పిఎంఇండియా
2013 జులై ఐదో తేదీ నుంచి జాతీయ ఆహార భద్రతా చట్టం (నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్-ఎన్ ఎఫ్ ఎస్ ఏ) అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీని ద్వారా దేశంలో మూడింట రెండువంతుల జనాభాకు అత్యధిక సబ్సిడీ కింద ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆహారధాన్యాలను అందిస్తున్నాయి. కిలో గోధుమల్ని రూ.2 లకు, కిలో బియ్యాన్ని రూ.3 లకు అందిస్తున్నాయి. ఈ చట్టం కింద లబ్ధిదారులను 2011 జనాభా అంచనాల ప్రకారం నిర్ణయించారు. దేశంలో గల రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలన్నిటిలో 2015 సెప్టెంబర్ నాటికి ఈ చట్టం అమలుకావాలని గతంలో భావించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ (పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్..పిడిఎస్) ద్వారా దేశమంతా లబ్ధిదారులు అత్యధిక సబ్సిడీ కింద గోధుమలు, బియ్యాన్ని పొందుతారని అనుకున్నారు. అయితే దేశంలోని అన్ని ప్రాంతాలు 2015 సెప్టెంబర్ నాటికి ఎన్ ఎఫ్ ఎస్ ఏ కిందకు రాలేదు. దాంతో కేంద్రం ఎన్ ఎఫ్ ఎస్ ఏ కిందకు రాని ప్రాంతాలలోని ఏపీఎల్, బిపిఎల్ కుటుంబాలకు కూడా ఈ ఆర్థిక సంవత్సరంలోనే సెప్టెంబర్ 2015 వరకు అదనపు కేటాయింపులు చేయాలని నిర్ణయించింది. ఇంతవరకూ దేశంలో 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మాత్రమే ఎన్ ఎఫ్ ఎస్ ఏను అమలు చేస్తున్నాయి. మిగతావి ఇంకా టిపిడిఎస్ (టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్..లక్ష్యిత ప్రజాపంపిణీ వ్యవస్థ) కిందనే ఉన్నాయి. ఈ మిగిలిపోయిన రాష్ట్రాలు రాబోయే కొన్ని నెలల్లలోనే ఎన్ ఎప్ ఎస్ ఏ ను అమలు చేయడానికి చురుగ్గా చర్యలు చేపట్టాయి. దాంతో కేంద్రం కూడా ప్రతి నెలా ఎన్ ఎఫ్ ఎస్ ఏ అమలుకాని రాష్ట్రాలలోని ఏపిఎల్, బిపిఎల్ కుటుంబాలకు కూడా ఇప్పటివరకు ఇస్తున్న అదనపు కేటాయింపులను కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఇది అక్టోబర్ 2015 నుంచి మార్చి 2016 వరకు కొనసాగుతుంది. అయితే మార్చి 2016 లోపే మిగతా రాష్ట్రాలు ఎన్ ఎఫ్ ఎస్ ఏ కిందకు వస్తే ఈ అదనపు కేటాయింపులు ఆ వచ్చిన రోజువరకు కొనసాగుతాయి. లేదంటే మార్చి 2016వరకు కొనసాగుతాయి. ఎన్ని వీలైతే అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు ఎంత వీలైతే అంత తొందరగా పాత టిపిడిఎస్‌నుంచి వైదొలగి జాతీయ ఆహార భద్రత చట్టాన్ని అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది.