Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

న్యూ ఢిల్లీ లో రామ్ నాథ్ గోయెంకా పురస్కారాల ప్ర‌దాన కార్యక్రమంలో ప్ర‌ధాన‌ మంత్రి కీలకోపన్యాస పాఠం

న్యూ ఢిల్లీ లో రామ్ నాథ్ గోయెంకా పురస్కారాల ప్ర‌దాన కార్యక్రమంలో ప్ర‌ధాన‌ మంత్రి కీలకోపన్యాస పాఠం


స‌మావేశానికి హాజ‌రైన ప్ర‌ముఖులారా,

పురస్కారాలను గెలుచుకొన్న వారంద‌రినీ నేను అభినందిస్తున్నాను. అలాగే అవార్డుకు చేరువ వ‌ర‌కు వ‌చ్చినా దాన్ని సాధించ‌లేక‌పోయిన వారికి కూడా నా అభినంద‌న‌లు. ఈ ప్ర‌య‌త్నం కొన‌సాగాలి. ప్ర‌తిఒక్క‌రు త‌మ‌ క‌లంతో, ఆలోచ‌న ధోర‌ణితో, క‌ఠోర శ్ర‌మతో దేశ పురోభివృద్ధికి ఎంతో కొంత వాటాను అందించే కృషిని కొన‌సాగించాలి.

తాము ప‌ని చేస్తున్న రంగంలో జీవిత‌ కాలంలో ఎంతో ఉత్కృష్ట‌మైన మ‌లుపు లోకి ప్ర‌వేశించిన వారు ఎంద‌రో ఉన్నారు. మ‌రి కొంద‌రు తాము ప‌ని చేస్తున్న రంగానికి వెలుప‌ల కూడా త‌మ‌కంటూ ఒక స్థానం సంపాదించుకుంటే, కొద్ది మంది మాత్ర‌మే జీవిత‌ కాలంలో ఎంతో ఉన్న‌త స్థానం సొంతం చేసుకొంటారు. అటువంటి గొప్ప వ్య‌క్తిత్వం ఉన్న వారు రామ్ నాథ్ గోయెంకా గారు.

రామ్ నాథ్‌ గారిని క‌లిసే అవ‌కాశం లభించడం ఎంతో అదృష్టం. ఆయ‌న గుజ‌రాత్ కు విచ్చేశారు. ఆయ‌న ఎంతో ఉన్న‌త స్థాయి వ్య‌క్తి కావ‌డం వ‌ల్ల ఆయ‌న‌ను క‌లిసేందుకు వ‌చ్చే వారిలో రాజ‌కీయ ప్ర‌ముఖుల నుండి ముఖ్య‌మంత్రులు, ప్రసార మాధ్యమాల రంగానికి చెందిన అత్యంత ప్ర‌ముఖులైన సంపాద‌కులు ఎంద‌రో ఉంటారు. అప్ప‌టికి నాకు ఒక గుర్తింపు ఏదీ లేదు. న‌గ‌రం లోని ఒక సంపాద‌కుడిని క‌లిసేందుకు నెల రోజుల వ‌ర‌కు వేచి ఉండవలసి వ‌చ్చింది. అటువంటిది రామ్ నాథ్‌ గారిని క‌లిసే భాగ్యం నాకు దక్కింది. అది జెపి ఉద్య‌మ స‌మ‌యం. రామ్ నాథ్ గోయెంకా గారిలో ఒక అగ్నిశిఖ ఉన్న‌ట్టు మేం భావించాం. అది కేవ‌లం ఇండియ‌న్ ఎక్స్ ప్రెస్ కు ప‌రిమితం కాదు. వార్తాప‌త్రిక‌లలో వ‌స్తున్న వార్త‌ల ప‌ట్ల ఆయ‌న సంతృప్తి చెంద‌లేదు. త‌న ఆలోచ‌న‌లు, భావాలు ప‌త్రిక‌లో స‌రిగా ప్ర‌తిబింబించ‌డం లేద‌ని ఆయ‌న భావించారు. అందుకే వార్తాప‌త్రిక‌ల‌కు వెలుప‌ల ఏదో ఒక‌టి చేయాల‌ని ఆయ‌న అనుకున్నారు. ఆ స‌మ‌యంలో జ‌య‌ప్ర‌కాశ్‌ గారికి అండ‌గా నిల‌బ‌డిన కొద్ది మందిలో రామ్ నాథ్ గోయెంకా గారు ఒక‌రు. ఆయ‌న ఎప్పుడూ తాను న‌మ్మిన సిద్ధాంతాల‌కే క‌ట్టుబ‌డే వారు. ఆ రోజుల్లో ప్ర‌తి ఒక్క‌రికీ ఒక కుటుంబం గురించి బాగా తెలుసు. ఆ కుటుంబంతో స‌న్నిహిత అనుబంధం క‌లిగిన ప్ర‌తి ఒక్క‌రికీ ఆ కుటుంబం అనుస‌రించే సిద్ధాంతాలు బాగా తెలుసు. ఆ కుటుంబం నుంచి ఏదో ఒక మేలు, ఆశీస్సులు పొందేందుకు ప‌రిత‌పించే వారికి కొద‌వే లేదు. కాని త‌న ఆశ‌యాలు, సిద్ధాంతాల కోసం గోయెంకా గారు ఆ కుటుంబంతోనే తెగ‌తెంపులు చేసుకొన్నారు.

పాత్రికేయ అనుభ‌వాన్ని రంగ‌రించి ప‌త్రిక‌కు రాసే వార్త‌లు, వ్యాసాల‌కు మాత్ర‌మే అది ప‌రిమితం కాలేదు. పత్రికారచన కోర్సు మూలాల్లోకి వెళ్తే, ఈ రోజు ఆ కోర్సులో ఏ పాఠ్యాంశాలున్నాయో నాకు తెలియ‌దు. కాని పత్రికారచన చ‌రిత్ర‌, అభివృద్ధి స్వాతంత్ర్య ఉద్యమంతో ముడిప‌డి ఉంది. వార్తాప‌త్రిక‌తో ముడిప‌డ‌ని స్వాతంత్ర్య ఉద్య‌మం ఏదీ లేదు. బ్రిటిష్ పాల‌న‌కు వ్య‌తిరేకంగా ప్రసార మాధ్యమాలు పోరాడాయి. పత్రికారచన మాధ్య‌మంగా చేసుకుని ఆ రంగంలోని ఎంద‌రో బ్రిటిష‌ర్ల ఆలోచ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా పోరాడి సుదీర్ఘ కాలం క‌ట‌క‌టాల వెనుక మ‌గ్గాల్సి వ‌చ్చింది. అయినా వారు పోరాట పంథా ను వీడ‌లేదు. తిల‌క్‌ గారు, గాంధీ గారు, అర‌బిందో గారు ల వంటి వారు ఎంద‌రో స్వాత్రంత్ర్య సమరాన్ని విస్త‌రించ‌డానికి వార్తాప‌త్రిక‌ల‌ను బ‌ల‌మైన మాధ్య‌మంగా ఉప‌యోగించుకొన్నారు. స‌ర‌స్వ‌తి క‌టాక్షం ఉన్న పిల్ల‌లెంద‌రో ఉండ‌డం భార‌తదేశం ప్ర‌త్యేక ల‌క్ష‌ణాలలో ఒక‌టి. తేలిక‌పాటి ప‌ద్య‌ర‌చ‌న నుండి ఆశువుగా సాహిత్యం రాసిన వారు అనేక మంది ఉన్నారు. వారంద‌రికీ స‌ర‌స్వ‌తి మాత ఆశీస్సులు ఉన్నాయి.

ప్ర‌ముఖ ర‌చ‌యిత‌లు అనేకులు పత్రికారచన లోకి ప్ర‌వేశించ‌డానికి ప్రాధాన్యమిచ్చారు. పత్రికారచన నేర్చుకొనేది కాదు. వారు క‌విత‌ల ద్వారా వారి లోపలి భావాల‌ను వెల్లడించడ‌మే కాదు, స్వాతంత్ర్య ఉద్య‌మ స్ఫూర్తిని ర‌గిలించేందుకు పత్రికారచన ను ఆయుధంగా వాడుకొన్నారు. క‌విత‌ల క‌న్నా పత్రికారచన కు గ‌ల‌ శ‌క్తి బ‌లీయ‌మైంద‌ని వారు గుర్తించారు. క‌విత‌ల ల‌క్ష్యం వినోదాన్ని పంచ‌డమయితే, పత్రికారచన ల‌క్ష్యం జాతి సంక్షేమం. ఆ సాహిత్యాన్నంతటినీ మ‌న కోసం వ‌దలి వెళ్లారు. అదే భార‌తదేశ ప్ర‌యాణం. బ్రిటిష‌ర్లు కూడా సంక్షోభాన్ని ఎదుర్కొన్న అంశాలు కొన్ని ఉన్నాయి. అటువంటి వాటిలో విద్యావంతుల స‌మ‌స్య ఒక‌టి. త‌మ‌కు వ్య‌తిరేకంగా ప‌ని చేసే, పోరాడే వ్య‌వ‌స్థ ఒక‌టి ఉండాల‌ని వారు ఆలోచించే వారు.

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. స్వాతంత్ర్యం సిద్ధించిన అనంత‌రం ప్ర‌జాస్వామ్య ప‌టిష్ఠ‌త‌లో పత్రికారచన కీల‌కమైన పాత్రను పోషించింది. ఎవ‌రినో విమ‌ర్శించేందుకు లేదా కించ‌ప‌రిచేందుకు చెప్పిన మాట కాదిది. ఉదాహ‌ర‌ణ‌కు ఒక అంటు వ్యాధి ప్ర‌బ‌లితే ప్ర‌తి ఒక్క‌రూ ఆ వ్యాధిని గురించి ఆలోచిస్తారు. తెలిసిన దాని నుండి తెలియ‌ని దానికి క‌ద‌ల‌డం తేలిక కావ‌డ‌మే ఇందుకు కార‌ణం. అందుకే ప్ర‌జాస్వామ్యానికి ఏర్ప‌డే ముప్పును తెలుసుకోవాలంటే ఎమ‌ర్జెన్సీని గురించి అవ‌గాహ‌న సాధించ‌డం అవ‌స‌రం. ఎమ‌ర్జెన్సీ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఏర్ప‌డింది. దానిని రాజ‌కీయ సూచీల ద్వారా వారు మ‌దింపు చేసే వారు. రాజకీయ క్రీడ అక్క‌డితే ముగిసిపోయింద‌ని నేను భావిస్తున్నాను. దానిని స‌హ‌జ‌ సిద్ధంగానే స‌మీక్షించవలసి ఉంది. నేను ఇక్క‌డ విమ‌ర్శ అనే ప‌దం వాడ‌లేదు. ప్ర‌తి త‌రంలో అటువంటి స‌మీక్ష జ‌రిగిన‌ప్పుడే అటువంటి పాపాలు చేయాల‌నుకొనే వ్య‌క్తులు మ‌ళ్లీ పుట్ట‌రు. ఆ ప్రాధాన్యాన్ని గుర్తించే మా లాంటి వ్య‌క్తులు ప‌దేప‌దే ఎమ‌ర్జెన్సీ కాలం గురించి గుర్తు చేస్తూ ఉంటారు. ఆ రోజులలో ఆ నిర్ణ‌యాన్ని స‌వాలు చేసిన వారు చాలా కొద్ది మందే ఉన్నారు. అటువంటి వారిలో రామ్‌నాథ్ గోయెంకా గారు ఒక‌రు. ఎమ‌ర్జెన్సీకి వ్య‌తిరేకంగా ఆయ‌న ప‌త్రిక ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ పోరాడింది. ఏ భ‌యం లేకుండా ఆయ‌న ఆ పోరాటం సాగించారు. ప్ర‌జాస్వామ్యానికి ఆ అధ్యాయం ఎంతో కీల‌క‌మైంద‌ని నేను భావిస్తున్నాను. ప్ర‌తి యుగంలోనూ ప్ర‌జాస్వామ్యం మ‌రింత ప‌రిఢ‌విల్లేందుకు కృషి చేయాల్సిన అవ‌స‌రం ఉంది.

గ‌తంలో లేని కొన్ని స‌వాళ్లు ఈ రోజు ప్రసార మాధ్యమాలు ఎదుర్కొంటున్నాయి. ఈ స‌వాళ్లు శ‌తాబ్ది మొత్తంలో క‌నివిని ఎరిగి ఉండ‌క‌పోవ‌చ్చు. సాంకేతిక విజ్ఞ‌ానమే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం. ఆధునిక సాంకేతిక విజ్ఞ‌ానం ప్రసార మాధ్యమాలకు పెను స‌వాలు విసరింది. గ‌తంలో 24 గంట‌ల త‌రువాత వార్త వ‌చ్చినా అది వార్త‌గానే ఉండేది. కానీ ఈ రోజు 24 సెకండ్లు ఆల‌స్యం అయితే అది పాచి వార్త‌గా మారిపోతోంది. మొబైల్ ఫోన్ ల లోనే ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌లు అప్‌ డేట్స్‌ గా వ‌స్తున్నాయి. క్ష‌ణాల వ్య‌వ‌ధిలో ప్ర‌పంచ వార్త‌ల‌న్నీ మ‌న ముందు వాలిపోతున్నాయి. టివి మీడియా అస్తిత్వం లోకి వ‌చ్చిన త‌రువాత ప్ర‌భుత్వాల‌కు చింత పెరిగిపోయింది. ఏ సంఘ‌ట‌నకైనా, లేదా వార్త‌కైనా స్పందించేందుకు ప్ర‌భుత్వానికి కొంత స‌మ‌యం అవ‌స‌రం. ఉదాహ‌ర‌ణ‌కు ఏదైనా అంటువ్యాధి ప్ర‌బ‌లిన‌ట్ట‌యితే, దాని నివార‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకొనే వారిని స‌మీక‌రించాల్సి ఉంటుంది. అలాగే ఏదైనా దాడి జ‌రిగితే పోలీసు బృందాన్ని పంపాల్సి ఉంటుంది. అందుకు త‌గిన వ్య‌వ‌ధి ని ప్రసార మాధ్యమాలు ఇవ్వ‌డం లేదు. వారికి అది “బ్రేకింగ్ న్యూస్‌.” ప్ర‌భుత్వం స్పందించ‌డానికి ముందే సామాజిక మాధ్యమం రంగం లోకి దిగిపోతోంది. ఈ రోజు స‌మ‌యం సెకండ్ల‌ లోకి త‌గ్గిపోయింది. ఆ రోజుల్లో పత్రికారచన అనేది మంచి విద్యావంతుల‌కే ప‌రిమితం. లేదంటే ఏదో ఒక సంస్థ‌తో అనుబంధం ఉన్న‌ వారికి మాత్ర‌మే ప‌రిమితం. కానీ ఈ రోజు ఒక గ్రామ‌స్థుడు కూడా తాను ఇష్ట‌ప‌డిన ఫొటో ఏదైనా ఉంటే దాన్ని ప్ర‌చురించేస్తున్నాడు. అంటే ప్ర‌జ‌ల వ‌ద్ద ఎంతో స‌మాచారం ఉంది. ఇటువంటి స‌మ‌యంలో విశ్వ‌స‌నీయ‌త ఎంతో ముఖ్యం. ఉద‌యం లేవ‌గానే వార్తాప‌త్రికను చ‌ద‌వ‌డమనేది టీ తీసుకోవ‌డం వంటి త‌ప్ప‌నిస‌రి అల‌వాటు. ప్ర‌జ‌లు టివి చూస్తున్నా కూడా రోజూ ఒక్క‌సారైనా ప‌త్రిక ను చ‌దువుతారు. మొబైల్‌లో ముందు రోజు వ‌చ్చిన వార్త, ఆ రోజు పేప‌ర్‌లో వ‌చ్చిందా లేదా అని చూస్తున్నారు. ఆ ర‌కంగా వార్తాప‌త్రిక‌పై తాము పెడుతున్న ఖ‌ర్చు న్యాయ‌బ‌ద్ధ‌మేనా అని వారు ప‌రిశీలిస్తున్నారు. అందుకే పెను స‌వాలు ముందుంద‌ని నేను భావిస్తున్నాను. ఈ స‌వాలును ఎదుర్కోవ‌డం ఎలా ?

ఈ సంద‌ర్భంగా నాకు ఒక సంఘ‌ట‌న గుర్తుకొస్తోంది. అప్పుడు నేను గుజ‌రాత్ కు ముఖ్యమంత్రిగా ఉన్నాను.. వార్తాప‌త్రిక‌లు సాధార‌ణంగా రాజ‌కీయ నాయ‌కుల‌కు సంబంధించిన వ్యాసాలను ప్ర‌చురిస్తూ ఉంటాయి. ప్ర‌తి ఒక్క రాజ‌కీయ‌వేత్త గురించి ఒక‌సారో, రెండో సార్లో వార్త‌లు వ‌స్తూ ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు ప్ర‌స్తుత విఐపి క‌ల్చ‌ర్‌ లో లెక్క‌కు మించిన కార్ల వినియోగం వంటివి. ఇవి ఎంతో ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు. కొన్ని సార్లు రెడీమేడ్‌గా కూడా అందుతూ ఉంటాయి. నేను కూడా చ‌దువుతాను. ఇటువంటి లాంఛ‌నాల‌న్నింటి విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని నేను అధికారుల‌కు సూచిస్తూ ఉంటాను. అది బ్లూ బుక్ లో రాసి ఉంద‌ని, మేం ఆ విష‌యంలో రాజీ ప‌డ‌లేమ‌ని వారు చెబుతూ ఉంటారు. ఒక‌సారి అహమదాబాద్‌లో నా కాన్వాయ్ వెళ్తోంది. కాన్వాయ్‌ లోని వాహ‌నాల వ‌రుస‌ను ఒక యువ‌కుడు రెకార్డ్ చేస్తూ, కార్ల సంఖ్య‌ను కూడా లెక్క వేస్తున్నాడు. ఆ వీడియోను సామాజిక మాధ్యమం లో అప్‌లోడ్ చేశాడు. సోష‌ల్ మీడియాను నేను కూడా అధికంగా ఉప‌యోగిస్తాను. అత‌ను పోస్ట్ చేసిన వీడియో రెండు మూడు గంట‌ల్లో నాకు చేరింది. అది నాపై లోతైన ప్ర‌భావం చూపింది. ఆ వీడియో ప్ర‌భావం ఎంత బ‌లంగా ఉందంటే, దానిపై వార్తాప‌త్రిక‌ల్లో విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. సామాజిక మాధ్యమం ఎంత శ‌క్తివంత‌మైన‌దో ఈ ఉదాహ‌ర‌ణ ద్వారా నేను తెలియ‌చేశాను. ప్ర‌జ‌ల‌ను సాధికారపరచడం చాలా మంచి ప‌నే, కానీ విశ్వ‌స‌నీయ‌త కూడా ఎంతో అవ‌స‌రం.

