పిఎంఇండియా
ఇవాళ, ఆగస్టు 24వ తేదీని, మీ సంస్థ స్థాపక దినాన్ని మీరు ఒక గర్వకారణమైనటువంటి దినంగా వేడుక చేసుకొంటున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ అగ్రో ఇండస్ట్రీస్ ఫౌండేషన్ జాతి నిర్మాణంలో సముచిత పాత్రను పోషించడంపై మీకు నా అభినందనలు. ఈ రోజున నేను మీ మధ్యకు రాగలిగి, మీ సంతోషాన్ని పంచుకోగలిగి ఉంటే వ్యక్తిగతంగా అది నాకెంతో ఆనందం కలిగి ఉండేది.
మీ అందరి అనుభవాలను వినడం ద్వారా నేనూ ఎంతో కొంత కొత్త విషయాలను నేర్చుకునే వీలు చిక్కేది. వాడీ కార్యక్రమం ప్రారంభమైన సందర్భంగా నవ్‌సారి, వల్సాద్ లలో నేను మీ కృషిని సన్నిహితంగా పరిశీలించడం నాకు ఇప్పటికీ గుర్తుంది. అందువల్ల భావోద్వేగపరంగా బిఎఐఎఫ్ తో నాకు చాలా సాన్నిహిత్యం ఉంది. వివిధ రాష్ట్రాలలో మీ సంస్థ ఉద్యమ స్థాయిలో నిర్వహిస్తున్న కార్యకలాపాల రీత్యా ఏ సంస్థకైనా అది ఎంతో గొప్ప సంతృప్తినిస్తుంది. ఈనాటి కార్యక్రమంలో భాగంగా అనేక పురస్కారాల ప్రదానం సాగింది. కొన్ని స్వయం సహాయ సంఘాలతో పాటు వ్యక్తిగతంగా సాధించిన ఘనతకుగాను మరికొందరు విజేతలు అవార్డు అందుకొన్నారు. వీరిలో ఒకరు కర్నాటక, మరొకరు గుజరాత్, ఇంకొకరు మహారాష్ట్ర, వేరొకరు ఝార్ ఖండ్ రాష్ట్రాల నుండి వచ్చిన వారు ఉన్నారు. వారందరినీ పేరుపేరునా అభినందిస్తున్నాను. వారు ఇదే విధంగా సమాజహితం కోసం వారి కృషిని కొనసాగిస్తారని ఆశిస్తున్నాను.
మిత్రులారా, ఇది సాబర్ మతీ ఆశ్రమం స్థాపన, చంపారణ్ సత్యాగ్రహం శతాబ్ది సంవత్సరం కావడం ఈ సందర్భంగా గమనార్హం. అంతేకాదు.. ఇది సార్వత్రిక గణేశ ఉత్సవాల 125వ సంవత్సరం కూడా! మన దేశ చరిత్రలో ఈ మూడు మైలురాళ్లూ స్వాతంత్ర్య ఉద్యమానికి కొత్త దిశను చూపినవిగా సదా గుర్తుంటాయి. ప్రజా భాగస్వామ్యం ద్వారా పవిత్ర ప్రతిజ్ఞను సాకారం చేసుకోవడంలో ఇవన్నీ సంకేతాలు. భారతీయ అగ్రో ఇండస్ట్రీస్ ఫౌండేషన్ ఆవిర్భావానికి ప్రజా భాగస్వామ్యంతోనే ప్రజా సంక్షేమం అనే దార్శనికతే మూల సూత్రం. ఈ సంస్థ ఆవిర్భవించి నేటికి 50 సంవత్సరాలు పూర్తి అయ్యాయి గానీ, 1946లో గాంధీ గారి తో పాటు మణిభాయ్ గారు ఉరూలీ కంచన్ గ్రామానికి వచ్చిన నాడే దీనికి పునాది పడింది. గాంధీ జీ స్ఫూర్తితో ఈ ప్రాంతం మొత్తంలో పరివర్తనను తీసుకురావాలని ప్రతినబూనిన మణిభాయ్ గారు అప్పట్లోనే గుజరాత్ నుండి గిర్ జాతి గోవులు కొన్నింటిని ఇక్కడికి తేవడం ద్వారా తన కృషికి శ్రీకారం చుట్టారు. మన గ్రామాల్లోని సంప్రదాయ విజ్ఞానంతో ఆధునిక శాస్త్ర పరిజ్ఞానాన్ని జోడించి రైతులకు అనుబంధ ఆదాయం సమకూర్చడం ఎలాగో మీ సంస్థ విజయవంతంగా నిరూపించింది.
