పిఎంఇండియా
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ‘వీరబాల దివస్’ సందర్భంగా ఈ రోజు నిర్వహించిన జాతీయ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన అతిథులకు స్వాగతం పలికిన ప్రధానమంత్రి, అక్కడున్న పిల్లలనుద్దేశించి మాట్లాడారు. వీరబాల దివస్ ప్రాముఖ్యతను వారికి వివరించారు. ఈ సందర్భంగా కళాకారుల వందేమాతర ప్రదర్శన అద్భుతంగా ఉందని ప్రశంసించారు. వారి అంకితభావం, కృషి ఆ ప్రదర్శనలో స్పష్టంగా కనిపించాయన్నారు.
భారతదేశానికి గర్వకారణమైన, అజేయ ధైర్య సాహసాలకు ప్రతీకలైన వీర సాహిబ్‌జాదాలను దేశం నేడు స్మరించుకుంటోందని శ్రీ మోదీ చెప్పారు. వయస్సు, అనుభవాల పరిమితులను ఛేదించుకున్న ఈ సాహిబ్‌జాదాలు క్రూర మొఘల్ సామ్రాజ్యం ఎదుట కొండలా అడ్డు నిలిచారన్నారు. మతోన్మాదాన్నీ, ఉగ్ర మూలాలనూ పెకలించారని కొనియాడారు. ఇంతటి మహోజ్వల చరిత్ర ఉన్న ఈ దేశ యువత.. స్ఫూర్తిదాయకమైన ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న యువతరం ఏదయినా సాధించగలదని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
డిసెంబర్ 26వ తేదీ వస్తే చాలు.. సాహిబ్‌జాదాల అసమాన పరాక్రమ స్ఫూర్తితో ‘వీరబాల దివస్’ వేడుకలను ప్రభుత్వం ప్రారంభించిందన్న తృప్తి, భరోసా కలుగుతాయని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. గత నాలుగేళ్లుగా ఈ కొత్త సంప్రదాయంతో సాహిబ్‌జాదాల స్ఫూర్తిని యువత అందిపుచ్చుకుంటోందన్నారు. యువతను ధీరులుగా, ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే దిశగా ఇది ఓ వేదికగా నిలిచిందన్నారు. ఏటా వివిధ రంగాల్లో దేశం కోసం విశేష విజయాలు సాధించిన బాలలు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాన్ని (పీఎంఆర్బీపీ) స్వీకరిస్తారని, ఈ సంవత్సరం కూడా దేశవ్యాప్తంగా 20 మంది పిల్లలు ఈ పురస్కారాన్ని అందుకున్నారని ప్రధానమంత్రి తెలిపారు. వారితో తన సంభాషణను వివరిస్తూ… చాలా మంది పిల్లలు అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారనీ.. కొందరు సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణలో ప్రశంసనీయ సేవలందించారనీ.. ఇంకొందరు శాస్త్ర, సాంకేతిక రంగంలో కొత్త ఆవిష్కరణలు చేశారనీ.. మరికొందరు క్రీడలు, కళ, సంస్కృతీ రంగంలో విశేష కృషి చేశారనీ శ్రీ మోదీ తెలిపారు. ఈ పురస్కారం ఆ పిల్లలది మాత్రమే కాదనీ.. వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మార్గదర్శకుల కృషికీ ఇది గుర్తింపు అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. పురస్కార విజేతలకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించిన ఆయన, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు.
వీరబాల దివస్‌ను భావోద్వేగానికీ, భక్తిభావానికీ ప్రతీకగా వ్యాఖ్యానించిన శ్రీ మోదీ.. అత్యంత చిన్న వయస్సులోనే నాడు అత్యంత శక్తిమంతమైన మొఘల్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి నిలిచిన వీర సాహిబ్‌జాదాలు అజిత్ సింగ్, జుఝార్ సింగ్, జొరావర్ సింగ్, ఫతే సింగ్‌లను స్మరించుకున్నారు. ప్రాథమిక భారతీయ ఆదర్శాలకూ, మత మౌఢ్యానికీ నడుమ.. సత్యానికీ, అసత్యానికీ నడుమ.. ఆ పోరాటం సాగిందన్నారు. ఒక పక్షానికి పదో గురువు శ్రీ గురు గోవింద్ సింగ్ నాయకత్వం వహించగా, మరోవైపు ఔరంగజేబు క్రూర పాలన సాగిందన్నారు. భారతీయుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసి బలవంతంగా మతమార్పిడులు చేయాలని ఔరంగజేబు నిశ్చయించుకున్నాడని, అందుకే సాహిబ్‌జాదాలు చాలా చిన్నవారే అయినప్పటికీ వారిని లక్ష్యంగా చేసుకున్నాడని ప్రధానమంత్రి చెప్పారు. గురు గోవింద్ సింగ్ సామాన్యుడు కాదనీ.. తపస్సుకూ, త్యాగానికీ ప్రతీక అయిన ఆయన వారసత్వాన్ని సాహిబ్‌జాదాలు అందిపుచ్చుకున్నారనీ… ఔరంగజేబు, అతని సేనానులు ఈ విషయాన్ని విస్మరించారని ప్రధానమంత్రి అన్నారు. మొఘలు సామ్రాజ్యం అంత బలమైనదే అయినప్పటికీ, నలుగురు సాహిబ్‌జాదాలలో ఒక్కరు కూడా చలించలేదని శ్రీ మోదీ కొనియాడారు. వారి శౌర్యం ఇప్పటికీ ఆయన మాటల్లో ప్రతిధ్వనిస్తుందంటూ…సాహిబ్‌జాదా అజిత్ సింగ్ మాటలను ఆయన గుర్తు చేసుకున్నారు.
కొన్ని రోజుల కిందటే కురుక్షేత్రలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో శ్రీ గురు తేగ్ బహదూర్ జీని ఆయన 350వ బలిదాన దినం సందర్భంగా దేశం స్మరించుకుందని ప్రధానమంత్రి మోదీ గుర్తుచేశారు. ఆయన త్యాగం నుంచి స్ఫూర్తి పొందిన సాహిబ్‌జాదాలు మొఘలుల అకృత్యాలకు భయపడతారనుకోవడం పొరపాటన్నారు. మాతా గుజ్రీ, శ్రీ గురు గోవింద్ సింగ్, నలుగురు సాహిబ్‌జాదాల ధైర్యమూ, ఆదర్శాలూ ప్రతి భారతీయుడికీ బలాన్నిస్తాయనీ, తరగని స్ఫూర్తినిస్తాయని ప్రధానమంత్రి అన్నారు. సాహిబ్‌జాదాల త్యాగనిరతి ప్రతి పౌరుడికీ ఎంతగానో తెలిసి ఉండాల్సిందన్న శ్రీ మోదీ.. దురదృష్టవశాత్తు స్వాతంత్య్రానంతరం కూడా వలసవాద మనస్తత్వమే బలంగా ఉండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 1835లో బ్రిటిష్ రాజకీయవేత్త మెకాలే ఈ మనస్తత్వానికి బీజం వేశారనీ, స్వాతంత్య్రానంతరం కూడా దీన్ని నిర్మూలించలేకపోయామనీ అన్నారు. దీంతో ఇలాంటి సత్యాలు దశాబ్దాల పాటు అణచివేతకు గురయ్యాయన్నారు. వలసవాద మనస్తత్వం నుంచి విముక్తిని నేడు భారత్ సంకల్పించిందని శ్రీ మోదీ స్పష్టం చేశారు. భారతీయ త్యాగాలకూ, శౌర్యానికీ సంబంధించిన జ్ఞాపకాలు ఇకపై అణచివేతకు లోనుకాబోవని, దేశ నాయికా నాయకులను ఇకపై పక్కనపెట్టబోమని ప్రకటించారు. అందుకే వీరబాల్ దివస్‌ను పూర్తి భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అక్కడితోనే ఆగలేదన్నారు. 2035 నాటికి మెకాలే కుట్రకు 200 ఏళ్లు పూర్తవుతుందని, మరో పదేళ్లు మిగిలి ఉండగానే వలసవాద మనస్తత్వం నుంచి భారత్ సంపూర్ణ విముక్తిని సాధించి చూపుతుందని స్పష్టం చేశారు. ఈ మనస్తత్వం నుంచి విముక్తి పొందితే.. స్వదేశీ సంప్రదాయాల పట్ల మరింత గౌరవాదరాలు పెరుగుతాయని, స్వావలంబన పథంలో దేశం పురోగమిస్తుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
వలసవాద మనస్తత్వం నుంచి దేశాన్ని విముక్తం చేసే ప్రచారానికి సంబంధించిన ఛాయలు ఇటీవల పార్లమెంటులో కనిపించాయని, శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు సభ్యులు హిందీ, ఇంగ్లిషుతోపాటు ఇతర భారతీయ భాషల్లో దాదాపు 160 ప్రసంగాలు చేశారని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. సుమారు 50 ప్రసంగాలు తమిళంలో, 40కి పైగా ప్రసంగాలు మరాఠీలో, దాదాపు 25 ప్రసంగాలు బెంగాలీలో చేశారని ఆయన తెలిపారు. ప్రపంచంలోని ఏ పార్లమెంటులో అయినా ఇలాంటి దృశ్యం చాలా అరుదుగా కనిపిస్తుందని, ఇది మనందరికీ గర్వకారణమని అన్నారు. దేశంలో భాషా వైవిధ్యాన్ని అణచివేసేందుకు మెకాలే ప్రయత్నించాడని, కానీ వలసవాద మనస్తత్వం నుంచి భారత్ నేడు విముక్తి పొందుతున్న తరుణంలో.. ఆ భాషా వైవిధ్యమే మనకు గొప్ప శక్తిగా నిలుస్తోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
Addressing a programme on Veer Baal Diwas. We remember the exemplary courage and sacrifice of the Sahibzades.
— Narendra Modi (@narendramodi) December 26, 2025
https://t.co/kQPb0RmaIj
Today, we remember the brave Sahibzades, the pride of our nation. They embody India's indomitable courage and the highest ideals of valour. pic.twitter.com/gOoSf5FQlE
— PMO India (@PMOIndia) December 26, 2025
The courage and ideals of Mata Gujri Ji, Sri Guru Gobind Singh Ji and the four Sahibzades continue to give strength to every Indian. pic.twitter.com/9mwfF0VL00
— PMO India (@PMOIndia) December 26, 2025
India has resolved to break free from the colonial mindset once and for all. pic.twitter.com/9l6Dt3F0XI
— PMO India (@PMOIndia) December 26, 2025
As India frees itself from the colonial mindset, its linguistic diversity is emerging as a source of strength. pic.twitter.com/6TA3P9JzA9
— PMO India (@PMOIndia) December 26, 2025
Gen Z… Gen Alpha… will lead India to the goal of a Viksit Bharat. pic.twitter.com/XzwUt2nvtt
— PMO India (@PMOIndia) December 26, 2025