పిఎంఇండియా
న్యూఢిల్లీలోని రోహిణిలో ఈ రోజు జరిగిన అంతర్జాతీయ ఆర్య మహాసమ్మేళనం 2025ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీ మోదీ మాట్లాడుతూ.. ఇంతకుముందు విన్న మంత్రాల శక్తిని అందరూ ఇంకా అనుభూతి చెందుతున్నారన్నారు. తానెప్పుడు ఈ సమావేశాలకు వచ్చినా.. దివ్యమైన, అసాధారణ అనుభవం కలుగుతుందని వ్యాఖ్యానించారు. స్వామి దయానందుడి ఆశీస్సుల వల్లే ఈ భావన ఎల్లవేళలా సాధ్యమవుతోందన్నారు. స్వామి దయానందుడి ఆదర్శాలు పూజనీయమైనవన్నారు. అక్కడున్న చింతనాపరులందరితో తనకున్న దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ అనుబంధం వల్లే వారిలో ఒకరిగా ఉండే అవకాశం తనకు ఎన్నోసార్లు దక్కుతోందన్నారు. వారిని కలిసి, మాట్లాడినప్పుడల్లా.. ఏదో తెలియని శక్తి ఆవహిస్తుందని, తనలో ప్రేరణ లభిస్తోందని వ్యాఖ్యానించారు.
గతేడాది గుజరాత్లోని మహర్షి దయానంద సరస్వతి జన్మస్థలంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వీడియో సందేశం ద్వారా పాల్గొన్నట్లు శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు. అంతకుముందు, ఢిల్లీలో మహర్షి దయానంద సరస్వతి 200వ జయంతి వేడుకలను కూడా ఆయన ప్రారంభించారు. వేద మంత్రాల శక్తిని కొనియాడారు. పవిత్ర హవన క్రతువులు నిన్ననే జరిగాయా అన్నంత పరిశుద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.
అంతకుముందు జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న వారంతా మహర్షి దయానంద సరస్వతి ద్విశత జయంత్యుత్సవాలను రెండేళ్ల పాటు ‘విచార యజ్ఞ’గా కొనసాగించాలని సంకల్పించిన విషయాన్ని ప్రధానమంత్రి గుర్తుచేశారు. నిరంతరాయమైన ఈ మేధో నివేదన పూర్తి కాలం కొనసాగడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సమయంలో చేపట్టిన కార్యక్రమాల పట్ల ఎప్పటికప్పుడు తనకు సమాచారం అందుతోందని శ్రీ మోదీ చెప్పారు. ఆర్య సమాజ 150వ వార్షికోత్సవాల సందర్భంగా నేడు మరోసారి మనఃపూర్వక నివాళి అర్పించే అవకాశం తనకు లభించిందన్నారు. స్వామి దయానంద సరస్వతి పాదాల వద్ద ప్రణమిల్లి నివాళి అర్పించారు. ఈ అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్మారక నాణేన్ని, పోస్టల్ స్టాంపును విడుదల చేయడం గౌరవంగా భావిస్తున్నానన్నారు.
‘‘ఆర్య సమాజ 150వ వార్షికోత్సవం ఏ ఒక్క సమూహానికో, వర్గానికో సంబంధించిన ఘట్టం కాదు.. దేశ వైదిక అస్తిత్వంతో బలంగా అనుసంధానమైన వేడుక ఇది’’ అని ప్రధానమంత్రి అన్నారు. గంగా వాహినిలా స్వీయ శుద్ధి శక్తి గల భారతీయ తాత్విక సంప్రదాయంతో ఇది అనుసంధానమై ఉందని వ్యాఖ్యానించారు. ఆర్య సమాజం ఎప్పటికప్పుడు ముందుకు తెచ్చిన గొప్ప సామాజిక సంస్కరణా పరంపరే ఈ కార్యక్రమానికి మూలాధారమని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ ఉద్యమం ఎందరో స్వాతంత్ర్య సమరయోధులకు సైద్ధాంతిక బలాన్నిచ్చిందన్నారు. లాలా లజపతి రాయ్, అమరుడు రాంప్రసాద్ బిస్మిల్ వంటి అనేక మంది ఉద్యమకారులు ఆర్య సమాజం నుంచి ప్రేరణ పొంది.. స్వాతంత్ర్య పోరాటానికి పూర్తిగా అంకితమయ్యారన్నారు. స్వాతంత్ర్యోద్యమంలో ఆర్య సమాజ పాత్రకు రాజకీయ కారణాల వల్లే తగిన గుర్తింపు రాలేదని ప్రధానమంత్రి విచారం వ్యక్తం చేశారు.
మొదటి నుంచీ ఆర్య సమాజం అంకితభావం కలిగిన దేశభక్తుల సంస్థగా ఉందని శ్రీ మోదీ గుర్తుచేశారు. ‘‘ఆర్య సమాజం భారతీయతా సారాన్ని నిస్సంకోచంగా ప్రవచించి, ప్రచారం చేసింది’’ అన్నారు. భారత వ్యతిరేక భావజాలాలు, విదేశీ సిద్ధాంతాలను రుద్దే ప్రయత్నాలు, విభజన మనస్తత్వాలు, సాంస్కృతిక నిర్మాణాన్ని కలుషితం చేసే ప్రయత్నాలు… వీటన్నింటినీ ముందుండి నిలబడి ఆర్య సమాజం సవాలు చేసిందన్నారు. ఆర్య సమాజ 150వ వార్షికోత్సవం సందర్భంగా.. సమాజం, దేశం రెండూ ఇంత గొప్పగా, అర్థవంతంగా… దయానంద సరస్వతి ఆదర్శాలను స్మరించుకోవడంపై ప్రధానమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.
మతపరమైన జాగరణ ద్వారా చరిత్ర గమనానికి కొత్త దిశానిర్దేశం చేసిన స్వామి శ్రద్ధానంద వంటి ఆర్య సమాజ పరిశోధకులను స్మరించుకుంటూ.. ఈ చరిత్రాత్మక కార్యక్రమానికి అలాంటి మహనీయుల శక్తి, ఆశిస్సులు సంపూర్ణంగా ఉన్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఆ వేదికపై నుంచి అసంఖ్యాకులైన మహనీయులకు ప్రణమిల్లి.. వారిని స్మరించుకున్నారు.
భారత్ అనేక విధాల ప్రత్యేకమైనదనీ.. ఈ భూమి, నాగరికత, వైదిక సంప్రదాయం యుగయుగాలుగా శాశ్వతంగా నిలిచాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. కొత్త సవాళ్లు తలెత్తినప్పుడల్లా, కాలం కొత్త ప్రశ్నలను లేవనెత్తినప్పుడల్లా.. వాటికి తగిన పరిష్కారాలతో ఓ మహనీయుడు అవతరిస్తాడని స్పష్టం చేశారు. సమాజానికి మార్గనిర్దేశం చేయడానికి ఎవరో ఒక ఋషి, దార్శనికుడు లేదా పండితుడు ఎల్లప్పుడూ ముందుకొస్తారని ఆయన పేర్కొన్నారు. స్వామి దయానంద సరస్వతి ఆ గొప్ప సంప్రదాయానికి చెందిన మహర్షి అని ప్రధానమంత్రి అన్నారు. శతాబ్దాల బానిసత్వం దేశాన్ని, సమాజాన్ని ఛిన్నాభిన్నం చేసిన వలస పాలన కాలంలో స్వామి దయానందుడు జన్మించారని శ్రీ మోదీ గుర్తు చేశారు. ఆలోచన, విచారం స్థానంలో మూఢనమ్మకాలు, సామాజిక దురాచారాలు వచ్చి చేరాయనీ, వలస పాలనను సమర్థించుకోవడం కోసం బ్రిటిష్ వారు భారతీయ సంప్రదాయాలు, నమ్మకాలను కించపరిచారని అన్నారు. ఆ పరిస్థితుల్లో నూతన, మౌలిక భావనలను వ్యక్తీకరించే ధైర్యాన్ని సమాజం కోల్పోయిందన్నారు. ‘‘ఈ క్లిష్ట సమయంలోనే ఓ యువ సన్యాసి అవతరించాడు. ఎక్కడో హిమాలయ సానువుల్లో, కఠినతర భూభాగాల్లో తీవ్రమైన ఆధ్యాత్మిక సాధన చేస్తూ.. కఠోర తపస్సుతో తనను తాను పరీక్షించుకున్నాడు. అక్కడినుంచి తిరిగొచ్చి న్యూనతా భావంలో చిక్కుకున్న భారతీయ సమాజాన్ని కదిలించాడు. మొత్తం బ్రిటీష్ యంత్రాంగమంతా భారతీయ అస్తిత్వాన్ని మరుగున పరచాలని చూస్తున్న వేళ, సామాజిక ఆదర్శాలు క్షీణిస్తున్న తరుణంలో, ఆధునికతే నైతికతగా చిత్రీకరిస్తున్న సమయంలో… ‘వేదాలకు తిరిగి వెళ్లండి’ అంటూ నిశ్చయుడై పిలుపునిచ్చాడీ మహర్షి’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. వలస పాలన కాలంలో అణచివేసిన జాతీయ చైతన్యాన్ని తిరిగి జాగృతం చేసిన అసాధారణ వ్యక్తిగా స్వామి దయానందుడిని ప్రధానమంత్రి అభివర్ణించారు.
భారత్ పురోగమించాలంటే వలస పాలన శృంఖలాలను తెంచుకోవడం మాత్రమే సరిపోదనీ, భారతీయ సమాజాన్ని బంధించిన సంకెళ్లను కూడా తెంచుకోవాల్సిన అవసరం ఉందని స్వామి దయానందుడు అవగతం చేసుకున్న తీరును శ్రీ మోదీ వివరించారు. దయానందుడు కుల వివక్షను, అంటరానితనాన్ని స్పష్టంగా తిరస్కరించారని శ్రీ మోదీ చెప్పారు. నిరక్షరాస్యతకు వ్యతిరేకంగా ప్రచారాన్ని లేవనెత్తి.. వేదాలు, గ్రంథాల వ్యాఖ్యానాలను వక్రీకరించే వారికి ఎదురు నిలిచారన్నారు. విదేశీ కథనాలను ఎదుర్కొని నిలిచి, శాస్త్రార్థ సాంప్రదాయక అభ్యాసం ద్వారా సత్యం వైపు నిలబడ్డారని తెలిపారు. వ్యక్తిగత, సామాజిక అభివృద్ధి రెండింటిలోనూ మహిళల కీలక పాత్రను గుర్తించి.. మహిళలను ఇంటికే పరిమితం చేసే సంకుచిత మనస్తత్వాన్ని సవాలు చేసిన దార్శనిక ఋషిగా స్వామి దయానందుడిని ప్రధానమంత్రి అభివర్ణించారు. ఆయన ప్రేరణతో ఆర్య సమాజ పాఠశాలలు బాలికలకు విద్యను అందించడం ప్రారంభించాయి. జలంధర్లో మొదలైన బాలికల పాఠశాల అనతికాలంలోనే పూర్తి స్థాయి మహిళా కళాశాలగా అభివృద్ధి చెందింది. ఆర్య సమాజ సంస్థల్లో విద్యాభ్యాసం చేసిన లక్షలాది మంది భారత కుమార్తెలు నేడు దేశ పునాదిని బలోపేతం చేస్తున్నారని ప్రధానమంత్రి అన్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్త వేదికపైనే ఉన్నారనీ.. రెండు రోజుల కిందటే భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము స్క్వాడ్రన్ లీడర్ శివంగి సింగ్తో కలిసి రాఫెల్ యుద్ధ విమానంలో ప్రయాణించారని శ్రీ మోదీ గుర్తు చేశారు. నేడు భారత కుమార్తెలు యుద్ధ విమానాలు నడుపుతున్నారని, ‘డ్రోన్ దీదీలు’గా ఆధునిక వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో మహిళా సైన్సు గ్రాడ్యుయేట్లు భారత్లోనే ఉన్నారని గర్వంగా పేర్కొన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళలు నాయకత్వ పాత్రలు పోషించడం పెరుగుతోందన్నారు. దేశంలోని ప్రతిష్ఠాత్మక పరిశోధన సంస్థల్లోని మహిళా శాస్త్రవేత్తలు మంగళయాన్, చంద్రయాన్, గగన్యాన్ వంటి అంతరిక్ష కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని శ్రీ మోదీ చెప్పారు. దేశం సరైన మార్గంలో పురోగమిస్తోందనేందుకు, స్వామి దయానందుడి కలలు నెరవేరుతున్నాయనేందుకు ఈ విప్లవాత్మక మార్పులు నిదర్వనమని ఆయన స్పష్టం చేశారు.
స్వామి దయానందుడి ఓ విశిష్ట ఆలోచన తనకు తరచూ గుర్తొస్తుందని, ఎప్పుడూ దానిని ఇతరులకూ చెప్తుంటానని ప్రధానమంత్రి చెప్పారు. ‘‘తక్కువగా తీసుకుని, ఎక్కువ ఇచ్చేవారే నిజంగా పరిణితులు’’ అని స్వామిజీ అన్నారు. ఈ కొన్ని పదాల్లోనే ఎంతో లోతైన జ్ఞానం ఉందని, వాటిని వ్యాఖ్యానించాలంటే బహుశా పుస్తకాలెన్నో రాయొచ్చని ఆయన అన్నారు. ఒక ఆలోచన యథార్థమైన బలం దాని అర్థంలో మాత్రమే ఉండదనీ.. అది ఎంతకాలం కొనసాగుతుంది, ఎన్ని జీవితాలను మారుస్తుందన్న దానిపైనే దాని శక్తి ఆధారపడి ఉంటుందని శ్రీ మోదీ అన్నారు. ఈ ప్రాతిపదికలపై మహర్షి దయానందుడి ఆలోచనలను పరిగణిస్తే, అంకితభావంతో కృషి చేసే ఆర్య సమాజ అనుచరులను గమనిస్తే… ఆయన భావనలు కాలక్రమేణా మరింత జ్వాజ్వల్యమానంగా మారినట్టు స్పష్టమవుతోందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
స్వామి దయానంద సరస్వతి పరోపకారిణి సభను స్థాపించడం గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. స్వామీజీ నాటిన విత్తనం గురుకుల్–కంగ్రి, గురుకుల్–కురుక్షేత్ర, ‘డీఏవీ’ తదితర విద్యా కేంద్రాలతో శాఖోపశాఖలతో విశాల వృక్షంగా ఎదిగిందని, ఇవన్నీ నేడు తమతమ రంగాల్లో శ్రద్ధగా కృషి చేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. దేశం సంక్షోభంలో పడినప్పుడల్లా ఆర్య సమాజ సభ్యులు నిస్వార్థంగా తోటి పౌరుల సేవకు తమనుతాము అంకితం చేసుకున్నారని వివరించారు. దేశ విభజన విషాద సమయంలో సర్వస్వం కోల్పోయి భారత్కు వచ్చిన శరణార్థులకు చేయూత, పునరావాసం, విద్యాసౌలభ్య కల్పనలో ఆర్య సమాజం పోషించిన కీలక పాత్రను శ్రీ మోదీ ప్రస్తావించారు. ఇది చరిత్రలో పాతుకుపోయిన సత్యమని, అంతేకాకుండా నేటికీ ప్రకృతి వైపరీత్యాల సమయాన బాధితుల సేవలో ఆర్య సమాజం ముందంజలో ఉందన్నారు.
Addressing the International Arya Mahasammelan in Delhi. https://t.co/ClDC6q7bl9
— Narendra Modi (@narendramodi) October 31, 2025
आर्य समाज की स्थापना के 150 वर्ष...
— PMO India (@PMOIndia) October 31, 2025
ये अवसर केवल समाज के एक हिस्से या संप्रदाय से जुड़ा नहीं है।
ये अवसर पूरे भारत की वैदिक पहचान से जुड़ा है: PM @narendramodi pic.twitter.com/L4QjO0lMZF
आर्य समाज निर्भीक होकर भारतीयता की बात करने वाली संस्था रही है: PM @narendramodi pic.twitter.com/ScK2zX5KJT
— PMO India (@PMOIndia) October 31, 2025
स्वामी दयानंद जी युगदृष्टा महापुरुष थे: PM @narendramodi pic.twitter.com/ZegYbR8YML
— PMO India (@PMOIndia) October 31, 2025
आज भारत sustainable development की दिशा में एक प्रमुख global voice बन चुका है: PM @narendramodi pic.twitter.com/Wlrow0qHyo
— PMO India (@PMOIndia) October 31, 2025