Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పోర్చుగ‌ల్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా (జూన్ 24, 2017) ప్ర‌ధాన మంత్రి ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌

పోర్చుగ‌ల్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా (జూన్ 24, 2017) ప్ర‌ధాన మంత్రి ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌

పోర్చుగ‌ల్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా (జూన్ 24, 2017) ప్ర‌ధాన మంత్రి ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌


శ్రేష్ఠుడైన ప్ర‌ధాని శ్రీ అంటోనియో కోస్టా,
విశిష్ట ప్ర‌తినిధులారా,
మీడియా స‌భ్యులారా

గ‌త వారంలో పోర్చుగల్ లోని అట‌వీ ప్రాంతంలో భ‌యాన‌క‌మైన అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. ఈ దుర్ఘ‌ట‌న బాధితుల‌కు నా ప్ర‌గాఢ‌మైన సానుభూతిని తెలియ‌జేస్తున్నాను. భాధితులు, వారి కుటుంబాలు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటూ భార‌త‌దేశం ప్రార్థ‌న‌లు చేస్తోంది.

స్నేహితులారా,

పోర్చుగ‌ల్‌, భార‌త‌దేశం ఇరు దేశాలు చరిత్రాత్మ‌క అనుబం ధాల‌ను క‌లిగిన దేశాలు. ఈ రెండు దేశాల మ‌ధ్య‌ బ‌ల‌మైన‌ ఆర్ధిక బంధాల‌తో పాటు ప్ర‌జ‌లకు, ప్రజలకు మ‌ధ్య‌ బ‌ల‌మైన బంధాలు ఉన్నాయి. ఇంత‌వ‌ర‌కు భార‌త‌దేశ ప్ర‌ధాన మంత్రి ఎవ‌రూ పోర్చుగ‌ల్ లో ద్వైపాక్షిక ప‌ర్య‌ట‌న చేయ‌క‌పోవ‌డం నాకు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. ఏది ఏమైనప్ప‌టికీ, భార‌త‌దేశం, పోర్చుగ‌ల్ ల మ‌ధ్య‌ ఆరు నెల‌ల వ్య‌వ‌ధిలో ఇది రెండో శిఖ‌రాగ్ర స‌మావేశం కావ‌డం నాకు సంతోషాన్ని క‌లిగిస్తోంది. నా ప‌ర్య‌ట‌న వివ‌రాల‌ను అతి త‌క్కువ స‌మ‌యంలో తెలియ‌జేసిన‌ప్ప‌టికీ ప్ర‌ధాని శ్రీ కోస్టా అందించిన స్వాగ‌త స‌త్కారాలకు నేను కృత‌జ్ఞుడినై ఉంటాను. జ‌న‌వ‌రిలో ప్ర‌ధాని శ్రీ కోస్టా భార‌త‌దేశంలో ప‌ర్య‌ట‌ించినపుడు ఆయనకు స్వాగతం పలకడం నాకు గౌర‌వప్రదం. ఇది ద్వైపాక్షిక సంద‌ర్శ‌న మాత్ర‌మే కాదు; ప్ర‌వాసీ భారతీయ దినోత్స‌వంలో ఆయన ముఖ్య అతిథి కూడా. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న భార‌త సంత‌తి ప్ర‌జ‌ల్లో ఘ‌న‌త వ‌హించిన‌ వారిలో ఆయ‌న అతి ముఖ్యుడు.

