పిఎంఇండియా
రష్యా ఉప ప్రధాని దిమిత్రీ పత్రుషేవ్, మంత్రి వర్గంలో నా సహచరులు చిరాగ్ పాశ్వాన్, శ్రీ రన్వీత్, శ్రీ ప్రతాప్‌రావ్ జాదవ్, వివిధ దేశాల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులు, ప్రతినిధులు, విశిష్ట అతిధులు, సోదరీసోదరులారా!
వరల్డ్ ఫుడ్ ఇండియాకు మీ అందరికీ స్వాగతం. ఈ రోజు ఈ కార్యక్రమంలో మన రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వినియోగదారులు అందరూ ఒకే గొడుగు కిందకు చేరుకున్నారు. కొత్త పరిచయాలు, నూతన సంబంధాలు, సృజనాత్మకతల ఉత్సవంగా వరల్డ్ ఫుడ్ ఇండియా మారింది. ఇక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను నేను ఇప్పుడే సందర్శించాను. పోషకాహారం, వంటనూనె వినియోగాన్ని తగ్గించడం, ప్యాకేజ్డ్ ఉత్పత్తులను ఆరోగ్యకరంగా మార్చడంపై ప్రధాన దృష్టి సారించడం చూసి సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను.
స్నేహితులారా,
ఒక ప్రదేశంలో పెట్టుబడి పెట్టే ముందు ప్రతి ఒక్కరూ ఆ ప్రాంతానికున్న సహజ సామర్థ్యాలను అంచనా వేస్తారు. ఇప్పుడు ఆహార రంగంలో పెట్టుబడులు పెట్టేవారు భారత్ వైపు ఆశావహ దృక్పథంతో చూస్తున్నారు. ఎందుకంటే.. వైవిధ్యం, డిమాండు, విస్తృతి అనే మూడు బలాలు భారత్‌కున్నాయి. ప్రతి గింజ ధాన్యమూ, ప్రతి ఫలమూ, ప్రతి కూరగాయా భారత్‌లో పండుతోంది. ఈ వైవిధ్యమే భారత్‌కు ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని అందించింది. మనదేశంలో ప్రతి వంద కిలోమీటర్లకు ఆహారం, రుచులు మారుతుంటాయి. వివిధ రకాల ఆహార పదార్థాలకు భారత్‌లో విశేషమైన డిమాండ్ ఉంది. ఈ గిరాకీయే భారత్‌ను పోటీలో నిలిపి, పెట్టుబడిదారులకు అనువైన గమ్యస్థానంగా మార్చింది.
స్నేహితులారా,
ఇప్పుడు భారత్ మునుపెన్నడూ లేని విధంగా, అసాధారణ రీతిలో అభివృద్ధి చెందుతోంది. గడచిన పదేళ్లలో 25 కోట్ల మంది భారతీయులు పేదరికాన్ని ఓడించారు. ఇప్పుడు వీరంతా నవ మధ్యతరగతిలో భాగమయ్యారు. ఈ నవ మధ్యతరగతి దేశంలో అత్యంత ఉత్సాహవంతమైన, ఆకాంక్షాత్మక విభాగం. ఇంత పెద్ద సంఖ్యలోని ప్రజల ఆకాంక్షలే.. ఆహార సరళిని రూపొందిస్తున్నాయి. ఈ ఆకాంక్షాత్మక తరగతే.. డిమాండును పెంచుతోంది.
స్నేహితులారా,
ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ యువత గొప్ప విజయాలను సాధిస్తోంది. దానికి మన ఆహార రంగం మినహాయింపేమీ కాదు. ఇప్పుడు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద అంకుర సంస్థల వ్యవస్థగా భారత్ ఎదిగింది. అందులో ఎక్కువ భాగం ఆహారం, వ్యవసాయ రంగానికి సంబంధించినవే ఉన్నాయి. ఏఐ, ఈ–కామర్స్, డ్రోన్లు, యాప్‌లు ఈ రంగంలో భాగమవుతున్నాయి. మన అంకుర సంస్థలు సరఫరా వ్యవస్థలు, రిటెయిల్, ప్రాసెసింగ్‌ల్లో మార్పులు తీసుకొస్తున్నాయి. వైవిధ్యం, డిమాండు, ఆవిష్కరణలకు భారత్ వేదికగా ఉంది. అందుకే పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా భారత్ మారింది. ఎర్రకోట బురుజుల నుంచి నేను చెప్పిన విషయాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తున్నాను: భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి ఇదే సరైన సమయం.
స్నేహితులారా,
ఈ ప్రపంచానికి 21వ శతాబ్దం తీసుకొచ్చిన సవాళ్ల గురించి మనందరికీ తెలుసు. అలాగే ప్రపంచానికి సవాళ్లు ఎదురైన ప్రతిసారి తనదైన రీతిలో సానుకూల పాత్ర పోషించడానికి భారత్ ఎప్పుడూ ముందుకు వస్తుంది. ప్రపంచ ఆహార భద్రత కోసం భారత్ నిరంతరం కృషి చేస్తోంది. మన రైతులు, పాడి రైతులు, మత్స్యకారుల కృషికి, తోడ్పాటునిచ్చే ప్రభుత్వ విధానాలకు ధన్యవాదాలు. వాటి వల్ల భారత్ సామర్థ్యం పెరుగుతోంది. గత దశాబ్దంలో మన ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద పాల ఉత్పత్తిదారుగా ఉంది. ప్రపంచ పాల అవసరాల్లో 25 శాతాన్ని దేశం అందిస్తోంది. మనం అతి పెద్ద చిరుధాన్యాల ఉత్పత్తిదారుగా కూడా ఉన్నాం. వరి, గోధుమల్లో మనం ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నాం. పండ్లు, కూరగాయలు, మత్స్య ఉత్పత్తుల్లో సైతం భారత్‌కు గణనీయమైన వాటా ఉంది. అందుకే ప్రపంచంలో ఎక్కడైనా ఆహార సంక్షోభం లేదా సరఫరా వ్యవస్థలో అంతరాయం ఏర్పడినప్పుడు భారత్ ముందుకొచ్చి తన బాధ్యతను నిర్వర్తిస్తుంది.
స్నేహితులారా,
ప్రపంచ సంక్షేమం దృష్ట్యా భారత్ సామర్థ్యాన్ని, సహకారాన్ని మరింత పెంపొందించుకొనేందుకు మనం కృషి చేస్తున్నాం. దీని కోసమే.. మొత్తం ఆహారం, పోషకాల రంగాన్ని, దీనితో ముడిపడి ఉన్నవారందరనీ ప్రభుత్వం బలోపేతం చేస్తుంది. మా ప్రభుత్వం ఆహార శుద్ధి రంగాన్ని ప్రోత్సహిస్తోంది. అందుకే ఈ రంగంలో నూరు శాతం ఎఫ్‌డీఐలకు అనుమతిచ్చాం. దీనికి అదనంగా.. పీఎల్ఐ పథకం, మెగా ఫుడ్ పార్కుల విస్తరణ ఈ రంగాన్ని మరింత ప్రోత్సహిస్తున్నాయి. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద స్టోరేజి మౌలిక వసతుల పథకాన్ని అమలు చేస్తోంది. ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలు ఫలితాలు కనిపిస్తున్నాయి. గత పదేళ్లలో, ఆహార శుద్ధి పరిశ్రమ సామర్థ్యం ఇరవై రెట్లు పెరిగింది. శుద్ధి చేసిన ఆహార ఎగుమతులు రెట్టింపు కంటే ఎక్కువ పెరిగాయి.
స్నేహితులారా,
ఆహార సరఫరా, విలువ వ్యవస్థలో రైతులు, పాడి రైతులు, మత్స్యకారులు, చిన్న ప్రాసెసింగ్ యూనిట్లు కీలకపాత్రను పోషిస్తున్నాయి. వీరందరినీ గత దశాబ్దంలో మా ప్రభుత్వం బలోపేతం చేసింది. భారత్‌లో 85 శాతం మంది చిన్న, సన్నకారు రైతులేనని మీకు తెలుసు. అందుకే.. వారికి మద్దతు ఇచ్చే.. విధానాలను, వ్యవస్థలను రూపొందించాం. దీంతో ఇప్పుడు చిన్న రైతులు మార్కెట్లో ప్రధాన శక్తిగా ఎదుగుతున్నారు.
మిత్రులారా,
ఉదాహరణకు, మన స్వయం సహాయ సంఘాలు సూక్ష్మ ఆహార శుద్ధి యూనిట్లను నడుపుతున్నాయి. ఈ స్వయం సహాయ సంఘాలు మన గ్రామాలలో లక్షలాది మంది ప్రజలతో అనుసంధానంగా ఉన్నాయి. వారికి మద్దతు ఇవ్వడానికి మా ప్రభుత్వం రుణ ఆధారిత సబ్సిడీలను అందిస్తోంది. ఈ రోజు కూడా, సుమారు 800 కోట్ల రూపాయల సబ్సిడీలను మీ సమక్షంలో ఇప్పుడే ఈ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశాం.
