పిఎంఇండియా
పూర్వ కేంద్ర మంత్రి శ్రీమతి సుష్మా స్వరాజ్ న్యూ ఢిల్లీ లోని ఎఐఐఎమ్ఎస్ లో 2019వ సంవత్సరం ఆగస్టు 6వ తేదీ నాటి రాత్రి కన్నుమూయడం పట్ల మంత్రివర్గం ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఆమె మరణం తో దేశం ఒక ప్రముఖ నేత ను మరియు అసాధారణమైన పార్లమెంటు సభ్యురాలి ని కోల్పోయింది.
తీర్మానం యొక్క పాఠం ఈ కింది విధం గా ఉంది:-
‘‘హరియాణా లోని అంబాలా లో 1952వ సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీ నాడు జన్మించిన శ్రీమతి సుష్మా స్వరాజ్, అంబాలా కంటోన్మెంట్ లో గల సనాతన ధర్మ కళాశాల నుండి పట్టభద్రురాలు అయ్యారు. చండీగఢ్ లోని పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి న్యాయ శాస్త్రం లో డిగ్రీ ని సంపాదించారు. కాన్పుర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆమె కు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. 1973వ సంవత్సరం లో ఆమె భారత సర్వోన్నత న్యాయస్థానం లో న్యాయవాద వృత్తి ని అవలంబించారు.
శ్రీమతి సుష్మా స్వరాజ్ చిన్న వయస్సు లోనే ప్రజా జీవనం లోకి అడుగు పెట్టారు. 1977వ సంవత్సరం లో 25 ఏళ్ళ ప్రాయం లో హరియాణా విధాన సభ కు ఎన్నికయ్యారు. హరియాణా రాష్ట్ర ప్రభుత్వం లో కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి పదవి ని నిర్వహించారు. 1987వ సంవత్సరం నుండి 1990 వ సంవత్సరం మధ్య కాలం లో ఆమె తిరిగి హరియాణా విధాన సభ సభ్యురాలు గా ఎన్నికై, విద్య, ఆహారం, ఇంకా పౌర సఫరాల శాఖ మంత్రి పదవీబాధ్యతల ను నిర్వహించారు.
1990వ సంవత్సరం లో ఆమె రాజ్య సభ కు ఎన్నికయ్యారు. 1996వ సంవత్సరం లో 11వ లోక్ సభ సభ్యురాలి గా ఎన్నికైన అనంతరం ఆమె కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి పదవి ని స్వీకరించారు. 1998వ సంవత్సరం లో ఆమె పన్నెండో లోక్ సభ కు ఎన్నికయ్యారు. అప్పుడు కేంద్ర సమాచార, ప్రసార శాఖ కు తోడు అదనపు బాధ్యత గా టెలికమ్యూనికశన్స్ శాఖ ను నిర్వహించారు. 1998వ సంవత్సరం అక్టోబరు లో, ఆమె ఢిల్లీ కి ఒకటో మహిళా ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత 2000వ సంవత్సరం ఏప్రిల్ లో రాజ్య సభ కు ఆమె మరో మారు ఎన్నికయ్యారు. 2000వ సంవత్సరం సెప్టెంబర్ నుండి 2003వ సంవత్సరం జనవరి వరకు సమాచార, ప్రసార శాఖ మంత్రి గా ఉన్నారు. తదనంతరం 2003వ సంవత్సరం జనవరి నుండి, 2004 వ సంవత్సరం మే నెల వరకు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి గా పని చేశారు. 2006వ సంవత్సరం ఏప్రిల్ లో రాజ్య సభ కు ఆమె మళ్ళీ ఎన్నికయ్యారు. 2009వ సంవత్సరం లో ఆమె 15వ లోక్ సభ సభ్యురాలు గా ఎన్నికయ్యారు. 2009వ సంవత్సరం డిసెంబర్ నుండి 2014వ సంవత్సరం మే వరకు ఆమె ప్రతిపక్ష నాయకురాలు గా ఉన్నారు. 2014వ సంవత్సరం లో ఆమె 16వ లోక్ సభ కు ఎన్నికయ్యారు. 2014వ సంవత్సరం మే మాసం నుండి 2019వ సంవత్సరం మే మాసం వరకు ఆమె కేంద్ర మంత్రిమండలి లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి పదవి లో ఉండి, సేవల ను అందించారు.
శ్రీమతి సుష్మా స్వరాజ్ అసాధారణమైన వాక్పటిమ మరియు దయాభరితమైన వైఖరిల కు గాను సదా స్మరణీయురాలు. ఆమె ఒక సమర్ధ పరిపాలకురాలు గా, స్నేహ మర్యాదల తో పాటు మానవత కలిగిన వ్యక్తి గా విదేశాల లో చిక్కుబడ్డ భారతీయుల కు సహాయాన్ని అందించడం ద్వారా అందరి మనస్సు లను గెలుచుకొన్నారు. ఆమె లోని ఈ లక్షణాల ను బట్టే, అమెరికా లోని ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ దిన పత్రిక 2017వ సంవత్సరం లో ఆమె ను ‘‘భారతదేశం లో అత్యంత ప్రేమాస్పదురాలైనటువంటి రాజకీయవాది’’ గా ప్రకటించింది.
శ్రీమతి సుష్మా స్వరాజ్ వివిధ బాధ్యత లలో దేశ ప్రజల కు అందించిన సేవల ను ప్రశంసిస్తూ మంత్రివర్గం తీర్మానిస్తున్నది. ఆమె ను కోల్పోయినటువంటి ఆమె కుటుంబ సభ్యుల కు యావత్తు దేశ ప్రజల పక్షాన మరియు ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తి అయిన సంతాపాన్ని సైతం మంత్రివర్గం వ్యక్తం చేస్తున్నది.’’