Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పుణె లో జరిగిన ఇంటర్ నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్ ఆన్ శుగర్ కేన్ వేల్యూ చెయిన్ – ‘విజన్ 2025 శుగర్’ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం

పుణె లో జరిగిన ఇంటర్ నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్ ఆన్ శుగర్ కేన్ వేల్యూ చెయిన్ – ‘విజన్ 2025 శుగర్’ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం


ఇక్కడకు పెద్ద సంఖ్యలో విచ్చేసిన నా రైతు సోదరులు మరియు సోదరీమణులు మరియు సహకార రంగానికి చెందిన ప్రముఖులారా,

ముందుగా వ‌సంత్ దాదా పాటిల్ గారి శ‌త‌ జ‌యంతి ఉత్సవ ప్రారంభ ఘడియలో ఆయనకు నేను సగౌరవంగా నివాళులు అర్పిస్తున్నాను. ప్ర‌జా జీవితంలో ఆయ‌న ఉన్న‌త ప్ర‌మాణాలు నెల‌కొల్పారు. స‌హ‌కార రంగం ద్వారా రైతుల‌కు ఆయ‌న అపార‌మైన సేవ‌ల‌ను అందించారు. అందులో కూడా ఆయ‌న ఆధునిక మార్గాన్నే ఎంచుకున్నారు. వ‌సంత దాదా గారి ముందు చూపు కార‌ణంగానే ఈ సంస్థ పునాదులు ఈ నాటికీ దృఢంగా ఉన్నాయి. రైతుల‌కు, గ్రామీణ ప్రాంతాల‌కు సంబంధించిన భారతీయ ఆర్ధిర‌ కంగం లోని ప్రాథమిక మార్గం ప‌ట్ల ఆయ‌న ముందు చూపు గొప్పది. దీన్ని స‌క్ర‌మంగా గుర్తించి, ఈ విష‌యాన్ని నిరంత‌రం బ‌లోపేతం చేయ‌డం ద్వారా ముందు త‌రాల‌కు మేలు జ‌రుగుతుంది.

మ‌న దేశంలో వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న వేగం మ‌రింత అధికంగా ఉండాల్సింది. అలాగే సాంకేతిక‌తను ఉప‌యోగించుకున్న తీరు ఇప్పుడు ఉన్న స్థాయిలో కాకుండా మ‌రింత అధికంగా ఉండాల్సింది. ఈ అంశాలలో ప్ర‌పంచం సాధించిన ప్ర‌గ‌తితో పోల్చితే మ‌నం చాలా వెనుక‌బ‌డి ఉన్నాం. మ‌న దేశం లోని చెరుకు గ‌డ‌లో ఉండే చ‌క్కెర శాతాన్ని తీసుకొని దాన్ని ప్ర‌పంచ దేశాల‌తో పోల్చితే మ‌న దేశంలోని ప‌లు ప్రాంతాల్లో ఒక్కో చోట ఒక్కో ర‌కంగా ఉంది. ఇది ద‌క్షిణ ప్రాంతంలో ఒక ర‌కంగా ఉంటే, మ‌ధ్య భార‌తంలో మ‌రో ర‌కంగా ఉంది. ఉత్త‌ర భార‌తంలో మ‌రో ర‌కంగా ఉంది. ఇటువంటి ప‌రిస్థితుల్లో రైతులు అర్థం చేసుకునే భాష‌ను ఉప‌యోగించి వారిని చేరుకోవ‌డానికి ఈ సంస్థ అంకిత‌భావంతో ప‌ని చేసింది. ఈ విష‌యంలో శాస్త్ర‌వేత్త‌ల‌ను క‌లుపుకుపోతూ, సాంకేతిక‌త‌ను త‌గిన స్థాయిలో ఉప‌యోగించుకుంటూ ప్ర‌గ‌తి సాధించింది.

ఇది సాధార‌ణ‌మైన విజ‌యం కాదు. దీని ఫ‌లితాన్ని మ‌నం ఇప్పుడు చూస్తున్నాం. వ్య‌వ‌సాయం లోని ప‌లు విష‌యాల‌ను అర్థం చేసుకోవ‌డానికి ఈ రోజు నేను శ‌ర‌ద్‌ రావు గారితో క‌లిసి వ్య‌వ‌సాయ‌ క్షేత్రాన్ని ద‌ర్శించాను. వీటిని తెలుసుకోవ‌డ‌మంటే నాకు చాలా ఇష్టం. చెరుకు పంట సాగులో ఇమిడిన వ‌ర‌ద నీటి విధానం చూసి ఒక‌ప్పుడు నేను ఆందోళన చెందే వాడిని. పొలంలో నీరు పొంగిపొరలితేనే చెరుకు పంట పెరుగుతుంద‌ని రైతులు న‌మ్మ‌డ‌మే నా ఆందోళ‌న‌కు కార‌ణం.

ఈ విష‌యాల‌ను అర్థం చేసుకోవ‌డానికి చాలా సంవ‌త్స‌రాల క్రితం నేను మారిష‌స్ కు వెళ్లాను. ఆ రోజుల్లో నేను రాజ‌కీయాల్లో లేను. స్ప్రింక్ల‌ర్ల‌ను ఉప‌యోగించి అక్క‌డి రైతులు సాగునీటిని అందిస్తూ అధిక మొత్తంలో చెరుకుపంట‌లో దిగుబ‌డి సాధిస్తున్నార‌ని తెలుసుకున్నాను. మారిష‌స్ ప‌ర్య‌ట‌న‌ నుండి ఇండియాకు వ‌చ్చిన తరువాత మ‌న రైతుల‌తో మాట్లాడాను. కానీ వారిని ఒప్పించ‌లేక‌పోయాను. ఇది చాలా పాత విష‌యం. ఆ రోజుల్లో మ‌న రైతుల‌కు త‌క్కువ నీటి వినియోగం గురించి చెబుతుంటే వారు దీన్ని కొత్త ఆలోచ‌న‌గా ప‌రిగ‌ణించే వారు. సాధ్యం కాని ప‌ని అన్న‌ట్టుగా ఉండే వారు. అయినా వారికి వివ‌రించ‌డానికి నేను ప్ర‌య‌త్నించాను. సోద‌రులారా చూడండి.. దీన్ని ప‌క్క‌న పెట్ట‌కండి, సూక్ష్మ‌ నీటి సాగు ద్వారా చెరుకు సాగులో మంచి ఫ‌లితాలు వ‌స్తాయ‌ని చెప్పి చూశాను. ఫ‌లితం లేదు. కానీ ఈ రోజుల్లో మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ లలో త‌మ పొలాల్లో సూక్ష్మ‌ నీటి సాగు విధానాన్ని చేప‌ట్టిన తీరును చూస్తే సంతోషం క‌లుగుతోంది. నీటి కొర‌త‌ను వారు స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంటున్నారు. వారికి దీని ఫ‌లితాలు క‌నిపిస్తున్నాయి. చెరుకు పంట సాగులో సూక్ష్మ నీటి సాగు విధానాన్ని అవ‌లంబించిన చోట‌ మెరుగైన ఫ‌లితాలు కనిపిస్తున్నాయి. పంట నాణ్యంగా ఉంటోంది. అలాగే దిగుబ‌డి అధికంగా ఉంటోంది. అలాగే పంట‌లో చ‌క్కెర శాతం కూడా గ‌ణ‌నీయంగా ఉంటోంది. అందుకే సుగ‌ర్ ప‌రిశ్ర‌మ‌లో వున్న‌వారు కూడా క్ర‌మ‌క్ర‌మంగా ఈ విష‌యాన్ని గ్ర‌హించారు. రైతులు సూక్ష్మ నీటి సాగు విధానాన్ని అమ‌లు చేస్తే అది తప్ప‌కుండా మేలు చేస్తుంద‌ని తెలుసుకొన్నారు.

ఇక్క‌డ ప‌ని చేస్తున్న ప‌రిశోధ‌న సంస్థ‌ల‌ను తీసుకుందాం. వాటిపైన దృష్టిగానీ పెట్ట‌గ‌లిగితే రెండు అంశాలు ఉన్నాయి. నేను ఇప్ప‌టికే ఈ స‌మ‌స్య గురించి ప్ర‌భుత్వ‌ విభాగాల‌తో చర్చించాను. ప్ర‌పంచంలోని ఇత‌ర దేశాల‌ను తీసుకొంటే చెరుకు గ‌డ‌ మీద ఉండే క‌నుపుల మ‌ధ్య‌ ఎడం ఎక్కువ‌గా ఉంటుంది. మ‌న దేశంలో మాత్రం చెరుకు గ‌డ‌ మీద ఉండే క‌నుపుల మ‌ధ్య‌ ఎడం చాలా త‌క్కువ‌గా ఉంటుంది. దాని కార‌ణంగా చ‌క్కెర శాతం త‌క్కువ‌గా ఉంటోంది. దాంతో పంట‌లో వ్య‌ర్థాలు అధికంగా ఉంటున్నాయి. జెనెటిక్ స‌ర్దుబాట్ల ద్వారా చెరుకు గ‌డలోని రెండు క‌నుపుల మ‌ధ్య‌ దూరాన్ని పెంచ‌డానికి అవ‌కాశం ఉందా ? అలా చేయ‌గ‌లిగితే చెరుకు గ‌డ‌లోని చ‌క్కెర శాతం పెరుగుతుంది. అలా చేసిన‌ప్పుడు పంట‌కు త‌క్కువ నీరు పెట్టినా స‌రిపోతుంది. ఎందుకంటే క‌నుపుల మ‌ధ్య‌ ఎడం త‌క్కువ‌గా ఉండ‌డంవ‌ల్ల పంట‌కు ఎక్కువ నీరు అవ‌స‌ర‌మ‌వుతోంది. ఈ స‌మ‌స్య‌ పైన మ‌నం మ‌రింత ప‌రిశోధ‌న చేయాలా ! ఈ సంస్థ చెరుకు పంట‌లో ప‌రిశోధ‌న‌ల‌కే అంకిత‌మైన సంస్థ‌. కాబ‌ట్టి ఇక్క‌డ చెరుకు పంట మీద‌నే ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతాయి. శ‌ర‌ద్ రావు గారు గాని, ఇక్క‌డ వున్న శాస్త్ర‌వేత్త‌లు గాని ముందుకు రాగ‌లిగితే మ‌రో అంశాన్ని కూడా ఇక్క‌డ ప్ర‌స్తావిస్తాను. వాటి తీరును బ‌ట్టి ఈ రెండు అంశాల్లో స‌మ‌స్య‌లు ఒకే ర‌కంగా ఉ. నేను చెబుతున్న‌ది వెదురు పంట గురించి. వెదురు ఉత్ప‌త్తులకు అంత‌ర్జాతీయ మార్కెట్ ఉంది. అయితే మ‌న దేశంలో పెరిగే వెదురులో కూడా చెరుకు పంట‌లోని క‌నుపు స‌మ‌స్యే క‌నిపిస్తోంది. వెదురు గ‌డ‌లోని రెండు క‌నుపుల మధ్య ఎడం చాలా త‌క్కువ‌గా ఉంది. దీని కార‌ణంగా మ‌న రైతులు మ‌న వెదురు ఉత్ప‌త్తుల ద్వారా ఆశించిన స్థాయిలో ల‌బ్ధి పొంద‌లేక‌పోతున్నారు. వెదురు పంట సాగులో కూడా సాగునీటి వాడ‌కాన్ని త‌గ్గించి పంట దిగుబడిని పెంచ‌వ‌చ్చు. నేను శాస్త్ర‌వేత్త‌ను కాను. ఈ విష‌యంలో శాస్త్ర‌వేత్తలు బాగా చెప్ప‌గ‌ల‌రు. నా స్థూల‌మైన ఆలోచ‌న ప్ర‌కారం చెరుకుపంట‌లో దిగుబ‌డులు పెంచ‌డానికి చేస్తున్న ప‌రిశోధ‌న‌ల‌తోపాటుగానే వెదురు పంట‌లో కూడా జెనెటిక్ స‌ర్దుబాట్లు చేయ‌డంద్వారా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌వ‌చ్చా? అంత‌ర్జాతీయ స్థాయి నాణ్య‌త‌గ‌ల వెదురును ఉత్ప‌త్తి చేయ‌గ‌లిగితే దేశంలోని వ్య‌వ‌సాయార్థిక రంగంలో మ‌రో విభాగాన్ని ప్రారంభించ‌వ‌చ్చు. మ‌నం ఈ దిశ‌గా కూడా ఆలోచ‌న చేయ‌గ‌ల‌గాలి.

రెండో స‌మ‌స్య ఏదంటే వ్య‌వ‌సాయ భూముల శాతం త‌రిగిపోతోంది. త‌రాల త‌ర‌బ‌డి రైతు కుటుంబం త‌న వ్య‌వ‌సాయ భూమిని ఆ యా త‌రాల వార‌సుల‌కు పంచుతోంది. జ‌నాభా పెరిగే కొద్దీ సాగు చేసే భూములు త‌రిగిపోతున్నాయి. భూమిని ఇత‌ర అవ‌స‌రాల‌ కోసం ఉప‌యోగించ‌డం పెరుగుతోంది. అటువంటి ప‌రిస్థితుల్లో ప్ర‌తి హెక్టారు భూమిలో పంట దిగుబ‌డిని పెంచితేనే మ‌న రైతులు ల‌బ్ధి పొంద‌గ‌ల‌రు. పొలంలో వివిధ ర‌కాల ఎరువుల‌ను తెచ్చి గుమ్మ‌రించ‌గానే ప్ర‌తి హెక్టారుకు పంట దిగుబ‌డి పెర‌గ‌దు. శాస్త్రీయ ప‌ద్ధతిలో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ వ్య‌వ‌సాయం చేస్తేనే దిగుబ‌డి పెరుగుతుంది. చెరుకు పంట‌ లోని రెండు వ‌రుస‌ల మ‌ధ్య‌ మ‌రో పంట వేయ‌వచ్చ‌నే ఆలోచ‌న‌ను గ‌తంలో రైతులు అంగీక‌రించేవారు కాదు. ఇప్పుడు అటువంటి ప‌రిస్థితి లేదు. ఇప్పుడు రైతులు చాలా సంతోషంగా త‌మ చెరుకు పంట‌లోని రెండు వ‌రుస‌ల మ‌ధ్య‌ ప‌ప్పు బ‌ఠానీ, పెస‌లు వంటి పంట‌ల్ని వేస్తున్నారు. బిందు సేద్యం, స్ప్రింక్ల‌ర్ల విధానంలో పంట‌కు నీటిని అందిస్తున్న రైతులకు ఇది మ‌రీ సులువ‌యిపోయింది. కాబ‌ట్టి అద‌న‌పు పంట‌ల‌ను రాబ‌ట్టుకుంటున్నాం. చెరుకు పంట‌ నుండి య‌థావిధిగా మ‌నం ఆదాయం పొందుతున్నాం. అయితే రెండు వ‌రుస‌ల మ‌ధ్య‌ ఉప‌యోగం లేని నేల‌ను ఉప‌యోగించుకొని అద‌న‌పు పంట‌ను పొందుతున్నాం. ఈ విష‌యంలో కొంత మంది రైతులు కూర‌గాయ‌ల్ని పండిస్తుంటే మ‌రికొంద‌రు పూల‌ పంట‌ల్ని అద‌న‌పు పంట‌లుగా సాగుచేస్తున్నారు. అయితే ఎక్కువ మంది ప‌ప్పు పంట‌ల్నే వేస్తున్నారు. పప్పు ధాన్యాల పంట‌ల్ని ప్రోత్స‌హించాలనుకుంటున్నాం. ఇప్ప‌టికీ భార‌త‌దేశం భారీ మొత్తంలో ప‌ప్పు ధాన్యాల్ని దిగుమ‌తి చేసుకుంటోంది. భార‌త‌దేశంలో ప‌ప్పు ధాన్యాల‌కు భారీ డిమాండ్ ఉంది. అందుకే చెరుకు పంట‌తో పాటు ప‌ప్పు పంట‌ల సాగును చేప‌డితే మ‌నకు మార్కెట్ నుండి త‌ప్ప‌నిస‌రిగా ఆదాయం ల‌భిస్తుంది. చెరుకు పంట దిగుబ‌డిలో హెచ్చు త‌గ్గులుంటే ఆ సంవ‌త్స‌రం చెరుకుపంట‌లో నిరుప‌యోగంగా ఉన్న నేలను ఉప‌యోగించుకున్న రైతులు ల‌బ్ధి పొంద‌డం జ‌రుగుతుంది. ఈ అంశంలో మ‌రింత ప‌రిశోధ‌న జ‌ర‌గాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంది.

ఇంత‌వ‌ర‌కూ చూస్తే మన చెరుకు రైతుల భ‌విష్య‌త్ పూర్తిగా చ‌క్కెర మిల్లుల మీద‌నే ఆధార‌ప‌డి ఉంది. చ‌క్కెర మిల్లులే రైతుల భ‌విష్య‌త్తును నిర్ణ‌యిస్తూ వస్తున్నాయి. వ‌సంత్ దాదా పాటిల్‌ గారు, శ‌ర‌ద్ రావు గారి నాన్న‌గారు, స‌హ‌కార సంస్థ‌ల ప్ర‌గ‌తి కోసం జీవితాన్ని అంకితం చేసిన గ్రామీణ ప్రాంతాల నాయ‌క దిగ్గ‌జం వైకుంఠ రాయ్ మెహ‌తా గారు ల కార‌ణంగా స‌హ‌కార సంస్థ‌లు బలోపేత‌మ‌య్యాయి. వాటి కార‌ణంగా ఈ త‌రానికి అనేక అవ‌కాశాలు ల‌భించాయి. స‌హ‌కార రంగ పునాది గ‌ట్టిగా ఉండ‌డం వ‌ల్ల మ‌హారాష్ట్ర , గుజ‌రాత్ ల రైతులు త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోగ‌లుగుతున్నారు. అయితే స‌మ‌యానుకూలంగా చూసుకుంటే అంత‌ర్జాతీయ ఆర్ధిక‌ వ్య‌వ‌స్థ‌లో ఉండే అద‌న‌పు విలువ‌ను మ‌నం మ‌రచిపోకూడ‌దు. ఇది వ‌ర్త‌మాన అవ‌స‌రం. ప్ర‌పంచ‌ వ్యాప్తంగా చూసిన‌ప్పుడు చ‌క్కెర ఉత్ప‌త్తి పెరిగితే భార‌త‌దేశం భారీగా న‌స్ట‌పోతోంది. ప్ర‌పంచ‌బవ్యాప్తంగా చ‌క్కెర ఉత్పత్తి త‌గ్గిపోతే అప్పుడు భార‌త‌దేశానికి అవ‌కాశం ల‌భిస్తుంది. ఒక్కోసారి మార్కెట్ ప‌రంగా భార‌త‌దేశానికి అనుకూల ప‌రిస్థితులు వ‌స్తాయి. అయితే ఆ ఏడాది క‌రువు ప‌రిస్థితులు వ‌చ్చి మ‌న రైతులు దెబ్బ తిన‌డం జ‌రిగితే ఆ అవ‌కాశాన్ని మ‌నం ఉప‌యోగించుకోలేం. అటువంటి అన‌నుకూల ప‌రిస్థితుల్లో మ‌నం ఈ రంగాన్ని నిర్వ‌హించాల్సి ఉంటుంది. అయితే దీనికి ప‌రిష్కారం ఉంది. దాని ద్వారా కొంత మేర‌కు హామీ ల‌భిస్తుంది. అదే ఎథెనాల్‌.

భార‌త‌దేశం త‌న ద‌గ్గ‌రున్న విదేశీ మార‌క ద్ర‌వ్యంలో అధిక మొత్తాన్ని ఇంధ‌న దిగుమ‌తికి వినియోగిస్తోంది. పెట్రోల్‌, డీజిల్‌, ఆయిల్ దిగుమ‌తుల‌కు మ‌నం అధిక మొత్తంలో ఖ‌ర్చు చేస్తున్నాం. ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ‌లో ఎథెనాల్ ఉప‌యోగించ‌డంద్వారా ఈ ఇంధ‌న దిగుమ‌తిని మ‌నం ఎలా త‌గ్గించ‌గ‌లం? ప‌్ర‌పంచంలో ప‌లు దేశాలు ముఖ్యంగా బ్రెజిల్ లాంటివి ఎథెనాల్ ను స‌క్ర‌మంగా ఉప‌యోగించ‌డం ద్వారా పెట్రోల్ వినియోగాన్ని త‌గ్గించుకున్నాయి. అంతే కాదు ఆ దేశాలు ప‌ర్యావ‌ర‌ణ హిత వాతావ‌ర‌ణాన్ని త‌యారు చేసుకోగ‌లిగాయి. ఇండియాలో ఎథెనాల్ వినియోగాన్ని ఎలా పెంచ‌గ‌లం ? గ‌త రెండేళ్ల‌లో ఎథెనాల్ ఉత్ప‌త్తి, అమ్మ‌కాలు మూడింత‌లు పెరిగాయి. 2015-16లో దేశ చ‌రిత్ర‌లోనే ఇది అత్య‌ధికం. అయితే మ‌నకున్న సామ‌ర్థ్యంతో పోలిస్తే ఇది త‌క్కువే. అందుకే విధానాల ద్వారా, ప్రోత్సాహ‌క వ్య‌వ‌స్థ ద్వారా, అద‌నపు విలువ‌ ద్వారా దిగుమ‌తుల్ని త‌గ్గించుకోవ‌డం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఎథెనాల్ విష‌యంలో ఈ ప‌ని చేయాలి. మ‌న ర‌వాణా వ్య‌వ‌స్థ‌లో గ‌ల్ఫ్ చ‌మురు, ప‌రిశ్ర‌మ‌ల చ‌మురు లను వినియోగిస్తున్నాం. నాకు న‌మ్మ‌కం ఉంది.. మ‌న రైతులు ప‌రిశ్ర‌మ‌ల చ‌మురు ఉత్ప‌త్తికోసం కృషి చేసి, దేశంలో గ‌ల్ఫ్ చ‌మురు వినియోగాన్ని త‌గ్గించి దేశాన్ని ప్ర‌గ‌తి ప‌థంలో న‌డిపించ‌గ‌లరు. ఈ అంశాల‌ను మ‌నం బ‌లోపేతం చేయాల్సి ఉంది. ఇందుకోసం ప్ర‌భుత్వం ప్ర‌గ‌తి పూర్వక విధాన నిర్ణ‌యాల‌ను తీసుకోవాల్సి ఉంది. మొట్ట మొద‌టిసారిగా ఎంఎస్ పి వంటి వ్య‌వ‌స్థ‌ కోసం ఏర్పాట్లు చేశాం. వాటిని స‌ర‌ళ‌మైన‌వ‌ని మీరు పిల‌వ‌వ‌చ్చు. కానీ న‌మ్మ‌క‌మైన మార్కెట్ అభివృద్ధి చెందుతుంది.

దేశంలో కొన్ని చ‌క్కెర క‌ర్మాగారాల్లో ఎథెనాల్ ఉత్ప‌త్తికి అవ‌స‌ర‌మైన యంత్రాలు, క‌ర్మాగారాలు లేవు. ఎవ‌రి ద‌గ్గ‌రైనా దీనికి సంబంధించి స‌హాయం తీసుకొని క‌ర్మాగారాన్ని ఏర్పాటు చేసుకోమ‌ని వారికి చెప్ప‌డం జ‌రిగింది. ఆ తరువాత వారి ఖ‌ర్చుల‌ను ప్ర‌భుత్వం ఇస్తుంది. ఈ నిర్ణ‌యం కార‌ణంగా చెరుకు ఉత్ప‌త్తిలో భారీ భాగాన్ని ఎథెనాల్ ఉత్ప‌త్తికి మ‌ర‌లించ‌వ‌చ్చు. చ‌క్కెర మార్కెట్ ఆశించిన స్థాయిలో లేన‌ప్పుడు ప‌రిస్థితిని స‌మ‌న్వ‌యం చేయ‌వ‌చ్చు. చ‌క్కెర మార్కెట్‌లో ఏవైనా స‌మ‌స్య‌లు వ‌స్తే మ‌న మార్గాన్ని మార్చుకోవ‌డం జ‌రుగుతుంది. ఇది మ‌న ఆర్ధిక వ్య‌వ‌స్థ‌లో స‌మ‌న్వ‌య శ‌క్తిగా ప‌ని చేసి మ‌న‌కు స‌హాయ‌కారిగా ఉంటుంది.

స్టార్ట్- అప్ కంపెనీల‌ద్వారా కూడా మ‌నం ఈ స‌మ‌స్య‌నుండి బైట‌ప‌డ‌వ‌చ్చు. ప‌రిశోధ‌న‌లు, అన్వేష‌ణ రంగంలో మ‌నం చాలా సాధించాల్సి ఉంది. కంపెనీలో జ‌రుగుతున్న‌ వాటితో పోలిస్తే ఇంజినీయరింగ్ ద్వారా వ్య‌వ‌సాయ‌రంగంలో నూత‌న ఆవిష్క‌ర‌ణలు ఎక్కువగా జ‌రుగుతున్నాయి. వైద్య‌ శాస్త్రం పూర్తిగా సాంకేతిక‌తతో ముందుకు సాగుతోంది. వైద్య‌శాస్త్రాల రంగంలో సాంకేతిక‌త ఎలాగైతే ముఖ్య‌మైన పాత్ర‌ను పోషిస్తున్న‌దో అదే విధంగా వ్య‌వ‌సాయ‌ రంగంలో కూడా ప్ర‌ధాన‌మైన పాత్ర‌ను పోషించే రోజు ఎంతో దూరంలో లేదు. మ‌న యువ‌త, శాస్త్ర‌వేత్త‌లు, సాంకేతిక నిపుణులు నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు సాధించేందుకు వీలుగా స్టార్ట్- అప్ ల ద్వారా మ‌నం అవ‌కాశాల‌ను క‌ల్పించాలి.
క్షేత్ర‌స్థాయి పైన, చ‌క్కెర మీదా… వస‌ంత‌ దాదా పాటిల్ గారు ప్రారంభించిన సంస్థ‌లో త‌యార‌య్యే చ‌క్కెర ఉప ఉత్ప‌త్తుల‌మీదా దృష్టి పెడ‌దాం. నేను ఇప్పుడే కొన్ని యంత్రాల‌తో కూడిన నూత‌న ప‌రికరాన్ని చూశాను. పాల‌ల్లో కొవ్వు శాతాన్ని అంచ‌నా వేసిన‌ట్టే, దానితో చెరుకు గ‌డ‌ల్లోని చ‌క్కెర శాతాన్నితెలుసుకుంటున్నారు. ఇవి ఇప్ప‌టికే ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ పొందాయి. అయితే ప్ర‌తిభ‌ గ‌ల మ‌న యువ‌త అటువంటి చిన్న యంత్రాల‌ను భారీ సంఖ్య‌లో అభివృద్ధి చేయ‌గ‌ల‌రు. మ‌నం స్టార్ట్- అప్స్ ను బ‌లోపేతం చేయాల్సి ఉంది. వ్య‌వ‌సాయరంగంలో స్టార్ట్- అప్స్ సంఖ్య ఎంత పెరిగితే అవి మ‌న రైతుల‌కు అంత ఉప‌యోగ‌క‌రంగా ఉంటాయి. వ్య‌వ‌సాయ‌ ప‌రంగా, అద‌న‌పు విలువ ప‌రంగా రెండు విధాలా అవి ఉప‌యోగ‌క‌రంగా ఉంటాయి. ఈ నేప‌థ్యంలో మ‌నం వ్య‌వ‌సాయ‌రంగంలో రెండో హ‌రిత విప్ల‌వం గురించి మాట్లాడ‌వ‌చ్చు. అది కేవ‌లం భూముల విస్తీర్ణం, పంట దిగుబ‌డులకు సంబంధించింది మాత్ర‌మే కాదు. ఈ విప్ల‌వం వ్య‌వ‌సాయ దిగుబ‌డులు, జెన‌టిక్ స‌ర్దుబాట్లు, సాంకేతిక‌తను ఆధునీక‌రించ‌డం, అద‌న‌పు విలువ‌, మార్కెట్ మొద‌లైన వాటికి సంబ‌ధించిన‌ది.

రైతుల‌కు పూర్తి స్థాయిలో భ‌ద్ర‌త ఇవ్వ‌డానికి వీలుగా ‘ప్ర‌ధాన మంత్రి ఫ‌స‌ల్ బీమా యోజన’ ను ప్ర‌భుత్వం ప్ర‌వేశపెట్టింది. ఇది రైతుల‌కు అత్య‌ధిక భ‌ద్ర‌త‌ను క‌ల్పించే బీమా ప‌థ‌కం. త‌న పొలంలో ఏ పంట‌లు వేయాల‌నే విష‌యాన్ని స్వ‌యంగా రైతులు తేల్చుకోవాలి. తన స‌మీపంలోని పొలంలో రైతు ఎర్ర రంగు బాక్సులో నుండి తీసి ఏదైనా వినియోగిస్తే దాన్నే త‌నూ వినియోగించాల‌ని మ‌రో రైతు భావిస్తున్నాడు. లేదా ప‌చ్చ రంగు పౌడ‌ర్‌ను ఏ రైత‌ు అయినా ఉప‌యోగిస్తే వారి స‌మీపంలోని మ‌రో రైతు త‌ను కూడా ఆ ప‌చ్చరంగు పౌడ‌ర్ నే ఉప‌యోగించాల‌నుకుంటున్నాడు. ఒక్కో రైతు పొలం ఒక్కొక్క తీరుగా ఉంటుందనే విష‌యాన్ని రైతులు మ‌రచిపోతున్నారు. పొలం స్వ‌భావం వాటికి అవ‌స‌ర‌మ‌య్య ప‌దార్థాలు ఆయా పొలాల‌కు వేరువేరు ఉంటాయ‌నే విష‌యాన్ని రైతులు గ్ర‌హించాలి. ఒక రైతు పొలం నేల ధ‌ర్మాలు మ‌రో రైతు పొలం ధ‌ర్మాలు వేరు వేరుగా ఉంటాయి. రైతులు మొద‌ట త‌మ పొలాల నేల సామ‌ర్థ్యాన్ని తెలుసుకోవాలి. ఇందుకు సాయిల్ హెల్త్ కార్డు ఉప‌యోగ‌ప‌డుతుంది. పొలం కూడా మాన‌వ శ‌రీరం వంటిదే. ర‌క్త‌ ప‌రీక్ష‌, మూత్ర ప‌రీక్ష‌, ఇంకా ఇత‌ర రిపోర్టులు వ‌చ్చిన తరువాత‌నే వైద్యులు మందుల చీటీల‌ను రాస్తారు. మానవ శ‌రీరం గురించి ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకుంటామో అలాగే పొలం ఆరోగ్యం గురించి శ్ర‌ద్ధ తీసుకోవాలి. స్టార్ట్- అప్ కంపెనీలుగా ప్రారంభ‌మైన నేల ప‌రీక్ష‌ల ల్యాబుల‌ ద్వారా సాయిల్ హెల్త్ కార్డుల‌ను అధిక మొత్తంలో పొంద‌వ‌చ్చు. రైతులు కూడా త‌మ స‌హ‌కార సొసైటీ ద్వారా సొంత నేల ప‌రీక్ష‌ల ల్యాబుల‌ను ఏర్పాటు చేసుకోవ‌చ్చు. ప్ర‌తి ఏడాది రైతులు త‌మ పొలాల్లో విత్త‌నాలు వేసే ముందు ఆ పొలం సామ‌ర్థ్యాన్ని తెలుసుకోవ‌డానికి ప్రాధాన్య‌మివ్వాలి. పొలం బ‌లానికి అనుగుణంగా ఏయే ప‌నులు చేయాలో స‌మ‌య ప‌ట్టిక‌ను త‌యారు చేసుకోవాలి. దీనివ‌ల్ల వ్య‌వ‌సాయ ఖ‌ర్చులు గ‌ణ‌నీయంగా త‌గ్గుతాయి.

సోలార్ పంపుల విష‌యంలో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం భారీ కార్య‌క్ర‌మాన్నే ప్రారంభించింది. సోలార్ పంప్ ఉద్య‌మాన్ని రైతుల‌కు చేరువ చేస్తే వ్య‌వ‌సాయంలో ఖ‌ర్చులు త‌గ్గుతాయి. ఎందుకంటే విద్యుత్ పైనా, నీటి పైనా రైతులు పెడుతున్న ఖ‌ర్చులు చాలా ఎక్కువ‌గా ఉంటున్నాయి. సోలార్ పంపుల వినియోగం పెర‌గడానికి అనుగుణంగా కేంద్ర ప్ర‌భుత్వం ప్రోత్సాహ‌కాలు అందిస్తోంది. ఇదే బాట‌లో న‌డుస్తోంది మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం. స‌హ‌కార సంస్థ‌లు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనాలి. వ్య‌వ‌సాయంలో సోలార్ పంపుల‌ను ఉప‌యోగించ‌డం ద్వారా విద్యుత్తు ను ఆదా చేసే దిశ‌గా మ‌నం కృషి చేయాలి. ఈ ప‌ని చేస్తే వ్య‌వ‌సాయ పెట్టుబ‌డులు రైతుల‌కు అనుకూలంగా ఉంటాయి.

మీరు వ్య‌వ‌సాయ‌ రంగంలో నా కంటే వేయి రెట్లు ఎక్కువ అనుభ‌వం క‌లిగిన‌వార‌ని నేను న‌మ్ముతున్నాను. నేను శ‌ర‌ద్ రావు గారి ప‌ని విధానాన్ని గ‌మ‌నిస్తూనే వున్నాను. ఎంత రాజ‌కీయ హ‌డావిడీ వున్నా, రాజ‌కీయ‌ప‌ర‌మైన ఒత్తిళ్లు ఎన్ని ఉన్నా వ్య‌వ‌సాయ‌ రంగానికి సంబంధించిన ఏ స‌మ‌స్య వచ్చినా, అన్న‌దాత‌లకు ఏవైనా ఇబ్బందులు వ‌చ్చినా ఆయ‌న వెంట‌నే కార్య‌రంగం లోకి దిగుతారు. ఆ ప‌నిని త‌న భుజాల‌ మీద వేసుకుంటారు. ఈ అంకిత భావాన్ని నేను స్వ‌యంగా గ‌మ‌నించాను. ఈ ఫిబ్ర‌వ‌రి నాటికి ప్ర‌జాప్ర‌తినిధిగా, క్రియాశీల‌క రాజ‌కీయాల్లో ఆయ‌న యాభై ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. ఆయ‌న‌కు నా ముంద‌స్తు శుభాకాంక్ష‌లు. గ‌త యాబై సంవ‌త్స‌రాలుగా విశ్రాంతి అనేదే లేకుండా ఆయ‌న ప్ర‌జాప్ర‌తినిధిగా ప్ర‌జ‌ల‌కు సేవ‌లందిస్తున్నారు. ఎన్నిక‌ల్లో పాల్గొనే వారికి, ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించే వారికి బాగా తెలుసు.. వారు ఎటువంటి జీవితాన్ని గ‌డ‌పవలసి వ‌స్తుందో. శ‌ర‌ద్ రావు గారు ఈ విష‌యాన్ని ఆచ‌రించి చూపారు. ప్ర‌జాజీవితంలో ఎలా మెల‌గాల‌నేదానికి ఆయ‌న ఉత్త‌మ‌మైన ఉదాహ‌ర‌ణ‌గా నిలిచారు.

