పిఎంఇండియా
న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎ ఐ ఐ ఎమ్ ఎస్) కు చెందిన వెస్ట్ అన్సారీ నగర్, ఆయుర్ విజ్ఞాన్ నగర్ కేంపస్ లలో నివాస సముదాయాల పునర్వికాసానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న ఇళ్ళ సముదాయాల స్థానంలో కొత్త నివాసాలను నిర్మించే కార్యక్రమాన్ని నేషనల్ బిల్డింగ్స్ కన్ స్ట్రక్షన్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఎన్‌బిసిసి ) చేపడుతుంది. సుమారు 0.87 లక్షల చదరపు మీటర్ల బిల్డప్ ఏరియా (బియుఎ)తో టైప్ I నుండి టైప్ IV వరకు 1,444 నివాస భవనాలు, సుమారు 4.02 లక్షల చదరపు మీటర్ల బియుఎతో టైప్ II నుండి టైప్ VI వరకు 3,928 నివాస భవనాలు ప్రస్తుతం ఉన్నాయి. సుమారు 0.65 లక్షల చదరపు మీటర్ల సామాజిక మౌలిక సదుపాయాలను కూడా ఇది సృష్టిస్తుంది. ఇందులో ఒక ధర్మశాల సహా ఇంచుమించు 0.94 లక్షల చదరపు మీటర్ల వాణిజ్య బియుఎ కూడా ఉంటాయి.
30 సంవత్సరాల పాటు నిర్వహణ మరియు కార్యకలాపాల వ్యయాలను కలుపుకొని మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.4,441 కోట్లు. వాణిజ్య స్థలాన్ని ఫ్రీ హోల్డ్ బేసిస్ పద్ధతిలో అమ్మడం ద్వారా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ద్వారా ఈ ప్రాజెక్టును అమలు చేయడం జరుగుతుంది. దశలవారీగా 5 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తారు.
పూర్వ రంగం:
వెస్ట్ అన్సారీ నగర్ మరియు ఆయుర్ విజ్ఞాన్ నగర్ కేంపస్‌లలో ఇప్పుడు ఉన్న నివాస గృహాలు 50- 60 సంవత్సరాలకు పైబడినవి. వాటికి కాలం చెల్లింది. వాటిలో నివసించడం సురక్షితం కాదు. ఈ పాతబడ్డ ఇళ్ళ స్థితి వేగంగా క్షీణిస్తుండడంతో వాటి నిర్వహణకు ఎంతో ఎక్కువ మొత్తం ఖర్చుపెట్టవలసి వస్తున్నది. న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్‌లోని ప్రస్తుత గృహ సముదాయం భూమిని ఎంత అసమర్థంగా ఉపయోగిస్తున్నారో చాటిచెప్తున్నది. అందువల్ల హరిత భవన నిబంధనలు మరియు ఘన/ ద్రవ వ్యర్థాల నిర్వహణ పద్ధతులతో కూడిన ఆధునిక నిర్మాణ సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగిస్తూ మాస్టర్ ప్లాన్ ఢిల్లీ (ఎమ్ పిడి) – 2021 ప్రకారం భూ వనరులను గరిష్ఠ స్థాయిలో వినియోగించుకొని గృహ సముదాయాన్ని మెరుగుపరచడం కోసం ప్రస్తుతం ఉనికిలో వున్న పాత, శిథిలావస్థలో ఉన్న గృహ సముదాయాన్ని పునర్ వికాసం కోసం ఒక ప్రతిపాదనను ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ముందుకుతెచ్చింది.
***