పిఎంఇండియా
అందరికీ నమస్కారం !
ఈ సదస్సు ద్వారా దేశ విదేశాలకు చెందిన గౌరవ అతిథులతో పాటు మీ ప్రేక్షకులతో మమేకమయ్యే అవకాశం కల్పించినందుకు నెట్‌వర్క్18 యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ఏడాది భారత యువత ఆకాంక్షలపై ప్రధానంగా దృష్టి సారిస్తూ సదస్సు నిర్వహించడం సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఇదే వేదికపై ‘వికసిత భారత్ యువ నాయకత్వ గోష్ఠి’ జరిగింది. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే యువత కలలు, సంకల్పం, అభినివేశం ఈ కార్యక్రమంలో ప్రస్ఫుటమయ్యాయి. 2047 నాటికి భారత్ పురోగమన పథాన్ని వివరిస్తూ.. అడుగడుగునా జరిగే నిరంతర చర్చలు విలువైన అవగాహననిస్తాయి. అంతేకాదు అమృత కాల తరాన్ని శక్తియుతం చేస్తాయి. దేశాన్ని వేగంగా ముందుకు నడిపిస్తాయి. ప్రస్తుత శిఖరాగ్ర సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ మీకు శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా…
నేడు ప్రపంచ దేశాలు భారత్ నే చూస్తున్నాయి. వాటి ఆశలు కూడా భారత్ పైనే ఉన్నాయి. మనం కేవలం కొన్నేళ్ల వ్యవధిలోనే ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో 11వ స్థానం నుంచి 5వ స్థానానికి ఎదిగాం. అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లు ఎదురైనా భారత్ ఆగలేదు. బదులుగా రెట్టింపు వేగంతో ముందుకు సాగింది. కేవలం ఒక దశాబ్ద కాలంలో మన ఆర్థిక వ్యవస్థ పరిమాణం రెట్టింపైంది. భారత పురోగమనం నిలకడగా, స్థిరంగా సాగుతుందని ఒకనాడు భావించినవారు నేడు ‘శరవేగంతో దూసుకెళ్లే సాహసోపేత భారత్’ను ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఈ క్రమంలో మన దేశం త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించగలదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ అసమాన ప్రగతికి సారథ్యం వహిస్తున్నది యువత ఆశయాలు, ఆకాంక్షలే. కాబట్టి వారి ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చడమే నేటి జాతీయ ప్రాథమ్యం.
మిత్రులారా…
ఈ రోజు ఏప్రిల్ 8. మరో ఒకట్రెండు రోజుల్లో 2025 సంవత్సరంలోని మొదటి 100 రోజులు పూర్తవుతాయి… 2025 లో 100 రోజుల మొదటి మైలురాయి ఇది. ఈ 100 రోజులలో తీసుకున్న నిర్ణయాలు యువత ఆకాంక్షలను ప్రతిబింబిస్తున్నాయన్న విషయాన్ని మీరు గుర్తిస్తారు.
మిత్రులారా…
ఈ 100 రోజుల్లో మేం కేవలం నిర్ణయాలు తీసుకోలేదు – భవిష్యత్తుకు బలమైన పునాది వేశాం. మేం విధానాలను అవకాశాలుగా మార్చాం. యువ నిపుణులు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రయోజనం చేకూర్చేలా రూ.12 లక్షల వరకు వార్షికాదాయంపై పన్ను ఉపశమనం కల్పించాం. దేశవ్యాప్తంగా వైద్య విద్యకు 10,000 కొత్త సీట్లు, ఐఐటీలలో 6,500 కొత్త సీట్లు అందుబాటులోకి తెచ్చాం. విద్యారంగ విస్తరణతోపాటు ఆవిష్కరణల వేగం పెరిగిందనడానికి ఇదొక నిదర్శనం. అలాగే, దేశం నలుమూలలకూ ఆవిష్కరణలు చేరేవిధంగా 50,000 కొత్త అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశాం. ఒక దీపం అనేక ఇతర దీపాలను వెలిగిస్తుంది. కృత్రిమ మేధ (ఏఐ), నైపుణ్యాభివృద్ధి దిశగా కొత్త అత్యున్నత నైపుణ్య కేంద్రాల ఏర్పాటుకు ఈ ల్యాబులు తోడ్పడతాయి. భవిష్యత్తుకు సిద్ధం కావడానికి యువతకు అవకాశమిస్తాయి. 10,000 కొత్త పీఎం రీసెర్చ్ ఫెలోషిప్ లు ఆలోచన నుంచి ప్రభావం దాకా వారి ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి. అంతరిక్ష రంగం తరహాలోనే అణుశక్తి రంగంలోనూ అవకాశాలు అందివస్తాయి. దీంతో విభజన రేఖలు తొలగి ఆవిష్కరణలకు బాటలు పడతాయి. తొలిసారి గిగ్ఎ కానమీతో సంబంధం ఉన్న యువతకు సామాజిక భద్రత పథకం ప్రవేశపెట్టాం. గతంలో వీరికి పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదు. ఇప్పుడు ప్రభుత్వ విధానాలకు వారూ కేంద్రకంగా ఉన్నారు. ఎస్సీ/ఎస్టీ, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రూ.2 కోట్లదాకా టర్మ్ రుణాలు అందిస్తున్నాం. సార్వజననీత అనేది కేవలం వాగ్దానంగా మిగిలిపోకుండా నేడు అదొక విధానంగా రూపొందింది. ఈ నిర్ణయాలన్నీ దేశ యువతకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగిస్తాయి. దేశ ప్రగతి వారి పురోగమనంతో ముడిపడి ఉండటమే ఇందుకు కారణం.
మిత్రులారా…
మన దేశం గత 100 రోజుల్లో సాధించిన అసమాన విజయాలు ప్రగతి విషయంలో భారత్ ఏమాత్రం రాజీపడబోదని, ఆ వేగాన్ని ఆపడం ఎవరితరమూ కాదని, అచంచల దీక్షతో ముందడుగు వేస్తుందని రుజువు చేస్తున్నాయి. ఈ 100 రోజుల వ్యవధిలోనే అంతరిక్షంలో ఉపగ్రహాల జోడింపు, విడదీత ద్వారా ప్రపంచంలో ఈ సామర్థ్యంగల నాలుగో దేశంగా భారత్ అవతరించింది. అలాగే సెమీ-క్రయోజెనిక్ ఇంజిన్ను విజయవంతంగా పరీక్షించింది. 100 గిగావాట్ల సౌర విద్యుదుత్పాదన సామర్ధ్యాన్ని సాధించడం ద్వారా చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. మరోవైపు 1,000 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది. కీలక ఖనిజాల కార్యక్రమం ప్రారంభమైంది. ఇక కేంద్ర ప్రభుత్వోద్యోగుల కోసం 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. రైతులకు ఎరువులపై రాయితీలను పెంచడం వారి సంక్షేమంపై ప్రభుత్వ నిబద్ధతను చాటిచెబుతుంది. ఛత్తీస్‌గఢ్‌లో 3 లక్షలకు పైగా కుటుంబాల సామూహిక గృహప్రవేశ కార్యక్రమం జరిగింది. స్వామిత్వ పథకం కింద 65 లక్షలకు పైగా ఆస్తి కార్డులను పంపిణీ చేశాం. అదేవిధంగా ఈ 100 రోజుల్లోనే ప్రపంచంలోని ఎత్తయిన సొరంగాల్లో ఒకటైన సోనామార్గ్ ను దేశానికి అంకితం చేశాం. భారత నావికాదళంలో ‘ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ వాగ్షీర్’ నౌకలతో భారత నావికాదళం మరింత బలోపేతమైంది. సాయుధ దళాల కోసం ‘దేశీయంగా’ తయారు చేసిన ‘తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ల కొనుగోలుకు ఆమోదం ఇచ్చాం. వక్ఫ్స వరణకు బిల్లు ఆమోదం పొందడం సామాజిక న్యాయం వైపు పడిన ఓ కీలక ముందడుగు. ఈ 100
రోజులు కేవలం 100 నిర్ణయాలను మాత్రమే కాదు… 100 తీర్మానాలను నెరవేర్చడాన్ని సూచిస్తాయి.
మిత్రులారా…
రైజింగ్ భారత్‌కు వెన్నుదన్నుగా నిలుస్తున్న తారకమంత్రం ఈ పనితీరు మాత్రమే. రెండు రోజుల క్రితం నేను రామేశ్వరంలో ఉన్నానని మీ అందరికీ తెలుసు. అక్కడ, చారిత్రాత్మక పంబన్ వంతెనను ప్రారంభించే అవకాశం నాకు లభించింది. బ్రిటిష్ పాలకులు 125 ఏళ్ల కిందట అక్కడ నిర్మించిన వంతెన చరిత్రకు సాక్షిగా నిలిచిందని పేర్కొన్నారు. అనేక తుఫానులకు ఎదురొడ్డి నిలిచింది. ఒకసారి సునామీ, తుఫాను కారణంగా తీవ్రమైన నష్టాన్ని చవిచూసింది. దీనికి సంబంధించి ఏళ్ల తరబడి ప్రజలు మొరపెట్టుకుంటున్నా మునుపటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ వచ్చాయి. అయితే, కొత్త వంతెన పనులు తమ ప్రభుత్వం హయాంలోనే మొదలై, ప్రారంభోత్సవం కూడా జరగడం శుభ పరిణామం. అంతేగాక దేశంలో తొలి ‘వర్టికల్ లిఫ్ట్’ రైలు-సముద్ర వంతెన రూపొందింది.