దేవేంద్ర ఫ‌డ్ ణవీస్ గారిని గురించి మాట్లాడుకోవాలంటే ఆయ‌న‌ నాగ్ పుర్ పురపాలక సంఘ కార్పొరేట‌ర్ గా ఎన్నిక‌యిన‌ నాటి నుండి తీసుకుంటే ప్ర‌జాప్ర‌తినిధిగా ఆయ‌న పాతికేళ్ల పాటు సేవ‌లందిస్తూ వ‌చ్చారు. ఇంత త‌క్కువ వ‌య‌స్సులో ఆయన ఈ స్థాయికి చేరుకున్నారు. ఏది ఏమైన‌ప్ప‌టికీ శ‌ర‌ద్ రావు గారు ఎంపీగా, ఎమ్మెల్యేగా సేవ‌లందించారు. ఆయ‌న వార‌స‌త్వం ఘ‌న‌మైంది. ప్ర‌జా జీవితంలో ఆయ‌న భారీ కీర్తిని సంపాదించారు. అది ఘ‌న‌ వార‌స‌త్వం. వ్య‌క్తిగ‌తంగా తీసుకుంటే శ‌ర‌ద్ రావు గారు అంటే నాకు అపార‌మైన గౌర‌వం ఉంది. నేను గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న ఎల్ల‌ప్పుడూ నాకు సాయం చేస్తుండే వారు. మ‌ద్ద‌తుగా నిలిచే వారు. ఈ విష‌యాన్ని బ‌హిరంగంగా ఒప్పుకోవ‌డానికి నేను గ‌ర్వ‌ప‌డుతున్నాను. ప్ర‌జా జీవిత‌మంటే ప్ర‌జ‌ల‌ సంక్షేమం కోస‌మేనని నేను న‌మ్ముతున్నాను.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా, ప్ర‌స్తుతం మాట్లాడుతున్న విష‌యానికి సంబంధం లేని దాని గురించి నేను కొంత చెప్పాల‌నుకుంటున్నాను. ఎనిమిదో తేదీన రాత్రి ఎనిమిది గంట‌ల‌కు ఏం జ‌రిగిందో మ‌నంద‌రికీ తెలుసు. మ‌న శ‌త్రువులు త‌మ దేశంలో ముద్రించే క‌రెన్సీకంటే అధికంగా మ‌న దేశ కరెన్సీని ముద్రించి ఆ న‌కిలీ నోట్ల‌ను మ‌న దేశంలోకి దొంగ‌గా ర‌వాణా చేయడానికి కుట్ర ప‌న్నారు. లెక్క‌కు మించి పెద్ద నోట్ల‌ను అందుబాటులోకి తెచ్చారు. న‌క్స‌లిజం లేదా ఉగ్ర‌వాదం పేరుతో కొంత మంది డ‌బ్బును దోచుకున్నారు. వారు ఆ డ‌బ్బును అడ‌వుల్లో దాచి వీలున్న‌ప్పుడ‌ల్లా ఆయుధాలు కొంటున్నారు. అది ఉగ్ర‌వాదానికి సాయం చేస్తోంది. అందుకే త‌ప్ప‌నిస‌రిగా ఈ నిధుల‌ను ఆపాల్సి వ‌చ్చింది. అందుకే మా ప్ర‌భుత్వం న‌కిలీ నోట్ల‌కు సంబంధించి ఎంతో ముఖ్య‌మైన నిర్ణ‌యాన్ని తీసుకుంది. న‌కిలీ నోట్లు రూ. 1000, రూ.500 నోట్ల రూపంలో ఉన్నాయి. నోట్ల‌ చెలామణీ ర‌ద్దు నిర్ణ‌యానికి ఆశీర్వాదం ప‌లుకుతున్నందుకు దేశ ప్ర‌జ‌ల‌కు నేను కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. ఈ స‌మావేశంలో అధిక సంఖ్య‌లో రైతులు ఉన్నారు కాబ‌ట్టి నోట్ల ర‌ద్దును గురించి కొంత చెప్పాల‌ని అనుకుంటున్నాను. ఎందుకంటే కొంత త‌ప్పుడు స‌మాచారం వ్యాప్తి చెంది ఉంది. రైతుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే ప‌ని జ‌రిగింది. పెద్ద నోట్ల‌యిన రూ. 1000, రూ.500 ర‌ద్ద‌య్యాయి కాబ‌ట్టి రైతులు ఏం సంపాదించినా స‌రే దాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని ప్ర‌భుత్వం చెబుతోందని, ఆ డిపాజిట్ల‌పైన మోదీ ప‌న్ను వేస్తార‌ని దుష్ప్ర‌చారం జ‌రిగింది. నా రైతు సోద‌రులారా, ఇటువంటి త‌ప్పు ప్రచారాల‌ను న‌మ్మ‌వ‌ద్దు. మీపైన ఎలాంటి ప‌న్నులు ఉండ‌వు. మీరు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఇది మీదేశం, మీ డ‌బ్బు మీదే, బ్యాంకులు ప‌ని చేస్తున్న‌ది మీక‌స‌మే. మోదీ మీ వాడే. నోట్ల ర‌ద్దు విష‌యంలో జ‌రుగుతున్న దుష్ప్ర‌చారానికి దూరంగా ఉండండి.

ఎనిమితో తేదీన నోట్ల ర‌ద్దు ను గురించి మాట్లాడుతూ యాభై రోజు ల స‌మ‌యం కావాల‌ని అడ‌గడం వాస్త‌వ‌మే. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌ది భారీ మార్పు. మీకు తెలిసే ఉంటుంది.. 1978 లో జ‌న‌తా పార్టీ అధికారంలో ఉన్న‌పుడు అప్ప‌టి ప్ర‌ధాని మొరార్జీ దేశాయ్ గారు వేయి రూపాయల నోట్ల‌ను ర‌ద్దు చేశారు. ఈ ప‌నిని చేసిన వారిలో నేను మొద‌టి వాడిని కాదు. ఆ తరువాత యుపిఎ ప్ర‌భుత్వం 25 పైస‌ల నాణేన్ని ర‌ద్దు చేసింది. ఒక‌సారి గుర్తు చేసుకోండి.. వాళ్లు 25 పైస‌ల నాణేల‌ను ర‌ద్దు చేశారు. మీకు ఈ విష‌యం తెలుసు. ఏది ఏమైనా, మొరార్జీ భాయ్ రూ. 1000 నోటు ను ర‌ద్దు చేశారు. అయితే ఆ స‌మ‌యంలో రిజ‌ర్వ్ బ్యాంకు ముద్రించింది కేవ‌లం 145 కోట్ల రూపాయ‌ల విలువైన రూ.1000 నోట్ల‌నే. అందులోనూ 80 కోట్ల రూపాయ‌ల విలువైన వేయి నోట్లు చ‌లామ‌ణీలో ఉంటే మిగ‌తా వేయి నోట్లు బ్యాంకుల‌ వ‌ద్ద ఉండేవి. ప్ర‌స్తుతం రూ. 500, రూ. 1000 నోట్లకు సంబంధించి రూ.14 ల‌క్ష‌ల కోట్ల విలువైన నోట్లు ఉన్నాయి. మ‌న శ‌త్రువులు, మ‌న స‌మాజానికి శత్రువులైన‌ వాళ్లు, అవినీతిప‌రులు దీన్ని అవ‌కాశంగా తీసుకున్నారు. మ‌న శ‌త్రువుల ప‌న్నాగాల్ని ధ్వంసం చేయ‌క‌పోతే మ‌న తరువాతి త‌రాల క‌ల‌లు సాకారం కాకుండా అవి అడ్డు ప‌డుతుంటాయి. కాబ‌ట్టి ప్రియ‌మైన నా సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా, నోట్ల ర‌ద్దు అనే పెద్ద నిర్ణ‌యం వ‌ల్ల క‌ష్టాలు రావ‌ని నేను చెప్ప‌ను. మొద‌టి రోజు నుంచే నేను చెబుతున్నాను దీని వ‌ల‌న ఇబ్బందులు వ‌స్తాయ‌ని. దీని వ‌ల్ల క‌ష్టాలు న‌ష్టాలు ఉంటాయని. కానీ డెబ్బ‌యి సంవ‌త్స‌రాలుగా దేశాన్ని ప‌ట్టి పీడిస్తున్న వ్యాధి నుండి విముక్తి క‌ల‌గ‌డానికి ఈ నిర్ణ‌యం దోహ‌దం చేస్తుంది. నా సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా, ఈ నిర్ణ‌యం ముందు త‌రాల‌కు స‌రైన మార్గాన్ని అందిస్తుంది. పేద‌వాళ్లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు త‌మ త‌లలు ఎత్తుకొని జీవించ‌గ‌లుగుతారు. నా తోటి దేశ పౌరులారా నేను మీకు విజ్ఞ‌ప్తి చేస్తున్నాను ఇబ్బందులు ఉన్న‌ప్ప‌టికీ మీరు నాకు స‌హ‌కారం అందించాల‌ని విన‌మ్రంగా కోరుతున్నాను. దేశంలో కొంత‌మంది తీవ్ర‌మైన ఇబ్బందుల పాల‌వుతారు. వారు ఏం చేస్తారో నాకు తెలియ‌దు. వారి గురించి నేను కూడా పెద్ద‌గా చింతించ‌ను. దేశం లోని సాధార‌ణ ప్ర‌జ‌ల గురించే నా ఆందోళ‌నంతా.

మీకు ఈ విష‌యంలో హామీ ఇస్తున్నాను. మీ ద‌గ్గ‌రున్న రూ.500 నోటును ఇచ్చి రూ.499 తీసుకోవ‌ద్దని కోరుతున్నాను. మీ ఐదు వంద‌ల నోటు పైన మీకు పూర్తి హ‌క్కు ఉంది. మీ హ‌క్కు మీకు ద‌క్కుతుంది. మీ ద‌గ్గ‌రున్న 1,000 రూపాయ‌ల నోటును ప‌ది రూపాయ‌ల‌కు త‌క్కువకు కూడా ఇవ్వ‌ద్దు. మీ 1000 రూపాయ‌ల నోటుకు మీకు 1000 రూపాయ‌లు తిర‌గి వ‌స్తాయి. డిసెంబ‌ర్ 30 వ‌ర‌కూ అంటే యాభై రోజుల స‌మ‌యం ఇవ్వ‌ండంటూ మిమ్మల్ని నేను అభ్య‌ర్థిస్తున్నాను. ఏర్పాట్లు చురుగ్గా జ‌రుగుతున్నాయి. 8 కంటే ముందు ఈ ప‌నిని నేను చేయ‌గ‌లిగి ఉండ‌లేన‌నే విషయం నిజ‌మే. అంతే కాదు దీన్ని ర‌హ‌స్యంగా ఉంచ‌లేము. అది బయట‌కు పొక్క‌వ‌చ్చు.. నోట్ల ర‌ద్దు విష‌యం ముందే పొక్కి ఉంటే న‌ల్ల‌ధ‌నాన్ని దాచుకున్న‌వాళ్లు వెంట‌నే మేలుకొని ల‌బ్ధి పొంది ఉండేవాళ్లు. నేను ఉన్న‌ది పేద‌వాళ్ల‌ కోసం. పేద ప్ర‌జ‌ల హ‌క్కుల‌ను కాపాడ‌డానికి. నేను సామాన్య ప్ర‌జ‌ల‌ కోసం జీవిస్తున్నాను. వారి హ‌క్కుల‌కోసం బ‌తుకుతున్నాను. నోట్ల ర‌ద్దు వ‌ల్ల వ‌చ్చే ఇబ్బందుల‌ను నేను ముందే ఊహించాను. మొద‌ట్లో బ్యాంకుల‌కు కొత్త నోట్ల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌డం క‌ష్టంగానే ఉంటుంది. అందుకే వ్య‌వ‌స్థ‌ను చ‌క్క‌దిద్ద‌డానికి, ప్ర‌క్షాళ‌న చేయ‌డానికి మీ సంపూర్ణ స‌హ‌కారం కావాలి.

ఈ ఆశావాదంతో మ‌రోసారి నేను వస‌ంత దాదా గారికి నా ప్ర‌ణామాలు తెలియ‌జేస్తున్నాను. ఆయ‌న‌కు శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నాను; నివాళి ఘ‌టిస్తున్నాను. ఆయ‌న శ‌త జ‌యంతి సంవ‌త్స‌రం రైతుల జీవితాల్లో మార్పులు తేవాల‌ని, ఆధునిక వ్య‌వ‌సాయం అందుబాటులోకి రావాల‌ని నేను కోరుకుంటున్నాను. ఈ సంద‌ర్భంగా నాకు ఇక్క‌డ‌కు వ‌చ్చే స‌ద‌వ‌కాశం ల‌భించింది. ఈ ముఖ్య‌మైన సంద‌ర్బంలో పాల్గొనాలంటూ న‌న్ను ఆహ్వానించినందుకు శ‌ర‌ద్ రావు గారికి నా హృద‌యపూర్వ‌క కృత‌జ్ఞ‌త‌ తెలియ‌జేసుకుంటున్నాను.

మీ అంద‌రికీ అనేకానేక ధన్యవాదాలు.