మిత్రులారా,
అలాగే, మా ప్రభుత్వం రైతు ఉత్పత్తిదారుల సంస్థలను (ఎఫ్పీఓలు) విస్తరిస్తోంది. 2014 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా పదివేల ఎఫ్పీఓలు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా లక్షలాదిమంది చిన్న రైతులు అనుసంధానమయ్యారు. వీటి ద్వారా చిన్న రైతులు తమ పంటలను విస్తృత స్థాయిలో మార్కెట్‌కు తీసుకెళ్లగలుగుతున్నారు. అంతేకాదు, వీటి పాత్ర ఈ ఒక్కదానికే పరిమితం కాదు. ఈ ఎఫ్పీఓలు ఆహార శుద్ధి రంగంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. బ్రాండెడ్ ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్నాయి. మన ఎఫ్పీఓల శక్తి సామర్ధ్యాలను చూసినప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. ఈరోజు మన ఎఫ్పీఓల 15,000కు పైగా ఉత్పత్తులు ఆన్లైన్ వేదికల్లో లభ్యమవుతున్నాయి. కాశ్మీర్ నుంచి బాస్మతి బియ్యం, కుంకుమపువ్వు, అక్రూట్లు, హిమాచల్ నుంచి జామ్, ఆపిల్ జ్యూస్, రాజస్థాన్ నుంచి మిల్లెట్ కుకీలు, మధ్యప్రదేశ్ నుంచి సోయా నగెట్స్, బీహార్ నుంచి సూపర్‌ఫుడ్ మఖానా, మహారాష్ట్ర నుంచి వేరుశెనగ నూనె, బెల్లం, కేరళ నుంచి అరటి చిప్స్, కొబ్బరి నూనె – ఇలా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన ఎఫ్పీఓలు భారతీయ వ్యవసాయ వైవిధ్యాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్తున్నాయి. ఇంకా మీకు సంతోషం కలిగించే విషయం ఏమిటంటే 1,100 కంటే ఎక్కువ ఎఫ్పీఓలు కోటీశ్వరులుగా మారారు. అంటే వాటి వార్షిక టర్నోవర్ కోటి రూపాయల మార్కును దాటింది. ఈరోజు, రైతుల ఆదాయాన్ని పెంచడంలో, యువతకు ఉపాధి కల్పించడంలో ఎఫ్పీఓలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
మిత్రులారా,
ఎఫ్పీఓలతో పాటు, సహకార సంఘాలు కూడా భారతదేశంలో గొప్ప శక్తిగా నిలుస్తున్నాయి. ఈ సంవత్సరం అంతర్జాతీయ సహకార సంఘాల సంవత్సరం. భారతదేశంలో సహకార సంఘాలు మన పాడి రంగానికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త శక్తిని అందిస్తున్నాయి. సహకార సంఘాల ప్రాధాన్యతను గుర్తించి, వాటి అవసరాలకు అనుగుణంగా మా విధానాలను రూపొందించేందుకు ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశాం. ఈ రంగానికి పన్ను, పారదర్శకత సంబంధిత సంస్కరణలను కూడా చేపట్టాం. ఈ విధాన స్థాయి మార్పులు సహకార రంగానికి కొత్త శక్తిని అందించాయి.
మిత్రులారా,
సముద్ర, మత్స్య రంగంలో భారత్ సాధించిన వృద్ధి కూడా విశేషంగా ఉంది. గత దశాబ్దంలో మత్స్య రంగానికి సంబంధించిన మౌలిక సదుపాయాలను విస్తరించాం. మత్స్యకారులకు ఆర్థిక మద్దతు, లోతైన సముద్రంలో చేపలు పట్టే పడవల కోసం సహాయాన్ని అందించాం. దీని వల్ల మన సముద్ర ఉత్పత్తి, ఎగుమతులు రెండూ పెరిగాయి. ఈరోజు ఈ రంగం దాదాపు మూడు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. అలాగే సముద్ర ఉత్పత్తుల శుద్ధి ప్రక్రియను విస్తరించడానికి కూడా మేం కృషి చేస్తున్నాం. ఇందుకోసం ఆధునిక ప్రాసెసింగ్ ప్లాంట్లు, కోల్డ్ చైన్లు, స్మార్ట్ హార్బర్లు వంటి వాటిలో పెట్టుబడులు పెడుతున్నాం.
మిత్రులారా,
పంటల సంరక్షణ కోసం ఆధునిక సాంకేతికతలో కూడా మేం పెట్టుబడులు పెడుతున్నాం. రైతులను ఫుడ్ ఇర్రేడియేషన్ టెక్నాలజీతో అనుసంధానిస్తున్నాం. దీని వల్ల మన వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకాలం పెరిగింది. ఆహార భద్రత బలపడింది. ఈ పనిలో నిమగ్నమైన యూనిట్లకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తోంది.
మిత్రులారా,
భారత్ ఈ రోజు ఆవిష్కరణలు, సంస్కరణల కొత్త మార్గంలో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం, మన దేశంలో తదుపరి తరం జీఎస్టీ సంస్కరణల గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. రైతుల కోసం ఈ సంస్కరణలు తక్కువ వ్యయాలు, ఎక్కువ లాభాల భరోసాను కల్పిస్తున్నాయి. వెన్న, నెయ్యిపై కేవలం 5% జీఎస్టీ ఉన్నందున, రైతులు ఉత్పత్తిదారులు భారీగా లాభపడతారు. పాల కంటెయినర్లపై కూడా పన్ను కేవలం 5% మాత్రమే ఉంది. దీని వల్ల రైతులు, ఉత్పత్తిదారులకు మంచి ధరలు లభిస్తాయి. అలాగే పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరల్లో ఎక్కువ పోషకాహారం లభిస్తుంది. ఈ సంస్కరణల వల్ల ఆహార శుద్ధి రంగం కూడా గణనీయంగా లాభపడనుంది. తినడానికి సిద్ధంగా ఉన్న, నిల్వ చేసిన పండ్లు, కూరగాయలు, నట్స్‌పై కేవలం 5 శాతం జీఎస్టీ మాత్రమే వర్తిస్తుంది. నేడు 90 శాతానికి పైగా శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తులు సున్నా లేదా 5 శాతం పన్ను తరగతిలోకి వస్తాయి. బయో ఆధారిత పురుగుమందులు, సూక్ష్మపోషకాలపై పన్నులు తగ్గాయి. జీఎస్టీ సంస్కరణల కారణంగా, బయో ఇన్పుట్లు చౌకగా మారాయి. ఇది చిన్న తరహా సేంద్రీయ రైతులకు, ఎఫ్‌పిఓలకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది.
మిత్రులారా,
నేడు, బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్‌కు కూడా డిమాండ్ ఉంది. మన ఉత్పత్తులు తాజాగా, అధిక నాణ్యతతో ఉండటం ముఖ్యం. దీనితో పాటు, ప్రకృతి పట్ల మనకు బాధ్యత కూడా ఉంది. అందువల్ల, ప్రభుత్వం బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్‌పై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్‌కు సంబంధించిన ఆవిష్కరణలలో పెట్టుబడులు పెట్టాలని, వీలైనంత త్వరగా మన ఉత్పత్తి ప్యాకేజింగ్ మొత్తాన్ని బయోడిగ్రేడబుల్ మెటీరియల్‌లకు మార్చాలని పరిశ్రమ భాగస్వాములందరినీ నేను కోరుతున్నా.
మిత్రులారా,
భారత్ ఉదార స్ఫూర్తితో ప్రపంచానికి తన తలుపులు తెరిచి ఉంచింది. ఆహార శ్రేణితో సంబంధం ఉన్న పెట్టుబడిదారులందరికీ మేం స్వాగతం పలుకుతున్నాం. సహకారం విషయంలో విశాల దృక్పథం కలిగి ఉన్నాం. మీరందరూ భారత్‌లో అత్యధికంగా పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నా. ఈ రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. ఈ కార్యక్రమంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా.
ధన్యవాదాలు.
***
Addressing the World Food India 2025 programme. https://t.co/x7wR33oiKX
— Narendra Modi (@narendramodi) September 25, 2025
India has the triple strength of diversity, demand and scale. pic.twitter.com/C0XgWdyP6Y
— PMO India (@PMOIndia) September 25, 2025
In the last 10 years, 25 crore people in India have overcome poverty. pic.twitter.com/kBKTaiZcT5
— PMO India (@PMOIndia) September 25, 2025
Today, India is the world's third-largest start-up ecosystem, with many start-ups working in the food and agriculture sectors. pic.twitter.com/0PvhS8QVS4
— PMO India (@PMOIndia) September 25, 2025
India is continuously contributing to global food security. pic.twitter.com/7PJ9YLESMy
— PMO India (@PMOIndia) September 25, 2025
Today, small farmers are becoming a major force in the market. pic.twitter.com/TdqffjLyWj
— PMO India (@PMOIndia) September 25, 2025
In India, cooperatives are giving our dairy sector and our rural economy a new strength. pic.twitter.com/wg6AJHzoeR
— PMO India (@PMOIndia) September 25, 2025