పిఎంఇండియా
పన్నులకు సంబంధించిన పరస్పర సమాచారాన్ని పరస్పరం మార్పిడి చేసుకోవడం కోసం భారతదేశం, సమోవా ల మధ్య ఒప్పందంపై సంతకాలకు, సదరు ఒప్పందానికి అవసరమైన అనుమోదానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.
ఒప్పందం భారతదేశం, సమోవా ల మధ్య పన్నులకు సంబంధించిన సమాచారం మార్పిడికి బాట వేస్తుంది. పన్నుల ఎగవేతను, పన్ను నివారణను అరికట్టడంలో ఈ ఒప్పందం దోహదపడుతుంది.
ఈ ఒప్పందం వల్ల ప్రస్తుతానికి ఎటువంటి ఆర్థిక భారం తలెత్తదు. అసాధారణ ఖర్చులు 500 అమెరికన్ డాలర్లను మించిన సందర్భాలలో మాత్రమే ఆ ఖర్చులను భారతదేశం భరిస్తుంది. . భారతదేశం కుదుర్చుకున్న ఈ తరహా పన్నుల సంబంధ సమాచార మార్పిడికి సంబంధించిన వేరే ఒప్పందాలలోనూ ఇటువంటి నిబంధనలనే పాటిస్తోంది.
ఒప్పందంలోని ప్రధానాంశాలు :
1, ఈ ఒప్పందం భారతదేశం, సమోవా లలో సమర్థ అధికార యంత్రాంగానికి పరస్పర సమాచార మార్పిడి ద్వారా ఇరు దేశాలలోనూ ఈ ఒప్పందం పరిధిలోకి వచ్చే దేశీయ చట్టాల అమలుకు, పరిపాలనకు పరస్పర సహాయం చేసుకొనేటందుకు అనుమతిస్తుంది.
2. ఈ ఒప్పందంలో భాగంగా పొందిన సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి. అయితే పన్నుల వసూలు, అమలు, విచారణ, విజ్ఞప్తుల నిర్ణయాలకు సంబంధించిన సమాచారాన్ని నియంత్రణాధికారులకు (న్యాయస్థానాలకు, పరిపాలనా
సంబంధ నిర్వహణా వ్యవస్థకు) మాత్రం ఇవ్వవచ్చును. సమాచారాన్ని పంపే దేశం యొక్క ముందస్తు లిఖితపూర్వక అనుమతితో ఈ ఒప్పందం కింద పొందిన సమాచారాన్ని న్యాయ వ్యవస్థకు గాని, ఏ వ్యక్తి కి, వ్యవస్థకు, అధికార సంస్థకు అయినా గాని ఇవ్వవచ్చును.
3. ఈ ఒప్పందం క్రింద అనుసరించవలసిన పద్దతులలో ఏదైనా విభేదం ఏర్పడితే పరిష్కరించుకోవడానికి, లేదా ఒప్పందపు ప్రక్రియలపై అంగీకారం కుదుర్చుకోవడానికి కూడా ఆస్కారాన్ని సమకూరుస్తుంది.
4. ఒప్పందం అమలు లోకి రావడానికి ఇరు దేశాలలోను సంబంధిత చట్టాల ప్రకారం నెరవేర్చవలసిన ప్ర్రక్రియలు పూర్తి అయినట్లు నోటిఫికేషన్ ను వెలువరించిన తేదీ నాటి నుండి ఈ ఒప్పందం అమలులోకి రాగలదు.
పూర్వ రంగం :
ఆదాయపు పన్ను చట్టం,1961 క్రింద విధించదగిన పన్నులను చెల్లించకుండా ఎగవేయడాన్ని, లేదా ఆయా పన్నులను తప్పించుకోవడాన్ని నిరోధించేటందుకు ఏ విదేశంతోనైనా, లేదా ఏదైనా ప్రత్యేక పాలిత ప్రాంతంతోనైనా ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి ఆదాయపు పన్ను చట్టం, 1961 సెక్షన్ 90 ప్రకారం అధికారం ఉన్నది. పన్నులకు సంబంధించిన సమాచార మార్పిడికి సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం కోసం భారతదేశం, సమోవా ల మధ్య జరిగిన సంప్రతింపులు 2016 జూన్ లో ఒక కొలిక్కి వచ్చాయి. ఒప్పంద పాఠం పట్ల రెండు దేశాలూ సమ్మతిని తెలిపాయి.