Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పౌర విమాన‌యాన రంగంలో భార‌త్ కు, సింగ‌పూర్ కు మ‌ధ్య అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పందం


పౌర విమాన‌యాన రంగంలో సింగ‌పూర్ కో-ఆప‌రేష‌న్ ఎంట‌ర్ ప్రైజ్ కు, ఎయిర్ పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్ ఇండియా కు మ‌ధ్య 2015, నవంబ‌ర్ లో కుదిరిన ఒక అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పందానికి (ఎంఓయూ) కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న కేంద్ర మంత్రివ‌ర్గం స‌మావేశమ‌యింది. ప్ర‌ధాన‌మంత్రి సింగ‌పూర్ లో ప‌ర్య‌టించిన‌ప్పుడు 2015, న‌వంబ‌ర్ లో ఈ ఎంఓయూ ను భార‌త‌దేశం‌, సింగ‌పూర్ ప్ర‌భుత్వాల ప‌క్షాన ఎయిర్ పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), సింగ‌పూర్ కో-ఆప‌రేష‌న్ ఎంట‌ర్ ప్రైజ్ లు కుదుర్చుకున్నాయి.

పౌర విమాన‌యాన రంగంలో ఒక దేశానికి మ‌రొక దేశం స‌హ‌క‌రించుకోవాల‌న్న‌ది ఈ ఎంఓయూ ధ్యేయం. తొలి ద‌శ‌లో జైపూర్‌, అహ్మ‌దాబాద్ విమానాశ్ర‌యాలకు సంబంధించి ఈ స‌హ‌కారం కొన‌సాగ‌నుంది. ఇరుప‌క్షాల అంగీకారంతో ఈ స‌హ‌కారాన్ని ఇత‌ర విమానాశ్ర‌యాల‌కు కూడా విస్త‌రిస్తారు. ప‌ర‌స్ప‌ర అంగీకారం కుదిరిన మేర‌కు పౌర విమాన‌యాన రంగంలో (1) మాస్ట‌ర్ ప్లానింగ్‌, డిజైన్‌, (2) రాక‌పోక‌ల‌ను మెరుగుప‌ర‌చ‌డం, (3) వాణిజ్య ప్ర‌ధాన‌మైన అభివృద్ధి కార్య‌క‌లాపాలు, (4) సేవ‌ల నాణ్య‌త‌ను మెరుగుప‌ర‌చ‌డం, (5) శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు, (6) స‌ర‌కుల ర‌వాణా నిర్వ‌హ‌ణ‌, (7) మెయిన్‌టెనెన్స్, రిపేర్‌, ఓవ‌ర్ హాలింగ్‌ (ఎమ్ ఆర్ ఓ), (8) కార్య‌క‌లాపాల నిర్వ‌హ‌ణ‌, (9) ఇవి కాక ఇంకా ఏవైనా ఇత‌ర కార్య‌క‌లాపాలపైన కూడా సహకరించుకోవాలని ఎంఓయూలో పేర్కొన్నారు.

ప్ర‌పంచంలోకెల్లా అత్యుత్త‌మ స్థాయిలో నిర్వ‌హ‌ణ జ‌రుగుతున్న విమానాశ్ర‌యాల‌లో ఒక విమానాశ్రయం సింగ‌పూర్ ప్ర‌భుత్వ యాజ‌మాన్యంలో ఉంది. ఈ విమానాశ్ర‌యం గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా త‌న స్థానాన్ని క్ర‌మం త‌ప్ప‌కుండా నిల‌బెట్టుకుంటూ వ‌స్తోంది.

జైపూర్‌, అహ్మ‌దాబాద్ విమానాశ్ర‌యాల‌లో ఉన్న‌త స్థాయి సేవ‌ల‌ను అందించాలంటే ఎయిర్ పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) కార్య‌క‌లాపాలు, నిర్వ‌హ‌ణ (ఓ & ఎం) కాంట్రాక్టుల‌ను కుదుర్చుకోవాల్సి ఉంటుందని భావించారు. ఈ కాంట్రాక్టులలో టెర్మిన‌ల్ భ‌వ‌నం తాలూకు (న‌గ‌రం వైపు స్థ‌లం, విమానాశ్ర‌య స్థలం మిన‌హా) నాన్-ఏరోనాటిక‌ల్ రెవిన్యూను వీలైనంత ఎక్కువ స్థాయికి చేర్చడం, లేదా చేర్చ‌క‌పోవ‌డం అనే ష‌ర‌తును జతపరిచే ఆలోచ‌నకు కూడా తావు ఉంది. న‌గ‌రం వైపు, విమానాశ్ర‌యం వైపు స్థ‌లాలు ఏఏఐ ప్ర‌త్య‌క్ష నిర్వ‌హ‌ణ‌లోనే కొన‌సాగుతాయి.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా పరిశీలిస్తే, విమానాశ్ర‌య కార్య‌క‌లాపాలలో ప‌రిమిత ఓ & ఎం కాంట్రాక్టు న‌మూనాలు మాత్రమే అమ‌లవుతున్నాయి. టెర్మిన‌ల్ భ‌వ‌నాల‌ను ఇత‌ర సంస్థ‌ల‌కు ఓ & ఎం కాంట్రాక్టుగా ఇవ్వ‌డంలో ఏఏఐ కి పూర్వానుభ‌వం లేదు. ఈ నిర్ణ‌యాన్ని అమ‌లుప‌ర‌చాలంటే గనక జైపూర్, అహ్మ‌దాబాద్ విమానాశ్ర‌యాల ఓ & ఎం కాంట్రాక్టును త‌గిన సంస్థ‌కు అప్పగించవ‌ల‌సి ఉంటుంది.