స్నేహితులారా,

ఈ రోజు ప్ర‌ధాని శ్రీ కోస్టా, నేను అనేక అంశాల‌పైన చ‌ర్చ‌లు జరిపాం. ఆయ‌న గ‌త‌ ప్ర‌తిష్టాత్మ‌క భార‌తదేశ ప‌ర్య‌ట‌న అనంతరం నమోదైన పురోగ‌తిని స‌మీక్షించ‌డం జ‌రిగింది. ఇరు దేశాల ఆర్ధిక సంబంధాలు ప్ర‌గ‌తిని సాధిస్తున్నాయి. గ‌త సంవ‌త్స‌రం ద్వైపాక్షిక వాణిజ్యం 17 శాతం పెరిగింది. పోర్చుగ‌ల్ నుండి భార‌త‌దేశానికి వ‌చ్చే విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు 2016-17లో రెట్టింపు అయ్యాయి. వీటి విలువ త‌క్కువే అయిన‌ప్ప‌టికీ రెట్టింపు కావ‌డం సంతోష‌దాయ‌కం. ఇరు దేశాల ఆర్ధిక రంగాల్లో వ‌స్తువుల‌, సేవ‌ల‌, పెట్టుబ‌డుల‌, మాన‌వ వ‌న‌రుల అంశాల్లో మ‌రింత ప్ర‌గ‌తి సాధించ‌డానికి మ‌నం చాలా చేయ‌వ‌చ్చు. పోర్చుగీసు ఆర్ధిక‌రంగం తిరిగి నిల‌దొక్కుకుకోవ‌డం, భార‌త‌దేశంలోప‌టిష్టంగా కొన‌సాగుతున్న వృద్ధి రెండూ క‌లిసి ఇరు దేశాలు సంయుక్తంగా ఎద‌గ‌డానికి అత్యుత్త‌మ‌న అవ‌కాశాల‌ను అందిస్తాయి. స్నేహితులారా, ఔత్సాహిక పారిశ్రామికుల‌కోసం యూరోప్‌ కు సంబంధించి ఉజ్జ్వల‌మైన‌ వ్యాపార వాణిజ్య వాతావ‌ర‌ణాన్ని పోర్చుగ‌ల్ క‌లిగి వుంది. భార‌త‌దేశంలోనూ స్టార్ట్- అప్ ప‌రిశ్ర‌మ రంగం చ‌క్క‌టి అభివృద్ధి సాధిస్తూ దూకుడు మీద వుంది. స్టార్ట్- అప్ రంగ‌మ‌నేది అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్న‌ది. యువ‌త‌ను, స‌రికొత్త ఆలోచ‌న‌ల్ని, సాంకేతిక‌త‌ను, ప‌రిశోధ‌న‌ను, సృజ‌నాత్మ‌క‌త‌ను క‌లిగిన స్టార్ట్- అప్ రంగం విలువ‌ను, సంప‌ద‌ను సృష్టిస్తూ స‌మాజానికి ల‌బ్ధి చేకూరుస్తోంది. ప్ర‌ధాని శ్రీ కోస్టా భార‌త‌దేశాన్ని సంద‌ర్శించిన స‌మ‌యంలో ఆయ‌న నేను క‌లిసి భార‌త‌దేశ- పోర్చుగ‌ల్ అంత‌ర్జాతీయ స్టార్ట్- అప్ హ‌బ్ గురించి చ‌ర్చించుకున్నాం. ఆ త‌రువాత ఇంత త‌క్కువ స‌మ‌యంలోనే ఇది సాకారం కావ‌డం నాకు సంతోషాన్ని క‌లిగిస్తోంది. ప్ర‌ధాని శ్రీ కోస్టా తో క‌లిసి దీనిని ప్రారంభించే స‌మ‌యం కోసం ఎదురుచూస్తున్నాను. ప‌న్నులు, ప‌రిపాల‌నా సంస్క‌ర‌ణ‌లు, విజ్ఞాన‌ శాస్త్రం, అంత‌రిక్షం, యువ‌జ‌నుల వ్య‌వ‌హారాలు, క్రీడ‌ల రంగాల్లో కుదిరిన నూత‌న ఒప్పందాలు ఇరు దేశాల భాగ‌స్వామ్య ప్ర‌గ‌తికి నిద‌ర్శ‌నంగా నిలుస్తాయి. రెండు దేశాల మ‌ధ్య‌ శాస్త్ర విజ్ఞాన‌ రంగంలో, సాంకేతిక విజ్ఞాన‌ రంగంలో స‌హ‌కారం పెరుగుతోంది. రెండు దేశాల మ‌ధ్య‌ అత్యుత్త‌మ సాంకేతిక‌ రంగాన్ని ప్రోత్స‌హించ‌డానికిగాను రెండు దేశాలు క‌లిసి సంయుక్తంగా 4 మిలియ‌న్ యూరోలతో సైన్స్ అండ్ టెక్నాల‌జీ ఫండ్ ను నెల‌కొల్పాల‌ని నిర్ణ‌యించాయి. నానో టెక్నాల‌జీ, స‌ముద్ర విజ్ఞాన శాస్త్రంలో పోర్చుగీసు సాధించిన ప్ర‌గ‌తి నుండి నేర్చుకోవ‌డానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇరు దేశాల ద్వైపాక్షిక స‌హ‌కారంలో అంత‌రిక్ష‌మ‌నేది నూత‌న అంశం. ఈ ఏడాదిలో కొంత‌కాలం క్రితం ప్ర‌ధాని శ్రీ కోస్టా భార‌త‌దేశాన్ని సంద‌ర్శించిన‌ప్పుడు అంత‌రిక్ష స‌హ‌కారం ముందుకొచ్చింది. అంత‌రిక్షం, స‌ముద్ర శాస్త్ర రంగాలకు సంబంధించి అట్లాంటిక్ ఇంట‌ర్నేష‌న‌ల్ రీసెర్చ్ సెంట‌ర్ తో క‌లిసి ప‌ని చేయ‌డానికి మేం సిద్ధంగా ఉన్నాం.

