Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రిని కలుసుకున్న జమ్ము- కశ్మీర్ ప్రతిపక్ష నాయకుల ప్రతినిధి బృందం


జమ్ము- కశ్మీర్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను గురించి చర్చించేటందుకు ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష నాయకుల ప్రతినిధి బృందం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలుసుకుంది. ఈ బృందంలో జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నేత శ్రీ ఉమర్ అబ్దుల్లా, ఐ ఎన్ సి నేత శ్రీ గులామ్ అహ్మద్ మీర్, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ నేత శ్రీ హకీమ్ మొహ్మద్, సి పి ఎమ్ నేత శ్రీ ఎమ్.వై. తరిగామి, డెమొక్రటిక్ పార్టీ నేషనలిస్ట్ నేత శ్రీ గులామ్ హసన్ తదితరులు ఉన్నారు. వీరి సమావేశం అరమరికలు లేని వాతావరణంలో జరిగింది.

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల పట్ల ప్రధాన మంత్రి తీవ్ర ఆందోళనను, వేదనను వ్యక్తం చేశారు. ఇటీవలి అల్లర్లలో ప్రాణాలు కోల్పోయినవారు మన దేశంలోను, మనలోను ఒక భాగం వంటివారే; ప్రాణాలు కోల్పోయిన వారు యువకులు, లేదా భద్రతా సిబ్బంది, లేదా రక్షక భటులు అయినా అది మననను దు:ఖింపచేసేదే అని ఆయన అన్నారు. తన ప్రభుత్వం, యావత్తు దేశం జమ్ము- కశ్మీర్ రాష్ట్రానికి బాసటగా నిలబడుతుందని ప్రధాన మంత్రి అన్నారు. రాజకీయ పక్షాల వారందరూ ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాలన్నారు. రాష్ట్రం మరియు రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితి పునరుద్ధరణకు కృషి చేయాలని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు.

సమావేశంలో భాగంగా అందిన నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు అభినందనీయమైనవని ప్రధాన మంత్రి అన్నారు. రాష్ట్రంలోని పౌరుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ఆయన చెప్పారు.

చర్చలు చోటు చేసుకోవలసిందేనని, సమస్యకు రాజ్యాంగ పరిధికి లోబడి ఒక శాశ్వతమైన, మన్నికైన పరిష్కారాన్ని కనుగొనవలసిన అవసరం ఉన్నదని ప్రధాన మంత్రి నొక్కి వక్కాణించారు. జమ్ము- కశ్మీర్ లోని సమస్యలకు ఒక సమాధానాన్ని వెతకడానికి అన్ని రాజకీయ పక్షాలు కలసి పని చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు.