పిఎంఇండియా
ఇజ్రాయెల్ గాలి ఇక్కడ కూడా వీస్తోంది.
నమస్కారం!
నెట్‌వర్క్ 18 పాత్రికేయులూ, ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న సహచరులూ, ఇక్కడికి విచ్చేసిన విశిష్ట అతిథులూ, సోదరీ సోదరులారా!
‘రైజింగ్ ఇండియా’ గురించి మీరంతా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా అంతర్గత శక్తి గురించి ఎక్కువగా చెబుతున్నారు. సూటిగా చెప్పాలంటే.. స్వభావ సిద్ధమైన దేశ స్వీయ సామర్థ్యాల మీదే మీరు ప్రధానంగా దృష్టి సారించారు. ‘తత్వమసి’ అని మన గ్రంథాలు బోధిస్తున్నాయి. అంటే, మనం ఎక్కడో వెతుకులాడుతున్న దైవిక శక్తి మనలోనే ఉంది. అది మనమే. ఆ శక్తి మనలోనే ఉంది. దాన్ని మనం గుర్తించాలి. గత 11 ఏళ్లలో భారత్ తనలో ఉన్న ఈ అసలైన శక్తిని గుర్తించింది. నేడు ఆ శక్తి ప్రవర్ధమానమయ్యేలా దేశం నిరంతరం పురోగమిస్తోంది.
మిత్రులారా,
దేశంలో శక్తి ఉన్నట్టుండి జనించేది కాదు.. అది తరతరాలుగా జాగృతమవుతుంది. విజ్ఞానం, సంప్రదాయం, కష్టించే తత్వం, అనుభవం దానికి మెరుగులద్దుతాయి. కానీ మన సుదీర్ఘ చరిత్రలో.. శతాబ్దాల బానిసత్వం వల్ల మనలోని ఆత్మవిశ్వాసం పోయి న్యూనతా భావం నిండింది. మనకు చదువు లేదనీ, మనం ఇతరులను అనుసరించేవారిమి మాత్రమే అనీ… బయటి నుంచి వచ్చిన సిద్ధాంతాలు మన సమాజంలో ఒక నమ్మకాన్ని బలంగా నాటాయి. మన శాస్త్రాల్లో ఒక మాట ఉంది: ‘యాదృశీ భావనా యస్య సిద్ధిర్భవతి తాదృశీ’… అంటే మన ఆలోచన ఎలా ఉంటే, మనకు దక్కే ఫలితం కూడా అలాగే ఉంటుంది. మన ఆలోచనలే తక్కువ స్థాయిలో ఉంటే ఫలితాలూ అలాగే ఉంటాయి. మనం విదేశీ సాంకేతికతను అనుకరించాం. విదేశాల ఆమోదం కోసం ఎదురు చూశాం. ఇది కేవలం రాజకీయాంశమో, భౌగోళికాంశమో కాదు.. ఇది మానసిక బానిసత్వం. దురదృష్టవశాత్తు స్వాతంత్య్రానంతరం కూడా భారత్ ఈ బానిస మనస్తత్వం నుండి బయటపడలేక పోయింది. ఇప్పటికీ మనం దానికి భారీ మూల్యం చెల్లించుకుంటున్నాం. వాణిజ్య ఒప్పందాల చుట్టూ జరుగుతున్న చర్చలు దీనికి తాజా ఉదాహరణ. భారత్‌తో వాణిజ్య ఒప్పందాలు చేసుకునేందుకు అభివృద్ధి చెందిన దేశాలు ఎందుకు ఇంతలా ఉత్సాహం చూపిస్తున్నాయోనని కొందరికి ఆశ్చర్యం కలుగుతోంది. నైరాశ్యం నుంచి బయటపడి, ఆత్మవిశ్వాసంతో అడుగులేస్తున్న నవ భారతమే దీనికి సమాధానం. ఒకవేళ దేశం ఇంకా 2014కు ముందున్న ఆ చీకటి రోజుల్లోనే, అత్యంత బలహీనమైన అయిదు దేశాల్లో ఒకటిగా, విధాన నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంటే.. మనతో వాణిజ్య ఒప్పందాలకు ఎవరు ముందుకొచ్చేవారు? కనీసం మనవైపు కన్నెత్తయినా ఎవరు చూసేవారు?
కానీ మిత్రులారా,
గత 11 ఏళ్లలో మన దేశ చేతనలో ఒక కొత్త శక్తి ప్రవహించింది. కోల్పోయిన పూర్వ వైభవాన్ని తిరిగి పొందే దిశగా భారత్ నేడు పురోగమిస్తోంది. ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం అగ్రగామిగా ఉన్న సమయంలో మన అసలైన బలమేమిటి? మన తయారీ రంగం, మన ఉత్పత్తుల నాణ్యత, మన ఆర్థిక విధానాలే మన బలం. భారత్ నేడు మరోసారి ఆ అంశాలపైనే దృష్టి సారిస్తోంది. అందుకే మేం తయారీ రంగాన్ని బలోపేతం చేశాం. భారత్‌లో తయారీకి ప్రాధాన్యమిచ్చాం. మన బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేశాం. గతంలో రెండంకెల స్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్‌ను చోదక శక్తిగా నిలిపాం. భారత్‌కు ఉన్న ఈ బలాన్ని చూసి అభివృద్ధి చెందిన దేశాలే స్వయంగా మనతో వాణిజ్య ఒప్పందాలకు ముందుకొస్తున్నాయి.
మిత్రులారా,
దేశంలోని నిగూఢంగా ఉన్న ఆ శక్తి జాగరూకమైన వేళ, అది సరికొత్త విజయాలను అందుకుంటుంది. మీకు మరిన్ని ఉదాహరణలు చెబుతాను. ఇతర దేశాల ప్రభుత్వాధినేతలను నేను కలిసినప్పుడు.. మన జన్ ధన్, ఆధార్, మొబైల్ త్రిశక్తి గురించి వినేందుకు వారు అమితాసక్తిని కనబరుస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఏటీఎంలే చాలా ఆలస్యంగా వచ్చిన మన దేశం.. డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచంలో అగ్రస్థానానికి ఎలా చేరుకుంది? ప్రభుత్వ సాయం లబ్ధిదారులకు చేరే లోపు మధ్యలోనే పక్కదారి పట్టడమన్నది ఒక చేదు నిజంగా ఉండిపోయిన చోట.. డీబీటీ ద్వారా ఇప్పుడు రూ. 24 లక్షల కోట్లను నేరుగా ప్రజల ఖాతాల్లోకి బదిలీ చేయడం ఎలా సాధ్యపడింది? భారత్ ఏర్పరిచిన ఈ డిజిటల్ ప్రజా అవస్థాపన నేడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
మిత్రులారా,
ప్రపంచం నేడు ఆశ్చర్యపోతోంది. 2014 వరకు దాదాపు 3 కోట్ల కుటుంబాలు చీకట్లో మగ్గిన భారత్.. నేడు సౌర విద్యుత్ సామర్థ్యంలో ప్రపంచంలో అగ్రగామి దేశాల్లో ఒకటిగా ఎలా ఎదిగింది? నగరాల్లో ప్రజా రవాణా మెరుగుపడుతుందన్న ఆశే లేని స్థితి నుంచి.. ప్రపంచంలో మూడో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్ కలిగిన దేశంగా భారత్ ఎలా అవతరించింది? ఆలస్యానికీ, నత్తనడకకూ కేరాఫ్ అడ్రస్‌గా ఒకప్పుడు భావించిన భారత రైల్వేలు.. నేడు వందే భారత్, నమో భారత్ రైళ్లతో సెమీ హై స్పీడ్ కనెక్టివిటీని ఎలా సాధించాయి?
మిత్రులారా,
ఒకప్పుడు భారత్ కొత్త సాంకేతికతల్లో కేవలం వినియోగదారీ దేశంగానే ఉండేది. ఈ రోజు భారత్ కొత్త సాంకేతికతలను సృష్టించే స్థాయికి ఎదగడమే కాకుండా, సరికొత్త ప్రమాణాలను నిర్దేశిస్తోంది. మన శక్తిని మనం గుర్తించడం వల్లే ఇది సాధ్యమైంది. మీరిప్పుడు చర్చిస్తున్న మన ‘అంతర్గత శక్తి’ ఇదొక చక్కటి ఉదాహరణ.
మిత్రులారా,
మనం గర్వంగా ముందడుగు వేస్తున్న కొద్దీ ప్రపంచం మనల్ని చూసే విధానం కూడా మారుతుంది. ఒక్కసారి గుర్తుతెచ్చుకోండి.. కొన్నేళ్ల కిందటి వరకు భారతదేశ విశేషాల గురించి అంతర్జాతీయ మీడియాలో ఎంత తక్కువగా చర్చలు జరిగేవో! మన దేశంలో జరిగే కార్యక్రమాలకు పెద్దగా ప్రాధాన్యమిచ్చేవారు కాదు. కానీ నేడు చూడండి, భారత ప్రతి చర్యనూ ప్రపంచం ఎంతో నిశితంగా గమనిస్తోంది, విశ్లేషిస్తోంది. ఏఐ సదస్సు దీనికి ఉదాహరణ. అదీ ఇదే భవనంలో జరిగింది. వందకు పైగా దేశాలు అందులో పాల్గొన్నాయి. ధనిక దేశాలైనా, అభివృద్ధి చెందుతున్న దేశాలైనా.. అందరూ ఒకే టేబుల్ వద్ద కూర్చున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల నుంచి చిన్న చిన్న అంకుర సంస్థల వరకు అందరూ ఒక్కచోట సమావేశమయ్యారు.
మిత్రులారా,
ఇప్పటివరకు వచ్చిన పారిశ్రామిక విప్లవాలన్నింటిలో భారత్‌తోపాటు అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ.. ఇతర దేశాలను అనుసరించేవిగానే ఉన్నాయి. కానీ ఈ కృత్రిమ మేధ యుగంలో భారత్ నిర్ణయాల్లో భాగస్వామి మాత్రమే కాదు.. వాటిని నిర్దేశించే శక్తిగా ఎదిగింది. ఈ రోజు మనకు సొంత ఏఐ అంకుర సంస్థలకు సానుకూల వ్యవస్థ ఉంది. డేటా సెంటర్లలో పెట్టుబడి పెట్టే సత్తా ఉంది. ఏఐ డేటాను భద్రపరచడానికి, ప్రాసెస్ చేయడానికి అవసరమైన శక్తిపై మనం వేగంగా పనిచేస్తున్నాం. ముఖ్యంగా, అణు విద్యుత్ మనం చేపట్టిన సంస్కరణలు దేశ ఏఐ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో ఉపయోగపడతాయి.
మిత్రులారా,
ఈ ఏఐ సదస్సు నిర్వహణ యావత్ భారతదేశానికీ గర్వకారణం. కానీ దురదృష్టవశాత్తు దేశంలోని అత్యంత పురాతన పార్టీ ఈ వేడుకకు మచ్చ తెచ్చే ప్రయత్నం చేసింది. విదేశీ అతిథుల ఎదుట కాంగ్రెస్ తన గుడ్డలూడదీసుకోవడమే కాదు.. సైద్ధాంతిక దివాలాకోరుతనాన్నీ బయటపెట్టుకుంది. ఓటమి వల్ల నిరాశ పెరిగి, దానికి గర్వం తోడైతే.. ఇలా దేశాన్ని కించపరిచే ఆలోచనలే పుడతాయి. కాంగ్రెస్ చేసిన ఈ పనులు స్పష్టంగా దేశప్రజలకు ఆగ్రహాన్ని కలిగించాయి. తమ పాపాన్ని సమర్థించుకోవడానికి వారు మహాత్మాగాంధీని ముందుకు తెచ్చారు. కాంగ్రెస్ ఎప్పుడూ ఇంతే… తమ పాపాలను దాచాలనుకున్నప్పుడల్లా బాపూజీని ముందుకు తెస్తుంది. అదే తమను తాము కీర్తించుకోవాలనుకుంటే మాత్రం, ఆ ఘనతనంతా తమ కుటుంబానికే ఆపాదించుకుంటుంది.
మిత్రులారా,
సిద్ధాంతాల పేరిట కేవలం వ్యతిరేకత చూపించే టూల్‌కిట్ స్థాయికి కాంగ్రెస్ ఇప్పుడు దిగజారింది. గుడ్డిగా వ్యతిరేకించే మనస్తత్వం ఎంతలా పెరిగిపోయిందంటే.. ఏ వేదిక అయినా, ఏ సందర్భమైనా దేశాన్ని తక్కువ చేసి చూపించే అవకాశాన్ని వారు అస్సలు వదులుకోవడం లేదు. దేశానికి ఏ మంచి జరిగినా, ఏ శుభకార్యం తలపెట్టినా.. కాంగ్రెస్‌కు తెలిసిందల్లా కేవలం వ్యతిరేకించడమే.
మిత్రులారా,
నా దగ్గర పెద్ద జాబితానే ఉంది.. కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మిస్తే, వారు వ్యతిరేకించారు. పార్లమెంటు పైన ఉన్న అశోక చక్రంలోని సింహాలను చూసి కూడా వారు అభ్యంతరం చెప్పారు. ఒకప్పుడు సామాన్యుల చెప్పులను తిని పారిపోయిన సింహాల యజమానులు ఇప్పుడు పార్లమెంటు సింహాల కోరలు చూసి భయపడుతున్నారు. కర్తవ్య పథ్ నిర్మిస్తే వ్యతిరేకించారు. మన సాయుధ దళాలు సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే వ్యతిరేకించారు. బాలాకోట్ వైమానిక దాడులు జరిగితే వ్యతిరేకించారు. ఆపరేషన్ సిందూర్ జరిగితే వ్యతిరేకించారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. దేశం ఏ విజయం సాధించినా దాన్ని వ్యతిరేకించడమే కాంగ్రెస్ టూల్‌కిట్ పని.
మిత్రులారా,
ఆర్టికల్ 370ని రద్దు చేసిన వేళ దేశం సంబరాలు చేసుకుంది. కానీ కాంగ్రెస్ దాన్ని వ్యతిరేకించింది. మేం సీఏఏ చట్టాన్ని తెచ్చాం.. వారు వ్యతిరేకించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాం.. వారు వ్యతిరేకించారు. త్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా చట్టాన్ని తెచ్చాం.. వారు వ్యతిరేకించారు. మనం యూపీఐని ప్రారంభించాం.. వారు వ్యతిరేకించారు. స్వచ్ఛ భారత్ మిషన్‌ను మొదలుపెట్టాం.. వారు వ్యతిరేకించారు. దేశం సొంతంగా కోవిడ్ వ్యాక్సిన్‌ను తయారు చేసుకుంటే.. దాన్ని కూడా వ్యతిరేకించారు.
మిత్రులారా,
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షమంటే కేవలం గుడ్డిగా అడ్డుకోవడం మాత్రమే కాదు.. ఒక ప్రత్యామ్నాయ ఆలోచనను ప్రజల ముందుకు తేవడం. అందుకే దేశంలోని చైతన్యవంతులైన పౌరులు కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతూనే ఉన్నారు. ఈ రోజే కాదు, గత నాలుగు దశాబ్దాలుగా ఎప్పుడూ ఇదే జరుగుతోంది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని మీడియా మిత్రులు కూడా లోతుగా విశ్లేషించాలని కోరుతున్నాను. కాంగ్రెస్ ఓట్లను ఎవరూ దొంగిలించడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. అసలు విషయమేంటంటే, దేశ ప్రజలే కాంగ్రెస్‌ను తమ ఓటుకు అర్హమైనదిగా భావించడం లేదు. ఈ పతనం 1984 నుంచే మొదలైంది. 1984లో కాంగ్రెసుకు 39 శాతం ఓట్లు, 400 కన్నా ఎక్కువ సీట్లు వచ్చాయి. ఆ తర్వాతి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం తగ్గుతూనే వచ్చింది. నేడు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందంటే.. కేవలం నాలుగు రాష్ట్రాల్లోనే ఆ పార్టీకి 50 కన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గత 40 ఏళ్లలో యువ ఓటర్ల సంఖ్య పెరుగుతూ వస్తుంటే, కాంగ్రెస్ మాత్రం క్రమంగా కనుమరుగవుతోంది. కాంగ్రెస్ ఇప్పుడు కేవలం ఒక కుటుంబానికి బానిసలైన వ్యక్తుల క్లబ్బుగా మారిపోయింది. అందుకే మిలీనియల్స్ కాంగ్రెసుకు తగిన బుద్ధి చెప్పారు. ఇప్పుడు జెన్ జీ కూడా సిద్ధంగా ఉంది.
మిత్రులారా,
కాంగ్రెస్, దాని మిత్రపక్షాల ఆలోచనా దృక్పథం ఎంత సంకుచితంగా ఉందంటే.. దీర్ఘకాలిక దార్శనికతను కూడా వారు ఒక నేరంగా చూస్తున్నారు. ఈ రోజు మనం 2047 నాటికి వికసిత భారత్ గురించి మాట్లాడుతుంటే, ‘‘అంత దూరం గురించి ఇప్పుడే ఎందుకు?’’ అని కొందరు అడుగుతున్నారు. మరికొందరైతే.. అప్పటికి మోదీ బతికే ఉండడు కదా అని కూడా అంటున్నారు. కానీ నిజమేమిటంటే.. స్వల్పకాలిక ఆలోచనలతో ఎప్పుడూ దేశ వికాసం జరగదు. గొప్ప దార్శనికత, సహనం, సమయానుకూల నిర్ణయాల వల్లే అది సాధ్యమవుతుంది. నేనిప్పుడు కొన్ని గణాంకాలను నెట్‌వర్క్ 18 వీక్షకుల ముందుంచుతాను. ఏటా విదేశీ నౌకల ద్వారా సరుకు రవాణా కోసం భారత్ 6 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తోంది. ఎరువుల దిగుమతిపై ఏటా 2.25 లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం. పెట్రోలియం దిగుమతుల కోసం ఏటా 11 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. అంటే ఏటా లక్షల కోట్ల రూపాయలు దేశం వెలుపలికి వెళ్లిపోతున్నాయి. ఒకవేళ 20 – 25 ఏళ్ల కిందటే ఆత్మనిర్భరత దిశగా ఈ పెట్టుబడిని మళ్లించి ఉంటే.. ఈ రోజు ఆ మూలధనం దేశ మౌలిక సదుపాయాలను, పరిశోధనలను, పరిశ్రమలను బలోపేతం చేయడంతోపాటు రైతులను, యువతను సాధికారులను చేసేది. నేడు సరిగ్గా ఇదే దార్శనికతతో మా ప్రభుత్వం పనిచేస్తోంది. విదేశీ నౌకలకు మనం చెల్లిస్తున్న ఆ 6 లక్షల కోట్ల రూపాయలను ఆదా చేసేందుకు.. భారతీయ షిప్పింగ్, ఓడరేవుల మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నాం. దేశీయంగా ఎరువుల ఉత్పత్తిని పెంచడానికి కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాం. అలాగే నానో యూరియాను ప్రోత్సహిస్తున్నాం. పెట్రోలియం దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు ఇథనాల్ మిశ్రణ, గ్రీన్ హైడ్రోజన్ మిషన్, సౌరశక్తి, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యమిస్తున్నాం.
మిత్రులారా,
మనం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ రోజు నిర్ణయాలు తీసుకోవాలి. అందుకే భారత్ సెమీకండక్టర్ సానుకూల వ్యవస్థను నిర్మిస్తోంది. రక్షణ రంగం, మొబైల్ తయారీ, డ్రోన్ సాంకేతికత, కీలక ఖనిజాల రంగాల్లో పెట్టుబడుల ద్వారా.. రాబోయే దశాబ్దాల ఆర్థిక భద్రతకు బలమైన పునాది వేస్తున్నాం. ‘2047 లక్ష్యం’ కేవలం ఒక రాజకీయ నినాదం కాదు. గతంలో సరైన సమయంలో పెట్టుబడులు పెట్టడంలో విఫలమై.. కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన చారిత్రక తప్పిదాలను సవరించే ఒక గొప్ప సంకల్పమిది. నేడు మనం దేశీయంగా నౌకలను నిర్మించుకుని, ఇంధనాన్ని మనమే ఉత్పత్తి చేసుకుంటూ, కొత్త సాంకేతికతలను మనమే అభివృద్ధి చేసుకుంటే.. భవిష్యత్ తరాలు దిగుమతుల భారం గురించి కాకుండా, మన ఎగుమతుల సామర్థ్యంపై చర్చించుకుంటాయి. ‘నేటి సౌకర్యాలు’ కాదు.. ‘రేపటి సన్నద్ధత’ పైనే ఒక దేశ ప్రగతి ఆధారపడి ఉంటుంది. ముందుచూపుతో కష్టపడి మనం చేసే ఈ పనులే 2047 నాటికి ఆత్మనిర్భర, దృఢతర, సుభిక్ష భారతదేశానికి పునాది. కాంగ్రెస్ నిరసనల పేరుతో ఎన్ని బట్టలు చింపుకున్నా, మేం మాత్రం నిర్విరామంగా మా పనిని కొనసాగిస్తూనే ఉంటాం.