మిత్రులారా,
దేశంలో సమతుల అభివృద్ధి సాధించాలంటే గ్రామాల్లో నివసించే రైతులకు సాధికారిత ను కల్పించడం చాలా ముఖ్యం. రైతు సాధికారిత లేనిదే ‘న్యూ ఇండియా’ నిర్మాణ స్వప్నం సాకారం కాదు గనుకనే 2022 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో ప్రభుత్వం తన కృషిని ప్రారంభించింది. అందుకే వ్యవసాయ విధానాల అమలు తీరును ఉత్పాదక ప్రాధాన్యం నుండి ఆదాయ ప్రాథమ్యం వైపు మరల్చాం. ఆ మేరకు నేడు విత్తనం వేసిన నాటి నుండి పంట విపణికి చేరే దాకా ప్రభుత్వం రైతుకు అండగా ఉంటోంది. ప్రతి నీటి బొట్టునూ తగిన విధంగా ఉపయోగించడంపై దృష్టి పెట్టాం. సేంద్రియ వ్యవసాయాన్ని, పంటల మార్పిడిని ప్రోత్సహిస్తున్నాం. భూ కమతాల సామర్థ్య సమాచారం తెలుసుకొనేందుకు వీలుగా రైతులకు 9 కోట్లకు పైగా భూసార కార్డులను జారీ చేశాం. అలాగే ఇ-నామ్ (e-NAM) పథకం లో భాగంగా దేశం లోని 500కు పైగా వ్యవసాయ విపణులను అనుసంధానించాం. ఇటీవలే ‘ప్రధాన మంత్రి కిసాన్ సంపద’ పథకాన్ని ప్రవేశపెట్టాం. దేశంలో నిల్వ సదుపాయాల కొరతను తీర్చడం, ఆహార ఉత్పత్తి ప్రక్రియను ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యాలు.
ఏదైనా కారణం వల్ల రైతు ఆరుగాలం కష్టించి పండించిన పంట దెబ్బతింటే వారి జీవితాలు ఒడుదొడుకులలో పడకుండా సహాయానికి భరోసా ఇచ్చేందుకు ‘ప్రధాన మంత్రి పంటల బీమా’ (పిఎమ్ఎఫ్ బివై) పథకం అమలు చేస్తున్నాం. అధిక వడ్డీలతో పీడించే వ్యాపారుల బారి నుండి రైతులకు విముక్తి కల్పిస్తూ తక్కువ వడ్డీకి రుణాలను అందిస్తున్నాం. రైతుకు సాగు ఖర్చులు తగ్గించి, ఆదాయాన్ని పెంచడం ద్వారా వ్యవసాయానికి సంబంధించి వారికి వెతలు లేకుండా చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ఈ కృషిని మీరు గమనించే ఉంటారు. దేశానికి ఇంత తిండి పెట్టే అన్నదాతకు ఒత్తిడి తగ్గిస్తే దేశాభివృద్ధి కొత్త ఎత్తులకు చేరగలదు. ఈ దిశగా బిఎఐఎఫ్ ఎంతో సేవాభావంతో అనేక సంవత్సరాల నుండీ కృషి చేస్తోంది. అయితే, మీ మదిలో కొన్ని కొత్త ఆలోచనలు నాటాలని నేను ఇవాళ భావిస్తున్నాను. ఇదేదో మీకు సలహా ఇవ్వడమో, లేదా ఏదో సాధించడం కోసం ఓ నిపుణుడికి విజ్ఞాన బోధన చేయడమో కాదు. స్వయం సహాయ సంఘాల ద్వారా లక్షలాది మహిళలకు బిఎఐఎఫ్ సాధికారితను కల్పిస్తూనే ఉందని నాకు తెలుసు. అయితే, దీనిపై మీరు మరింత దృష్టి సారించాలన్నది నా ఆకాంక్ష.
ఓ నివేదిక ప్రకారం.. దేశంలో పశుపోషణ రంగానికి సంబంధించిన బాధ్యతలను 70 శాతందాకా నిర్వర్తిస్తోంది మహిళలే. పశువులకు మేత తేవడం, వాటికి నీళ్లు పెట్టడం, పాల దిగుబడి లేదా పశువులకు చికిత్స తదితరాలన్నింటినీ ప్రధానంగా మహిళలే చూసుకొంటున్నారు. ఒకవిధంగా పశుపోషణ రంగం దాదాపు పూర్తిగా మహిళల నైపుణ్యంపైనే ఆధారపడి ఉంది. కాబట్టి పశుసంబంధ విద్య, పరిశోధన, సేవా ప్రదానాలపై మహిళా స్వయం సహాయ సంఘాలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం నేటి అవసరం. ఈ రంగంలో ఎంత ఎక్కువగా శిక్షణ పొందితే దేశ పశుపోషణ రంగం అంత బలంగా తయారవడమేగాక ఆ మహిళలకూ లబ్ధి చేకూరుతుంది. ఈ దిశగా బిఎఐఎఫ్ వంటి సంస్థ గరిష్ఠ సంఖ్యలో మహిళలను ప్రభావితం చేయగలదు. ఆ మేరకు వారికి శిక్షణ ఇచ్చే కార్యక్రమాలను ప్రారంభిస్తుందని ఆశిస్తున్నాను.
మిత్రులారా,
మన దేశంలో పశవులకు సోకే వ్యాధులవల్ల ఏటా రూ.40 వేల కోట్ల దాకా నష్టం వాటిల్లుతోంది. ఈ సమస్య పరిష్కారం కోసం కొన్ని రాష్ట్రాల్లో పశు ఆరోగ్య మేళా వంటివి నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పశువులకు కంటి శుక్లం శస్త్ర చికిత్స మొదలు వాటి పళ్లు శుభ్రం చేయడం దాకా వివిధ సంరక్షణ చర్యలను చేపడుతున్నారు. అయితే, ఇలాంటి పశు మేళా కార్యక్రమాలను మరింత ఎక్కువగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వీటిని నిర్వహించడంలో బిఎఐఎఫ్ వంటి సంస్థలు ముఖ్యమైన పాత్ర పోషించగలుగుతాయి. మీ సంస్థ ఇప్పటికే 15 రాష్ట్రాలలో పనిచేస్తున్న నేపథ్యంలో మీ సామర్థ్యం మేరకు దేశం మొత్తానికీ మీ సేవలను విస్తరించాలని ప్రత్యేకించి మిమ్మల్ని కోరుతున్నా. తమ భూభాగంలో బిఎఐఎఫ్ శాఖల ఏర్పాటు కోసం ఈశాన్య రాష్ట్రాలు ఎదురుచూస్తున్నాయి. దేశానికి ఈశాన్యాన గల ఈ రాష్ట్రాలను ‘అష్టలక్ష్మీ’ కూటమిగా నేను పిలుస్తాను. ఈ రాష్ట్రాలలో సేంద్రియ వ్యవసాయానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల మీ అనుభవం వారికి ఎంతగానో లబ్ధి కారకం కాగలదని నా విశ్వాసం. అదేవిధంగా ఔషధ మొక్కల పెంపకంపై, సుగంధ మొక్కల పెంపకంపై రైతులకు అవగాహన పెంచాల్సిన అవసరం చాలా ఉంది. మన దేశంలో వేలాది ఔషధ మొక్కల జాతులు, సుగంధ మొక్కల జాతులు ఉన్నాయి. వాటికి ప్రపంచమంతటా గిరాకీ కూడా బాగా ఉంది. అయితే, గిరాకీ, సరఫరాల మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల ఈ ఔషధ మొక్కల పెంపకం- సరఫరా శృంఖలానికి సంబంధించిన అవగాహనను బిఎఐఎఫ్ వంటి సంస్థలు, అభ్యుదయ రైతులు, ప్రభుత్వం విస్తరింపజేయగలవు.
మిత్రులారా,
హరిత విప్లవం, శ్వేత విప్లవం మన దేశానికి సుపరిచితమే. అయితే, ‘నీలి విప్లవం’తో మన మత్స్యకార సోదరుల జీవితాల్లో మార్పును తీసుకురావలసిన సమయం ఆసన్నం అయింది. అలాగే తేనెటీగల పెంపకం- తేనె ఉత్పత్తి ద్వారా రైతులకు అనుబంధ ఆదాయం కోసం ‘మధుర విప్లవం’ కూడా నేటి అవసరం. ఆ మేరకు హరిత విప్లవం, శ్వేత విప్లవంతో పాటు నీలి విప్లవం, మధుర విప్లవం, జల విప్లవం దిశగా మేం కృషి చేస్తున్నాం. వ్యవసాయమంటే కేవలం గోధుమ, వరి, ఆవాలు వంటివి పండించడం కాదు, సంప్రదాయ వ్యవసాయంతో పాటు వ్యవసాయ ఉప రంగాల పైనా మరింత శ్రద్ధ తీసుకొంటే రైతులకు అనుబంధ ఆదాయం సమకూర్చేందుకు దోహదపడుతుంది. ఉదాహరణకు తేనెటీగల పెంపకాన్నే తీసుకుందాం.. ఓ పరిశోధన ప్రకారం సంప్రదాయ వ్యవసాయం చేసే రైతు ఓ 50 తేనెటీగల పెట్టెల యూనిట్ ను ఏర్పాటు చేసుకొంటే ఏటా రూ.2 లక్షల మేర అదనపు ఆదాయం ఆర్జించవచ్చు.
అంతేకాకుండా తేనె ఉత్పత్తితో పాటు పంటల ఫలదీకరణ ప్రక్రియ లోనూ తేనెటీగలు ప్రధాన పాత్ర ను పోషిస్తాయి. తేనెటీగల పెంపకం కావచ్చు.. చేపల పెంపకం కావచ్చు.. చెరుకు పిప్పి, పంటల వ్యర్థాల ద్వారా ఎథెనాల్ ఉత్పత్తి కావచ్చు.. వీటి ద్వారా ఆధునిక సమాజ అవసరాలెన్నో తీర్చగలం. కాబట్టి సంప్రదాయ వ్యవసాయదారులకు ఈ ఉప రంగాలపై అవగాహన కల్పించి, వారికి సహాయపడే కర్తవ్యాన్ని బిఎఐఎఫ్ విజయవంతంగా నెరవేర్చగలదు.
మిత్రులారా,
మహారాష్ట్రలోని విదర్భ, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ల లోని కొన్ని ప్రాంతాలు లేదా ఉత్తర్ ప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ ప్రాంతం కావచ్చు.. ఇవన్నీ రైతులు నీటిఎద్దడిని ఎదుర్కొంటున్న ప్రాంతాలే. ఈ నీటి కొరత సమస్య పరిష్కారానికి ప్రభుత్వం నిరంతర ప్రయత్నాలు చేస్తోంది. తదనుగుణంగా చిరకాలం నుండీ మూలపడిన 99 పథకాలను ప్రధాన మంత్రి సాగునీటి పథకం (పిఎమ్ కె ఎస్ వై) లో భాగంగా పూర్తి చేయిస్తోంది. వాటిలో 21 పథకాలు ఈ ఏడాది పూర్తి అయ్యాయి. ఈ పథకాల ద్వారా ప్రతి నీటిబొట్టూ సద్వినియోగం అయ్యేటట్టు జాగ్రత్తలు తీసుకొన్నాం. ఈ పథకం విజయవంతం కావడానికి బిందు సేద్యం, సూక్ష్మ సేద్యం, పంటల మార్పిడి వంటి విధానాలు కూడా అవసరం. ఇక మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎమ్ఎన్ఆర్ఇజిఎ) కేటాయింపులలో 60 శాతం నిధులను జల సంరక్షణ కోసం, జల నిర్వహణ కోసం వెచ్చిస్తున్నాం. అయితే, సోదరులు మరియు సోదరీమణులారా! ఈ చొరవలో రైతులు భాగస్వాములు కాకపోతే ఈ పథకాలన్నీ విజయవంతం కావన్నది వాస్తవం. ఈ స్వర్ణోత్సవాలలో హివరే బజార్ నుండి వచ్చిన శ్రీ పోపట్ రావ్ పవార్ కూడా ఉన్నారని నాకు చెప్పారు. పరస్పర ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ సామూహికంగా సముచిత రీతిలో నీటిని ఎలా వినియోగించుకోవచ్చునో హివరే బజార్ మనకు సోదాహరణంగా చూపింది. తద్వారా జల వినియోగ సామర్థ్యం పెరగడంతో పాటు భూగర్భ జలవనరులను సుస్థిర ప్రాతిపదికన ఎలా వినియోగించుకోవచ్చో స్పష్టం చేసింది. ఆ గ్రామంలో చురుకుగా సాగుతున్న ఇటువంటి ‘ప్రజా ఉద్యమం’, ‘జల ఉద్యమా’లను బిఎఐఎఫ్ ఉదాహరణలుగా మలచగలదన్న ఆశాభావం నాకుంది.
ఇంతేగాక బ్యాంకుల నుండి మాత్రమే రుణాలు తీసుకునేలా తోడ్పడటం సహా ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పిఎమ్ ఎఫ్ బివై) పథకం పై అవగాహన కల్పన ద్వారా రైతుల జీవితాల్లో కష్టాలను మీరు దూరం చేయగలరని నా విశ్వాసం. సోదరులు మరియు సోదరీమణులారా, జాతీయ సాధువు తుకోడీ స్వామి తన ‘గ్రామ గీత’లో
‘‘గ్రామ సుధార్నేచ మూల్ మంత్ర, సజ్జనాని వ్హావే ఏకత్రా!
సంఘటన్ హేచి శక్తిచే, గ్రామ్-రాజ్య నిర్మాణ్ కరి!!’’ అని రాశారు
‘గ్రామాల సంస్కరణకు మూల సూత్రం ప్రతి ఒక్కరూ చేయి కలిపి ఒక సంస్థ ద్వారా సామూహికంగా కృషి చేయాలి’ అని దీని భావం. అలా చేయగలిగితేనే గ్రామ-రాజ్య సౌభాగ్య సృష్టి సాధ్యమవుతుంది.’ మహాత్మ గాంధీ గారు కూడా ఇదే సూత్రం బోధించారు. మణిభాయ్ దేశాయ్ గారు కూడా ఇదే విధానాన్ని అనుసరించండని చెప్పారు. ఇవాళ మీ సంస్థ సామూహిక శక్తి గ్రామాల ప్రగతికి సరికొత్త ద్వారాన్ని తెరవగలదు. మన గ్రామాలు కూడా ఈ రోజును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి. బిఎఐఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని గ్రామీణులంతా నిర్వహించుకోవాలి. వారందరికీ ఓ దృక్పథం ఉండటంతో పాటు దాని ప్రకారం వారు ముందుకు నడవాలి. మీరు చురుకుగా పని చేస్తున్న 80వేల గ్రామాలు ఇదే దృక్పథంతో ముందడుగు వేయాలి. ‘న్యూ ఇండియా’ నిర్మాణంలో ఇదొక మాధ్యమం కావాలి.
మిత్రులారా,
వ్యవసాయ వ్యయాన్ని తగ్గించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. ఆ మేరకు భూసార నిర్వహణ, యూరియా కు వేపపూత వేయడం, బిందుసేద్యానికి ఊతమివ్వడం వంటి చర్యల ద్వారా రైతులకు సాగు ఖర్చు గణనీయంగా తగ్గింది. సౌర శక్తితో పనిచేసే పంపుల వాడకం వల్ల రైతులకు డీజిల్ పై వ్యయం అదా అయింది. ఈ ఆధునిక సాంకేతికతల వాడకంతో వ్యయం తగ్గి, పంట ఉత్పాదకత పెరిగింది. ఈ రంగంలో బిఎఐఎఫ్ సుదీర్ఘ అనుభవం కలిగి ఉన్నందున సాగు వ్యయాన్ని మరింత తగ్గించేందుకు చేయవలసిన దానిపై మీ సూచనలు సదా స్వాగతించబడతాయి. ఈ ఉద్యమంతో మీరు ఎంత ఎక్కువ సంఖ్యలో రైతులను భాగస్వాములను చేస్తారో అంత ఎక్కువగా పొదుపు చేయడం, తద్వారా ఆదాయం పెంచుకోవడం వారికి సులభమవుతుంది.
మిత్రులారా,
‘వ్యర్థం నుండి అర్థం’ (సంపద) అనేది సమకాలీన అవసరాలకు, భవిష్యత్ సవాళ్లకు సముచిత సమాధానమివ్వగల చర్చనీయాంశం. అది వ్యవసాయ వ్యర్థాల పునరుపయోగం లేదా కంపోస్టుగా మార్పునకు వినియోగం వంటివి రైతులకే గాక మొత్తం గ్రామాలకు అనుబంధ ఆదాయంగా ప్రయోజనకరం కాగలవు. ఇవాళ పొలాల్లో వ్యర్థమన్నది లేదు. ప్రతిదానినీ ఏదో ఒక విధంగా పునరుపయోగించి సంపదగా మార్చవచ్చు. అలాగే సౌర శక్తి వినియోగాన్ని ప్రోత్సహించడంద్వారా విద్యుత్తు పరంగా మొత్తం గ్రామాన్ని స్వావలంబన గలదిగా మార్చవచ్చు. పొలాల వెంబడి తగినంత స్థలం ఉన్నందున సౌర ఫలకాలను అమర్చుకోవడం ద్వారా విద్యుదుత్పాదనకు రైతులను ప్రోత్సహించవచ్చు. దేశ వ్యాప్తంగా పాల సహకార సంఘాలు ఉన్నందున అవి సౌర శక్తి సహకార సంఘాలుగా మారి సౌర శక్తిని ఉత్పత్తి చేసి విక్రయించనూ వచ్చు.
మిత్రులారా,
ఈ రోజుల్లో గ్రామాల్లోని ప్రతి ఇంటి పైనా ఓ చిన్న డిష్ అమర్చి ఉండడం మనం చూస్తున్నాం. అన్నింటినీ సుసాధ్యం చేయగల సాంకేతిక పరిజ్ఞానమంటే ఇదే. ఇంతకు ముందు కేవలం రెండు చానళ్లే చూడగలిగే వారం. కాగా, ఇప్పుడు 100 లేదా 200 చానళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. టీవీ రిమోట్ అన్నది ఇప్పుడు ఎవరికీ కష్టమైన పరికరం కాదు. చివరకు రెండు మూడేళ్ల బుడతలు కూడా రిమోట్ ను ఉపయోగించి అలవోకగా చానళ్లు మార్చేయగలుగుతారు. ఈ విధంగానే డిజిటల్ గ్రామాల స్వప్నాన్ని సాంకేతిక పరిజ్ఞానం సాకారం చేయగలుగుతుంది. డిజిటల్ లావాదేవీలు అధికంగా సాగే ప్రదేశాలు గ్రామాలే కావాలి. అన్నిరకాల రుణాల నుండి ఉపకార వేతనాల దాకా దరఖాస్తులు ఆన్‌లైన్‌లోనే దాఖలు కావాలి. డిజిటల్ సాంకేతికతతో పాఠశాలల్లో బోధన నడవాలి. ఆరోగ్య సంరక్షణ సేవలు డిజిటల్ సాంకేతికతతో ముడిపడాలి. ఈ డిజిటల్ గ్రామాల స్వప్న సాకారం కోసమే దేశం లోని ప్రతి గ్రామీణ వ్యవస్థనూ ప్రభుత్వం ఆప్టికల్ ఫైబర్ పరిజ్ఞానంతో సంధానిస్తోంది. అయితే, వనరులతో పాటు ఉపకరణాలు సమకూర్చినంత మాత్రాన సరిపోదు. వాటిని ప్రజలు వినియోగించుకునే