పిఎంఇండియా
పర్యటన రంగంలో సహకారం కోసం భారతదేశం, దక్షిణ ఆఫ్రికా ల మధ్య కుదిరిన ఒక అవగాహనపూర్వక ఒప్పందానికి (ఎమ్ ఒయు కు) మంత్రిమండలి ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ ఎమ్ ఒ యు పై 2016 జులై 8 నాడు సంతకాలు జరిగాయి.
ఎమ్ ఒ యు ప్రధాన లక్ష్యాలు ఇవీ.. :
అ) పర్యటన రంగంలో ద్వైపాక్షిక సహకారం విస్తరణ;
ఆ) పర్యటన రంగానికి సంబంధించిన సమాచారం, గణాంకాలను ఇచ్చి పుచ్చుకోవడం;
ఇ) హోటళ్ళు, టూర్ ఆపరేటర్లతో పాటు టూరిజం రంగంతో సంబంధం ఉన్న అన్ని వర్గాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం;
ఈ) మానవ వనరుల అభివృద్ధిలో కూడా సహకారాన్ని విస్తరించుకొనేందుకు ఒకరి దేశంలో మరొకరు కార్యక్రమాలను నిర్వహించడం;
ఉ) పర్యటన, ఆతిథ్యం రంగాలలో పెట్టుబడులు పెట్టడం;
ఊ) ఉభయ దేశాలలో పర్యటన రంగాన్ని ప్రోత్సహించేందుకు టూర్ ఆపరేటర్లు/మీడియా/ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే రంగాల నిపుణులు అటు వారు ఇటు, ఇటు వారు అటు పరస్పరం రాకపోకలు జరిపేటట్లుగా వారి సందర్శనలకు అవకాశాలను కల్పించడం;
ఎ) ప్రచారం, విద్య, మార్కెటింగ్, (టూరిజం సంబంధిత) గమ్యస్థానాల అభివృద్ధి, నిర్వహణ విభాగాలలో అనుభవాలను పరస్పరం మార్పిడి చేసుకోవడం;
ఏ) ఒక దేశంలో పర్యటన రంగం అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ఏర్పాటు చేసే ప్రదర్శనలలో మరొక దేశం పాల్గొనడం;
ఐ) సురక్షితమైన, గౌరవనీయమైన, సుస్థిరమైనదిగా పర్యటన రంగాన్ని పెంచి పోషించడం.
పూర్వ రంగం:
భారత, దక్షిణ ఆఫ్రికా ల మధ్య దీర్ఘకాలంగా సుహృద్భావపూర్వకమైన ద్వైపాక్షిక స్నేహబంధం ఉంది. భారతదేశానికి ఆకర్షణీయమైన పర్యటన విపణుల్లో ప్రధాన విపణి దక్షిణ ఆఫ్రికా (2015 సంవత్సరంలో 51,922 మంది దక్షిణ ఆఫ్రికన్ లు భారతదేశాన్ని సందర్శించారు). దక్షిణ ఆఫ్రికా దేశీయులకు ఎలక్ట్రానిక్ టూరిస్ట్ వీసా లను భారతదేశం మంజూరు చేస్తోంది. దీనికి మంచి స్పందన లభించింది కూడా. పర్యటకుల రాకకు ఆకర్షణీయ గమ్యం అయిన దక్షిణ ఆఫ్రికా నుండి అధిక సంఖ్యలో పర్యటకులు తరలివచ్చేందుకు ఈ ఎమ్ ఒ యు సహాయకారి కాగలదని భారతదేశం భావిస్తోంది.