పిఎంఇండియా
పెరూతో వస్తువులు, సేవలు, పెట్టుబడులపై వాణిజ్య ఒప్పందం దిశగా సంప్రదింపులు చేపట్టడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఆ మేరకు పెరూ- భారతదేశం వాణిజ్య ఒప్పందానికి గల అవకాశాల అన్వేషణ కోసం 2015 జనవరి 15న రెండు దేశాల మధ్య ఓ సంయుక్త అధ్యయన బృందం (జెఎస్ జి) ఏర్పాటైంది. ఈ బృందం సమర్పించిన నివేదికపై పరిశీలనను రెండు దేశాలూ 2016 అక్టోబరు 20న పూర్తి చేశాయి. అనంతరం వస్తువులు, సేవలు, పెట్టబడులపై వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు కొనసాగించేందుకు అంగీకరించాయి.
పూర్వ రంగం:
లాటిన్ అమెరికా- కరీబియన్ ప్రాంతం (ఎల్ఎసి)లో 2015-16కు సంబంధించి భారతదేశానికి ఎగుమతుల గమ్యంగా పెరూ మూడో స్థానంలో నిలిచింది. పెరూ తో 2005-06 కాలంలో భారతదేశం ద్వైపాక్షిక వాణిజ్యం 107.32 మిలియన్ యుఎస్ డాలర్ల పరిమాణంలో ఉండగా 2015-16లో అది ఏకంగా 1319.45 శాతం వృద్ధిని నమోదుచేసి 1,523.35 మిలియన్ యుఎస్ డాలర్ల స్థాయికి దూసుకుపోయింది. ఇందులో ఎగుమతుల పరిమాణం 703.12 మిలియన్ యుఎస్ డాలర్లు, దిగుమతులు 820.22 మిలియన్ యుఎస్ డాలర్లుగా నమోదైంది.
భారతదేశంతో చిరకాల స్నేహ సంబంధాలున్న పెరూ పలు అంతర్జాతీయ వేదికలపై మద్దతుగా నిలుస్తూవస్తోంది. ఇప్పుడిక వాణిజ్య ఒప్పందం కారణంగా రెండు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య బంధం దృఢతరమవుతుంది. భారతదేశం,పెరూ ల సంబంధాలలో ఈ వాణిజ్య ఒప్పందం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోవడంతోపాటు ఎల్ఎసి దేశాలతో భారతదేశానికి గల సంప్రదాయ సోదర సంబంధాలు పటిష్టం అవుతాయి.