మిత్రులారా,
చిత్తశుద్ధి ఉంటేనే దేశాభివృద్ధి సాధ్యం. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఇందులోనూ విఫలమయ్యాయి. వారు ఎప్పుడూ చిత్తశుద్ధితో పనిచేయలేదు. పేదల కష్టాల పట్ల వారికి ఎలాంటి ఆందోళన లేదు. ఉదాహరణకు, బెంగాల్‌లో ఆయుష్మాన్ భారత్ పథకం ఇప్పటికీ అమలు కాలేదు. వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. పేదలకు 5 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స అందించే పథకాన్ని అడ్డుకునేవారా? కాదు కదా. అలాగే పీఎం ఆవాస్ యోజన కింద పేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తున్న విషయం మీకు తెలిసిందే. నేనిప్పుడు మరో గణాంకాన్ని నెట్‌వర్క్ 18 వీక్షకులతో చెప్పాలనుకుంటున్నాను. తమిళనాడులో పేద కుటుంబాల కోసం దాదాపు 9.5 లక్షల పక్కా ఇళ్లను కేటాయించాం.. అక్షరాలా 9.5 లక్షలు. కానీ వీటిలో 3 లక్షల ఇళ్ల నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. ఎందుకు? ఎందుకంటే డీఎంకే ప్రభుత్వం పేదలకు ఈ ఇళ్లను నిర్మించి ఇవ్వడంపై ఆసక్తి చూపడం లేదు. దీనికి కారణం సుస్పష్టం.. వారికి ఆ చిత్తశుద్ధి లేదు.
మిత్రులారా,
వ్యవసాయ రంగం గురించీ చెప్తాను.. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయాన్ని దాని కర్మకు వదిలేశారు. చిన్న రైతులను పట్టించుకోలేదు. పంట బీమా అస్తవ్యస్తంగా ఉండేది. కనీస మద్దతు ధరపై స్వామినాథన్ కమిటీ నివేదికను ఫైళ్లకే పరిమితం చేశారు. కాంగ్రెస్ బడ్జెటులో ప్రకటనలు చేసేది తప్ప, క్షేత్రస్థాయిలో ఏమీ జరిగేది కాదు. ఎందుకంటే వారిలో చిత్తశుద్ధి లేదు. కానీ మేం దేశ రైతుల కోసం చిత్తశుద్ధితో పనిచేయడం మొదలుపెట్టాం. నేడు ప్రపంచం ఆ ఫలితాలను వీక్షిస్తోంది. ఈ రోజు భారత్ ప్రపంచంలోని ప్రధాన వ్యవసాయ ఎగుమతిదారుల్లో ఒకటిగా ఎదుగుతోంది. ప్రతి స్థాయిలో మేం రైతులకు ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశాం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఇప్పటివరకు 4 లక్షల కోట్ల రూపాయలకు పైగా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశాం. కనీస మద్దతు ధరను సాగు ఖర్చుకు 1.5 రెట్లుగా నిర్ణయించి, రికార్డు స్థాయిలో కొనుగోళ్లు చేశాం. పప్పుధాన్యాలకు సంబంధించి ఒకే ఒక్క గణాంకాన్ని చెప్తాను.. యూపీఏ ప్రభుత్వం తన పదేళ్ల కాలంలో.. కేవలం 6 లక్షల మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాలను మాత్రమే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసింది.. 6 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. కానీ మా ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 170 లక్షల మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసింది. అంటే దాదాపు 30 రెట్లు ఎక్కువ. నిజంగా రైతుల కోసం పనిచేసేదెవరో మీరే నిర్ణయించుకోండి.
