Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రజల సందేశాలు ఈ సారి దీపావళిని సాయుధ దళాలకు ప్రత్యేకంగా మార్చనున్నాయి


సాయుధ దళాల పట్ల దేశానికి ఉన్న ఘనమైన గౌరవం మరియు అభిమానం ఈ సారి పండుగల కాలంలో అభివ్యక్తం కానున్నది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో చేపడుతున్న ఒక విశిష్టమైన ప్రచార ఉద్యమం ఇందుకు వేదిక కానున్నది.

#Sandesh2Soldiers పేరిట సాగే ఈ ప్రచార ఉద్యమం ఆప్తులకు దూరంగా దేశ సరిహద్దులలో విధి నిర్వహణలో ఉంటూ దేశాన్ని కంటికి రెప్పలాగా కాపాడుతున్న భారతీయ సాయుధ దళాలలో సంతోషాన్ని పెంపొందింపచేసేందుకు ప్రతి ఒక్క పౌరుడికి/పౌరురాలికి ఒక అవకాశాన్ని కల్పించబోతున్నది.

ఉత్తరాలు మరియు సందేశాలను సాయుధ దళాలకు పంపించవలసిందిగా ప్రజలను ఆహ్వానిస్తూ ఒక ప్రచార ఉద్యమాన్ని ఆరంభించడం జరిగింది. ఈ ప్రయత్నాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వం వహిస్తూ మన ధీర సాయుధ దళ సిబ్బందికి సందేశాలను పంపించవలసిందిగా ప్రజలను కోరుతున్న ఒక ప్రత్యేక వీడియో ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకొన్నారు. కొద్ది గంటల వ్యవధిలోనే, ఈ వీడియో ట్విటర్ మరియు ఫేస్ బుక్ ల వంటి వేదికలన్నింటిలోనూ గొప్ప కుతూహలాన్ని రేకెత్తించింది.

ప్రజలు Narendra Modi App ద్వారాను, MyGov.in ద్వారాను, అలాగే ఆకాశవాణి ద్వారాను వారి సందేశాలను పంపించేందుకు అవకాశం ఉంది. దూరదర్శన్ సైతం ప్రజల మనోభావాలను సాయుధ దళాలతో పంచుకొనే ఒక కార్యక్రమాన్ని సమర్పించనుంది.

Narendra Modi App పైన ఒక ప్రత్యేక మాడ్యుల్ ను ఆరంభించారు. ఇది ప్రజలకు వారి శుభాకాంక్షలను, లేదా వారి చేతిరాతతో కూడిన సందేశాలను సాయుధ దళాలకు పంపేందుకు తోడ్పడుతుంది.

#Sandesh2Soldiers ప్రచార ఉద్యమం ప్రజలకు, సాయుధ దళాలకు మధ్య అన్యోన్యాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. ఈ నెల ఆరంభంలో భోపాల్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాన మంత్రి పాల్గొని, మన సాహసవంతులైన జవానులను గురించి ప్రత్యేకంగా దృష్టి సారించారు. జవానులను కలుసుకొన్న సందర్భాలలో వారి పాత్రను మెచ్చుకోవలసిందిగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తి కూడా సోషల్ మీడియా లో మంచి స్పందనను రేకెత్తించింది.

శ్రీ నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అయినప్పటి నుండి వచ్చిన రెండు దీపావళి పర్వదినాలలోనూ సాయుధ దళాలతో గడిపారు.