మిత్రులారా…
ప్రాజెక్టులు ఆలస్యమైతే దేశం అభివృద్ధి చెందదు. పనితీరు, తక్షణ కార్యాచరణే పురోగమన సారథులుగా నిలుస్తాయి. ఆలస్యం అభివృద్ధికి శత్రువు. ఈ శత్రువును ఓడించాలని మేము నిర్ణయించుకున్నాం. నేను మీకు మరిన్ని ఉదాహరణలు చెబుతా. అస్సాంలోని బోగీబీల్ వంతెనను తీసుకోండి. మన మాజీ ప్రధాని శ్రీ దేవెగౌడ 1997లో దీనికి శంకుస్థాపన చేశారు. శ్రీ వాజ్ పేయీ అధికారంలోకి వచ్చినప్పుడు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆయన ప్రభుత్వం ఎన్నికలలో ఓడిపోయి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. ఈ ఆలస్యం కారణంగా అరుణాచల్, అస్సాంలో లక్షలాది ప్రజలు నానా అగచాట్లూ పడ్డారు. అయినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. 2014లో అధికారంలోకి వచ్చాక మేం ఈ ప్రాజెక్టును పునః ప్రారంభించాం. కేవలం నాలుగేళ్లలో.. అంటే 2018 నాటికి ఈ వంతెన పూర్తయింది. మరో ఉదాహరణ కేరళలోని కొల్లం బైపాస్ రోడ్ ప్రాజెక్ట్.కు సంబంధించింది. ఇది 1972 నుంచి నిలిచిపోయింది. 50 సంవత్సరాలు! ఒక్కసారి ఊహించుకోండి. అది ఎల్డీఎఫ్ అయినా, యూడీఎఫ్ అయినా, అర్ధ శతాబ్దం పాటు ఏ ప్రభుత్వం దానిపై పెద్దగా దృష్టిపెట్టలేదు. కానీ మేం అధికారంలోకి రాగానే ఐదేళ్లలోనే దాన్ని పూర్తి చేశాం.
మిత్రులారా…
అంతేకాదు నవీ ముంబయి విమానాశ్రయంపై 1997లో చర్చలు మొదలు కాగా, 2007లో దీనికిఆమోదముద్ర పడింది. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై చర్యలేవీ తీసుకోలేదు. మా ప్రభుత్వం వచ్చాక దీన్ని వేగిరపరచింది. నవీ ముంబయి విమానాశ్రయం నుంచి వాణిజ్య విమానాలు ప్రారంభమయ్యే రోజు ఇక ఎంతో దూరం లేదు.
మిత్రులారా…
నేను పంచుకుంటున్న విజయాల జాబితాలో కొత్త సంసద్ భవన్, భారత్ మండపం కూడా ఉన్నాయి.
మిత్రులారా…
ఏప్రిల్ 8 కి మరో ప్రత్యేకత ఉంది. అది ముద్రా యోజనకు 10 ఏళ్ళు పూర్తవడం. గతంలో హామీదారు లేకుండా బ్యాంకు ఖాతా తెరవడం కూడా సవాలుగా ఉండేదని ఇక్కడ కూర్చున్న చాలా మంది యువకులు తమ తల్లిదండ్రుల చెప్పగా వినే ఉంటారు. ఇక హామీలు, సిఫారసులు లేకుండా బ్యాంకు రుణాలు పొందడం సాధారణ కుటుంబాలకు ఒక కలగానే మిగిలేది. పేద కుటుంబాలు, ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ వర్గాలు, భూమిలేని కూలీలు, కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా కొలేటరల్ ఇవ్వలేని మహిళలపరిస్థితి ఏమిటి? వారి కలలు నెరవేరకూడదా? వారికి ఆకాంక్షలు ఉండకూడదా? వారి శ్రమకు విలువ లేదా? మేం తెచ్చిన ముద్రా యోజన వారి ఆకాంక్షలకు రూపమిచ్చి యువతకు కొత్త మార్గాన్ని అందించింది. గత దశాబ్ద కాలంలో ముద్రా యోజన కింద ఏ హామీ లేకుండానే 52 కోట్ల రుణాలు పంపిణీ చేశాం. ట్రాఫిక్ లైట్ ఎరుపు నుంచి ఆకుపచ్చ రంగులోకి మారే సమయానికి 100 ముద్రా రుణాలు ఆమోదం పొందుతున్నాయి. మీరు పళ్ళు తోముకోవడం పూర్తి చేసే సమయానికి ౨౦౦ ముద్రా రుణాలు మంజూరు అవుతున్నాయి. మీరు రేడియోలో ఇష్టమైన పాట విన్నంత సమయంలో 400 రుణాలు క్లియర్ అవుతున్నాయి. ఏదైనా డెలివరీ యాప్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టి అది వచ్చేలోపు 1,000 ముద్రా రుణాలు మంజూరవుతున్నాయి. ఓటీటీలో ఓ ఎపిసోడ్ పూర్తయ్యేలోగా ముద్రా యోజన కింద 5,000 చిన్న వ్యాపారాలు మొదలవుతున్నాయి.
మిత్రులారా…
ముద్రా యోజనకు పూచీకత్తులు అవసరం లేదు. ఇది ప్రజలపై నమ్మకముంచింది. ఈ పథకం ద్వారా ౧౧ కోట్ల మంది తొలిసారిగా స్వయం ఉపాధి కోసం రుణాలు పొందే అవకాశం లభించిందనీ.. తద్వారా మొదటిసారిగా వారు పారిశ్రామికవేత్తలుగా ఎదిగారని తెలిస్తే మీరెంతో సంతోషిస్తారు. మరోరకంగా చెప్పాలంటే గత దశాబ్ద కాలంలో ముద్రా యోజన ద్వారా 11 కోట్ల కలలకు రెక్కలొచ్చాయి. గ్రామాలూ చిన్నపట్టణాలు.. ఇలా అన్నిచోట్లా ఈ పథకం కింద దాదాపు రూ.33 లక్షల కోట్లు పంపిణీ చేశాం. అవును అక్షరాలా ముప్పై మూడు లక్షల కోట్ల రూపాయలు! అనేక దేశాల జీడీపీ కన్నా ఇది ఎక్కువ. ఇది కేవలం మైక్రో ఫైనాన్స్ మాత్రమే కాదు.. క్షేత్రస్థాయిలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పు కూడా.
మిత్రులారా…
మరో ఉదాహరణ ఆకాంక్షాత్మక జిల్లాలు, బ్లాకుల కార్యక్రమం. మునుపటి ప్రభుత్వాలు 100 కి పైగా జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా ముద్రవేసి నిర్లక్ష్యానికి గురిచేశాయి వీటిలో చాలా వరకు జిల్లాలు ఈశాన్య, గిరిజన ప్రాంతాల్లో ఉండేవి. అత్యుత్తమ ప్రతిభా పాటవాలున్న అధికారులను ప్రభుత్వం ఈ జిల్లాలకు పంపాల్సి ఉండేది. దానికి బదులు అధికారులను శిక్ష రూపంలో అక్కడికి బదిలీ చేసేవారు. “వెనుకబడినవారిని వెనుకబడే ఉండనివ్వండి” అన్న సంకుచిత మనస్తత్వానికి ఇది నిదర్శనం. మేము ఈ విధానాన్ని మార్చాం. ఈ ప్రాంతాలను ఆకాంక్షాత్మక జిల్లాలుగా ప్రకటించాం. మెరుగైన పరిపాలనపై దృష్టి సారించాం. మా ప్రధాన పథకాలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేశాం. వివిధ అంశాల ఆధారంగా ఈ జిల్లాల వృద్ధిని పర్యవేక్షించాం. నేడు ఈ ఆకాంక్షాత్మక జిల్లాలలో చాలా వరకు రాష్ట్ర సగటును అధిగమించాయి. కొన్ని అభివృద్ధిలో జాతీయ సగటును కూడా అధిగమించాయి. ఈ మార్పు స్థానిక యువతకు అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. ‘‘మేం కూడా సాధిస్తాం, మేం కూడా పురోగమిస్తాం’’ అని ఈ జిల్లాల్లో యువత ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో చెప్పగలుగుతుంది. నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంస్థలు, జర్నళ్ల నుంచి ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమానికి గుర్తింపు, ప్రశంసలు దక్కాయి. ఈ విజయంతో ప్రేరణ పొందిన మేం ఇప్పుడు 500 ఆశాజనక బ్లాక్ లపై పని
చేస్తున్నాం. ఆకాంక్షలతో ముందుకు నడిచే వృద్ధి సమ్మిళితం, సుస్థిరంగా ఉంటుంది.
మిత్రులారా…
ఒక దేశం త్వరితగతిన అభివృద్ధి చెందాలంటే శాంతి, సుస్థిరత, భద్రతా భావం అత్యావశ్యకం. चित्त जेथा भयशून्यो, उच्च जेथा शिर… అంటే ‘‘ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో… అక్కడ గర్వంగా తలెత్తుకోగలం’’ అని గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పారు. కానీ భయం, ఉగ్రవాదం, హింసలతో కూడిన వాతావరణాన్ని భారత్ దశాబ్దాలుగా ఎదుర్కొంది. దీనివల్ల యువత తీవ్రంగా నష్టపోయింది. యువత జీవితాలను హింస, వేర్పాటువాదం, ఉగ్రవాదం తినేశాయి. కొన్ని తరాలుగా జమ్మూ కాశ్మీర్ యువకులు బాంబు దాడులు, కాల్పులు, రాళ్ల దాడులకు గురయ్యారు. గత ప్రభుత్వాలు ఈ మంటలను ఆర్పే ధైర్యం చేయలేకపోయాయి. మా ప్రభుత్వ బలమైన రాజకీయ సంకల్పం, సునిశిత చర్యలు జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితిని సమూలంగా మార్చేశాయి. జమ్ముకాశ్మీర్ యువత నేడు అభివృద్ధిలో క్రియాశీలక భాగస్వాములవుతున్నారు.
మిత్రులారా…
నక్సలిజం సమస్యను చూడండి… ఒకానొక సమయంలో దేశంలోని 125 కి పైగా జిల్లాలు హింస, ఉగ్రవాదంతో సతమతమవుతున్నాయి. అవును.. 125 జిల్లాలు! నక్సలిజం మొదలవడంతో ప్రభుత్వ పరిధి అక్కడితో ముగిసిపోయింది. పెద్ద సంఖ్యలో యువత నక్సలిజం బాధితులయ్యారు. వీరిని తిరిగి ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి మేం సర్వ శక్తులూ కేంద్రీకరించాం. గత పదేళ్లలో 8,000 మందికి పైగా నక్సలైట్లు లొంగిపోయి హింసా మార్గాన్ని విడిచిపెట్టారు. దేశంలో నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య ఇప్పుడు 20 కంటే తక్కువే ఉంది. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాలు కూడా దశాబ్దాల తరబడి వేర్పాటువాదాన్ని, హింసను భరించాయి. గత పదేళ్లలో మా ప్రభుత్వం 10 ప్రధాన శాంతి ఒప్పందాలపై సంతకాలు చేసింది. ఈ కాలంలో 10,000 మందికి పైగా యువకులు తమ ఆయుధాలను విడిచిపెట్టి అభివృద్ధి బాట పట్టారు. నిజమైన విజయం కేవలం వేలాది మంది ఆయుధాలను విడిచిపెడితే వచ్చేది కాదు…వారు తమ భవిష్యత్ వర్తమానాలను కాపాడుకున్నప్పుడే విజయం సాధ్యమవుతుంది.
మిత్రులారా…
దశాబ్దాలుగా దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించకుండా, రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని మరుగున పడి ఉండేలా చేశారు. ఇప్పుడీ సమస్యలను ముఖాముఖి ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. 20వ శతాబ్దపు రాజకీయ తప్పిదాలు 21వ శతాబ్దపు తరాలపై భారం మోపడాన్ని అనుమతించలేం. దేశ అభివృద్ధికి అతిపెద్ద అడ్డంకులలో ఒకటి బుజ్జగింపు రాజకీయాలు. వక్ఫ్ సంబంధిత చట్టాలకు పార్లమెంట్ లో జరిగిన ఇటీవలి సవరణలు జరిగాయి. దీని గురించి మీ నెట్వర్క్లలో కూడా విస్తృతంగా చర్చించారు. వక్ఫ్ చట్టాల చుట్టూ ఇప్పుడు జరుగుతున్న చర్చలన్నీ బుజ్జగింపు రాజకీయాల ఫలితమే. ఈ తరహా రాజకీయ బుజ్జగింపులు మనకు కొత్తేమీ కాదు… వీటికి స్వాతంత్య్ర పోరాటం సమయంలోనే బీజం పడింది. ఒకసారి ఆలోచించండి… మనకంటే ముందో, వెనకో, మనతో పాటో చాలా దేశాలు స్వాతంత్య్రం పొందాయి. కానీ స్వాతంత్య్రం కోసం విభజన తప్పదనే షరతుకు వీటిలో ఎన్ని దేశాలు అంగీకరించేవో చెప్పండి?. విభజనను స్వేచ్ఛకు షరతుగా అంగీకరించాల్సి వచ్చింది? స్వాతంత్య్రం పొందిన సమయంలో ఎన్ని దేశాలు విభజనకు గురయ్యాయి? భారత్ ఒక్కదానికే ఎందుకు అలా జరగాలి? ఎందుకంటే ఆ సమయంలో, ఆ సమయంలో దేశ ప్రయోజనాల కన్నా అధికారానికే ప్రాధాన్యం ఇవ్వడమే కారణం. ప్రత్యేక దేశం అనే ఆలోచన సాధారణ ముస్లిం కుటుంబాలది కాదు… ఇది కొద్దిమంది అతివాదులు చేసిన ప్రచారం. ఏకపక్షంగా అధికారాన్ని పొందడం కోసం కొందరు కాంగ్రెస్ నాయకులు వారికి సహకరించారు.
మిత్రులారా…
ఈ బుజ్జగింపు రాజకీయాలు కాంగ్రెస్‌కు అధికారాన్నీ.. కొందరు అతివాద నాయకులకు శక్తిని, సంపదను ఇచ్చాయి. కానీ, ఓ సాధారణ ముస్లింకు దీనివల్ల లభించిందేమిటన్నదే అసలైన ప్రశ్న. పేదలు, పస్మండా (అణగారిన) ముస్లింలకు ఏమి మిగిలింది? నిర్లక్ష్యం తప్ప. వారు నిరక్షరాస్యులుగా మిగిలిపోయారు. నిరుద్యోగంతో నలిగిపోయారు. ముస్లిం మహిళలకు ఏమి లభించింది? ముస్లిం మహిళలు అన్యాయానికి గురయ్యారు. షా బానో కేసు ఇందుకో ఉదాహరణ. అతివాద ధోరణుల వల్ల ఆ కేసులో వారి రాజ్యాంగ హక్కులను నిర్లక్ష్యం చేశారు. మహిళలను నోరు విప్పనివ్వలేదు.ప్రశ్నించే అవకాశం కూడా ఇవ్వకుండా వారిపై ఒత్తిడి పెంచారు. మరోవైపు అతివాదులకు మహిళల హక్కులను అణచివేసేలా పూర్తి స్వేచ్ఛనిచ్చారు.
మిత్రులారా…
బుజ్జగింపు రాజకీయాలు మన దేశంలో సామాజిక న్యాయమనే ప్రధాన సూత్రానికి పూర్తిగా విరుద్ధం. కానీ కాంగ్రెస్ దాన్ని ఓటు బ్యాంకు రాజకీయాలకు సాధనంగా ఉపయోగించుకుంది. 2013లో వక్ఫ్ చట్టానికి చేసిన సవరణ అతివాద శక్తులను, భూ మాఫియాలను సంతోషపరిచే ప్రయత్నం తప్ప మరొకటి కాదు.ఈ చట్టం రాజ్యాంగానికి అతీతంగా ఉన్నట్లు అనిపించేలా రూపొందించారు. రాజ్యాంగం అనేది న్యాయానికి పథ నిర్దేశం చేస్తుంది. కానీ, ఈ వక్ఫ్ చట్టం ఆ మార్గాలను పరిమితం చేసేసింది. ఫలితం.. రాడికల్స్ ,భూమాఫియాలు పెచ్చుమీరాయి. కేరళలోని క్రైస్తవులకు చెందిన భూములు తమవేనన్న వక్ఫ్ వాదన తెరపైకి వచ్చింది. హర్యానాలో గురుద్వారా భూములను వివాదాల్లోకి లాగారు. కర్ణాటకలో రైతుల భూములను వక్ఫ్ క్లెయిమ్ ల పరిధిలోకి తెచ్చారు. అనేక రాష్ట్రాల్లో కొన్ని గ్రామాలు, వేల హెక్టార్ల భూమి ఇప్పుడు ఎన్ వోసీ, చట్టపరమైన సమస్యలలో చిక్కుకున్నాయి. దేవాలయాలు, చర్చిలు, గురుద్వారాలు, పొలాలు లేదా ప్రభుత్వ భూములు ఏవైనా… తమ ఆస్తులపై యాజమాన్యాన్ని నిలుపుకోగలమన్న నమ్మకాన్ని ప్రజలు కోల్పోయారు. ఒకే ఒక్క నోటీసు వల్ల.. అనేక మంది తమ సొంత ఇళ్లు, పొలాలు తమవే అని నిరూపించుకోవడానికి పత్రాల కోసం పాట్లు పడ్డారు. న్యాయం చేయాల్సిన చట్టం భీతి గొలిపేలా చేసింది. ఇది ఎక్కడి చట్టం?
మిత్రులారా…
ముస్లిం సమాజంతో సహా అన్ని వర్గాల ప్రయోజనాలకు ఉపయోగపడే అద్భుతమైన చట్టాన్ని ఆమోదించిన పార్లమెంటును నేను అభినందిస్తున్నాను. ఈ చట్టం వక్ఫ్ పవిత్రతను కాపాడుతుంది. అదే సమయంలో పేద, పస్మండా (అణగారిన) ముస్లింలు, మహిళలు, పిల్లల హక్కులను పరిరక్షిస్తుంది. వక్ఫ్ బిల్లుపై జరిగిన చర్చ గత 75 ఏళ్లలో మన పార్లమెంటరీ చరిత్రలోనే రెండో సుదీర్ఘ చర్చ. ఈ బిల్లుపై ఉభయ సభలలోనూ 16 గంటల పాటు చర్చించారు. సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) 38 సమావేశాలు నిర్వహించింది. 128 గంటల పాటు చర్చలలో పాల్గొంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ ద్వారా దాదాపు కోటి సూచనలు వచ్చాయి. ఈ రోజు దేశంలో ప్రజాస్వామ్యం ఇక పార్లమెంటు నాలుగు గోడలకే పరిమితం కాదని ఇది నిరూపిస్తుంది. ప్రజల భాగస్వామ్యం మన ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తోంది.
మిత్రులారా…
నేడు సాంకేతికత, కృత్రిమ మేధతో ప్రపంచం వేగంగా దూసుకుపోతోంది. ఈనేపథ్యంలో మనం కళ, సంగీతం, సంస్కృతి సృజనాత్మకతలపై మరింత దృష్టి పెట్టాలి. ఎందుకంటే మనం రోబోట్లను కాదు, మానవులను సిద్ధం చేయాలనుకుంటున్నాం. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ సృజనాత్మకత ద్వారా మనం మానవత్వాన్ని, సున్నితత్వాన్ని పెంచేలా చూడాలి. ప్రపంచంలో అతి పెద్ద పరిశ్రమల్లో వినోద పరిశ్రమ ఒకటి. ఇది మరింత విస్తరించబోతోంది. కళను, సంస్కృతిని ప్రోత్సహించి, వాటి ఘనతను చాటడం కోసం అంతర్జాతీయ వేదికగా వేవ్స్ (ప్రపంచ దృశ్య, శ్రవణ వినోద సదస్సు)ను ప్రారంభించాం. రాహుల్ మాట్లాడుతున్నప్పుడు మీరు వేవ్స్ అనే పదాన్ని చాలాసార్లు వినే ఉంటారు. ఇది 2014 లో ప్రారంభించింది కాదు; ఇది ప్రతి దశాబ్దంలో కొత్త రూపాలు, ఆవిష్కరణలతో అభివృద్ధి చెందుతూనే ఉంది. ఈ రోజు నేను వేవ్స్ -ప్రపంచ దృశ్య, శ్రవణ వినోద సదస్సు- గురించి మాట్లాడుతున్నా.. ఈ వేదికను సిద్ధం చేశారు. వచ్చే నెలలో ఈ వేవ్స్ కు ముంబయి ఆతిథ్యం ఇస్తోంది. ఇది ఒక నిత్య అంతర్జాతీయ కార్యక్రమంగా జరుగుతూనే ఉంటుంది. సినిమాలు, పాడ్కాస్ట్లు, గేమింగ్, సంగీతం, ఏఆర్, వీఆర్ లు భారత్ లో శక్తిమంతమైన, సృజనాత్మక రంగాలుగా వెలుగొందుతున్న విషయం మీకు తెలుసు. ఈ రంగాలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ‘క్రియేట్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని రూపొందించాం. భారతీయ కళాకారులు కళారూపాలను సృష్టించి ప్రపంచంతో పంచుకోవడానికి వేవ్స్ వేదికగా నిలుస్తుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులను భారత్ కు ఆహ్వానించడానికి కూడా మంచి అవకాశాన్ని ఇస్తుంది. వేవ్స్ వేదికకు ప్రాచుర్యం కల్పించేందుకు సహాయపడాలని నేను నెట్‌వర్క్ 18ను కోరుతున్నాను. సృజనాత్మక రంగాలకు చెందిన యువ నిపుణులు ఈ వేదికలో భాగస్వాములు కావాలి. వీరిలో కొందరిని కలిసే అవకాశం కూడా నాకు లభించింది. వేవ్స్ ప్రతీ ఇంటిని, ప్రతీ గుండెనూ తాకాలి! మీరు ఇది జరిగేలా చేస్తారని నాకు నమ్మకం ఉంది. ఈ సదస్సు ద్వారా నెట్‌వర్క్ 18 దేశ యువతలోని సృజనాత్మకత, వారి ఆలోచనలు, దృఢ సంకల్పాన్ని అద్భుగా చాటి చెప్పింది. దేశం ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ఆలోచించడానికి, సూచనలివ్వడానికి, పరిష్కారాలను గుర్తించడానికి యువతను ప్రోత్సహించడం ప్రశంసనీయం. యువతను కేవలం శ్రోతలుగా మాత్రమే కాకుండా మార్పు దిశగా వారిని క్రియాశీలక భాగస్వాములను చేయడం మంచి ప్రయత్నం. ఇప్పుడు యూనివర్సిటీలు, కళాశాలలు, పరిశోధన సంస్థలుఈ సదస్సును ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుతున్నా. ప్రామాణిక రికార్డులు, అధ్యయనం, విలువైన సలహాలూ సూచనలను విధాన రూపకల్పనలో పొందుపరచడం ద్వారా.. ఈ సదస్సును చిరస్థాయిలో నిలపాల్సిన ఆవశ్యకత ఉంది. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదగాలన్న సంకల్పానికి యువత ఉత్సాహం, ఆలోచనలు, భాగస్వామ్యం చోదక శక్తులుగా నిలుస్తాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా మన యువతకు మరోసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా.
ధన్యవాదాలు!
గమనిక ఇది ప్రధాన మంత్రి ప్రసంగానికి దాదాపు అనువాదం. అసలు ప్రసంగం హిందీలో చేశారు.
Addressing the #RisingBharatSummit2025. Do watch. @CNNnews18 https://t.co/Y2AADRZP2k
— Narendra Modi (@narendramodi) April 8, 2025
The world's eyes are on India. So are its expectations. pic.twitter.com/swrVsLVlJA
— PMO India (@PMOIndia) April 8, 2025
India has sprinted ahead at double the speed, doubling the size of its economy in just one decade. pic.twitter.com/WEFEAYJOD3
— PMO India (@PMOIndia) April 8, 2025
Fast and Fearless India. pic.twitter.com/apfvglfe8C
— PMO India (@PMOIndia) April 8, 2025
Delay is the enemy of development. pic.twitter.com/xfj3aFBexa
— PMO India (@PMOIndia) April 8, 2025
When growth is driven by aspirations, it becomes inclusive and sustainable. pic.twitter.com/XCsuLmH0eS
— PMO India (@PMOIndia) April 8, 2025
Ensuring dignity for all, especially the marginalised. pic.twitter.com/jSuaCwMZdB
— PMO India (@PMOIndia) April 8, 2025
WAVES will empower Indian artists to create and take their content to the global stage. pic.twitter.com/RzMfoKGUjZ
— PMO India (@PMOIndia) April 8, 2025
Delay is the enemy of development!
— Narendra Modi (@narendramodi) April 9, 2025
And, India is comprehensively defeating this culture of delays in all sectors. pic.twitter.com/etGFsaUViF
Mudra Yojana is not just micro-finance, it is a mega transformation at the grassroots. #10YearsOfMUDRA pic.twitter.com/imZHJpAxRu
— Narendra Modi (@narendramodi) April 9, 2025
We are building an India where peace, stability and security are the foundation of our nation's rapid progress. pic.twitter.com/c3xdZhSISJ
— Narendra Modi (@narendramodi) April 9, 2025
Appeasement politics stands in complete contradiction to the idea of true social justice. pic.twitter.com/IdE82IGZ3I
— Narendra Modi (@narendramodi) April 9, 2025
Entertainment is one of the world’s fastest-growing industries and it’s only getting bigger.
— Narendra Modi (@narendramodi) April 9, 2025
The WAVES Summit will showcase India’s creative power on the global stage. pic.twitter.com/ffbW95EUGm