స్నేహితులారా,

ఇరు దేశాల ప్ర‌జ‌లు ఉజ్జ్వల‌మైన, ప్ర‌గ‌తిదాయ‌క సంబంధాల‌ను క‌లిగి వున్నారు. పోర్చుగ‌ల్ లో నివ‌సిస్తున్న భార‌తీయ సంత‌తి ప్ర‌జ‌లు మ‌న ద్వైపాక్షిక సంబంధాలు బ‌లోపేతం కావ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు.. పుట్ బాల్ క్రీడ‌ ప‌ట్ల పోర్చుగీసు ప్ర‌జ‌ల‌కు అమిత‌మైన ప్రేమ వుంది. ప్ర‌ధాని శ్రీ కోస్టాయే స్వ‌యంగా ఫుట్ బాల్ ప్రేమికుడు. ఇరు దేశాల స‌మాజాల మ‌ధ్య‌ బంధాల‌ను పెంచ‌డానికి ఇది కూడా దోహ‌దం చేస్తుంది. రెండు దేశాల మ‌ధ్య‌ కొన‌సాగుతున్న సాంస్కృతిక బంధాలు విస్త‌రిస్తున్నాయి. లిస్బ‌న్ విశ్వవిద్యాల‌యంలో ఇండియ‌న్ స్ట‌డీస్ చైర్ ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. భార‌తీయ చలనచిత్రాలకు పోర్చుగీసు భాష‌లో స‌బ్ టైటిల్స్ ఇవ్వ‌డం జ‌రుగుతోంది. ఇరు దేశాల‌కు స‌హాయ‌కారిగా ఉండ‌డానికిగాను హిందీ పోర్చుగీసు నిఘంటువును అభివృద్ధి చేయ‌డం జ‌రుగుతోంది. గోవా, పోర్చుగ‌ల్ ల మ‌ధ్య‌ 17 వ శ‌తాబ్దంలో కొన‌సాగిన లేఖ‌ల‌కు సంబంధించిన 12 వేల డాక్యుమెంట్లు ఉన్నాయి. వీటికి సంబంధించిన డిజిట‌ల్ వ‌ర్ష‌న్ ను భార‌తదేశంతో పంచుకోవ‌డానికి పోర్చుగ‌ల్ ముందుకు వచ్చినందుకు నా అభినంద‌న‌లు. ఈ ముఖ్య‌మైన డాక్యుమెంట్లు భార‌తీయ ప‌రిశోధ‌కుల‌కు చాలా బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

స్నేహితులారా,

అంత‌ర్జాతీయ రంగంలో పోర్చుగ‌ల్‌, భార‌త‌దేశం బ‌ల‌మైన భాగ‌స్వాములు. ఐక్య‌ రాజ్య‌ స‌మితి భ‌ద్ర‌త మండ‌లిలో భార‌త‌దేశానికి శాశ్వ‌త స‌భ్య‌త్వం రావ‌డం కోసం పోర్చుగ‌ల్ స్థిర‌మైన మ‌ద్ద‌తును ప్ర‌క‌టిస్తున్నందుకు కృత‌జ్ఞ‌త‌లు. బ‌హుళ పాక్షిక ఎగుమ‌తి నియంత్ర‌ణ వ్య‌వ‌స్థ‌ల్లో భార‌త‌దేశానికి పోర్చుగ‌ల్ స‌హ‌కార‌మిస్తోంది. ఉగ్ర‌వాదానికి, హింసాత్మ‌క తీవ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా భార‌త‌దేశం, పోర్చుగ‌ల్ ల స‌హ‌కారాన్ని బ‌లోపేతం చేయాల‌ని ఇరు దేశాలు సంక‌ల్పించాయి.

శ్రేష్ఠుడా,

మీరు అందించిన స్వాగ‌త స‌త్కారాల‌కు, అమోఘ‌మైన ఆతిథ్యానికి నేను మ‌రోసారి అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను. మీరు మీ విలువైన స‌మ‌యాన్ని వెచ్చించినందుకు ధన్యవాదాలు.

ముఇటో ఒబ్రిగాడో
మీకు అనేకానేక ధన్యవాదాలు.

***