పిఎంఇండియా
న్యాయ రంగంలో సహకారం కోసం భారతదేశం, బాంగ్లాదేశ్ ల మధ్య అవగాహనపూర్వక ఒప్పందం (ఎమ్ఒయు)పై సంతకాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రెండు దేశాల న్యాయ యంత్రాంగాల మధ్య సహకారాన్ని పటిష్టపరచడంతో పాటు ఆ సహకారాన్ని పెంపొందింపచేయడం ఈ ఎమ్ఒయు ధ్యేయంగా ఉంటుంది.
రెండు దేశాల మధ్య న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థలోని ఇతర అధికారుల పర్యటనలు, శిక్షణ కార్యక్రమాలు, విద్యాసంబంధి కార్యక్రమాల నిర్వహణ ద్వారా న్యాయమూర్తుల మధ్య, వివిధ స్థాయిలలోని అధికారుల మధ్య పరస్పర సంభాషణలను ప్రోత్సహించడానికి ఈ ఎమ్ఒయు తోడ్పడనుంది. అంతే కాకుండా, చట్టం మరియు న్యాయం రంగంలోని తాజా పరిణామాల తాలూకు సమాచారాన్ని ఒక దేశం మరొక దేశానికి ఇచ్చి పుచ్చుకోవడాన్ని కూడా ఈ ఎమ్ఒయు ప్రోత్సహించనుంది. ఈ రంగంలో మౌలిక సదుపాయాలకు సంబంధించిన, సమాచార సాంకేతికతకు సంబంధించిన విజ్ఞానాన్ని ఒక దేశం మరొక దేశానికి ఇచ్చి పుచ్చుకోవడానికి ఈ ఎమ్ఒయు వీలు కల్పిస్తుంది.