మిత్రులారా,
కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రైతులకు సాయమందించడంలోనూ యూపీఏ ప్రభుత్వం లోభత్వాన్ని చూపింది. పదేళ్ల పాలనలో యూపీఏ ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలను మాత్రమే ఇచ్చింది. కానీ మా ప్రభుత్వం దానికి నాలుగు రెట్లు.. అంటే 28 లక్షల కోట్ల రూపాయల రుణాలను అందించింది. యూపీఏ సమయంలో 5 కోట్ల మంది రైతులు మాత్రమే దీనివల్ల లబ్ధి పొందగా, నేడు ఆ సంఖ్య రెండింతలను మించింది. దాదాపు 12 కోట్ల మందికి లబ్ధి చేకూరింది. అంటే మొదటిసారిగా చిన్న రైతులకు కూడా ఈ సాయం అందుతోంది. పీఎం ఫసల్ బీమా యోజన అనే రక్షణ కవచాన్ని కూడా మా ప్రభుత్వం రైతులకు అందించింది. దీని కింద సంక్షోభ సమయాల్లో ఇప్పటికే దాదాపు రూ. 2 లక్షల కోట్లను రైతులకు అందించాం. మేం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం కాబట్టే.. భారతీయ రైతుల ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. వారి ఉత్పాదకత పెరుగుతోంది. వారి ఆదాయాలు పెరుగుతున్నాయి.
మిత్రులారా,
21వ శతాబ్దంలో నాలుగో వంతు ఇప్పటికే గడిచిపోయింది. రాబోయే కాలం దేశ అభివృద్ధికి అత్యంత నిర్ణయాత్మకమైనది. ఈ రోజు మనం తీసుకునే నిర్ణయాలే మన భవితను నిర్దేశిస్తాయి. మన బలాన్ని గుర్తించి, దానిని మరింత మెరుగుపరుచుకుంటూ మనం ముందుకు సాగాలి. ప్రతి వ్యక్తి తన రంగంలో అత్యుత్తమ ప్రతిభను కనబరచాలి. ‘అత్యుత్తమ ప్రతిభ’ను ప్రతి సంస్థా పెంపొందించుకోవాలి. కేవలం వస్తువులను ఉత్పత్తి చేయడం కాదు.. అత్యుత్తమ నాణ్యతతో ఉత్పత్తులను మనం అందించాలి. ఏదో పరిపాటిగా పనిచేయడం కాదు.. అంతర్జాతీయ స్థాయి పనులను చేసి చూపాలి. మన సామర్థ్యాన్ని కార్యాచరణగా మలచుకోవాలి. ఈ సారి ఎర్రకోట మీద నుంచి నేను చెప్పినట్టు.. ఇదే సమయం, ఇదే సరైన సమయం… నూతన శిఖరాలను అధిరోహించేలా భారత్‌ను నిలిపేందుకు తగిన సమయమిదే. మరోసారి మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. నమస్కారం.
***
Speaking at the News18 #RisingBharatSummit2026.@News18India@CNNnews18 https://t.co/8pcMjFSI89
— Narendra Modi (@narendramodi) February 27, 2026
Why are developed nations so eager to sign trade deals with India?
— PMO India (@PMOIndia) February 27, 2026
Because a confident India is rising beyond doubt and despair.#RisingBharatSummit2026 pic.twitter.com/qBUH7IfSZx
In the last 11 years, a new energy has flowed into the nation's consciousness. India is determined to regain its rightful strength.#RisingBharatSummit2026 pic.twitter.com/W2Z8lmQg5O
— PMO India (@PMOIndia) February 27, 2026
India's Digital Public Infrastructure has today become a subject of global discussion.#RisingBharatSummit2026 pic.twitter.com/j6MTfFSZGr
— PMO India (@PMOIndia) February 27, 2026
Today, every move India makes is closely watched and analysed across the world. The AI Summit is a clear example of this.#RisingBharatSummit2026 pic.twitter.com/4bqpZyS8VH
— PMO India (@PMOIndia) February 27, 2026
Nation-building never happens through short-term thinking.
— PMO India (@PMOIndia) February 27, 2026
It is shaped by a long-term vision, patience and timely decisions.#RisingBharatSummit2026 pic.twitter.com/ggpuk7lpSr