పిఎంఇండియా
జల భద్రతపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సు ఇవాళ ముగిసిన నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య మరింత సన్నిహిత సహకారం ద్వారా ‘టీమ్ ఇండియా’ స్ఫూర్తిని బలోపేతం, సహకారాత్మక సమాఖ్యవాదాన్ని ప్రోదిచేయడం, జాతీయ ప్రాధాన్యాలపై సామూహిక విధివిధానాలను ప్రోత్సహించే దిశగా ప్రధానమంత్రి సంకల్పించిన శాఖాపరమైన శిఖరాగ్ర సమావేశాల పరంపరలో ఇది మొదటిది కావడం గమనార్హం. జాతీయ జల భద్రతకు సంబంధించి వివిధ కోణాల్లో కేంద్రీకృత చర్చల దిశగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులతోపాటు సీనియర్ అధికారులను ఈ సమావేశం ఒకే వేదికపైకి తెచ్చింది.
ఇందులో భాగంగా రెండు రోజులపాటు సాగిన ఈ విస్తృత చర్చలను ప్రధానమంత్రి అభినందించారు. ఈ సందర్భంగా తీర్మానించిన ఆచరణీయ, వ్యవధి నిర్దేశిత కార్యాచరణపై నిరంతర సమీక్షతోపాటు అధ్యయన ప్రక్రియను కొనసాగించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ శిఖరాగ్ర సమావేశం కేవలం ఒక్కసారితో ముగిసేదిగా మిగలరాదని, నిరంతర సమీక్షలు, తదుపరి చర్యల ప్రక్రియ కొనసాగాలని ఆయన పిలుపునిచ్చారు.
పట్టణీకరణతో జనాభా పెరుగుదల, భవిష్యత్ నీటి అవసరాలు సహా తలెత్తే వివిధ సవాళ్లపై పట్టణ స్థానిక సంస్థలకు అవగాహన కల్పించాలని కోరారు. ఆ మేరకు ఆయా సంస్థల పరిధిలోనూ ఇలాంటి మేధామధన శిబిరాలను నిర్వహించాలని సూచించారు. నీటిని పొదుపు చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా అనుసరించాలని ఆయన కోరారు. భారత తయారీదారులు, భాగస్వాములు, సమర్థ పరిష్కారాల రూపకల్పన సహా వాటి విస్తరణకు వీలుగా ప్రపంచ ఉత్తమ పద్ధతులపై అవగాహనతో కూడిన ప్రత్యేక ప్రదర్శనలు, కార్యశాలలను నిర్వహించాలని కూడా ఆయన సూచించారు.
ప్రజల భాగస్వామ్యానికి ప్రాధాన్యమిస్తూ- ప్రజలలో మరింత అవగాహన దిశగా “జల ఉత్సవాల” నిర్వహణను ప్రోత్సహించాలని ప్రధానమంత్రి సూచించారు. పూడికతీతను ఒక సాధారణ కార్యక్రమంగా మార్చాలని, తదనుగుణ స్పష్టమైన ప్రమాణాలను, ప్రామాణిక కార్యాచరణ విధానాలను రూపొందించాలని పిలుపునిచ్చారు. డ్యామ్ల భద్రత, ప్రతి రుతుపవనానికీ ముందు పటిష్ట సన్నద్ధత, సూచించిన జాగ్రత్తల అనుసరణ వగైరాలను విద్యా ప్రణాళికలలో తగిన విధంగా చేర్చడం సహా పాఠశాల విద్యార్థులలో అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించారు.
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలలో జల నిర్వహణ, యాజమాన్యంపై పరిజ్ఞానాన్ని, సామర్థ్యాన్ని బలోపేతం చేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఆచరణాత్మక అభ్యసన సౌలభ్యం దిశగానూ, విజయవంతమైన చర్యల పునరావృతం నిమిత్తం ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులతో ప్రగతిశీల అంతర్రాష్ట్ర అధ్యయన పర్యటనలు చేపట్టాలని ఆయన సూచించారు.
పటిష్ట జల సమాచార నిర్వహణ దిశగా ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. జల రంగంలోని సమాచారన్ని సమీకృతం చేసి, క్రమపద్ధతిలో నిర్వహణ ద్వారా విశ్లేషిస్తూ సమర్థంగా వినియోగించుకోవాలని చెప్పారు. ఏకరూప ఫార్మాట్ ద్వారా సమాచార సేకరణ-విశ్లేషణ కోసం కృత్రిమ మేధను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ, పారిశ్రామిక ప్రయోజనాల కోసం శుద్ధి చేసిన నీటిని సముచితంగా వినియోగించడం ద్వారా నీటి కొరత పరిష్కారానికి దూరదృష్టి గల, సమీకృత ప్రణాళిక ఆవశ్యకతను కూడా ఆయన ఉద్ఘాటించారు.
లోగడ గుజరాత్ ముఖ్యమంత్రిగా తన అనుభవాన్ని ఉటంకిస్తూ- క్రమబద్ధ ప్రణాళిక, నిబద్ధత, తగినన్ని వనరులు, సమర్థ అధికారుల నియామకం తదితరాల ద్వారా నీటి కొరత పరిస్థితులను అవకాశాలుగా మార్చుకోవచ్చని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
చివరగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ సి.ఆర్.పాటిల్ మాట్లాడుతూ- ఈ సదస్సుతో ఒనగూడిన నాలుగు కీలక ఫలితాలను ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ మేరకు జల వనరుల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడం, జల సంరక్షణను నిరంతర ప్రజా ఉద్యమంగా మలచడం, తాగునీటి వనరుల దీర్ఘకాలిక సుస్థిరతకు భరోసా ఇవ్వడం, గ్రామీణ తాగునీటి పథకాల సమర్థ నిర్వహణ-పర్యవేక్షణలను సంస్థాగతం చేయడంపై ఏకాభిప్రాయం వ్యక్తమైందని ఆయన పేర్కొన్నారు.
****
Water security is vital for India and for our planet.
— Narendra Modi (@narendramodi) September 2, 2026
It calls for innovative ideas, technology and above all, Jan Bhagidari.
At the National Departmental Summit on Water, highlighted some key priorities:
Take Jal Utsav deeper among the people.
Harness AI and data to improve…