పిఎంఇండియా
నేషనల్ షెడ్యూల్డ్ కేస్ట్స్ ఫైనాన్స్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎన్ ఎస్ ఎఫ్ డి సి ) అధీకృత వాటా మూలధనంలో పెంపుదలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఇది సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలో పని చేస్తోంది. తాజా ఆమోదం ప్రకారం ఆథరైజ్ డ్ షేర్ కాపిటల్ ను రూ.1,000 కోట్లనుంచి రూ.1,200 కోట్ల కు పెంచడం జరిగింది. ఈ ఆమోదం తరువాత ఆర్థిక కార్యక్రమాల కోసం వినియోగించే నిధులు పెరిగి, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న షెడ్యూల్డ్ కులాల వారిలొ మరింత ఎక్కువ మందికి ఆర్థిక సాయం లభిస్తుంది. అంటే లబ్ధి దారుల సంఖ్య పెరుగుతుందన్నమాట. ఆర్థికంగా వెనుకబడ్డ షెడ్యూల్డ్ కులాల వారిలో ఎక్కువ మందికి ఈ నిధుల పంపిణీ వేగవంతంగా జరుగుతుంది. అంటే ఆర్థిక కార్యక్రమాల పరిధి పెరుగుతుంది. 2015-16కుగాను 63,000ల మంది లబ్ధిదారులకు సాయం చేయాలని ఎన్ ఎస్ ఎఫ్ డి సి లక్ష్యంగా పెట్టుకుంది.
ఎన్ ఎస్ ఎఫ్ డి సి తన పథకాలను 37 ఏజెన్సీల ద్వారా 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేస్తోంది. పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ఇంకా ఇతర సంస్థల ద్వారా అవసరమున్న ప్రాంతాల్లో ఎన్ ఎస్ ఎఫ్ డి సి తన పథకాలను అమలు చేయబోతున్నది.
నేపథ్యం :
ఎన్ ఎస్ ఎఫ్ డి సి ఆయా రాష్ట్రాల్లో గల తన ఏజెన్సీల ద్వారా రాయితీతో కూడిన వడ్డీకి రుణాలను అందజేస్తోంది. ఈ రుణాలు లక్ష్యిత గ్రూపు స్వయం ఉపాధి పొందడానికి, ఆర్థికంగా ఎదగడానికి ఉద్దేశించినవి. షెడ్యూల్డ్ కులాల్లోని నిరుద్యోగులు స్వతంత్రోపాధి ని పొందాలనకుంటే వారికి అవసరమయ్యే నైపుణ్యాల శిక్షణ కార్యక్రమాలను/ పరిశ్రమను నడపగలిగే శక్తి సామర్థ్యాల శిక్షణ కార్యక్రమాలను కూడా ఎన్ ఎస్ ఎఫ్ డి సి ప్రాయోజితం చేస్తోంది. ఆథరైజ్ డ్ షేర్ కాపిటల్ గా ఉన్న రూ.1,000 కోట్లలో రూ. 998.13 కోట్లను ఇప్పటికే ఎన్ ఎస్ ఎఫ్ డి సికి కేంద్ర ప్రభుత్వం చెల్లించింది. అంటే దాదాపుగా నిధులన్నింటినీ ఇచ్చేసింది. దాంతో కార్పొరేషన్‌కు సంబంధించిన ఆథరైజ్ డ్ షేర్ కాపిటల్ ను పెంచి, దాని పని పరిధిని విస్తరించడం తప్పనిసరి అయింది.