Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘న‌మామి గంగే’ కార్య‌క్ర‌మం అమ‌లును వేగ‌వంతం చేయ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువచ్చిన స‌మూల మార్పులు


వ్య‌ర్థ జ‌లాల శుద్ధికి ఉద్దేశించిన ‘న‌మామి గంగే’ కార్య‌క్ర‌మం అమ‌లులో కేంద్రం ప‌లు సంస్క‌ర‌ణ‌లు తీసుకువచ్చింది. ఈ కార్య‌క్ర‌మాన్ని హైబ్రిడ్ ఆన్యుటీ ఆధారిత‌ ప్ర‌భుత్వ ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం కింద చేప‌ట్ట‌డానికి వీలుగా చేసిన ప్ర‌తిపాద‌న‌కు ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ కార్య‌క్ర‌మం అమ‌లులో ఇది స‌మూల మార్పుల‌ను తెస్తుంది. కార్య‌క్ర‌మ ప‌నివిధానాన్ని మెరుగుప‌ర‌చ‌డానికి, స‌మ‌ర్థ‌త‌ను పెంచ‌డానికి, అది ఎంత‌మేర‌కు ప‌నికొస్తుందో నిర్దారించ‌డానికి, సుస్థిరత్వాన్ని తేవ‌డానికి ఈ మోడ‌ల్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. ఇందుకోసం అవ‌స‌ర‌మ‌య్యే మూల‌ధ‌నాన్ని పాక్షికంగా(40 శాతం దాకా) ప్ర‌భుత్వం చెల్లిస్తుంది. మిగ‌తా నిధుల‌ను ఆన్యుటీ ద్వారా 20 సంవ‌త్స‌రాల వర‌కూ ఉండే కాంట్రాక్టు స‌మ‌యంలో స‌మ‌కూర్చుకోవ‌డం జ‌రుగుతుంది.

ఈ మోడ‌ల్ కు ఉన్న ప్ర‌త్యేక స్వ‌భావం కార‌ణంగా దీన్ని భ‌విష్య‌త్ లో సుస్థిర‌మైన ప్రాతిప‌దిక మీద అభివృద్ధి చేయ‌డానికి ప్ర‌భుత్వం ఒక ప్ర‌త్యేక సాధ‌న వాహిక‌ను (స్పెష‌ల్ ప‌ర్ప‌స్ వెహిక‌ల్.. ఎస్ పివి)ని ఏర్పాటు చేస్తోంది. గంగా న‌ది శుద్ధికి సంబంధించిన జాతీయ కార్య‌క్ర‌మ మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో ‘న‌మామి గంగే’ కార్య‌క్ర‌మం రూపొందుతుంది. పిపిపి ప్రాజెక్టులను చేప‌ట్ట‌డం, నిర్మాణం, రాయితీల‌ను పొందుతున్న సంస్థ‌ల‌ను నిర్దారించ‌డం, కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ‌ను ప‌ర్య‌వేక్షించ‌డం, శుద్ధి చేసిన వ్య‌ర్థ జ‌లాల‌ను మార్కెట్ చేయ‌డం త‌దిత‌ర ప‌నులు ప్ర‌త్యేక సాధ‌న వాహిక ద్వారా కొన‌సాగుతాయి. ఎస్ పివి ని భార‌తీయ కంపెనీల చ‌ట్టం 2013 ప్ర‌కారం ఏర్పాటు చేస్తారు.

ప్రాజెక్టుల‌ను చేప‌ట్ట‌డానికిగాను సంబంధిత రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో, ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల‌తో ఎస్ పివి త్రైపాక్షిక ఒప్పందాల‌ను కుదుర్చుకుంటుంది. ఈ త్రైపాక్షిక్ష ఒప్పందాల ద్వారా కాలుష్య కార‌కుల‌ నుంచి వినియోగ ప‌న్నుల‌ను వ‌సూలు చేయ‌డం సాధ్య‌మ‌వుతుంది. తాగ‌డానికి కాకుండా ఇత‌ర అవ‌స‌రాల‌కు ఉప‌యోగించే భూగ‌ర్భ జ‌లాల వినియోగాన్ని ప‌ర్య‌వేక్షించవ‌చ్చు. శుద్ధి చేసిన వ్య‌ర్థ జ‌లాల పునర్వినియోగానికి త‌గిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఎస్ పివి త‌యారు చేస్తుంది.

సంబంధిత మంత్రిత్వ శాఖ రైల్వే మంత్రిత్వ శాఖ‌తో ఇప్ప‌టికే ఈ విష‌యంలో అవగాహనపూర్వక ఒప్పందాన్ని (ఎంఓయూ) కుదుర్చుకోవ‌డం జ‌రిగింది. త‌ద్వారా శుద్ది చేసిన జలాన్ని కొన‌డానికి, ఎక్క‌డ వీలైతే అక్క‌డ మార్కెట్ చేయ‌డానికి వీల‌వుతుంది. ఇలాంటి ఎంఓయూల‌ను విద్యుత్, పెట్రోలియం, ప‌రిశ్ర‌మ‌ల మంత్రిత్వ‌ శాఖ‌ల‌తో కుదుర్చుకోవ‌డానికి చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతోంది.

శుద్ధి చేసిన వ్య‌ర్థ జ‌లాల‌కు మార్కెట్‌ను అభివృద్ధి చేయ‌డం, ఈ రంగంలో నిర్మాణాత్మ‌క సంస్క‌ర‌ణ‌లు తేవ‌డం అనేది భవిష్య‌త్తును దృష్టిలో పెట్టుకొని ప్ర‌భుత్వం తీసుకుంటున్న‌ చ‌ర్య‌లుగా పేర్కొన‌వ‌చ్చు. ‘న‌మామీ గంగే’ కార్య‌క్ర‌మంలో సంస్క‌ర‌ణ‌ల‌ ద్వారా దీనికి సంబంధించిన ప‌లు ప్రాజెక్టులు కొత్త‌గా అమ‌లులోకి వ‌స్తాయి. ప్రారంభ సంవత్స‌రాల‌లో ఆర్థికప‌ర‌మైన వ‌నరుల ఒత్తిడి త‌క్కువ‌గా ఉంటుంది. వ్య‌ర్థ జ‌లాల‌ను శుద్ధి ఎంత‌ కాలం చేస్తారో అంత‌ కాలం పాటు ఇందులో భాగ‌స్వాముల‌కు రాయితీల క‌ల్ప‌న ఉంటుంది కాబ‌ట్టి ఈ ప్రాజెక్టుల అమ‌లు చాలా కాలం కొన‌సాగే ఆస్కారం ఉంది. సామ‌ర్థ్య ప్ర‌మాణాల‌ను ఆన్యుటీల‌తో ముడి వేయ‌డం జ‌రుగుతుంది కాబ‌ట్టి త‌గిన ప్ర‌మాణాల ప్ర‌కారం వ్య‌ర్ధ జ‌లాల శుద్ధి జ‌రుగుతుంది. ఈ సంస్క‌ర‌ణ‌ల వ‌ల్ల కాలుష్య కార‌కుల నుంచి వినియోగ ఛార్జీల‌ను ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌లు స‌క్ర‌మంగా వ‌సూలు చేయ‌గ‌లుగుతాయి. శుద్ధి చేసిన వ్య‌ర్థ జ‌లాలు అందుబాటులోకి వ‌స్తే న‌దీజ‌లాల‌పై ఆధార‌ప‌డ‌డం త‌గ్గుతుంది. త‌ద్వారా గంగాన‌దిలోకి ప్ర‌వాహం పెరుగుతుంది. బాధ్య‌తాయుత నీటి వినియోగం పెరిగి దేశంలో నీటి కొర‌త త‌గ్గుముఖం ప‌డుతుంది.

నేప‌థ్యం:

గ‌తంలో చేప‌ట్టిన ప‌లు కార్య‌క్ర‌మాల‌కోసం (గంగా యాక్ష‌న్ ప్లాన్ 1 మ‌రియు 2, ఎన్ జి ఆర్ బి ఏ, యమునా యాక్ష‌న్ ప్లాన్) వెచ్చించిన నిధుల‌ నుంచి త‌గిన ఫ‌లితాలు రాలేద‌నే విష‌యాన్ని గ‌మ‌నించ‌డం జ‌రిగింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌, బిహార్‌, ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రాల‌లో ప‌ని చేస్తున్న మురుగునీటి శుద్ధి క‌ర్మాగారాలలో 30 శాతం దాకా ప‌ని చేయ‌డం లేదని కేంద్ర కాలుష్య నియంత్ర‌ణ మండలి ప‌రిశీల‌న‌లో తేలింది. ఇక ప‌నిచేస్తున్న‌వాటిలో 94 శాతం క‌ర్మాగారాలు నిర్దేశించిన ప్ర‌మాణాల‌ను పాటించ‌డం లేదు.

గంగా న‌దిని శుద్ది చేయ‌డానికి గ‌తంలో చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలకు ఎదురైన అవాంత‌రాలు, స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డానికి మంత్రిమండలి ఆమోదముద్ర దోహ‌ద‌ప‌డుతుంది. దేశంలో వ్య‌ర్థ జ‌లాల రంగంలో సమ‌గ్ర‌మైన సంస్క‌ర‌ణ‌ల‌కు మంత్రివర్గం ఆమోదం ద్వారా సాధ్య‌మ‌వుతుంది. దీనికి సంబంధించిన ప్రాజెక్టుల అమ‌లు వేగ‌వంత‌మ‌వుతాయి. 100 శాతం నిధులు అందుబాటులో ఉండే ‘నమామీ గంగే’ కార్య‌క్ర‌మం కింద విడుద‌ల‌య్యే నిధులు ఈ సంస్క‌ర‌ణ‌ల‌ ద్వారా స‌క్ర‌మంగా వినియోగ‌మ‌వుతాయి.