ప్ర‌తి ఒక్క‌రూ త‌మ‌లోని భావాల‌ను ఎంతో స్వేచ్ఛ‌గా వెల్ల‌డించే మాధ్య‌మం ఇది. ఏ ఒక్క‌రికీ ఎలాంటి అవ‌రోధం ఉండ‌దు. ఒక‌రు ఏదో చేస్తే దాని ప‌రిణామాలు అంద‌రికీ తెలిసిపోతాయి. ఈ విష‌యంలో నేను ప్రసార మాధ్యమాలకు కృత‌జ్ఞుడిని. స్వాతంత్ర్యం అనంత‌రం ఏ రాజ‌కీయ నాయ‌కునికి ఇంత ప్ర‌చారం వ‌చ్చిన అదృష్టం ద‌క్క‌లేదు. అందుకే అభిప్రాయాలను తెలియ‌చేసేందుకు రెండు అంశాలు ప్ర‌జ‌ల ముందుంచుతున్నాను. ప్ర‌పంచం ఎంతో మారిపోయింది. ఆర్థిక వ్య‌వ‌స్థ‌లోనే కాదు, మ‌న జీవితాల్లో కూడా ప్ర‌పంచీక‌ర‌ణ ప్ర‌వేశించింది. ఈ రోజు మొత్తం ప్ర‌పంచం ప‌ర‌స్ప‌రం అనుసంధానం అయింది; ప‌ర‌స్ప‌ర ఆధార‌నీయం అయింది. మ‌నం కూడా ప్ర‌పంచీక‌ర‌ణ‌లో భాగ‌స్వాములుగా మారిపోయాం. ప్ర‌పంచంలోని ప్ర‌తి ఒక్క రంగం మీద మ‌న ప్ర‌భావం ఉంటుంది. ఎవ‌రికి ఇష్టం ఉన్నా, లేక‌పోయినా మ‌న‌కు ఒక క‌ల ఉండాలి. మ‌న‌కు అపార‌మైన బ‌లం, సామర్థ్యం ఉన్నాయి. ప‌ర్యావ‌ర‌ణ పురస్కారం పొందిన‌ప్పుడు నేను వివేక్‌ ని ఛ‌లోక్తిగా అడిగాను.. ఈ వార్త వాతావ‌ర‌ణానికి సంబంధించిందా, కాలుష్యానికి సంబంధించిందా అని. ప్ర‌పంచం ఈ రోజు భూతాపాన్ని గురించి, ప‌ర్యావ‌ర‌ణాన్ని గురించి మాట్లాడుతోంది. ప్ర‌కృతికి హాని క‌లిగించ‌కుండా దానితో స‌హ‌జీవ‌నం చేయ‌డం ఎలాగో భార‌తదేశానికి తెలుసు. అది భార‌తీయుల ర‌క్తంలోనే ఉంది. ప్ర‌కృతి ప్రాధాన్య‌ం, దాని శ‌క్తి మ‌నంద‌రికీ తెలుసు. కానీ మ‌నం మ‌నుగ‌డ కోసం అన్నింటినీ నాశ‌నం చేస్తున్నాం. మ‌న‌కు మ‌న‌మే హాని చేసుకొంటున్నాం. మహాత్మ గాంధీ సాబర్ మతీ తీరంలో నివ‌సించే వారు. 1930 ద‌శ‌కంలో ఆ స‌మ‌యంలో న‌దిలో పూర్తిగా నీరుండేది. ఎవ‌రైనా ఆయ‌న‌కు ఒక గ్లాసు తో తాగేందుకు నీరు అందిస్తే అందులో స‌గం మాత్ర‌మే ఇవ్వ‌ండని చెప్పే వారు. నీటిని వృథా చేయ‌కూడ‌ద‌నే వారు. పారుతున్న న‌ది ప‌క్క‌నే ఆయ‌న కూర్చొనే వారు. ప్ర‌కృతి వ‌న‌రుల గురించిన చ‌ర్చ మ‌న ర‌క్తంలోనే ఉంది. నిద్ర‌ లేవ‌గానే భూమిపై అడుగు పెట్టే ముందు భూమాత‌ను క్ష‌మాప‌ణ కోరాల‌ని మ‌న బాల్యం నుండి మ‌న‌కు నేర్పారు. అవి మ‌నం అనుస‌రించే విలువ‌లు. మ‌న త‌ల్లులు ఎంత విద్యావంతుల‌నే అంశంతో సంబంధం లేకుండా సూర్యుడు మ‌న‌కు తాత అని, చంద్రుడు మామ అని, యావ‌త్ ప‌ర్యావ‌ర‌ణం మ‌న కుటుంబం అని బోధించే వారు. ఇదే స‌రైన బాట అని ప్ర‌పంచానికి బోధించేందుకు పత్రికారచనను ఎందుకు సాధ‌నంగా ఉప‌యోగించుకోకూడ‌దు ? ఆ దిశ‌గా మ‌నం ఏమైనా చేయ‌గ‌ల‌మా ?

ఏదో ఒక రోజు ఎవ‌రో ఒక‌రు ఇవ‌న్నీ చెప్పేందుకు మ‌న ముందుకు వ‌స్తారు, కానీ వారు ప్ర‌భుత్వం లోని వారు కాకూడ‌దు. మాట‌ల‌తో మంత్రం వేయ‌గ‌ల నైపుణ్యం త‌న‌కు ఉంద‌ని వినోబా గారు చెప్పే వారు. ఆయ‌న ర‌చ‌న‌లు చ‌ద‌వ‌డాన్ని నేను ఇష్ట‌ప‌డ‌తాను. అ-స‌ర్కారీ యే (ప్ర‌భుత్వేత‌ర వ్య‌వ‌స్థ‌) అస‌ర్‌-కారి (స‌మ‌ర్థ‌వంతం) అని ఆయ‌న ఒక‌ప్పుడు రాశారు. ఇదే మ‌నంద‌రి క‌ల కావాలి. ఆర్థిక‌, బ‌డ్జెటు విభాగాల లోని అత్యున్న‌త స్థాయి దేశాలు అనుసంధాన‌మై ఉన్నాయ‌ని ప్రసార మాధ్యమాల ప‌రిశోధ‌న‌లో ఉన్న వారంద‌రికీ తెలుసు. ప్ర‌పంచీక‌ర‌ణతో ఆర్థిక వ్య‌వ‌స్థ‌లే కాదు, మొత్తం ప్ర‌పంచం ఇలాగే మారింద‌ని ప్ర‌తి ఒక్క‌రూ భావిస్తున్నారు. దీనిని ఒక చ‌క్క‌ని అవ‌కాశంతో పాటు ఒక స‌వాలుగా కూడా ప‌రిగ‌ణించవలసి ఉంటుంది. దానిని గురించి మ‌నం ఆలోచించాలి.

ప్ర‌భుత్వం ఎంత‌గా విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటే, అంత మెరుగ్గా మారుతుంది. రిపోర్టింగ్ లో త‌ప్పిదాల‌కు తావు ఉండ‌కూడ‌దు. భార‌తదేశం ఎన్నో ప్ర‌త్యేక‌త‌లు ఉన్న, విభిన్న ధోర‌ణుల‌కు ఆల‌వాల‌మైన దేశం. దేశ ఐక్య‌త మీకు వార్త కాక‌పోవ‌చ్చు. అందుకే మ‌రో వార్త కోసం మీరు వెంట‌నే వెతుకుతారు. కానీ అది మ‌న‌ను ఎంతో లోతుగా గాయ‌ప‌రుస్తోంది. ఈ పాపాన్ని వేరొక‌రు చేయ‌డం లేద‌ని కాదు. మా నేప‌థ్యం ఉన్న వారు దీనిని గురించి మీ క‌న్నా ఎక్కువ‌గా ఆలోచిస్తారు. నేను ఒక త‌ప్పు చేస్తే ఇక్క‌డ కూచున్న వారు వ్యాఖ్య చేయ‌వ‌చ్చు.. అది ఇప్పుడే కాక‌పోవ‌చ్చు.. ఒక నెల లేదా ఆ పైబ‌డిన త‌రువాత అయినా విమ‌ర్శ త‌ప్ప‌దు. ఒక‌ప్పుడు ఏదైనా ప్ర‌మాదం జ‌రిగి, అందులో ఒక‌రు మ‌ర‌ణిస్తే ఉన్న‌ది ఉన్న‌ట్టుగా “ప్ర‌మాదంలో ఒక‌రు మ‌ర‌ణించారు” అనే వార్త ను రాసే వారు. కానీ ఆ త‌రువాత‌ “త‌ప్ప‌తాగిన డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యంగా వాహ‌నం న‌డ‌ప‌డం వ‌ల్ల ఒక‌రు మ‌ర‌ణించారు” అని రాస్తున్నారు. క్ర‌మ‌క్ర‌మంగా వార్త‌ల రిపోర్టింగ్ ఎంత‌గానో మారిపోతోంది. ఇప్పుడ‌దే వార్త‌ను “బిఎండ‌బ్ల్యు కారు ఒక ద‌ళితుని చంపేసింది” అని రాస్తున్నారు. అయితే కారు య‌జ‌మానికి అత‌ను ద‌ళితుడ‌నే విష‌యం తెలియ‌దు. వార్త‌ను సంచ‌ల‌నాత్మ‌కం చేసే ధోర‌ణి ఇది. యాదృచ్ఛికంగా జ‌రిగిన ఒక ప్ర‌మాదంపై అటువంటి వార్త ను రాయ‌డం అవ‌స‌ర‌మా ? ఒక వార్త ప‌తాక శీర్షిక‌లో ప్ర‌చురించే అర్హ‌త గ‌ల‌ది అయితే దానిని త‌ప్ప‌కుండా అలాగే ప్ర‌చురించ‌వ‌చ్చు. ప్ర‌భుత్వం బ‌డ్జెటును ప్ర‌తిపాదిస్తే దానిని ఎలా రిపోర్ట్ చేస్తున్నారు ? లోటు ఉన్న‌దా లేదా, వెయ్యి కోట్లు లేదా రెండు వేల కోట్ల రూపాయ‌ల‌కు ప‌న్నులు విధించిందా అన్న‌ది వార్త‌. కానీ ఈ రోజు అదే వార్త‌ను “ప్ర‌జ‌ల న‌డ్డి విరిచిన మోదీ ప్ర‌భుత్వం” అనో, లేదంటే “యుపి ఎన్నిక‌లపై క‌న్నుతో మోదీ ప్ర‌భుత్వ బడ్జెటు” అనో రాస్తున్నారు. ఈ గాథ అంతా మీ అంద‌రికీ తెలిసిందే. ఇది విమ‌ర్శ కాదు, మ‌నంద‌రం తెలుసుకోవ‌ల‌సిన అంశం.

ఇంత సువిశాల‌మైన దేశాన్ని ప్ర‌భుత్వం ఒక్క‌టే న‌డ‌ప‌లేదు. దేశం లోని సంస్థ‌లు అన్నీ క‌లిసిక‌ట్టుగా దేశాన్ని పురోగ‌మింప‌చేయాలి. వెనుక‌బ‌డి ఉండేందుకు కార‌ణం ఏదీ లేదు. పత్రికారచనను ఒక అంకిత భావంతో తెలివిగా అనుస‌రిస్తున్న యువ‌త అంద‌రికీ నా హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు. వారి నుండి కొత్త త‌రం స్ఫూర్తిని పొందుతుంది. సోద‌రుడు వివేక్ న‌న్ను ఈ కార్య‌క్ర‌మానికి ఆహ్వానించారు. ఈ కుటుంబంతో నా బంధం ఎంతో ప్రాచీన‌మైంది. ఈ కార్య‌క్ర‌మానికి న‌న్ను ఆహ్వానించ‌డాన్ని ఒక గొప్ప గౌర‌వంగా నేను భావిస్తున్నాను. కుటుంబం అంద‌రికీ నా కృత‌జ్ఞ‌త‌లు.

ధ‌న్య‌వాదాలు…

***