పిఎంఇండియా
పారిశుధ్య కార్మికుల జాతీయ కమిశన్ కు 31.3.2019 తరువాత మరో మూడేళ్ల పాటు పొడిగించే ప్రతిపాదన ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.
ముఖ్యాంశాలు:
పారిశుధ్య కార్మికుల జాతీయ కమిషన్(ఎన్ సిఎస్ కె) చట్టం, 1993 ప్రకారం.. మొదట్లో 31.3.1997 వరకు కొనసాగే విధం గా 1993లో ఈ కమిశన్ ను ఏర్పాటు చేయడమైంది. అటుపైన ఈ చట్టం చెల్లుబాటు గడువు ను తొలుత 31.3.2002 వరకు, అటు పిమ్మట 29.2.2004 దాకా పొడిగించడమైంది. తదనుగుణం గా 29.2.2004 న దీని కి కాలం చెల్లింది. అయితే, తదనంతరం చట్టబద్ధ సంస్థ గా కాకుండా ఈ కమిశన్ పదవీకాలాన్ని అవసరం మేరకు ప్రభుత్వం పొడిగిస్తూండగా ప్రస్తుత కమిశన్ పదవీకాలం 31.3.2019తో ముగియనుంది.
ప్రధాన ప్రభావం:
పారిశుధ్య కార్మికుల సంక్షేమం మరియు అభ్యున్నతి కోసం ఈ కమిశన్ కృషి చేస్తుంది కాబట్టి దేశం లోని పారిశుధ్య కార్మికుల తో పాటు మానవ వ్యర్థాల ను తొలగించే పని లో ఉన్న వారికి కమిశన్ పదవీకాలం పొడిగింపు వల్ల ప్రధానంగా ప్రయోజనం కలుగుతుంది. మానవ వ్యర్థాల తొలగింపు కార్మిక చట్టం కింద నిర్వహించిన అధ్యయనం ప్రకారం 31.01.2019 నాటికి వారి సంఖ్య 14,226 గా నమోదైంది. అయితే, నీతి ఆయోగ్ ఉత్తర్వు కు అనుగుణం గా సాంఘిక న్యాయం- సాధికారిత మంత్రిత్వ శాఖ నిర్వహించిన అధ్యయనం లో 31.01.2019 నాటికి 31,128 మంది కార్మికులు ఉన్నట్లు నమోదైంది.
పూర్వరంగం:
మానవ వ్యర్థ పారిశుధ్య కార్మికుల సంక్షేమం దిశ గా చేపట్టవలసిన నిర్దిష్ట కార్యక్రమాల ను గురించి పారిశుధ్య కార్మికుల జాతీయ కమిశన్ ప్రభుత్వాని కి తగిన సిఫారసుల ను చేస్తోంది. అలాగే ప్రస్తుతం వారి సంక్షేమం కోసం అమలు చేస్తున్న కార్యక్రమాల పై అధ్యయనం, మూల్యాంకన బాధ్యత లను కూడా నిర్వర్తిస్తోంది. దీంతో పాటు వారి సమస్య లు, ఫిర్యాదు ల సంబంధిత కేసుల పై విచారణ ను నిర్వహిస్తుంది. అంతేకాకుండా మానవ వ్యర్థాల తొలగింపు పని లో కార్మికుల ను నియమించడం పై నిషేధం- పునరావాస కల్పన చట్టం నిబంధనల ప్రకారం.. అమలు పర్యవేక్షణ బాధ్యత కూడా కమిశన్ కు అప్పగించబడింది. ఈ చట్టాన్ని ప్రభావవంతం గా అమలు చేయడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కు సలహాలు, సూచనలు ఇస్తుంది. కేంద్ర, రాష్ట్రాల పరిధి లో చట్ట నిబంధనల సక్రమ అమలు-ఉల్లంఘనల కు సంబంధించి విచారణలు, ఫిర్యాదుల పై దర్యాప్తు కూడా కమిశన్ పరిధి లోనే ఉన్నాయి. పారిశుధ్య కార్మికుల అభ్యున్నతి కి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ సామాజికం గా, ఆర్థికం గా, విద్య పరం గా వెనుకబాటుతనాన్ని బట్టి చూస్తే ఈ వృత్తి నిర్మూలన కు చేయాల్సింది ఇంకా ఎంతో ఉందన్నది వాస్తవం. మరో వైపు దేశం లోని పలు ప్రాంతాల్లో మానవ వ్యర్థాల పారిశుధ్యం పని నేటికీ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యం లో ఇటువంటి హేయమైన పని కి మానవ వినియోగ విధానం నిర్మూలన కు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. అందువల్ల తాను తీసుకుంటున్న చర్యల ను మరికొంతకాలం కొనసాగించడం తో పాటు అమలు చేస్తున్న కార్యక్రమాల పై నిరంతర పర్యవేక్షణ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కారణం గానే పారిశుధ్య కమిశన్ పదవీకాలాన్ని 31.3.2019 అనంతరం మరో మూడు సంవత్సరాల పాటు పొడిగించాలన్న ప్రతిపాదన కు కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది.