Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

న‌గ‌ర ప్రాంతాల చెత్త నుంచి రూపొందించే ఎరువు (సిటీ కంపోస్టు)ను ప్రోత్స‌హించే విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్యక్ష‌త‌న‌ స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం న‌గ‌ర ప్రాంతాలలోని చెత్తచెదారం నుంచి రూపొందే ఎరువు (సిటీ కంపోస్టు)ను ప్రోత్స‌హించే విధానానికి ఆమోదం తెలిపింది.

ఈ విధానంలో భాగంగా, న‌గ‌రాల్లో సేక‌రించే కంపోస్టు ఉత్ప‌త్తిని పెంచ‌టానికి, ఆ కంపోస్టును వినియోగించటానికి ఒక్కొక్క ట‌న్నుకు రూ.1,500 మార్కెట్ అభివృద్ధి స‌హాయం అందే ఏర్పాటు చేశారు. ఈ మార్కెట్ అభివృద్ధి స‌హాయం వ‌ల్ల గరిష్ఠ మార్కెట్ ధర (ఎమ్ ఆర్ పీ) కన్నా త‌క్కువ ధ‌ర‌కే సిటీ కంపోస్టు రైతుకు ల‌భిస్తుంది. సిటీ కంపోస్టు ద్వారా పెద్ద‌ మొత్తంలో కార్బ‌న్‌తో పాటు భూమికి కావాల్సిన ఇత‌ర ప్ర‌థ‌మ‌, ద్వితీయ ధాతువులు ల‌భిస్తాయి. అంతే కాకుండా న‌గ‌రం కూడా స్వ‌చ్ఛంగా క‌న‌బ‌డుతుంది. ఎకో-మార్కు ప్ర‌మాణాలకు అనుగుణంగా సిటీ కంపోస్టు ద్వారా ప‌ర్యావ‌ర‌ణ అనుకూల ఉత్ప‌త్తులు రైతుకు చేర‌తాయి.

ఈ విధ‌మైన కంపోస్టింగ్ విధానంలో చెత్త‌ను ఉప‌యోగ‌క‌రంగా మార్చుకోవ‌టం ద్వారా డ‌ంపింగ్ యార్డుల ప‌రిమాణాన్ని త‌గ్గించ‌వ‌చ్చు. దీంతో పాటు ప్ర‌మాద‌క‌ర‌మైన గ్రీన్‌హౌస్ గ్యాసుల విడుద‌ల‌ (ముఖ్యంగా మీథేన్)ను కూడా త‌గ్గించ‌వ‌చ్చు. విష‌పూరిత‌మైన వ‌స్తువుల‌ ద్వారా భూగ‌ర్భ‌ జ‌లాలను, వాతావ‌ర‌ణాన్ని విష‌ పూరితం కాకుండా నిరోధించ‌వ‌చ్చు. దీంతో పాటు ఈ విధానం ద్వారా ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఉద్యోగాల‌ను కూడా సృష్టించ‌వ‌చ్చు.

ఫెర్టిలైజ‌ర్ కంపెనీలు, మార్కెటింగ్ సంస్థ‌లు సిటీ కంపోస్టును వాటి ర‌సాయ‌న ఎరువుల‌తో పాటుగా డీల‌ర్ల ద్వారా మార్కెట్ చేసుకోవ‌చ్చు. ఉప‌యోగ‌క‌ర‌మైన కంపోస్టును వినియోగించేలా ఈ కంపెనీలు ప‌లు గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకోవ‌చ్చు. ప్ర‌భుత్వ, ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు కూడా ఉద్యాన‌వ‌నాల కోసం సిటీ కంపోస్టును వినియోగించుకోవ‌చ్చు.
సిటీ కంపోస్టు వల్ల ఒన‌గూరే లాభాల‌పై రైతుల‌ను చైత‌న్య ప‌రిచేందుకు, అన్ని రాష్ట్రాల్లో కంపోస్టు కేంద్రాల‌ను ఏర్పాటు చేసేందుకు ఐఈసీ ప్ర‌చారాన్ని స‌ద‌రు మంత్రిత్వ శాఖ‌/ విభాగం చేప‌డ‌తాయి. వ్య‌వ‌సాయాన్ని ప్రోత్స‌హించే ఐసీఏఆర్ లోని కేవీకేలు కూడా ఈ విష‌యంలో చాలా తోడ్పాటుగా ఉంటాయి. వ్య‌వ‌సాయ వ‌ర్సిటీలు, కేవీకేలు న‌గ‌ర కంపోస్టు వినియోగంపై క్షేత్ర‌ స్థాయిలో ప్ర‌చారాన్ని చేప‌డ‌తాయి. వీరికి వ్య‌వ‌సాయ‌, రైతు అభివృద్ధి శాఖ‌లు పూర్తి స‌హ‌కారం అంద‌జేస్తాయి. చేయాల్సిన లక్ష్యాల‌ను నిర్దేశిస్తాయి.

కావాల్సినంత సిటీ కంపోస్టు ఉత్ప‌త్తి చేయ‌టంతో త‌యారీ దారులు, ఎరువుల‌ మార్కెటింగ్ సంస్థ‌ల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర ఒప్పందాన్ని ప‌ర్య‌వేక్షించేందుకు ఎరువుల విభాగం, కేంద్ర ప‌ట్టణాభివృద్ధి శాఖ‌, వ్య‌వ‌సాయ శాఖలు సంయుక్తంగా ఓ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసుకుంటాయి. స‌మ‌న్వ‌యంలో తలెత్తే ఏ స‌మ‌స్య‌నైనా ప‌రిష్క‌రించుకునే బాధ్య‌త పూర్తిగా వీరిదే.

ఆరంభంలో సిటీ కంపోస్టుల మార్కెటింగ్‌ను ప్రోత్స‌హించే బాధ్య‌త‌ను ఎరువుల కంపెనీలు చూడాలని ప్రతిపాదించారు. కాల క్రమంలో, ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు గుర్తించిన కంపోస్టు త‌యారీ దారులు, మార్కెటింగ్ సంస్థ‌లు ఎరువుల విభాగం ఆమోదంతో మార్కెటింగ్ వ్యవ‌హారాలు చూసేందుకు వీలు కల్పించనున్నారు. అయితే.. తాజాగా కేంద్రం ప్ర‌క‌టించిన మార్కెటింగ్ అభివృద్ధి స‌హాయం.. మార్కెటింగ్ చేసుకునే వారి ద్వారానే ఉత్ప‌త్తి దారుల‌కు చేరుతుంది.