పిఎంఇండియా
పొగాకు నియంత్రణ, ఉత్పత్తుల అక్రమ వ్యాపార నిర్మూలన దిశగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO ) సదస్సు నిర్దేశిత చట్రం కింద నిబంధనల స్వీకరణకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పొగాకు నియంత్రణపై ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశిత చట్రం (WHO FCTC)లోని 15 నిబంధన కింద చర్చించి, ఆమోదించిన మేరకు ధూమపానం లేదా ధూమరహిత పొగాకు ప్రత్యక్ష సేవనం (SLT) రెండింటికీ ఇది వర్తిస్తుంది. భారత దేశం కూడా WHO FCTCలో భాగస్వామిగా ఉంది.
వివరాలు:
భాగస్వామ్య దేశాల బాధ్యతల క్రమాన్ని ఈ చట్రం నిర్దేశిస్తుంది. ఆ మేరకు భాగస్వాములు చేపట్టాల్సిన సరఫరా శృంఖల నియంత్రణ చర్యలను వివరిస్తుంది. దీని ప్రకారం పొగాకు ఉత్పత్తుల తయారీకి లైసెన్సుల విధానం, ఉత్పత్తుల తయారీ యంత్ర పరికరాలు, ఉత్పత్తి కార్యకలాపాల్లో ఉన్న సంస్థల సముచిత విచక్షణ, వ్యవస్థ అనుసరణ, పర్యవేక్షణ, రికార్డుల నిర్వహణ, భద్రతలతోపాటు ఆన్ లైన్ వాణిజ్యం, స్వేచ్ఛా వాణిజ్య మండళ్లలో ఉత్పత్తి, సుంకంరహిత అమ్మకాలు తదితరాలకు సంబంధించిన నిబంధనలను భాగస్వామ్య దేశాలు పాటించాల్సి ఉంటుంది.
వివిధ నేరాలు, ఉత్పత్తుల జప్తు, జప్తుచేసిన ఉత్పత్తుల నిర్వహణ తదితరాలను కూడా ఈ నియమావళి నిర్దేశించింది. ఆ మేరకు సమాచార ఆదానప్రదానంలో అంతర్జాతీయ సహకారంసహా గోప్యత నిర్వహణ, శిక్షణ, సాంకేతిక తోడ్పాటు, శాస్త్ర-సాంకేతిక, విజ్ఞాన ప్రదానాంశాలు తదితర అంశాల్లో సహకారాన్ని సూచిస్తోంది.
ప్రభావం:
శక్తిమంతమైన నియంత్రణద్వారా పొగాకు ఉత్పత్తుల అక్రమ వ్యాపార నిర్మూలన దీనివల్ల సాధ్యమవుతుంది. పొగాకు సమగ్ర నియంత్రణ… ఫలితంగా పొగాకు వినియోగంలో తగ్గుదల, తద్వారా వ్యాధుల సంక్రమణ తగ్గుదల, పొగాకు వినియోగంతో ముడిపడిన మరణాల సంఖ్య తగ్గుదల వంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఇటువంటి ఒప్పందానికి ఆమోదం తెలపడంవల్ల ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్న పొగాకు అక్రమ వ్యాపారాలపై ప్రత్యామ్నాయ చర్యలకు వీలు కలుగుతుంది. భారతదేశం ప్రత్యేకించి పొగాకు నియంత్రణలో ముందంజలో ఉంది. అందువల్ల అక్రమ వ్యాపార నియంత్రణలో ప్రపంచ సుంకాల సంస్థవంటి అంతర్జాతీయ సంస్థలను ఎంతగానో ప్రభావితం చేయగలదు.
పొగాకు ఉత్పత్తుల అక్రమ వ్యాపారాన్ని నిర్మూలించేలా పొగాకుపై అంతర్జాతీయ కార్యాచరణను బలోపేతం చేసే ఈ నియమావళి అత్యంత వినూత్నమైనది. అలాగే ప్రజారోగ్య రక్షణకు ఇదొక చట్టబద్ధ ఉపకరణం అవుతుంది. పొగాకు ఉత్పత్తుల అక్రమ వ్యాపార నిర్మూలనతోపాటు అంతర్జాతీయ ఆరోగ్య సహకారానికి సంబంధించిన చట్టబద్ధ కోణాల బలోపేతానికి ఇదొక సమగ్ర ఉపకరణం.
నేపథ్యం:
పొగాకు నియంత్రణ, ఉత్పత్తుల అక్రమ వ్యాపార నిర్మూలన కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యాన రూపొందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ సదస్సు నిర్దేశిత చట్రాన్ని మొట్టమొదటి అంతర్జాతీయ ప్రజారోగ్య ఒప్పందంగా పరిగణించాలి. అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ స్థాయులలో పొగాకు నియంత్రణ దిశగా ఆ ఉత్పత్తుల సరఫరా, డిమాండ్లను తగ్గించే పటిష్ఠ చర్యలు చేపట్టడమే ఈ చట్రం ప్రధాన లక్ష్యం. అన్ని రూపాల్లోని పొగాకు ఉత్పత్తుల అక్రమ వ్యాపారం, ఉత్పత్తుల విక్రయాలను నిర్మూలించే దిశగా పొగాకు సరఫరా తగ్గింపు వ్యూహాలు ఈ చట్రంలోని 15 నిబంధన కింద పొందుపరచబడటం ఇందులోని కీలకాంశం. దొంగరవాణా, ఉత్పత్తుల అక్రమ-నకిలీల తయారీ వంటివాటిని ఇది సమర్థంగా నిరోధిస్తుంది. తదనుగుణంగా FCTCని నిర్దేశించే భాగస్వామ్య దేశాలు (COP) సదరు నియమావళిని రూపొందించి, ఆమోదించాయి. మొత్తం 10 భాగాలుగా ఉన్న ఈ నియమావళిలో 47 నిబంధనలున్నాయి.
*****