాకుండా తెరాయ్ రహదారి మార్గాల రెండో ద‌శ‌, విద్యుత్తు స‌ర‌ఫ‌రా లైన్లు, స‌బ్‌స్టేష‌న్ లు, కాస్కిలో పాలిటెక్నిక్‌ల ఏర్పాటుకు కూడా అదనపు లైన్ ఆఫ్ క్రెడిట్ ను మంజూరు చేయడానికి భార‌తదేశం ఒప్పుకొన్నది.

 

మిత్రులారా,

 

అభివృద్ధి, బ‌ల‌మైన ఆర్థికాభివృద్ధి అనే మ‌న రెండుదేశాల లక్ష్యాల సాధ‌న‌కు మ‌న స‌మాజాల భ‌ద్ర‌త కీల‌క‌మ‌ని ప్ర‌ధాని ‘ప్ర‌చండ‌’, నేను గుర్తించాము. అంతేకాక మ‌న భ‌ద్ర‌త ప్ర‌యోజ‌నాలు క‌ల‌గ‌ల‌సి ఉండ‌ట‌మే గాకుండా ఒక‌దానితో ఒక‌టి ముడిప‌డి ఉన్నాయి కూడా అని మేము అంగీక‌రిస్తున్నాము. రెండు దేశాల మ‌ధ్య గోడ‌లు లేని తెర‌చి ఉన్న స‌రిహ‌ద్దులు మ‌న ప్ర‌జ‌ల మ‌ధ్య సంబంధాల‌కు, స‌హ‌కారానికి దోహ‌ద‌ప‌డుతున్నాయి. అయితే ఇదే స‌మ‌యంలో మ‌న స‌రిహ‌ద్దుల‌ను దుర్వినియోగం చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న శ‌క్తుల‌ ప‌ట్ల మ‌నం అప్ర‌మ‌త్తంగా ఉండి, కాపాడుకోవాల్సిన‌ అవ‌స‌రం ఉంది.

 

కాబట్టి మ‌న రెండుదేశాల మ‌ధ్య పెరుగుతున్న వాణిజ్యం, ఆర్థిక‌, సాంస్కృతిక‌, అభివృద్ధి భాగ‌స్వామ్యానికి , మ‌న ప్ర‌జ‌ల శ్రేయ‌స్సు దృష్ట్యా మ‌న ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త సంస్థ‌ల మ‌ధ్య నిరంత‌ర స‌న్నిహిత సంబంధం, ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం ఎంతో కీల‌కం.

 

మిత్రులారా,

 

అభివృద్ధి ప్రాజెక్టులు, ప‌ర‌స్ప‌ర పెట్టుబ‌డులలో వాణిజ్యం, ర‌వాణా అనుసంధానాలు నేపాల్‌తో మ‌న భాగ‌స్వామ్యంలో మూల‌స్తంభాలు. ఓపెన్‌ స్కై, సీమాంత‌ర విద్యుత్ వాణిజ్యం, సీమాంత‌ర ర‌వాణా సౌక‌ర్యాల విష‌యంలో భార‌త్ చూపుతున్న చొర‌వ నేపాల్‌కు ప్ర‌త్య‌క్షంగా ప్ర‌యోజ‌న‌కారిగా మార‌ట‌మే గాకుండా, మ‌న ఆర్థిక భాగ‌స్వామ్యాన్ని బ‌లోపేతం చేస్తుంది. ఇంధ‌నం, జ‌ల‌ వ‌న‌రుల రంగాలతో పాటు ఇత‌ర ఆర్థిక అంశాలలో భార‌తదేశం, నేపాల్ లు క‌ల‌సి ప‌నిచేస్తున్నాయి.

 

ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న జల విద్యుత్తు పథకాలు, స‌ర‌ఫ‌రా లైన్ల అభివృద్ధి, కార్యాచ‌ర‌ణ‌లోకి తెచ్చే ప‌నులు  విజ‌య‌వంత‌మ‌య్యేందుకు వేగాన్ని పెంచాల‌ని ప్రధాని ‘ప్ర‌చండ‌’, నేను అంగీక‌రించాము.

 

ఇవి నేపాల్ ఇంధ‌న అవ‌స‌రాల‌ను తీర్చ‌ట‌మే కాకుండా, ఆదాయాన్ని స‌మ‌కూర్చే వ‌న‌రు కూడా.

 

మ‌న రెండు దేశాల స‌మాజాల మ‌ధ్య బంధాన్ని మ‌రింత బలోపేతం చేయాల‌ని చేయాల‌ని అనుకున్నాము.

 

మ‌న రెండు దేశాల బౌద్ధ వార‌స‌త్వాన్ని చూపిస్తూ, ఆయుర్వేదం త‌దిత‌ర సంప్ర‌దాయ వైద్య విధానాల అభివృద్ధిపై దృష్టి సారించాల‌ని నిర్ణ‌యించాము. అన్ని అభివృద్ధి పథకాల‌ను నిర్ణీత స‌మ‌యంలో పూర్త‌య్యేలా ప్ర‌ధాని ‘ప్ర‌చండ‌’, నేను నిశితంగా ప‌ర్య‌వేక్షించాల‌ని కూడా అనుకున్నాము.

 

మా నిర్ణ‌యాలు రెండు దేశాల ఆర్థిక బంధాన్ని మ‌రింత ఉన్న‌త‌ స్థితికి తీసుకువెళ్తాయ‌ని మేము ఇద్ద‌రమూ విశ్వ‌సిస్తున్నాము.

 

శ్రేష్ఠుడా,

 

మీ పర్యటన అత్యంత సకాలంలో జరుగుతున్న పర్యటన.

 

ఈ రోజు మనం జరిపిన చ‌ర్చ‌ శతాబ్దాల నుండి కొనసాగుతున్న మన సంబంధాలను మ‌రింత బ‌లోపేత‌ం చేయగలదని నేను  న‌మ్ముతున్నాను.

 

అలాగే, మన భాగస్వామ్యంలో ఒక కొత్త అద్వితీయమైన అధ్యాయాన్ని లిఖిస్తుంద‌ని భావిస్తున్నాను. శ్రేష్ఠుడా, మీకు మరొక్క మారు భార‌తదేశంలోనికి హృద‌య‌పూర్వ‌క స్వాగ‌తం. మీకు భార‌తదేశంలో ఆహ్లాదకరమైన, ఫలప్రదమైన బస లభించగలదని ఆశిస్తాను.

 

మీకు ఇవే నా ధ‌న్య‌వాదములు.

 

 

***