పిఎంఇండియా
‘ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన (పీఎం–ఎస్ఎస్వై) పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇంధన నిల్వ వ్యవస్థల (ఈఎస్ఎస్) సదుపాయంతో కూడిన తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల (ఎఫ్ఎస్పీవీ) అభివృద్ధికి ఉద్దేశించిన పథకమిది. మొత్తం రూ. 5,070 కోట్లను ఇందుకోసం కేటాయించనున్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
5,000 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది. కనీసం రెండు గంటల నిల్వ సామర్థ్యం (అంటే 10,000 మెగావాట్స్ అవర్) కలిగిన ఇంధన నిల్వ వ్యవస్థలనూ వీటితోపాటే ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టులకు 2026-27 నుంచి 2030-31 మధ్య ఆమోదం లభిస్తుంది. 2032-33 వరకు నిధుల పంపిణీ కొనసాగుతుంది.
జాతీయ సౌర శక్తి సంస్థ ఇటీవలి అంచనాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని జలాశయాలు, ఇతర అనువైన నీటి వనరుల ద్వారా.. తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల నుంచి దాదాపు 102.18 జీడబ్ల్యూపీ మేర సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసే అవకాశం ఉందని ఈ సంస్థ అంచనా వేసింది.
అర్హత కలిగిన ప్రతీ తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టూ విజయవంతంగా ప్రారంభమైన అనంతరం.. మెగావాట్‌కు రూ. కోటి చొప్పున కేంద్ర ఆర్థిక సాయాన్ని ఈ పథకం కింద అందిస్తారు. దీనితోపాటు సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం ప్రతి ప్రాజెక్టుకు రూ. 50 లక్షల వరకు సాయం లభిస్తుంది. ఇందులో భాగంగా నీటి లోతు (బాతిమెట్రీ), జలచిత్రణ (హైడ్రోగ్రఫీ) పరీక్షలు, పర్యావరణ అధ్యయనాలు, ప్రాజెక్టు అభివృద్ధిలో ఆటంకాలను తగ్గించడానికి అవసరమైన ఇతర సన్నాహక కార్యకలాపాలను చేపడతారు.
అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం దేశంలో తేలియాడే సౌర విద్యుత్ సామర్థ్యం 700 మెగావాట్లు మాత్రమే ఉండగా.. ఈ పథకం ద్వారా అది 5,000 మెగావాట్లకు పెంచుతుంది. ప్రస్తుతమున్న జలాశయాలు, పారిశ్రామిక నీటి నిల్వలను సమర్థంగా వినియోగించుకోవడానికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయి. అలాగే కొరతగా ఉన్న భూ వనరుల విషయంలో పోటీనీ తగ్గిస్తాయి. ఇంధన నిల్వ వ్యవస్థను అనుసంధానించడం గ్రిడ్ విశ్వసనీయతను, స్థిరత్వాన్ని పెంచడంలో దోహదపడుతుంది. ఏటా దాదాపు 10 మిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించడంలో ఈ పథకం సహాయపడుతుంది. ప్రాజెక్టుకు సంబంధించి అన్ని దశల్లోనూ కలిపి దాదాపు 16,000 నుంచి 17,000 మందికి పూర్తిస్థాయి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. నీటిపై తేలియాడే వ్యవస్థలతోపాటు.. సౌర విద్యుత్ ఫలకాలు, మాడ్యూళ్లు, విద్యుత్ నిల్వ వ్యవస్థల వంటి ప్రాజెక్టుకు సంబంధించి ప్రతి దశలోనూ దేశీయ తయారీని కూడా ఈ పథకం ప్రోత్సహిస్తుంది. తద్వారా ఆత్మనిర్భర భారత్ సంకల్పానికి ఊతమిస్తుంది.
ఈ పథకం పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి దోహదపడడమే కాకుండా దేశ విద్యుత్, పర్యావరణ లక్ష్యాలను చేరుకోవడంలోనూ సాయపడుతుంది. వికసిత భారత్ లక్ష్యాన్ని ముందకు తీసుకెళ్తూ.. జల వనరులను సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సాహాన్నిస్తుంది.
***