Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘‘పర్యావరణం, వాతావరణ పరిణామాల భవిత’’ పై అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం

‘‘పర్యావరణం, వాతావరణ పరిణామాల భవిత’’ పై అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం


భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరుడు శ్రీ భూపేందర్ యాదవ్, భారత అటార్నీ జనరల్ శ్రీ ఆర్. వెంకటరమణి, జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఛైర్మన్ జస్టిస్ ప్రకాశ్ శ్రీవాస్తవ , ఈ సభకు విచ్చేసిన ఇతర ప్రముఖులు, సోదరీ సోదరులారా!

శతాబ్దాలుగా భారతదేశం ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ విషయాలలో ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. ఆ భావజాల నిబద్ధతతో పాటు, మన సాంస్కృతిక అనుభవాల ఆధారంగా ఆధునిక వాతావరణ సవాళ్లకు భారత్‌ నేడు పరిష్కారాలను అందిస్తోంది. అదే సమయంలో, మానవాళి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిస్తోంది. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) నిర్వహిస్తున్న ఈ సదస్సు ఆ దిశగా కొనసాగుతున్న కృషికి మరింత బలం చేకూరుస్తుండటం సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఎన్‌జీటీ అధికారులు, దీనితో అనుబంధం ఉన్న ప్రముఖులందరికీ నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా, 

కార్బన్‌ ఉద్గారాలకు సంబంధించిన బాధ్యతను తరచుగా అభివృద్ధి చెందుతున్న దేశాలపై అన్యాయంగా మోపుతున్న విషయం మనందరికీ తెలుసు. అభివృద్ధి చెందుతున్న (గ్లోబల్‌ సౌత్‌) దేశాలకు కు చెందిన నా సహచరులు చాలామంది ఇక్కడ ఉన్నారు. అయితే, చారిత్రక వాస్తవం ఏమిటంటే.. నేటికీ భారత్‌లో తలసరి కార్బన్‌ ఉద్గారాలు ప్రపంచ సగటులో సగం కంటే తక్కువగా ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో తలసరి కార్బన్‌ ఉద్గారాలు భారత్‌తో పోలిస్తే ఆరు రెట్లు అధికంగా ఉన్నాయి. ఆరు రెట్లు అధికం. భారత్‌ ఈ వాస్తవాన్ని అంతర్జాతీయ వేదికలపై బలంగా వినిపిస్తోంది. ప్రతి భారతీయుడికి నేను చెప్పేది ఒక్కటే – మీ సామర్థ్యాన్ని కూడా ప్రపంచానికి చాటి చెప్పండి. మన సంప్రదాయాలను, వాటిలోని శక్తిని కూడా ప్రపంచం ముందు మనం ఆవిష్కరించాం. ఇదే అంశాలపై పారిస్‌లో జరిగిన సీఓపీ – 21 సందర్భంగా ‘కన్వీనియెంట్‌ యాక్షన్‌ –  కంటిన్యుటీ ఫర్‌ చేంజ్‌’ పుస్తకాన్ని ఆవిష్కరించాం. ప్రపంచాన్ని వెంట తీసుకెళ్తూ పర్యావరణ పరిరక్షణలో భారత్‌ కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది. ‘వన్‌ సన్‌, వన్‌ వరల్డ్‌, వన్‌ గ్రిడ్‌’ ఆలోచన అయినా, అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి (సీడీఆర్ఐ), గ్లోబల్‌ బయోఫ్యూయల్‌ అలయన్స్‌, అంతర్జాతీయ బిగ్‌ క్యాట్‌ అలయన్స్‌, పర్యావరణం కోసం జీవనశైలి మిషన్‌ లైఫ్ -ఎల్ఐఎఫ్ఈ) అయినా. ప్రతి వేదికా వాతావరణం, పర్యావరణ పరిరక్షణ పట్ల భారత్‌ చూపుతున్న దృఢ నిబద్ధతకు ప్రతీకగా నిలుస్తోంది.

మిత్రులారా, 

నేటి భారతదేశం పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన తన ప్రాచీన భావనలను ఆధునిక దృక్పథంతో మేళవిస్తూ ముందుకు సాగుతోంది. గత 12 ఏళ్లలో పర్యావరణానికి సంబంధించిన ప్రతి రంగంలో భారత్‌ అసాధారణ పురోగతి సాధించింది. పునరుత్పాదక ఇంధన రంగంపై ప్రధానంగా దృష్టి సారించాం. పర్యావరణ పరిరక్షణలో ఇది కీలక పాత్ర పోషించింది. జీ20 కూటమిలోని అగ్ర నాయకులందరి సమక్షంలో నేను ఈ విషయాన్ని గర్వంగా చెబుతున్నాను. పారిస్ లో జరిగిన కాప్-21 సదస్సులో చేసుకున్న అన్ని ఒప్పందాలను నిర్దేశిత సమయం కంటే ముందే పూర్తి చేసిన ఏకైక జీ-20 దేశం భారత్ మాత్రమే. నేను చెబుతున్న భారతదేశ సామర్థ్యానికి, శక్తియుక్తులకు ఇదే నిదర్శనం. శిలాజేతర ఇంధనం, సౌర విద్యుత్ సామర్థ్యం, కార్బన్ ఉద్గారాల తగ్గింపు –  ఇలా ప్రతి ప్రామాణికంలోనూ భారత పురోగతి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సానుకూల చర్చకు కారణమవుతోంది. ఒక్కసారి గణాంకాలను గమనిస్తే… పన్నెండేళ్ల క్రితం భారత్‌ సౌర విద్యుత్‌ సామర్థ్యం సుమారు 2 గిగావాట్లు –  పన్నెండేళ్ల క్రితం కేవలం 2 గిగావాట్లు. ఇక్కడ న్యాయవాదులు ఎవరైనా ఉంటే ఈ గణాంకాలను గుర్తుపెట్టుకోండి. అవసరమైనప్పుడు ఇవి ఉపయోగపడవచ్చు. నేడు భారత్‌ సౌర విద్యుత్‌ సామర్థ్యం 160 గిగావాట్లను దాటింది. అంటే 12 ఏళ్లలో రెండు గిగావాట్ల నుంచి 160 గిగావాట్లకు చేరుకుంది. ప్రధానమంత్రి సూర్య ఘర్‌ ఉచిత విద్యుత్‌ పథకం కింద ఇళ్లనే సౌర విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలుగా మార్చే లక్ష్యంతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ పథకం కింద ఇప్పటికే 50 లక్షలకు పైగా ఇళ్లపై రూఫ్‌టాప్‌ సౌర విద్యుత్‌ పలకలను ఏర్పాటు చేశారు. ఇది అనేక దేశాల్లోని మొత్తం ఇళ్ల సంఖ్య కంటే కూడా ఎక్కువ. ఇందుకోసం ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.80,000 వరకు ఆర్థిక సహాయం అందించింది. కుసుమ్‌ పథకం కింద 30 లక్షల మంది రైతుల పొలాల్లో ప్రభుత్వం సౌర విద్యుత్‌ పంపులను ఏర్పాటు చేసింది. ప్రతిష్ఠాత్మకమైన ‘వన్‌ నేషన్‌, వన్‌ గ్రిడ్‌’ ప్రాజెక్టును కూడా పూర్తిచేశాం. అంతేకాదు.. ఇళ్లలో ఎల్ఈడీ బల్బుల వినియోగం విద్యుత్‌ ఆదాలో విజయవంతమైన ఫలితాలను అందించింది. కోట్లాది ఎల్ఈడీ బల్బులను గృహాలకు పంపిణీ చేశాం. ఈ కృషి ఫలితాలు నేడు మన కళ్లముందు కనిపిస్తున్నాయి. సౌర విద్యుత్‌ ద్వారానే భారత్‌ దాదాపు 20 కోట్ల టన్నుల కార్బన్‌ ఉద్గారాలను నివారించగలిగింది.

మిత్రులారా, 

సౌర విద్యుత్‌తో పాటు, ఇతర స్వచ్ఛ ఇంధన రంగాల్లోనూ భారత్‌ గణనీయమైన విజయాలు సాధించింది. గత 12 ఏళ్లలో దేశంలో పవన విద్యుత్‌ సామర్థ్యం మూడు రెట్లు పెరిగింది. జలవిద్యుత్‌ సామర్థ్యం కూడా గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం దేశం అణు విద్యుత్‌ ఉత్పత్తిని వేగంగా విస్తరించే దిశగా ముందుకు సాగుతోంది. పర్యావరణంపై సుదీర్ఘ ప్రసంగాలు చేసేవారు.. నేను అణు విద్యుత్‌ రంగంలో పనులను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు, వాటిని అడ్డుకునేందుకు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఈ రంగంలోకి ప్రైవేట్‌ సంస్థలను కూడా తీసుకురావడానికి మార్గం సుగమం చేశాం. ఈ చర్యల ఫలితంగా నేడు భారత్ శిలాజేతర ఇంధన ఆధారిత విద్యుత్‌ సామర్థ్యం దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. బొగ్గును మరింత స్వచ్ఛంగా వినియోగించేందుకు కోల్‌ గ్యాసిఫికేషన్‌ వంటి సాంకేతికతలను కూడా భారత్‌ ప్రోత్సహిస్తోంది.

మిత్రులారా, 

స్వచ్ఛ రవాణా (క్లీన్‌ మొబిలిటీ), గ్రీన్‌ హైడ్రోజన్‌ వంటి రంగాల్లో భారత్‌ ఇప్పుడు వేగంగా ముందుకు సాగుతోంది. కొద్ది రోజుల క్రితమే భారత్‌ తొలి హైడ్రోజన్‌ రైలును ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైడ్రోజన్‌ రైలు కావడం విశేషం. దీంతో స్వచ్ఛ రవాణాలో కొత్త శకానికి నాంది పలికింది.

మిత్రులారా, 

12 ఏళ్లలో మన దేశంలో విద్యుత్‌ వాహనాల సంఖ్య దాదాపు 950 రెట్లు పెరిగింది. 950 రెట్లు!  2014కు ముందు ఏడాదిలో భారత్‌లో 3,000 లోపు విద్యుత్‌ వాహనాలు విక్రయమయ్యాయి. గత ఏడాది భారత్‌లో దాదాపు 25 లక్షల విద్యుత్‌ వాహనాలు విక్రయమయ్యాయి. అంటే, విద్యుత్‌ వాహనాల విప్లవం అందిస్తున్న అవకాశాన్ని భారత్‌ పూర్తి సామర్థ్యంతో అందిపుచ్చుకుంటోంది. ఇది పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతోంది. మన జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై ఆధునిక ఫాస్ట్‌ట్రాక్‌ వ్యవస్థలతో టోల్‌ ప్లాజాల వద్ద వాహనాలు వేచి ఉండే సమయం తగ్గింది. దీంతో టోల్‌ ప్లాజాల వద్ద వాహనాలు వేచి ఉండే సమయంలో వృథా అయ్యే ఇంధన వినియోగం కూడా తగ్గిపోయింది.

మిత్రులారా, 

2014 వరకు మన దేశంలోని ఐదు నగరాల్లో కలిపి 250 కిలోమీటర్లకు లోపే మెట్రో రైలు మార్గం ఉండేది. ఇక్కడ ఉన్న న్యాయవాదులు ఈ గణాంకాన్ని గుర్తుపెట్టుకోవాలి. 2014కు ముందు కేవలం ఐదు నగరాల్లోనే 250 కిలోమీటర్లకు లోపు మెట్రో రైలు నెట్‌వర్క్‌ ఉండేది! నేడు 20కి పైగా నగరాల్లో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. భారత్‌లో మెట్రో రైలు నెట్‌వర్క్‌ 1,000 కిలోమీటర్లను దాటింది. దీంతో 1,000 కిలోమీటర్లకు పైగా మెట్రో రైలు నెట్‌వర్క్‌ ఉన్న దేశాల వరసన భారత్‌ చేరింది.

మిత్రులారా, 

రైల్వే మార్గాల దాదాపు 100 శాతం విద్యుదీకరణతో కోట్ల లీటర్ల డీజిల్‌ వినియోగాన్ని నివారించగలిగాం. ఇది పర్యావరణ పరిరక్షణకు దోహదపడింది. ఈ నెలలోనే 3,000 కిలోమీటర్ల పొడవైన ప్రత్యేక (డెడికేటెడ్‌)  ఫ్రైట్‌ కారిడార్‌ను ప్రారంభించాం. దీనిపై నడిచే ప్రతి రైలు వందలాది ట్రక్కులు తరలించేంత సరుకును ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరవేస్తోంది. డబుల్‌ స్టాక్‌ కంటైనర్‌ సరుకు రైళ్లను నడపడం కూడా ఒక చారిత్రక ఘట్టమే. ఇలాంటి రవాణా వ్యవస్థ పర్యావరణ పరిరక్షణకు ఎంతగా దోహదపడుతుందో మీరు ఊహించవచ్చు.

మిత్రులారా, 

నేడు దేశంలో సుమారు 5,000 కిలోమీటర్ల మేర జలమార్గాలపై రవాణా జరుగుతోంది. ఇది అత్యంత పర్యావరణహితమైన రవాణా విధానం. ఈ జలమార్గాల్లో నడిచే ఒక సాధారణ అంతర్గత జలరవాణా నౌక ఒక్క ప్రయాణంలోనే డజన్ల కొద్దీ ట్రక్కులు తరలించేంత సరుకును రవాణా చేస్తుంది. ఇది కూడా పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదపడుతోంది.

మిత్రులారా, 

రవాణా రంగంలో చోటుచేసుకున్న ఈ మార్పులన్నీ మన అభివృద్ధి వేగవంతంగా, సుస్థిరంగా ఉందనడానికి నిదర్శనం.

మిత్రులారా, 

నేడు కోట్లాది ప్రజల భాగస్వామ్యంతో భారత్‌లో జల సంరక్షణకు సంబంధించి అపూర్వమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 70,000కు పైగా అమృత్‌ సరోవరాలు నిర్మించడం సంతోషంగా ఉంది. వర్షపు నీటి సంరక్షణ (క్యాచ్‌ ద రెయిన్‌) కార్యక్రమం కింద దాదాపు 1.5 కోట్ల నీటి సంరక్షణ నిర్మాణాలను ఏర్పాటు చేసి వర్షపు నీటిని సంరక్షిస్తున్నాం. ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన ద్వారా నేడు రెండు కోట్లమందికి పైగా రైతులు ఆధునిక సాగునీటి సదుపాయాలతో అనుసంధానమయ్యారు. ప్రతి నీటి చుక్క తో అధిక పంట ( పర్‌ డ్రాప్‌ మోర్‌ క్రాప్‌) వంటి కార్యక్రమాలు కూడా నీటి పొదుపునకు దోహదపడుతున్నాయి. శ్రీ అన్న – చిరుధాన్యాలు – మరో గొప్ప విజయగాథ. తక్కువ నీరు అవసరమయ్యే చిరుధాన్యాల సాగును భారత్‌ ప్రోత్సహిస్తోంది. ఇటీవలి సంవత్సరాల్లో దేశంలో చిరుధాన్యాల ఉత్పత్తి పెరగడంతో పాటు, వాటి ఎగుమతులు సుమారు 1.5 లక్షల టన్నులకు చేరుకున్నాయి. దీనివల్ల రైతులకు కొత్త అవకాశాలు లభించడంతో పాటు, నీటి సంరక్షణ కూడా జరుగుతోంది. ఈ నమూనా కారణంగా ప్రపంచం కూడా మనతో కలిసి ముందుకు వస్తోంది. భారత్‌ చేస్తున్న కృషికి గుర్తింపుగా 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా నిర్వహించారు.

మిత్రులారా, 

ప్రకృతి వ్యవసాయంపై జాతీయ మిషన్‌ కింద నేడు దేశంలో సుమారు 12.5 లక్షల హెక్టార్లలో 24,000 ప్రకృతి వ్యవసాయ క్లస్టర్లు అభివృద్ధి చెందాయి. అంతేకాకుండా, వాతావరణ మార్పులను తట్టుకునే దాదాపు 3,000 రకాల పంటలను కూడా దేశంలో అభివృద్ధి చేశాం. వ్యవసాయ వన సంరక్షణను ప్రోత్సహించడం ద్వారా కార్బన్‌ ఉద్గారాలను కూడా తగ్గిస్తున్నాం.

మిత్రులారా, 

దేశంలో భారత్‌ అటవీ విస్తీర్ణంలో వచ్చిన మార్పు కూడా మన కృషి ఎంత విస్తృతంగా సాగుతోందో తెలియజేస్తోంది. ఈ విషయాన్ని కూడా నా న్యాయవాది మిత్రుల కోసం ప్రస్తావిస్తున్నాను. గత 12 ఏళ్లలో మన అత్యంత దట్టమైన అటవీ విస్తీర్ణం 22 శాతానికి పైగా పెరిగింది. ఇది ఎంతో గొప్ప విజయం. తల్లి పేరుతో చెట్టు (ఏక్‌ పెడ్‌ మా కే నామ్‌)  నాటే కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా కోట్లాది మొక్కలు నాటారు. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతోంది.

మిత్రులారా, 

ప్లాస్టిక్‌ వ్యర్థాలు కూడా పర్యావరణానికి ప్రధాన సవాలుగా మారాయి. అందుకే భారత్‌ సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై నిషేధం విధించింది. తగ్గింపు, పునర్వినియోగం, పునరుత్పాదకం అనే సూత్రాలతో చక్రభ్రమణ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తున్నాం. నేడు భారత్‌లో ప్రతిరోజూ వేలాది టన్నుల వ్యర్థాలను పునర్వినియోగానికి అనువుగా మారుస్తున్నారు. గోబర్ధన్‌ యోజన ద్వారా గ్రామాల్లో ఆవు పేడతో పాటు ఇతర సేంద్రియ వ్యర్థాలను ఉపయోగకరమైన వనరులుగా మారుస్తున్నారు. వ్యర్థాలను సమస్యగా చూడకుండా వ్యర్థాల నుంచి సంపద ( వేస్ట్ టూ వెల్త్‌) నమూనా కింద వాటిని విలువైన వనరులుగా మార్చాలన్నదే మన ప్రయత్నం.

మిత్రులారా, 

ఈ గణాంకాలన్నీ కేవలం భారత్‌ అభివృద్ధికి సంబంధించిన వివరాలు మాత్రమే కావు.  మానవాళి భవిష్యత్తు కోసం భారత్‌ అందిస్తున్న సహకారానికి ఇవి ప్రతిబింబాలు.

మిత్రులారా, 

మన సాంస్కృతిక భావన – “మాతా భూమిః, పుత్రో అహం పృథివ్యాః” అంటే.. ఈ భూమి మన తల్లి, మనం ఆమె బిడ్డలం. ఈ ఆలోచనతోనే భారత్‌ బాధ్యతాయుతమైన, సుస్థిరమైన భవిష్యత్తును నిర్మించే దిశగా కృషి చేస్తోంది. ఈ సదస్సులో జరిగే చర్చలు, వాటి నుంచి వెలువడే కొత్త ఆలోచనలు, పరిష్కారాలు భవిష్యత్‌ తరాలకు ఎంతో గొప్పగా తోడ్పడగలవని నేను విశ్వసిస్తున్నాను. మరోసారి ఈ సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ధన్యవాదాలు.

 

***