సామర్థ్యం సంతరించుకొనేలా చేయగలిగేది బిఎఐఎఫ్ వంటి సంస్థలే. కాబట్టి మీ సంస్థ ఏటా కనీసం 500 గ్రామాలను ‘స్వల్ప నగదు’ గ్రామాలుగా అభివృద్ధి చేయలేదా ? మీరు ఇది చేయగలిగితే ఈ వ్యవస్థను అనుసరించడం ద్వారా వాటి పరిసరాల్లోని వెయ్యి లేదా రెండువేల గ్రామాలు తమంతట తామే ‘స్వల్ప నగదు గ్రామాలు’గా మారిపోవడం మీ కళ్లతో మీరే చూడగలరు. అంటే.. ఒకచోట మొదలైన మార్పు అలా గ్రామం నుండి గ్రామానికి వేగంగా అల్లుకుపోతుందన్న మాట!
మిత్రులారా,
గ్రామాలను సాధికారికం చేయడంద్వారా దేశ సాధికారిత సాధన సాధ్యమని గాంధీ జీ చెప్పిన సూత్రం విజయవంతం కావడమన్నది డిజిటల్ సాంకేతికత వ్యాప్తి మీదే ఆధారపడి ఉంది. ఈ సూత్రాన్ని అనుసరించడం ద్వారానే బిఎఐఎఫ్ సేవాకాంక్ష లక్షలాది రైతుల జీవితాల్లో పెనుమార్పులు తెచ్చింది. వారికి స్వయం ఉపాధిని గురించి నేర్పింది ఇదే. పవిత్ర ప్రతిన ద్వారా అన్నింటినీ సాకారం చేయగలమనడానికి మీ సంస్థే ఓ సజీవ ఉదాహరణ.
అదేవిధంగా నేను మీ ముందుంచిన ఆలోచనలకు అనుగుణంగా మరికొన్ని కొత్త శపథాలు చేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. భారతదేశం 2022లో 75వ స్వాతంత్ర్య దినాన్ని జరుపుకోబోయే నాటికి మీ పవిత్ర ప్రతినలన్నీ నెరవేరి లక్షలకు లక్షలాది రైతుల విజయానికి దారి తీయాలని ఆకాంక్షిస్తున్నాను.
మీకు ధన్యవాదాలు.
***
Happening now- PM @narendramodi is addressing Bhartiya Agro Industries Foundation's Golden Jublee Celebrations. https://t.co/vbG9VFN31Q
— PMO India (@PMOIndia) August 24, 2017
For the development of the nation, prosperity of farmers is essential: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 24, 2017
The 'Anna Datas' of the nation should be free from worries: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 24, 2017
Women self help groups should get quality training in research, veterinary education. Animal husbandry sector will benefit due to this: PM
— PMO India (@PMOIndia) August 24, 2017
We saw the green & white revolution. Time has come for the blue revolution, for fishermen & sweet revolution, for more honey production: PM
— PMO India (@PMOIndia) August 24, 2017
Along with 'Jan Andolan', 'Jal Andolan' can help us for the future: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 24, 2017
We take immense pride in our villages and the culture of our villages: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 24, 2017
The way ahead lies in improving digital infrastructure in our villages: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 24, 2017