పిఎంఇండియా
పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా సింగూర్‌లో ఈ రోజు 830 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం చేయగా, కొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. నిన్న తాను మాల్దాలో ఉండగా ఈ రోజు హుగ్లీ ప్రజల మధ్య ఉండే భాగ్యం కలిగిందని అన్నారు. అభివృద్ధి చెందిన దేశం కోసం తూర్పు భారత్ అభివృద్ధి అత్యంత ఆవశ్యకమని.. ఈ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆయన ప్రధానంగా చెప్పారు. నిన్నటి, నేటి కార్యక్రమాలు ఈ సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ రెండు రోజుల్లో పశ్చిమ బెంగాల్ అభివృద్ధికి సంబంధించిన వందల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసే అవకాశం తనకు లభించిందని ప్రధానమంత్రి అన్నారు.
నిన్ననే దేశంలోని మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును పశ్చిమ బెంగాల్ నుంచి ప్రారంభించినట్లు ప్రధానమంత్రి ప్రముఖంగా చెప్పారు. బెంగాల్‌కు ఇప్పటికే దాదాపు అర డజను కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందాయని.. నేడు మరో మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ రైళ్లలో ఒకటి.. తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసితో బెంగాల్ అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. ఢిల్లీ, తమిళనాడులకు కూడా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించామన్న ఆయన.. పశ్చిమ బెంగాల్ రైల్వే అనుసంధానత విషయంలో గత 24 గంటలు అపూర్వమైనవని పేర్కొన్నారు.
జలమార్గాల విషయంలో బెంగాల్‌కు అపారమైన సామర్థ్యం ఉందన్న ప్రధానమంత్రి.. దీనిపై కూడా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ఓడరేవు ఆధారిత అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. కొద్ది సేపటి క్రితమే ఓడరేవులు, నదీ జలమార్గాలకు సంబంధించిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశామన్న ఆయన.. పశ్చిమ బెంగాల్, భారత్ అభివృద్ధికి ఇవి చాలా ముఖ్యమైనవని ఉద్ఘాటించారు. పశ్చిమ బెంగాల్‌ను తయారీ, వాణిజ్యం, రవాణాకు ప్రధాన కేంద్రంగా మార్చడానికి ఇవి పునాది స్తంభాలుగా నిలుస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.
ఓడరేవులు, ఓడరేవుల అనుబంధ వ్యవస్థకు ఎంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే అంత ఎక్కువ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గత 11 ఏళ్లలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఓడరేవు సామర్థ్య పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెట్టిందని ఆయన తెలిపారు. సాగరమాల పథకం కింద ఈ ఓడరేవు అనుసంధానతను మెరుగుపరిచేందుకు రహదారులను కూడా నిర్మించినట్లు ఆయన తెలియజేశారు. ఈ ప్రయత్నాల ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయన్న ఆయన.. గత ఏడాది కోల్‌కతా ఓడరేవు కార్గో నిర్వహణలో కొత్త రికార్డులను సృష్టించిందని గుర్తు చేశారు.
బాలాగఢ్‌లో అభివృద్ధి చేస్తున్న ‘ఎక్స్‌టెండెడ్ పోర్ట్ గేట్ సిస్టమ్‘.. హుగ్లీ, పరిసర ప్రాంతాలకు కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుందని ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యానించారు. దీనివల్ల కోల్‌కతా నగరంలో ట్రాఫిక్, సరకు రవాణా ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు. గంగానదిపై నిర్మించిన జలమార్గం ద్వారా సరకు రవాణా మరింత పెరుగుతుందన్న ఆయన.. ఈ మొత్తం మౌలిక సదుపాయాలు హుగ్లీని నిల్వ– వాణిజ్య కేంద్రంగా మార్చడానికి సహాయపడతాయని పేర్కొన్నారు. దీనివల్ల వందల కోట్ల రూపాయల కొత్త పెట్టుబడులు వస్తాయని, వేలాది ఉద్యోగాలు లభిస్తాయని, చిన్న వ్యాపారులు– రవాణా సంస్థలకు ప్రయోజనం కలుగుతుందన్న ఆయన.. వీటితో పాటు రైతులు, ఉత్పత్తిదారులకు కొత్త మార్కెట్లు లభిస్తాయని ప్రధానంగా చెప్పారు.
నేడు బహుళ నమూనా అనుసంధానత, హరిత రవాణాకు భారత్ బలమైన ప్రాధాన్యత ఇస్తోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఆటంకం లేని రవాణాకు వీలు కల్పించేందకు ఓడరేవులు, నదీ జలమార్గాలు, రహదారులు, విమానాశ్రయాలను ఒకదానితో ఒకటి అనుసంధానిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీనివల్ల సరకు రవాణా ఖర్చులు, రవాణా సమయం రెండూ తగ్గుతాయని ఆయన వ్యాఖ్యానించారు. రవాణా మార్గాలు ప్రకృతికి అనుకూలంగా ఉండేలా చూసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆయన.. హైబ్రిడ్ ఎలక్ట్రిక్ బోట్లు నదీ రవాణా, హరిత రవాణాను బలోపేతం చేస్తాయని అన్నారు. ఇవి హుగ్లీ నదిపై ప్రయాణాన్ని సులభతరం చేస్తాయని.. కాలుష్యాన్ని తగ్గిస్తాయని.. నది ఆధారిత పర్యాటకాన్ని ప్రోత్సహిస్తాయని ఆయన చెప్పారు.
మత్స్య– సముద్ర ఆహారాల ఉత్పత్తి, ఎగుమతుల్లో భారత్ వేగంగా పురోగమిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. ఈ రంగంలో పశ్చిమ బెంగాల్ దేశానికే నాయకత్వం వహించాలనేది తన కల అని అన్నారు. నదీ జలమార్గాల విషయంలో బెంగాల్‌కు ఉన్న దార్శనికతకు కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా మద్దుతు ఇస్తోందన్న ఆయన.. దీనివల్ల రైతులు, మత్స్యకారులు ఇప్పటికే ప్రయోజనం పొందుతున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ ప్రాజెక్టులన్నీ పశ్చిమ బెంగాల్ అభివృద్ధి ప్రయాణాన్ని వేగవంతం చేస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా అందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ శ్రీ సీ.వీ. ఆనంద బోస్.. కేంద్ర మంత్రులు శ్రీ సర్బానంద సోనోవాల్, శ్రీ శంతనూ ఠాకూర్, శ్రీ సుకాంత మజుందార్.. ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
నేపథ్యం–
హుగ్లీలోని సింగూర్‌లో రూ. 830 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు.
బాలాగఢ్‌లో అంతర్గత జలరవాణా (ఐడబ్ల్యూటీ) టెర్మినల్, రోడ్డు ఓవర్ బ్రిడ్జితో కూడిన ‘ఎక్స్‌టెండెడ్ పోర్ట్ గేట్ సిస్టమ్‘కు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు.
సుమారు 900 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బాలాగఢ్‌ను సంవత్సరానికి సుమారు 2.7 మిలియన్ టన్నుల (ఎంపీటీఏ) సామర్థ్యంతో కూడిన ఒక ఆధునిక కార్గో టెర్మినల్‌గా అభివృద్ధి చేస్తున్నారు. కంటైనర్ల ద్వారా రవాణా చేసే సరకుల కోసం ఒకటి, పొడిగా ఉండే భారీ సరకుల కోసం మరొకటి చొప్పున… రెండు ప్రత్యేక కార్గో జెట్టీల నిర్మాణం కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా ఉంది.
రద్దీగా ఉండే పట్టణ రహదారుల నుంచి భారీ సరకు రవాణాను మళ్లించడం ద్వారా సరకు తరలింపు సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరచడం బాలాగఢ్ ప్రాజెక్ట్ లక్ష్యం. ఇది రహదారి భద్రతను మెరుగుపరుస్తుంది. కోల్‌కతా నగరంలో వాహన రద్దీని, కాలుష్యాన్నీ తగ్గిస్తుంది. స్థానికుల జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది. బహుళ నమూనా అనుసంధానత, సరకు రవాణా సామర్థ్యం మెరుగుపడటంతో ప్రాంతీయ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, వ్యవసాయ ఉత్పత్తిదారులకు తక్కువ ఖర్చుతో మార్కెట్‌ను అందుబాటులోకి తెస్తుంది. ఈ ప్రాజెక్ట్ గణనీయమైన ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని సృష్టిస్తుంది. సరకు రవాణా, టెర్మినల్ కార్యకలాపాలు, రవాణా సేవలు, నిర్వహణ, అనుబంధ కార్యకలాపాల్లో ఉద్యోగాల కల్పన ద్వారా స్థానిక సమాజాలకు ఇది ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు.
కోల్‌కతాలో అత్యాధునిక ఎలక్ట్రిక్ కాటమరాన్‌ను ప్రధానమంత్రి ప్రారంభించారు. అంతర్గత జల రవాణా కోసం కొచ్చిన్ షిప్‌యార్డ్ దేశీయంగా నిర్మించిన 6 ఎలక్ట్రిక్ కాటమరాన్‌లలో ఇది ఒకటి. అధునాతన ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ వ్యవస్థలు, లిథియం–టైటనేట్ బ్యాటరీ సాంకేతికతతో 50 మంది ప్రయాణికుల సామర్థ్యం గల హైబ్రిడ్ ఎలక్ట్రిక్ అల్యూమినియం కాటమరాన్… పూర్తి ఎలక్ట్రిక్‌తో ఎటువంటి ఉద్గారాలు లేని విధంగా, మరింత మన్నిక కోసం హైబ్రిడ్ పద్ధతిలోనూ పనిచేయగలదు. ఈ నౌక హుగ్లీ నది వెంబడి పట్టణ నదీ రవాణా, పర్యావరణ సంబంధిత పర్యాటకం, మారుమూల ప్రాంతాల ప్రయాణికుల అనసంధానతకు మద్దతిస్తుంది.
జయరాంబతి–బరోగోపినాథ్‌పూర్–మాయనాపూర్ కొత్త రైలు మార్గాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. కొత్త తార్కేశ్వర్–బిష్ణుపూర్ రైలు ప్రాజెక్టులో ఈ మార్గం ఒక ముఖ్యమైన భాగంగా ఉంది. కొత్త రైలు మార్గంతో పాటు మాయనాపూర్–జయరాంబతి మధ్య బరోగోపినాథ్‌పూర్‌లో ఆగే కొత్త రైలును కూడా ప్రారంభించారు. రోజువారీ ప్రయాణికులకు, విద్యార్థులకు, యాత్రికులకు ప్రయాణాన్ని మరింత అందుబాటు ధరల్లో సౌకర్యవంతంగా మార్చే ఈ రైలు.. బాంకురా జిల్లా వాసులకు ప్రత్యక్ష రైలు అనుసంధానాన్ని అందిస్తుంది.
మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధానమంత్రి ప్రారంభించారు. వీటిలో కోల్‌కతా (హౌరా) – ఆనంద్ విహార్ టెర్మినల్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, కోల్‌కతా (సీల్దా) – బనారస్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, కోల్‌కతా (సంత్రాగచ్చి) – తాంబరం అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి.
***
Speaking at the launch of key development projects in Singur. These initiatives will strengthen regional connectivity, improve ease of living and accelerate West Bengal’s growth.
— Narendra Modi (@narendramodi) January 18, 2026
https://t.co/jXvM0fuk2k
विकसित भारत के लिए, पूर्वी भारत का विकास... इस लक्ष्य के साथ केंद्र सरकार निरंतर काम कर रही है: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 18, 2026
कल पश्चिम बंगाल से देश की पहली वंदे भारत स्पीलर ट्रेन शुरु हुई है।
— PMO India (@PMOIndia) January 18, 2026
बंगाल को, करीब आधा दर्जन नई अमृत भारत एक्सप्रेस ट्रेनें भी मिली हैं।
आज तीन और अमृत भारत एक्स्प्रेस ट्रेनें शुरु हुई हैं: PM @narendramodi
बालागढ़ में बनने वाला एक्सटेंडेड पोर्ट गेट सिस्टम... हुगली और आसपास के इलाकों के लिए नए अवसरों का द्वार खोलेगा: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 18, 2026
आज भारत में हम multi-modal connectivity और green mobility पर बहुत बल दे रहे हैं।
— PMO India (@PMOIndia) January 18, 2026
Seamless transportation संभव हो सके... इसके लिए port, नदी जलमार्ग, highway और airports... इन सभी को आपस में कनेक्ट किया जा रहा है: PM @narendramodi